భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసే యత్నంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రయానానికి వెళ్లే వారు నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా లేని చోట కూడా మెసేజ్ పంపడంతో పాటు లోకేషన్ వివరాలు తెలిపే విధంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పందంతో అవగాహన కుదిరింది.
ఒప్పో, ఇస్రోల సంయుక్త ఆధ్వర్యంలో ఒప్పో మొబైల్స్‌లో నావిక్ సర్వీసును అందివ్వనున్నారు. భారత భూభాగంతో పాటు భారత సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకు సముద్రంలో నావిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. నావిక్ ద్వారా పొజిషన్, నావిగేషన్, టైమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మొబైల్ నెట్‌వర్క్ పని చేయని చోటు నుంచి కూడా షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్సెమ్మెస్) పంపించే వీలుంది. భూమితో పాటు సముద్రంలో కూడా ఈ నావిక్ కచ్చితమైన సేవలు అందివ్వగలదు. ముఖ్యంగా సముద్రయానం చేసే వారికి నావిక్ ఎంతో ఉపయోకరంగా మారనుంది.
తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. భవిష్యత్తులో ఒప్పో సంస్థ తయారు చేసే మొబైల్‌హాండ్ సెట్లలో ఇన్‌బిల్ట్‌గా నావిక్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇందులో పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. నావిక్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుంది. సాధారణంగా సముద్రంలోకి చేపల వేటలకి వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు.. వారు ఎక్కడున్నారు... ఎలా ఉన్నారు అనే అంశాలపై కచ్చితమైన సమచారం ఉండటం లేదు. మరోవైపు తుపానులు వచ్చినప్పుడు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారుతోంది. నావిక్ అందుబాటులోకి వస్తే చేపల వేటకు వెళ్లే వారు, ఇతర సముద్ర యానం చేసే వారితో ఎల్లవేళలా కనెక్టివిటీ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment