What Is NavIC And How It Will Work Better Than GPS, All You Need To Know - Sakshi
Sakshi News home page

What Is NavIC: భారత్‌కు దిక్సూచి ‘నావిక్‌’.. జీపీఎస్‌ కంటే మెరుగైన సేవలు!

Published Sun, Oct 23 2022 7:50 AM | Last Updated on Sun, Oct 23 2022 12:32 PM

Much Better Navigation With NAVIC Than GPS - Sakshi

అది 1999.. కశ్మీర్‌లోని కార్గిల్‌ శిఖరాలను ఆక్రమించిన పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ విజయ్‌’ను చేపట్టింది. ఉగ్రవాదుల అనుపానులను తెలుసుకోవడానికి అమెరికా నావిగేషన్‌ వ్యవస్థ ‘గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) సహకారాన్ని ప్రభుత్వం కోరింది. అయితే భారత వినతిని అమెరికా తిరస్కరించింది. ఈ ఘటన భారత్‌ సొంతంగా నావిగేషన్‌ వ్యవస్థ రూపొందించుకునేందుకు బీజం వేసింది. అదే ‘నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టలేషన్‌ (నావిక్‌). 2018 నుంచి దేశంలో రక్షణ, పోలీసు శాఖలు ఉపయోగిస్తున్న ఈ నావిక్‌ వ్యవస్థ త్వరలోనే దేశ ప్రజలకూ అందుబాటులోకి రానుంది.    

స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ అవసరం..
ఆధునిక సమాచార, సాంకేతిక యుగంలో నావిగేషన్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు అమెరికా నావిగేషన్‌ వ్యవస్థ జీపీఎస్‌పైనే భారత్‌తో సహా పలు దేశాలు ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధాలు, ఉగ్ర దాడులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అమెరికా తన జీపీఎస్‌ను ఇతర దేశాలకు అందుబాటులో లేకుండా చేస్తోంది. దీంతో సొంత నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఆయా దేశాలకు ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్, రష్యా, చైనా, జపాన్‌ వంటి దేశాలు సొంతంగా నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సొంత నావిగేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇస్రోను ఆదేశించింది. దీంతో ‘ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు కింద ఇస్రో భారత నావిగేషన్‌ వ్యవస్థ.. ‘నావిక్‌’ను రూపొందించే ప్రక్రియను 2006లో ప్రారంభించింది. రూ.1,400 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2012 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనివార్య కారణాలతో 2018 నాటికి ఇది పూర్తయింది. అప్పటి నుంచి కేంద్ర రక్షణ శాఖతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖలు నావిక్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు, ప్రకృతి విపత్తులు, సహాయ–పునరావాస కార్యక్రమాలు, వాహనాల ట్రాకింగ్‌ తదితర అవసరాలకు నావిక్‌ను ఉపయోగిస్తున్నారు.  

‘జీపీఎస్‌’ కంటే కచ్చితం..
అమెరికా జీపీఎస్‌ కంటే నావిక్‌ మనదేశానికి సంబంధించినంతవరకు మెరుగైన, కచ్చితమైన నావిగేషన్‌ పరిజ్ఞానాన్ని అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. భూస్థిర కక్ష్యలో 3,600 కి.మీ. ఎత్తులో ఉన్న 8 ఉపగ్రహాలను సమ్మిళితం చేసి ఈ నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించారు. అమెరికా జీపీఎస్‌కు మార్గనిర్దేశం చేస్తున్న ఉపగ్రహాల కంటే నావిక్‌కు అనుసంధానించిన ఉపగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉండటం విశేషం. నావిక్‌.. డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ బాండ్లను ఉపయోగించుకుంటూ పనిచేస్తోంది. దీంతో జీపీఎస్‌ కంటే మెరుగైన, కచ్చితమైన జియో పొజిషనింగ్‌తో కూడిన సమాచారాన్ని అందిస్తోంది. భారత భూభాగంతోపాటు మన దేశ సరిహద్దుల నుంచి 1,500 కి.మీ. పరిధిలో ప్రాంతానికి సంబంధించిన జియో పొజిషనింగ్‌ సమాచారాన్ని కూడా కచ్చితంగా అందించే సామర్థ్యం ‘నావిక్‌’ వ్యవస్థ సొంతం. కాగా అమెరికా, రష్యా, చైనాల నావిగేషన్‌ వ్యవస్థలు భూమి మీద ఏ ప్రాంతంలోనైనా జియో పొజిషనింగ్‌ సమాచారాన్ని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అదే రీతిలో భూగోళమంతా నావిగేషన్‌ సమాచారాన్ని అందించే సామర్థ్యానికి నావిక్‌ను తీర్చిదిద్దే పనిలో ఇస్రో ఉంది. 

మరికొంత సమయం కావాలంటున్న కంపెనీలు..
ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న నావిక్‌ను దేశ ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. 2023 జనవరి నుంచి భారత్‌లో విక్రయించే మొబైల్‌ ఫోన్లలో నావిక్‌ పరిజ్ఞానాన్ని పొందుపరచాలని మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు యాపిల్, శాంసంగ్, షావోమీ మొదలైనవాటికి గత నెలలో స్పష్టం చేసింది. అయితే నావిక్‌ పరిజ్ఞానాన్ని పొందుపరిచేందుకు తమ మొబైల్‌ ఫోన్ల హార్డ్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2023లో భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాల్సిన మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించినందున ఈ మేరకు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. 

అమెరికా జీపీఎస్‌ను అందిస్తున్న ఎల్‌1 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే ‘నావిక్‌’ను కూడా అందించాలని కొన్ని కంపెనీలు ప్రతిపాదించాయి. ఇలా అయితే జీపీఎస్, నావిక్‌ రెండింటిని అందించే రీతిలో మొబైల్‌ ఫోన్లను రూపొందించొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇస్రో తిరస్కరించింది. తాము సొంతంగా ఎల్‌5 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే నావిక్‌ను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా దేశంలో విక్రయించే మొబైల్‌ ఫోన్లలో ఎప్పటి నుంచి నావిక్‌ అందుబాటులోకి రానుందనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement