Satellites
-
ISRO: ప్రోబా-3 మిషన్ సక్సెస్
-
శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట డెత్‌స్టార్.. ‘స్టార్ వార్స్’తరహాలో సూపర్ వెపన్!
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ ‘స్టార్ వార్స్’చూశారా? అందులో సూపర్ వెపన్ అయిన ‘డెత్ స్టార్’ అనే అంతరిక్ష కేంద్రం భారీ లేజర్ కిరణాలతో ఏకంగాగ్రహాలనే నామరూపాల్లేకుండా చేయడం గుర్తుందా? అచ్చం అలాగే అంతరిక్షంలోని శత్రు దేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే నిజమైన ‘డెత్ స్టార్’ను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు! ఈ దిశగా ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తిచేశారు!! ఈ అత్యాధునిక ఆయుధానికి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ అంతరిక్షంలో ఉపయోగించేందుకే ఈ తరహా ఆయుధాల అభివృద్ధి జరుగుతున్నట్లుపలు చైనా జర్నల్స్ చెబుతున్నాయి.ఇంతకీ దాన్ని ఎలా రూపొందించారు..అందులో వాడే టెక్నాలజీ ఏమిటి?ఎలా పనిచేస్తుందంటే..సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం ప్రకారం ఈ సూపర్ వెపన్.. మైక్రోవేవ్ ఎనర్జీ (ఒక రకమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్)ని ప్రసరించే ఏడు ‘యంత్రాలను’ ఉపయోగిస్తుంది. అంతరిక్షంలో దూరదూరంగా ఉండే ఈ ఏడు యంత్రాలు ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా అనుసంధానమై ఉంఆయి. ఒక్కో యంత్రం ఒకే ఒక్క శక్తివంతమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్వేవ్ను శత్రు లక్ష్యంపై విడుదల చేస్తుంది. ఇలా ఏడు యంత్రాల నుంచి ఏకకాలంలో ఏడు తరంగాలు విడుదలై నిర్దేశిత లక్ష్యాన్ని నాశనం చేస్తాయి. అయితే ఇలా ఏకకాలంలో లక్ష్యాన్ని ఢీకొట్టాలంటే ఆ యంత్రాల నుంచి తరంగాలు కచ్చితంగా ఒకే సమయానికి విడుదల కావాలి.ఎంత కచ్చితత్వంతో అంటే అవి ఒక సెకనులో 170 లక్షల కోట్లవ వంతు కాలంలో విడుదల కావాలన్నమాట!! ప్రస్తుతం అత్యాధునిక జీపీఎస్ శాటిలైట్లలోని అటామిక్ గడియారాలు కొన్ని వందల కోట్ల ఏళ్లలో ఒకే ఒక్క సెకనును మాత్రమే మిస్ అవుతున్నాయి. వాటికన్నా ఎన్నో రెట్ల కచ్చితమైన కాలాన్ని లెక్కించడం అసాధ్యమని ఇప్పటివరకు భావిస్తుండగా చైనా శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని కూడా అధిగమించారు. గతేడాదే వారు సుమారు 1,800 కిలోమీటర్ల పరిధి నుంచి ఒక సెకనులో 10 లక్షల కోట్లవ వంతు కాలానికి సమానమైన కచ్చితత్వాన్ని సాధించారు. నిర్దేశిత లక్ష్యంలోని ఒకే భాగాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ తాకేందుకు ఈ ఆయుధంలో లేజర్ పొజిషనింగ్ పరికరాలు కూడా ఉన్నాయి. లక్ష్యం ఉన్న దూరం, దాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన కచ్చితత్వంతో కూడిన సమయాన్ని లెక్కించాక మొబైల్ కమాండ్ సెంటర్ నుంచి దాడి చేయాలని సంకేతం పంపగానే ఆయుధంలోని యంత్రాలు వాటి పని కానిస్తాయి. కేవలం ఒక గిగావాట్ శక్తిని విడుదల చేసే సామర్థ్యంగల ఒక ఆయుధం ద్వారా భూమికి సమీపంలోని ఉపగ్రహాలను నాశనం చేయడం సాధ్యమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.కమ్యూనికేషన్ నిర్వీర్యమే ఉద్దేశంమైక్రోవేవ్ ఆయుధాలు నిర్దేశిత లక్ష్యాలను పేల్చేసే బదులు శక్తివంతమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేయడం ద్వారా ఆయా లక్ష్యాల్లో ఉండే ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను దెబ్బతీస్తాయి. దీంతో ఉపగ్రహాల వంటి సమాచార వ్యవస్థల్లో గ్రౌండ్ సెంటర్లతో కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. డ్రోన్ల వంటి చిన్న లక్ష్యాలపై ఈ తరహా ఆయుధాలు సమర్థంగా పనిచేసినట్లు ఇప్పటికే పలు ప్రయోగాల్లో తేలింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేసిన థోర్ (ద టాక్టికల్ హైపవర్ ఆపరేషనల్ రెస్పాండర్) కొన్ని వందల డ్రోన్లను ఏకకాలంలో నిరీ్వర్యం చేయగలదు. అగ్రరాజ్యం గత నెలలోనే రష్యా లేదా చైనా శాటిలైట్ సిగ్నళ్లను నిలువరించగల మెడోలాండ్స్ అనే జామర్ ఆయుధాన్ని సమకూర్చుకుంది. మరోవైపు యూకే సైతం డ్రాగన్‌ఫ్లై లేజర్ వెపన్‌ను అభివృద్ధి చేసింది. గాల్లో ఎగిరే డ్రోన్లను కూల్చేసే సామర్థ్యాన్ని దీనికి ఉంది. అలాగే ఏకంగా 1.5 కి.మీ. దూరం నుంచే ఒక నాణెం సైజులో ఉండే లక్ష్యాన్ని కూడా కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం.- సాక్షి సెంట్రల్ డెస్క్ -
అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణ కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సైన్స్ బోధించేది వేరు. సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం ‘కృత్రిమ రావుకేతువుల’ సాయంతో కోరుకున్నప్పుడల్లా కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో జంట ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డ్ అటానమీ3 (ప్రోబా3). ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కక్ష్యలో పరస్పరం దగ్గరగా మోహరించే ఈ శాటిలైట్లు... లేజర్లు, కాంతి సెన్సర్లతో అనుసంధానమై ఉంటాయి. రెండో ఉపగ్రహం నుంచి చూస్తే సూర్యుడు కనబడకుండా ఉండేలా మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ తరహా కృత్రిమ సూర్యగ్రహణాలు అక్కరకొస్తాయని పరిశోధకులు అంటున్నారు. విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, మన సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో ఉండే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అద్యయనాలకు ‘ప్రోబా3’ మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఉపగ్రహాలు... ఒకే ఉపగ్రహంగా! ‘ప్రోబా3’ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ‘ప్రోబా3’లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో రెండు ఉపగ్రహాలను అతి దగ్గరగా కలిపి ఉంచేలా (లాక్ చేసేందుకు) కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనప్పటికీ... 144 మీటర్ల పొడవుండే ఏకైక అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ‘ప్రోబా3’ అనేది రెండేళ్ళు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇందులో సౌరగోళం ఆకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం నిర్వహించే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. తన పక్కనే ఉండే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహానికి సూర్యబింబం తాత్కాలికంగా కనిపించకుండా ‘అకల్టర్’ ఉపగ్రహం అడ్డుపడుతుంది. అలా ‘అకల్టర్’ ఉపగ్రహం ఏర్పరచిన ఛాయలో ఉంటూ ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం సూర్యుడి కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఉభయ ఉపగ్రహాలు భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు ‘అకల్టర్’ ఉపగ్రహం తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా సదరు డిస్క్ లాంటి పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహంలోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. ‘అకల్టర్’లో లేజర్, విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్, ‘కరోనాగ్రాఫ్’లో షాడో పొజిషన్ సెన్సర్లు ఉంటాయి. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుందని ఈఎస్ఏ ‘ప్రోబా3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వెల్లడించారు. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. దురదృష్టవశాత్తూ సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున ప్రతి రెండేళ్ళకోసారి మాత్రమే సంభవిస్తాయని, వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గలీనో వివరించారు. అంత కష్టపడినా చివరికి ఫలితం వాతావరణం దయపై ఆధారపడివుంటుందని, వాతావరణం అనుకూలించకుంటే ఆ ప్రయత్నాలన్నీ వృథాయేనని చెప్పారు. అంతగా ప్రయాసపడినా ఏవో కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని గలీనో తెలిపారు. సవివర పరిశోధనలకు ఆ అతి స్వల్ప సమయం సరిపోదన్నారు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారని, అయితే అంతర కరోనాను ఆ ప్రయోగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని తెలిపారు. సూర్యుడి ఉపరితలంపై 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కాగా కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇది వైరుద్ధ్యభరిత అంశమని ‘ప్రోబా3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ అన్నారు. నిజానికి సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలని, కానీ కరోనా విషయంలో అలా జరగదని, అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర కరోనాను అధ్యయనం చేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని చెప్పారు. సూర్యుడి ఉపరితలం కంటే సూర్యుడికి బాహ్య పొర అయిన కరోనా ఎందుకు ఎక్కువ వేడిమితో ఉందో తెలుసుకునేందుకు అంతర కరోనాను తాము దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని, కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ‘ప్రోబా3’ అందిస్తుందని ఫ్రాన్సిస్కో డీగో చెప్పారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో అంతరిక్షంలోకి సూర్యుడు భారీ స్థాయిలో ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూమి ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతోపాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. ఈ అంశాలపై ‘ప్రోబా3’ అవగాహనను పెంచుతుందని, సౌర భౌతికశాస్త్రాన్ని అది పంపే ఫలితాలు సమూలంగా మార్చివేస్తాయని భావిస్తున్నారు. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహాన్ని బెల్జియం కేంద్రంగా ఉన్న లీగ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని 15 కంపెనీలు, పలు సంస్థల కన్సార్టియం ఈఎస్ఏ కోసం అభివృద్ధి చేసింది. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా3’ జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సివుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగాసి’ రాకెట్ కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ఈఎస్ఏ, ఇస్రో ఈ ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సివుంది.జమ్ముల శ్రీకాంత్ -
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశంలో శాటిలైట్ల లెక్క తెలుసా?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా..వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఓసారి తెలుసుకుందామా.. మూడు కక్ష్యల్లో.. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈఓ), మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. జీఈఓభూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. ఎంఈఓభూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.ఎల్ఈఓభూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. స్టార్ లింక్ శాటిలైట్లతో.. ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్ లింక్’శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్‌లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్పేస్ స్టార్టప్‌లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్: ఇస్రో
బెంగళూరు/హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్ఎల్వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్‌సీపీఎస్)లోని పాలీమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది. సంప్రదాయ బ్యాటరీ సెల్స్‌తో పోలిస్తే ఈ ఫ్యూయల్ సెల్స్‌కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. -
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్‌పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్‌కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్‌తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్‌రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్‌రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్‌రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్‌రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్‌పీఈ మిషన్‌కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్‌లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్‌రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్‌బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్‌రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్‌ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్‌యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
శాటిలాజిక్‌తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జట్టు
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), అమెరికాకు చెందిన శాటిలాజిక్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత్‌లో లో ఎర్త్ ఆర్బిట్ (లియో) ఉపగ్రహాలను తయారు చేయనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఇందుకోసం కర్ణాటకలోని తమ వేమగల్ ఫ్యాక్టరీలో టీఏఎస్ఎల్ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ (ఏఐటీ) ప్లాంటును ఏర్పాటు చేనుంది. దేశ రక్షణ బలగాలు, వాణిజ్య అవసరాల కోసం ఉపగ్రహాల తయారీ, ఇమేజరీ డెవలపింగ్ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వివరించాయి. పేలోడ్లు, ఇతర టెక్నాలజీ కోసం స్థానికంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎస్ఎంఈ) కలిసి పని చేయనున్నట్లు టీఏఎస్ఎల్ సీఈవో సుకరణ్ సింగ్ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ డిఫెన్స్, కమర్షియల్ మార్కెట్లోకి ప్రవేశించడం తమకు ఒక మైలురాయి కాగలదని శాటిలాజిక్ సీఈవో ఎమిలియానో కార్గీమ్యాన్ పేర్కొన్నారు. -
అంతరిక్షంలో వ్యర్థాలు, ఆ శాటిలైట్లు భూమిపై దొర్లకుండా..
అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షంలో పంపించిన శాటిలైట్లలో కొన్ని డెబ్రిస్(చెత్త)గా మారాయి. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో అంతరిక్షం చెత్తకుప్పగా మారిపోతోంది. అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ప్రయోగాలకు కొన్నిసార్లు అంతరాయం ఏర్పడుతుంది. యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం భూమి చుట్టూ దాదాపు 25వేలఅంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని శిథిలాలు భూమిపైకి చేరతున్నాయి.మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుషితం చేస్తున్నాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. దీనివల్ల అంతరిక్షంలో డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుంది. అనేక శాటిలైట్లు పాడైన స్థితిలో శిధిలాలుగా మారి అంతరిక్షంలో భూకక్ష్య చుట్టూ ప్రమాదకర వేగంతో తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని అంచనా. సాదారణంగా రెండు ఉపగ్రహాలు ఢీకొన్నప్పుడు కెస్లర్ సిండ్రోమ్ అని పిలువబడే ఘర్షణ ఏర్పడి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటీవల క్యూబ్‌శాట్ Exo-0 అని పిలువబడే ఎయిర్‌బస్ పరికరాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇది కాలం చెల్లిన ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా పనిచేయని ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా ఒక అయస్కాంత శక్తితో అడ్డుకుంటుంది. ఈ ఎయిర్‌బస్ పరికరం సింపుల్‌గా మోటార్‌ను పోలి ఉంటుంది. ఇది మ్యాగ్నటిక్ ఫీల్డ్‌తో పనిచేస్తుంది. రోటార్ మూవ్‌మెంట్‌ను బట్టి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఇది శాటిలైట్ తిరిగే దశను కదలనీయకుండా ఉంచుతుంది. దీనివల్ల ఉపగ్రహాలు నేలపై పడటం వంటిది జరగదు. -
30న పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఈనెల 23న నిర్వహింయాల్సి ఉంది. చంద్రయాన్–3 మిషన్‌ను లూనార్ ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగాన్ని 30కి పొడిగించారు. ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది కావడం విశేషం. -
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్‌పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో యురేనస్‌ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
22న పీఎస్ఎల్వీ సీ55 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది. ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్లో నాలుగోదశ (పీఎస్–4)ను ఒక ఎక్స్పర్మెంటల్ చేయనున్నారు. ఈ రాకెట్లో ఆర్బిటల్ ఎక్స్పర్మెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్ ఆర్బిట్‌లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్పర్మెంటల్ ప్రయోగాన్ని చేస్తున్నారు. -
ONEWEB: ఇస్రో కీర్తి కిరీటంలో... మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్‌వెబ్ ఇండియా–2 ఇంటర్నెట్ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని ఆదివారం ఉదయం 9.00 గంటలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం తెలిసిందే. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇస్రో స్థాయి పెరిగింది: చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు పరస్పరం అలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్‌లో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భరతకు తార్కాణం ప్రధాని మోదీ అభినందనలు వన్‌వెబ్ ఇండియా–2 ప్రయోగం దిగ్విజయం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘‘వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా భారత్ పై చేయిని ఈ ప్రయోగం మరింత దృఢపరిచింది. ఆత్మనిర్భరత స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శుక్రవారం) 2.18 గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యాన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం గురువారం ఉదయం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా నిర్ణయించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రాకెట్ వివరాలు... ప్రయోగం ఇలా... ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. మొదటిగా 156.3 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్–07)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆంటారిస్–యూఎస్ఏకు చెందిన 10.2 కేజీల బరువు కలిగిన జానుస్–1 అనే ఉపగ్రహాన్ని 880.1 సెకన్లలో, అనంతరం 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీ శాట్–2 అనే ఉపగ్రహాన్ని 900.1 సెకన్లలో అంటే 15 నిమిషాలకు భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్యునికి సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇది షార్ నుంచి 84వ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ–డి1 సిరీస్‌లో రెండోది కావడం విశేషం. ఎస్ఎస్ఎల్వీ–డీ2కు ప్రత్యేక పూజలు తిరుమల: ఎస్ఎస్ఎల్వీ–డి2కు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, సభ్యులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ–డి2 నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు. -
బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్‌ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు. ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్‌లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది. వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్‌కు 27, నెప్ట్యూన్‌కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు. -
ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి?
భూగోళాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ‘చెత్త’. నానాటికీ పెరుగుతున్న వ్యర్థాలను వదిలించుకునేందుకు చాలా దేశాలు పెద్ద కసరత్తే చేస్తున్నాయి. కాగా.. ఇదే సందర్భంలో అంతరిక్షంలోనూ పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి. ఇవికాకుండా దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా. దీనివల్ల గగనతలం భవిష్యత్‌లో పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను సమూలంగా మార్చేశాయి. ఉపగ్రహాల (శాటిలైట్స్) వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా శాటిలైట్స్ వల్లే సాధ్యమైంది. సోవియట్ యూనియన్ 1957 అక్టోబర్ 4న స్పుతి్నక్ శాటిలైట్ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది. వివిధ దేశాల ఆధ్వర్యంలో మాత్రమే శాటిలైట్ ప్రయోగాలు కొనసాగగా.. ఇటీవల ప్రైవేట్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఐక్యరాజ్య సమితి ఔ టర్ స్పేస్ అఫైర్స్ విభాగం లెక్కల ప్రకారం 2022 జనవరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ‘ఆర్యభట్ట’. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్టతో మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు సుమారు 180 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఇవికాక సుమారు 38 దేశాలకు చెందిన 350కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశ శాటిలైట్లలో 40 వరకు సేవలందిస్తుండగా.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి. నాణేనికి రెండో వైపు.. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో గగనతలం చెత్తకుప్పగా మారిపోతోంది. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ (యూసీఎస్) లెక్కల ప్రకారం స్పేస్‌లో ఉన్న మొత్తం 8,261 శాటిలైట్లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారిపోయాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. ఇటీవల అమెజాన్, స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలోకి అడుగుపెట్టి శాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల 2030 నాటికి రోదసీలో శాటిలైట్ల సంఖ్య 58 వేలకు పైగా దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అంతరిక్షంలో స్పేస్ ట్రాఫిక్ పెరిగిపోవడంతోపాటు డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుందని అంచనా. పెనుసవాల్.. స్పేస్ జంక్ అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గాన్ని కక్ష్య (ఆర్బిట్) అంటారు. శాటిలైట్స్‌ను మూడు రకాల ఆర్బిట్స్‌లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి 300కి.మీ. వరకు లోయర్ ఆర్బిట్, 700–1,000 కి.మీ వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆర్బిట్స్, 36 వేల కి.మీ. జియో సింక్రనస్ ఆర్బిట్ (కమ్యూనికేషన్ శాటిలైట్స్) ఉంటాయి. ఏటా వందల సంఖ్యలో శాటిలైట్లను కక్ష్యల్లోకి పంపుతుండటంతో వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్ ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో రాకెట్ పరికరాల శిథిలాలను స్పేస్ డెబ్రిస్ అంటారు. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. సాఫ్ట్‌బాల్ పరిమాణంలో 34 వేల స్పేస్ డెబ్రిస్ శిథిలాలు ఉన్నాయని, ఒక మిల్లీమీటర్ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయని నాసా ప్రకటించింది. ప్రతి 10 వేల శిథిలాలలో ఒకటి ప్రమాదానికి కారణమవుతుందని అంచనా వేసింది. ఇలాంటి శిథిలాలు 1999 నుంచి ఇప్పటిదాకా 25 ఐఎస్ఎస్ను తాకినట్టు స్పేస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుíÙతం చేస్తున్నాయి. ఈ వ్యర్థ రేణువుల్లో కొన్ని గంటకు 40 వేల కి.మీ. వేగంతో భూకక్ష్య వైపు దూసుకొస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అంతర్జాతీయ కమిటీ వాస్తవానికి అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కి.మీ. వేగంతో తిరుగుతున్న డెడ్ శాటిలైట్లు, రాకెట్ శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్ శాస్త్రవేత్తలతో 1993లో ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కో–ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాల కమిటీ’ (యూఎన్–సీఓపీయూఓఎస్)ని నియమించింది. ఈ రెండు కమిటీల్లోనూ భారత్ ప్రారంభ సభ్యదేశంగా ఉంది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. దీనిప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటారు. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. స్పేస్ డెబ్రిస్‌ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్దా లేదు. – ఎంవైఎస్ ప్రసాద్, మాజీ డైరెక్టర్, షార్ ‘నాసా’ ట్రాక్ చేస్తోంది స్పేస్‌లోకి వెళ్లిన ప్రతి వస్తువుకు పొజిషనింగ్ నంబర్ ఇచ్చి వాటి కదలికలను అనుక్షణం ‘నాసా’ ట్రాక్ చేస్తోంది. దీనినే స్పేస్ సర్వేలెన్స్ నెట్వర్క్ ట్రాకింగ్ అంటారు. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని, ఇవి ట్రాక్ చేయడానికి చిన్నవే అయినా అంతరిక్ష నౌకను దెబ్బతీసేంత పెద్దవని యూఎస్ మిలటరీ సైతం ప్రకటించింది. అంతరిక్ష యాత్రకు ప్రాణాంతకం లేదా విపత్తు కలిగించే వేల వస్తువులు, నష్టాన్ని కలిగించేంత సామర్థ్యం గలవి మిలియన్ల కొద్దీ ఉన్నాయని అంచనా వేసింది. జియో సింక్రనస్ ఆర్బిట్‌లో భారీ బరువుండే ఉప గ్రహాలుంటాయి. ఈ ఆర్బిట్‌లోని పనికిరాని శాటిలైట్లను పైస్థాయికి పంపేస్తారని.. ఇక్కడ డెబ్రిస్‌ని అంచనా వేయలేమని ‘షార్’ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే, అధిక ‘డెడ్ శాటిలైట్లు’, శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయని, ఇవే ప్రధాన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. -
మరోసారి 36 ఉపగ్రహాలు ప్రయోగానికి ‘వన్‌వెబ్’ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు గ్లోబల్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ సంస్థ వన్‌వెబ్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక మార్క్–3 నుంచి ఈ ఏడాది మార్చి తొలివారంలో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. 36 ఉపగ్రహాలు తమ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాయని, వాటి గమ్యస్థానం భారత్ అంటూ వన్‌వెబ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మాసిమిలియానో లాడోవెజ్ ట్వీట్ చేశారు. వన్‌వెబ్ సంస్థ గత అక్టోబర్ 22న శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక ఎల్వీఎం–3 నుంచి 36 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడం తెలిసిందే. -
దిగంతాలకు తెలంగాణ కీర్తి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ‘ధ్రువ’స్పేస్‌టెక్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన తైబోల్ట్–1, తైబోల్ట్– 2 అనే నానో ఉపగ్రహాలను ఇస్రో సంస్థ శ్రీహరికోట నుంచి ‘పీఎస్ఎల్వీ–సీ54’ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా శనివారం విజయవంతంగా ప్రయోగించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. టీ–హబ్ సభ్యసంస్థ, తెలంగాణకు చెందిన ‘స్కైరూట్’స్టార్టప్ కంపెనీ ఇటీవలే ‘విక్రమ్–ఎస్’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశచరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి స్టార్టప్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ మూడు ఉపగ్రహాల ప్రయోగంతో టీహబ్ తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటిందన్నారు. తైబోల్ట్–1, తైబోల్ట్– 2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశీయ స్టార్టప్‌ల చరిత్రలో చిరస్మరణీయమని, దీని వల్ల స్టార్టప్‌ల నగరంగా హైదరాబాద్‌కు ఉన్న విశిష్టత రెట్టింపు అయిందని పేర్కొన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడంతోపాటు పరిశ్రమలు, శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాల్లో అవకాశాల సృష్టి లక్ష్యంగా ప్రారంభించిన టీ–హబ్ భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు సాధిస్తుందనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీ–హబ్ ప్రోత్సాహంతో ఉపగ్రహాలను రూపొందించి విజయవంతంగా ప్రయోగించడం ద్వారా తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్, ‘ధ్రువ’స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికి వెచ్చించి పనిచేయాలని, అద్భుత ఆలోచనలను స్టార్టప్‌లుగా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులు, టీ–హబ్ సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం3-ఎం2ను విజయవంతంగా ప్రయోగించటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. ఇదీ చదవండి: ఇస్రో దీపావళి ధమాకా -
ఇస్రోకి చేరిన 36 వన్‌వెబ్ ఉపగ్రహాలు
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌కి చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చేరుకున్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ–షార్) నుంచి జీఎస్ఎల్వీ–ఎంకే ఐఐఐ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం వన్‌వెబ్ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో చేతులు కలిపింది. ఈ ఏడాది మరో విడత, వచ్చే ఏడాది మరో మూడు విడతలు లాంచింగ్‌లు ఉంటాయని వన్‌వెబ్ తెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఉపగ్రహాల ద్వారా ఇప్పటికే అలాస్కా, కెనడా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించింది. వన్‌వెబ్‌లో దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి!