ఉదయం 9.17 గంటలకు ప్రారంభం
16.56 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక
ఏర్పాట్లు పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు
ఎస్‌ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం
షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగంగా నమోదు
సూళ్లూరుపేట/తిరుమల: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3) ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రయోగాన్ని 16.56 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తి చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్న మయ్యారు.
ఏదైనా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ సమయం కొద్దిగా మార్పు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్) నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్‌ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు.
ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.17 కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ ఏడు గంటల కౌంట్ డౌన్ ప్రక్రియలో నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపడంతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారన్నమాట.
అయితే ఈ ప్రయోగంలో మూడు దశలూ ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. దీనికి కౌంట్‌డౌన్ సమయాన్ని అతికొద్ది గంటలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్‌ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
రాకెట్ వివరాలు.. ప్రయోగమిలా..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 రాకెట్ 34 మీటర్లు పొడువు రెండు మీటర్లు వెడల్పు 119 టన్నుల బరువుతో నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని 16 (994 సెకన్లు) నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లకు పూర్తి చేయనున్నారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేయనున్నారు.
నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 808 సెకన్లకు 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ) ఈఓఎస్–08) మొదటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఎస్‌ఆర్–0 డెమోశాట్ అనే ఉపగ్రహాన్ని 994 సెకన్లు భూమికి 475 కిలో మీటర్లు ఎత్తులోని లియో అర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తి చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు.
కౌంట్‌డౌన్ వ్యవధి తక్కువ..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 రాకెట్‌కు కౌంట్‌డౌన్ సమయాన్ని తక్కువగా అంటే ఏడు గంటల వ్యవ«ధి మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాకెట్ మొదటి మూడు దశలు ఘన ఇంధనాన్ని ఉపయోగించి చేయనున్నారు. అంటే ఘన ఇంధనాన్ని ముందుగానే నింపి రాకెట్‌ను అనుసంధానం చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపేందుకు మాత్రమే కౌంట్‌డౌన్ సమయాన్ని తీసుకున్నారు.
ఈ ప్రయోగంలో నాలుగోదశలో 0.05 టన్నులు మాత్రమే ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. అందుకే ఏడు గంటల కౌంట్‌డౌన్ సమయం వ్యవధిలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి ఈ తక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగమిది. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగం కావడం విశేషం.
శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలకు ఇస్రో అధికారులు గురువారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోదతో కలసి శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment