సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్‌వీఎస్–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచింగ్‌ప్యాడ్ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్‌ఎల్‌వీ రాకెట్ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందాయి. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు.
అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్ తరహాలో భారత సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావ్‌ఐసీ(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టిలేషన్– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు.
GSLV-F12/ NVS-O1 Mission is accomplished.
After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit.
Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit.
— ISRO (@isro) May 29, 2023
తొలిసారిగా దేశీ అణుగడియారం
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్–01 ఉపగ్రహంలో ఎల్–1, ఎల్–5, ఎస్–బ్యాండ్ సిగ్నల్స్ వ్యవస్థను అమర్చారు. ఎల్–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు.
సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు.
కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment