navic
-
ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు!
యాపిల్ లవర్స్ అందరూ ఎంతాగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 15 సిరీస్' ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఈ ఐఫోన్‌కు 'ఇస్రో'కి కనెక్షన్ ఉన్నట్లు చాలామందికి తెలియక పోవచ్చు. ఈ కథనంలో ఈ సంబంధం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఇస్రో రూపొందించిన జీపీఎస్ సిస్టమ్ NavIC (న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టెలేషన్)కు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాపిల్ తన ఐఫోన్ మోడల్స్‌లో తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ ఫీచర్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండింటిలోనూ ఉంటుంది. NavIC గురించి.. 'న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టెలేషన్'ని గతంలో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని పిలిచేవారు. ఇది ఏడు ఉపగ్రహాల సమూహం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పనిచేస్తుంది. కావున భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. అంతే కాకుండా జీపీఎస్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సమాచారం. మొత్తం మీద దీని ద్వారా లొకేషన్ ట్రాకింగ్ కెపాసిటీ మరింత మెరుగుపడుతుందని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. నేడు ముఖేష్ అంబానీకంటే ఎక్కువ కార్లు కలిగిన బార్బర్ NavIC అనేది ISRO స్వతంత్రంగా అభివృద్ధి చేసింది. నిజానికి ఇది 2008లో 174 మిలియన్ డాలర్స్ లేదా రూ. 1426 కోట్లతో కార్య రూపం దాల్చి 2011 చివరికి పూర్తయింది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రూపొందించిన నావిక్ శాటిలైట్ సిస్టమ్ ఉందని, ఇది 'భారతదేశానికి మైలురాయి' అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. NavIC కేవలం ఐఫోన్ సిరీస్ మొబైల్స్‌కి మాత్రమే కాకుండా రియల్మీ 9 ప్రో, వన్ ప్లస్ నార్డ్ 2టీ, షియోమీ ఎమ్ఐ 11ఎక్స్ వంటి వాటిలో కూడా లభిస్తుంది. కావున వినియోగదారులు దీంతో ఉత్తమ్ లొకేషన్ ట్రాకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. జీపీఎస్ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. #WATCH | Delhi: Union Minister Rajeev Chandrasekhar says, "The world's largest company in technology Apple has launched its new iPhone 15. During this launch, India is achieving two milestones. First, the availability of the iPhone 15 in India would be on the same day as the… pic.twitter.com/Hc8H7IEzOb — ANI (@ANI) September 14, 2023 -
భారత్‌కు దిక్సూచి ‘నావిక్’.. జీపీఎస్ కంటే మెరుగైన సేవలు!
అది 1999.. కశ్మీర్‌లోని కార్గిల్ శిఖరాలను ఆక్రమించిన పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టింది. ఉగ్రవాదుల అనుపానులను తెలుసుకోవడానికి అమెరికా నావిగేషన్ వ్యవస్థ ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహకారాన్ని ప్రభుత్వం కోరింది. అయితే భారత వినతిని అమెరికా తిరస్కరించింది. ఈ ఘటన భారత్ సొంతంగా నావిగేషన్ వ్యవస్థ రూపొందించుకునేందుకు బీజం వేసింది. అదే ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ (నావిక్). 2018 నుంచి దేశంలో రక్షణ, పోలీసు శాఖలు ఉపయోగిస్తున్న ఈ నావిక్ వ్యవస్థ త్వరలోనే దేశ ప్రజలకూ అందుబాటులోకి రానుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అవసరం.. ఆధునిక సమాచార, సాంకేతిక యుగంలో నావిగేషన్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు అమెరికా నావిగేషన్ వ్యవస్థ జీపీఎస్‌పైనే భారత్‌తో సహా పలు దేశాలు ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధాలు, ఉగ్ర దాడులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అమెరికా తన జీపీఎస్‌ను ఇతర దేశాలకు అందుబాటులో లేకుండా చేస్తోంది. దీంతో సొంత నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఆయా దేశాలకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు సొంతంగా నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇస్రోను ఆదేశించింది. దీంతో ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద ఇస్రో భారత నావిగేషన్ వ్యవస్థ.. ‘నావిక్’ను రూపొందించే ప్రక్రియను 2006లో ప్రారంభించింది. రూ.1,400 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2012 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనివార్య కారణాలతో 2018 నాటికి ఇది పూర్తయింది. అప్పటి నుంచి కేంద్ర రక్షణ శాఖతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖలు నావిక్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు, ప్రకృతి విపత్తులు, సహాయ–పునరావాస కార్యక్రమాలు, వాహనాల ట్రాకింగ్ తదితర అవసరాలకు నావిక్‌ను ఉపయోగిస్తున్నారు. ‘జీపీఎస్’ కంటే కచ్చితం.. అమెరికా జీపీఎస్ కంటే నావిక్ మనదేశానికి సంబంధించినంతవరకు మెరుగైన, కచ్చితమైన నావిగేషన్ పరిజ్ఞానాన్ని అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. భూస్థిర కక్ష్యలో 3,600 కి.మీ. ఎత్తులో ఉన్న 8 ఉపగ్రహాలను సమ్మిళితం చేసి ఈ నావిగేషన్ వ్యవస్థను రూపొందించారు. అమెరికా జీపీఎస్‌కు మార్గనిర్దేశం చేస్తున్న ఉపగ్రహాల కంటే నావిక్‌కు అనుసంధానించిన ఉపగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉండటం విశేషం. నావిక్.. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ బాండ్లను ఉపయోగించుకుంటూ పనిచేస్తోంది. దీంతో జీపీఎస్ కంటే మెరుగైన, కచ్చితమైన జియో పొజిషనింగ్‌తో కూడిన సమాచారాన్ని అందిస్తోంది. భారత భూభాగంతోపాటు మన దేశ సరిహద్దుల నుంచి 1,500 కి.మీ. పరిధిలో ప్రాంతానికి సంబంధించిన జియో పొజిషనింగ్ సమాచారాన్ని కూడా కచ్చితంగా అందించే సామర్థ్యం ‘నావిక్’ వ్యవస్థ సొంతం. కాగా అమెరికా, రష్యా, చైనాల నావిగేషన్ వ్యవస్థలు భూమి మీద ఏ ప్రాంతంలోనైనా జియో పొజిషనింగ్ సమాచారాన్ని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అదే రీతిలో భూగోళమంతా నావిగేషన్ సమాచారాన్ని అందించే సామర్థ్యానికి నావిక్‌ను తీర్చిదిద్దే పనిలో ఇస్రో ఉంది. మరికొంత సమయం కావాలంటున్న కంపెనీలు.. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న నావిక్‌ను దేశ ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. 2023 జనవరి నుంచి భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరచాలని మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు యాపిల్, శాంసంగ్, షావోమీ మొదలైనవాటికి గత నెలలో స్పష్టం చేసింది. అయితే నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరిచేందుకు తమ మొబైల్ ఫోన్ల హార్డ్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2023లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాల్సిన మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించినందున ఈ మేరకు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. అమెరికా జీపీఎస్‌ను అందిస్తున్న ఎల్1 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే ‘నావిక్’ను కూడా అందించాలని కొన్ని కంపెనీలు ప్రతిపాదించాయి. ఇలా అయితే జీపీఎస్, నావిక్ రెండింటిని అందించే రీతిలో మొబైల్ ఫోన్లను రూపొందించొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇస్రో తిరస్కరించింది. తాము సొంతంగా ఎల్5 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే నావిక్‌ను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా దేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో ఎప్పటి నుంచి నావిక్ అందుబాటులోకి రానుందనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. -
సముద్రంలో తప్పిపోవడం.. ఇకపై జరగదంతే.. ఒప్పోతో ఇస్రో ఒప్పందం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసే యత్నంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రయానానికి వెళ్లే వారు నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేని చోట కూడా మెసేజ్ పంపడంతో పాటు లోకేషన్ వివరాలు తెలిపే విధంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పందంతో అవగాహన కుదిరింది. ఒప్పో, ఇస్రోల సంయుక్త ఆధ్వర్యంలో ఒప్పో మొబైల్స్‌లో నావిక్ సర్వీసును అందివ్వనున్నారు. భారత భూభాగంతో పాటు భారత సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకు సముద్రంలో నావిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. నావిక్ ద్వారా పొజిషన్, నావిగేషన్, టైమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మొబైల్ నెట్వర్క్ పని చేయని చోటు నుంచి కూడా షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్సెమ్మెస్) పంపించే వీలుంది. భూమితో పాటు సముద్రంలో కూడా ఈ నావిక్ కచ్చితమైన సేవలు అందివ్వగలదు. ముఖ్యంగా సముద్రయానం చేసే వారికి నావిక్ ఎంతో ఉపయోకరంగా మారనుంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. భవిష్యత్తులో ఒప్పో సంస్థ తయారు చేసే మొబైల్‌హాండ్ సెట్లలో ఇన్‌బిల్ట్‌గా నావిక్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇందులో పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. నావిక్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుంది. సాధారణంగా సముద్రంలోకి చేపల వేటలకి వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు.. వారు ఎక్కడున్నారు... ఎలా ఉన్నారు అనే అంశాలపై కచ్చితమైన సమచారం ఉండటం లేదు. మరోవైపు తుపానులు వచ్చినప్పుడు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారుతోంది. నావిక్ అందుబాటులోకి వస్తే చేపల వేటకు వెళ్లే వారు, ఇతర సముద్ర యానం చేసే వారితో ఎల్లవేళలా కనెక్టివిటీ ఉంటుంది. -
గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్
భారత్‌లో ప్రస్తుతం విదేశీ యాప్‌లకు ప్రత్నామ్నాయంగా చాలా స్వదేశీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌కు ప్రత్నామ్నాయంగా ‘కూ‘ యాప్ పై పెద్ద చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‘ పేరుతో ప్రభుత్వమే ఒక యాప్ రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మ్యాప్స్ సేవల్లో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ మ్యాప్స్ కు ప్రత్నామ్నాయంగా మరో యాప్ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీని కోసం మన దేశానికి చెందిన భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో), మ్యాప్ మై ఇండియా చేతులు కలిపాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత వినియోగదారులకు గూగుల్ మ్యాప్స్ కు దీటుగా సేవలు అందించడమే తమ తక్షణ కర్తవ్యం అని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సిఇ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్(డీవోఎస్) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో ధృవీకరించింది. ఈ సందర్భంగా మ్యాప్ మై ఇండియా సీఈఓ రోహణ్ వర్మ మాట్లాడుతూ.." స్వదేశీ నావిగేషన్ సేవల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయి అని తెలిపారు. మ్యాప్ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన స్వదేశీ కంపెనీ. ఈ సంస్థ దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందిస్తుందన్నారు. మీకు ఇకపై గూగుల్ మ్యాప్స్/ గూగుల్ ఎర్త్ అవసరం లేదు" అని అన్నారు. మ్యాప్ మై ఇండియా వినియోగదారులు ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత స్పష్టంగా మ్యాపులను చూడవచ్చు అని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం తమకు తప్పనిసరి అవసరమని ఇస్రో తెలిపింది. .@isro & MapmyIndia partner to offer India’s best indigenous maps, navigation & geospatial apps & services. Path-breaking #AatmanirbharBharat milestone! Now Indian users can leverage made in India maps, navigation, and GIS services. https://t.co/CTL9TX7dFO #ISRO #Maps #GIS pic.twitter.com/R2nCIbDWo4 — MapmyIndia (@MapmyIndia) February 11, 2021 చదవండి: ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ వీడియో లీక్ ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు -
నావిక్-జీపిఎస్ చిప్‌ల తయారీకి బిడ్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 10 లక్షల ఇంటిగ్రేటెడ్ నావిక్, జీపిఎస్ రిసీవర్ల డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. స్వదేశీ పొజిషనింగ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి నావిక్ యూజర్ రిసీవర్లను వాణిజ్యపరం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్), జీపీఎస్ రిసీవర్లకు ఇవి వాడతారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంని నావిక్ అని పిలుస్తారు. నావిక్‌ను భారతదేశంలోని వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం సమాచార సేవలను అందించడానికి, భారత్‌తో పాటు సరిహద్దుల్లోని 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా నావిగేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించారు. నావిక్ వ్యవస్థ పూర్తిగా భారత నియంత్రణలో ఉంది. జీపీఎస్ ఒక్కదానికే పనిచేసే చిప్‌ల బదులు నావిక్‌ను కూడా అనుసంధానం చేస్తే, పట్టణాల్లో మరింత కచ్చితంగా నావిగేషన్ సేవలు అందంచే వీలుంటుంది. బిడ్లు సమర్పించేందుకు జనవరి 11ను గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన బిడ్డర్లకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంది. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) -
నావిక్‌తో ‘హెచ్చరికలు’
బెంగళూరు: దేశీయంగా అభివృద్ధి చేసిన జీపీఎస్ వ్యవస్థ ‘నావిక్’తో ప్రకృతి విపత్తులు, తుపానులు, సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దులపై మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయవచ్చునని ఇస్రో శాస్త్రవేత్త నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. ఇందుకోసం తాము ప్రత్యేకంగా ఓ పరికరాన్ని తయారు చేస్తున్నామన్నారు. బెంగళూరులో జరుగుతున్న స్పేస్ ఎక్స్‌పోలో శుక్రవారం నీలేశ్ మాట్లాడుతూ ఈ పరికరం తక్కువ ధరకే లభిస్తుందనీ, సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా జాలరులకు తెలియజేస్తుందని చెప్పారు. గతేడాది డిసెంబర్లో ఓక్కి తుపాను విరుచుకుపడినప్పుడు కేరళలో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ పరికరాన్ని తయారుచేసినట్లు ఆయన చెప్పారు. తుపానుల వంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు ముందుగానే మత్స్యకారులకు హెచ్చరించి వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేందుకు ఈ పరికరం ఉపకరిస్తుందని నీలేశ్ తెలిపారు. -
అటు నావిగేషన్.. ఇటు రక్షణ..
* ఏడో ఉపగ్రహ ప్రయోగంతో పూర్తయిన ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ * దేశంతోపాటు చుట్టూ 1,500 కి.మీ. పరిధిలో నావిగేషన్ సౌకర్యం * విమాన, నౌకాయానానికి, రక్షణ, పౌర అవసరాలకూ ప్రయోజనం సాక్షి,హైదరాబాద్/సూళ్లూరుపేట: ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో చివరి ఉపగ్రహ ప్రయోగం పూర్తవడంతో మరో రెండు నెలల్లోనే మనదైన నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ స్వదేశీ దిక్సూచి వ్యవస్థతో భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులను, దిక్కులను తెలియజేయడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రమాదాల సమయాల్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. విమాన, నౌకాయాన మార్గాలకూ తోడ్పడుతుంది. భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థ అవసరాన్ని 2006లోనే ఇస్రో గుర్తించింది. ఏడు ఉపగ్రహాలతో రూ.3,425 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి నిధులు కేటాయించడంతో ఇస్రో పని ప్రారంభించింది. 2014 జూలై 1న ఈ వ్యవస్థలో తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. వ్యవస్థ స్థూల రూపం.. ఐఆర్ఎన్ఎస్ఎస్లో మొత్తం ఏడు ఉపగ్రహాలున్నాయి. వాటిలో మూడు భూస్థిర కక్ష్యలో భూమి నుంచి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీల తూర్పు రేఖాంశాల వద్ద ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు జియోసింక్రనస్ కక్ష్యలో (భూమధ్య రేఖను ఖండించే భూస్థిర కక్ష్యలో) 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో తిరుగుతుంటాయి. నిర్దేశిత భూభాగంలో ఏ ప్రాంతాన్నయినా కచ్చితంగా గుర్తించేందుకు ఈ ఏర్పాటు ఉపయోగపడుతుంది. ఒక్కో ఉపగ్రహం నిర్ధారితకాలంపాటు సేవలు అందిస్తుంది. అనంతరం ఇతర ఉపగ్రహాలను వాటికి బదులుగా ప్రయోగిస్తారు. సైనిక, పౌర అవసరాలకు.. మన నావిగేషన్ వ్యవస్థ ద్వారా స్థూలంగా రెండు రకాల సేవలు అందుతాయి. మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఇతర పరికరాల్లో జీపీఎస్ స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రాంతానికైనా కచ్చితమైన మ్యాపులు అందివ్వగలదు. విమానాలు, నౌకల రాకపోకలు, వాటి మార్గాలను నిర్ణయించడం మరింత సులువు అవుతుంది. జీపీఎస్ వంద మీటర్లు అటుఇటూగా నావిగేషన్ సౌకర్యాన్ని అందిస్తే... ఐఆర్ఎన్ఎస్ఎస్ మరింత కచ్చితత్వంతో కేవలం 20 మీటర్ల తేడాతో వివరాలు అందిస్తుంది. నావిగేషన్‌తోపాటు పట్టణ ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల గుర్తింపు, సవివరమైన, కచ్చితమైన భూ సర్వేలకూ దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రక్షణ కోసం..: ప్రస్తుతం మనం అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడుతున్నాం. అత్యవసర సమయాల్లో జీపీఎస్‌ను మిలటరీ అవసరాల కోసం వాడుకునేందుకు అమెరికా అనుమతిస్తుందన్న నమ్మకం లేదు. అందువల్ల మనదైన నావిగేషన్ వ్యవస్థ అవసరమవుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ అందుబాటులోకి రావడంతో పౌర అవసరాలు తీరడంతోపాటు దేశ రక్షణ వ్యవస్థకు బలమైన ఊతం లభిస్తుంది. ఖర్చెంత?: ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.3,425 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒక్కో ఉపగ్రహానికి దాదాపు రూ.150 కోట్లు వ్యయం చేశారు. పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ రాకెట్ల ద్వారా ప్రయోగించిన వాటి ఖర్చు కొంచెం తక్కువగా రూ.130 కోట్ల వరకూ ఉంది. మొత్తంగా ఈ వ్యవస్థలోని ఏడు ఉపగ్రహాలకు సుమారు రూ.1,400 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్లు ఖర్చుకాగా.. బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్‌ను నిర్మించారు.53 ప్రయోగాల్లో 46 విజయాలు ఇస్రోను స్థాపించినప్పటి నుంచి 89 ఉపగ్రహాలు, 53 రాకెట్ ప్రయోగాలు, ఒక స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం, ఒక జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో ఆధ్వర్యంలో చేసిన 53 రాకెట్ ప్రయోగాల్లో 46 విజయవంతమయ్యాయి. అందులో 34 విజయాలు పీఎస్‌ఎల్వీలవే కావడం విశేషం. వాణిజ్యపరమైన ప్రయోగాలకు కూడా పీఎస్ఎల్వీ అత్యంత కీలకంగా మారింది. 2008లో పీఎస్ఎల్వీ-సీ9 ద్వా రా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జూన్ మొదటి వారంలో పీఎస్ఎల్వీ-సీ34 ద్వారా ఒకేసారి 22 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. -
స్వదేశీ దిక్సూచి 'నావిక్'
► రెండు నెలల్లో మన జీపీఎస్ అందుబాటులోకి.. ► ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో ఏడో ప్రయోగం సక్సెస్ ► పీఎస్ఎల్వీ-సీ33 ప్రయోగం విజయవంతం ► గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం ► 20 నిమిషాల 19 సెకన్లలో ప్రయోగం పూర్తి ► ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలోకి చేర్చిన పీఎస్ఎల్వీ శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచ యవనికపై భారత్ మరో కీర్తి పతాకను ఎగురవేసింది.. అతికొద్ది సంపన్న దేశాలకే పరిమితమైన సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటును దాదాపు పూర్తిచేసుకుంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-ఐఆర్ఎన్ఎస్ఎస్)లో చివరిదైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని కదనాశ్వం పీఎస్ఎల్వీ-సీ33 ద్వారా గురువారం విజయవంతంగా ప్రయోగించింది. వరుస విజయాలతో వినువీధిలో భారత కీర్తిపతాకను రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ ప్రయోగంతో ఐఆర్ఎన్ఎస్ఎస్లోని చివరిదైన ఏడో ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరింది. దీంతో మరో రెండు నెలల్లోనే పూర్తిస్థాయిలో మన ‘జీపీఎస్’ అందుబాటులోకి రానుంది. సెల్ఫోన్లు ఇతర పరికరాల ద్వారా నావిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వైమానిక, నౌకాయాన రంగాలకు, రక్షణ, పౌర సేవలకూ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఎంతో ఊతమివ్వనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు వినువీధిలో భారత కీర్తి ప్రతిష్టలను ఎగురవేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఐఎన్ఆర్ఎస్ఎస్ వ్యవస్థను జాతికి అంకితం చేస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. ఉత్కంఠగా కౌంట్‌డౌన్.. పీఎస్ఎల్వీ-సీ33 ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 51 గంటల 30 నిమిషాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన కౌంట్‌డౌన్ ముగిశాక... గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం మొదలైంది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ-సీ33 దాదాపు 320 టన్నుల బరువుతో నిప్పులు కక్కుతూ నింగికి ప్రయాణాన్ని ప్రారంభించింది. రాకెట్ నాలుగు దశలూ విజయవంతంగా పూర్తయి... 20 నిమిషాల 19 సెకన్లకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ దిగ్విజయంగా భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. శాస్త్రవేత్తలంతా ఒకరినొకరు అభినందించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఉపగ్రహాన్ని కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాని పనితీరును పరీక్షించి.. అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. ఉపగ్రహంలో ఉన్న 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి... భూస్థిర బదిలీ కక్ష్య నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో సింక్రొనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. ఇందుకు దాదాపు వారం రోజులు సమయం పట్టే అవకాశముంది. జూన్ నాటికి నావిగేషన్ వ్యవస్థ: ఇస్రో చైర్మన్ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో చివరిదైన ఏడో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. దీనితోపాటు ఈ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలన్నింటినీ పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే ప్రయోగించామన్నారు. ఏడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరిన వెంటనే జూన్ నాటికి సొంత నావిగేషన్ వ్యవస్థను మన దేశానికి అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా అభినందించారు. ప్రయోగం జరిగిందిలా.. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ-సీ33 రాకెట్‌ను ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం సహా రాకెట్ మొత్తం బరువు సుమారు 320 టన్నులు. ఇంత బరువును మోసుకెళ్లేందుకు తొలి దశలోని స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనాన్ని, కోర్ అలోన్ దశలో మరో 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. రెండో దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించారు. తొలిదశ 110 సెకన్లలో, రెండో దశ 262 సెకన్లలో, మూడో దశ 663 సెకన్లలో, నాలుగో దశ 1,182 సెకన్లలో పూర్తయింది. మొత్తంగా 20 నిమిషాల 19 సెకన్లకు 1,425 కిలోల బరువున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పెరిగీ (భూమికి దగ్గరగా) 286 కిలోమీటర్లు, అపోగీ (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో 17.82 డిగ్రీల వాలులో ఉపగ్రహం ప్రయాణం ప్రారంభించింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 35వది. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 13వ ప్రయోగం.