పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం
నిర్ధారిత కక్ష్యలోకి స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు
జనవరి 7న డాకింగ్ ప్రక్రియ: ఇస్రో
సఫలమైతే నాలుగో దేశంగా రికార్డు
గగన్‌యాన్, భావి మిషన్లకు కీలకం
సూళ్లూరుపేట: అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం, విడదీత సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వేసిన తొలి అడుగు విజయవంతమైంది. స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్)లో భాగంగా ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ–సీ60 రాకెట్ సోమవారం విజయవంతంగా నిర్ధారిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ప్రయోగంలో తొలి అంకం దిగి్వజయమైంది. అతి కీలక మైలురాయికి ఇస్రో కేవలం అడుగు దూరంలో నిలిచింది.
రెండో దశలో జంట ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం (డాకింగ్) చేయడం స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ జనవరి 7న జరగవచ్చని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. అది సఫలమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత అతి సంక్లిష్టమైన డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇస్రో నిర్వహించబోయే మానస సహిత గగన్‌యాన్, చంద్రయాన్–4 ప్రయోగాలతో పాటు భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం తదితరాల్లో ఈ టెక్నాలజీది కీలక పాత్ర కానుంది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వెలిబుచ్చారు.
ఇలా జరిగింది...
ప్రయోగం ముందు నిర్ణయించినట్టు సోమవారం రాత్రి 9.58కు బదులు 2 నిమిషాల ఆలస్యంగా పదింటికి జరిగింది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం రెండు ఉపగ్రహాలతో పీఎల్‌ఎల్వీ–సి60 తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని తొలి ప్రయోగవేదిక నుంచి నింగికెగిసింది. మామూలుగా 320 టన్నులుండే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ స్ట్రాపాన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నులతోనే దూసుకెళ్లింది. 111.12 సెకన్లకు తొలి దశ, 262.06 సెకన్లకు రెండో దశ, 511.22 సెకన్లకు మూడో దశ, 792.48 సెకన్లకు నాలుగో దశ విజయవంతంగా పూర్తయ్యాయి.
15.15 నిమిషాలకు టార్గెట్, 15.20 నిమిషాలకు ఛేజర్ ఉపగ్రహాలను 470 కి.మీ. ఎత్తులో నూతన సెమీ మేజర్ యాక్సిస్ వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. తర్వాత పీఎస్–4లో అమర్చిన పలు స్టార్టప్ కంపెనీలకు చెందిన 24 పేలోడ్లను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తయింది. 2024లో చివరిదైన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో సైంటిస్టుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. షార్ కేంద్రం నుంచి ఇది 99 ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 62వది. వాటిలో 60 విజయాలే కావడం విశేషం!
వారంలోనే పని మొదలు
స్పేడెక్స్ ఉపగ్రహాలు వారంలోనే పని చేయడం ఫ్రారంభిస్తాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ చెప్పారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2025 మార్చిలోపు రెండు పీఎస్‌ఎల్వీ, ఒక జీఎస్‌ఎలీ్వ, రెండు ఎల్‌వీఎం3 రాకెట్ ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. గగన్‌యాన్ ప్రయోగమూ వీటిలో ఉంది’’ అని వివరించారు.
స్పేడెక్స్ ఉపయోగాలెన్నో...
స్పేడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో పూర్తిగా సొంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది. ఒక్కోదాని బరువు 220 కిలోలు. ఇవి రెండేళ్ల పాటు సేవలందిస్తాయి. వీటి అనుసంధానం సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడింది. అత్యంత వేగంగా ప్రయాణించే రెండు ఉపగ్రహాలు వేగాన్ని నియంత్రించుకుంటూ క్రమంగా పరస్పరం చేరువవుతూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఢీకొని పేలిపోతాయి.
— అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి స్పేడెక్స్ ప్రయోగం తొలి అడుగు.
— రోదసీలో వ్యోమనౌకల మధ్య వస్తు మారి్పడి తదితరాలకు డాకింగ్ టెక్నాలజీ వీలు కలి్పస్తుంది.
— ఇస్రో చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఎంతో దోహదపడుతుంది.
— చంద్రయాన్–4 ద్వారా చంద్రుడి ఉపరితలంపై సేకరించిన నమూనాలను భూమికి తేవడాన్ని సులభతరం చేస్తుంది. ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూల్స్‌ను పంపి భూమి, చంద్రుడి కక్ష్యలో డాకింగ్ చేయనున్నారు.
— కక్ష్యలో ఉపగ్రహాల మరమ్మతులు, వాటిలో ఇంధనం నింçపడం తదితరాలకు ఉపయోగపడుతుంది.
— ఈ టెక్నాలజీ వల్ల ఉపగ్రహాల జీవితకాలమూ పెరుగుతుంది.
— జంట ఉపగ్రహాల్లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా మెరుగైన భూ పరిశీలనకు తోడ్పడుతుంది.
— మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ మానవసహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడుతుంది.
ISRO has successfully launched PSLV-C60 with SpaDeX and innovative payloads from Sriharikota, Andhra Pradesh 🚀
A MASSIVE STEP IN SPACE EXPLORATION 🙌pic.twitter.com/vLdIIyOghN— The Khel India (@TheKhelIndia) December 30, 2024
Comments
Please login to add a commentAdd a comment