Short Message Service (SMS)
-
సముద్రంలో తప్పిపోవడం.. ఇకపై జరగదంతే.. ఒప్పోతో ఇస్రో ఒప్పందం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసే యత్నంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రయానానికి వెళ్లే వారు నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేని చోట కూడా మెసేజ్ పంపడంతో పాటు లోకేషన్ వివరాలు తెలిపే విధంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పందంతో అవగాహన కుదిరింది. ఒప్పో, ఇస్రోల సంయుక్త ఆధ్వర్యంలో ఒప్పో మొబైల్స్‌లో నావిక్ సర్వీసును అందివ్వనున్నారు. భారత భూభాగంతో పాటు భారత సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకు సముద్రంలో నావిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. నావిక్ ద్వారా పొజిషన్, నావిగేషన్, టైమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మొబైల్ నెట్వర్క్ పని చేయని చోటు నుంచి కూడా షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్సెమ్మెస్) పంపించే వీలుంది. భూమితో పాటు సముద్రంలో కూడా ఈ నావిక్ కచ్చితమైన సేవలు అందివ్వగలదు. ముఖ్యంగా సముద్రయానం చేసే వారికి నావిక్ ఎంతో ఉపయోకరంగా మారనుంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. భవిష్యత్తులో ఒప్పో సంస్థ తయారు చేసే మొబైల్‌హాండ్ సెట్లలో ఇన్‌బిల్ట్‌గా నావిక్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇందులో పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. నావిక్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుంది. సాధారణంగా సముద్రంలోకి చేపల వేటలకి వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు.. వారు ఎక్కడున్నారు... ఎలా ఉన్నారు అనే అంశాలపై కచ్చితమైన సమచారం ఉండటం లేదు. మరోవైపు తుపానులు వచ్చినప్పుడు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారుతోంది. నావిక్ అందుబాటులోకి వస్తే చేపల వేటకు వెళ్లే వారు, ఇతర సముద్ర యానం చేసే వారితో ఎల్లవేళలా కనెక్టివిటీ ఉంటుంది. -
ట్యాక్స్ రీఫండ్ ఎస్ఎంఎస్.. క్లిక్ చేశారో
మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది ఇటీవల కాలంలో. సైబర్ నేరాలు అంతకంతకు కొత్త కొత్త మార్గాల్లో విజృంభిస్తున్నారే తప్ప, అసలు తగ్గడం లేదు. తాజాగా ఓ సైబర్ క్రైమ్ రాకెట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ రూపంలో పన్ను చెల్లింపుదారులను దగా చేస్తోంది. ఐటీ రిటర్నులకు తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నట్టు సైబర్ నేరగాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్‌కు సంబంధించి ఈ ఎస్ఎంఎస్ను పన్నుచెల్లింపుదారులకు సెండ్ చేశారు. తప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తో మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్‌ను టార్గెట్ చేశారని ఆ మెసేజ్‌లో చెప్పారు. మీ అకౌంట్ నెంబర్ సరియైనదో కాదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ కాకపోతే, మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి, సరిచేసుకోవాలని సైబర్ నేరగాళ్లు కోరారు. ఆ మెసేజ్ నిజంగానే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని భావించి, ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, ఇక పన్ను చెల్లింపుదారుల పని అంతే అట. అలా క్లిక్ చేస్తే అచ్చం ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి ఎంట్రి అయినట్టు ఉంటుంది. కానీ అది అధికారిక ఐటీ డిపార్ట్మెంట్ కాదు. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఎంటర్ కావాలని సైబర్ క్రిమినల్స్ కోరతారు. ఆ తర్వాత స్టెపులో బ్యాంక్ అకౌంట్ అకౌంట్ వివరాలు అడుగుతారు. ఆ వెబ్సైట్ నిజమేమో అనుకుని బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేసిన వారు, సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నారు. దీనిపై నెల క్రితమే కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కొత్త సైబర్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్టు సైబర్ క్రైమ్ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు నమోదు చేసిన లాగిన్ వివరాలతో, సైబర్ నేరగాళ్లు ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్లి, వారి ఐటీ ఫండ్స్‌ను తమతమ అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటున్నారు. అంతేకాక ఐటీ డిపార్ట్మెంట్ రికార్డుల్లో ఉన్న ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీని కూడా సైబర్ నేరగాళ్లు మార్చేస్తున్నారు. ఈ డేటాను వారు వేరే వాళ్లకి అమ్మేస్తున్నారు కూడా. ఇదే రకమైన కేసును గతేడాది థానే పోలీసులు చేధించారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు అధికారుల మాదిరి అమెరికన్ సిటిజన్లను మోసం చేసిన భారతీయులను అరెస్ట్ చేశారు. ఈ అనుమానిత మెసేజ్‌లకు స్పందించకుండా దూరంగా ఉండాలని ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను హెచ్చరిస్తోంది. -
వాట్సాప్‌లో భారీగా ఛార్జీల బాదుడు
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్.. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయకుండా ఉచితంగా తన సర్వీసులను అందిస్తోంది. మొబైల్ ఫోన్లో నెట్ ఉంటే చాలు. వాట్సాప్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించనవసరం లేదు. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఛార్జీల బాదుడు షురూ చేయాలని నిర్ణయించింది. అయితే అది యూజర్లందరకూ కాదట. కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమే. మార్కెటింగ్, కస్టమర్ సర్వీసు మెసేజ్‌లు పంపే వారి నుంచి ఇక ఛార్జీలు వసూలు చేయాలని ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ నిర్ణయించిందని తెలిసింది. యూసేజ్ తగ్గిపోవడం, రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో, ఈ ఛార్జీలను విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. పంపించిన మెసేజ్ డెలివరీ అయినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఒక్కో మెసేజ్‌కు 0.5 సెంట్ల నుంచి 9 సెంట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. అంటే మన దేశంలో ఈ ఛార్జీలు 34.16 పైసల నుంచి రూ.6.15 వరకు ఉంటాయి. అయితే వాట్సాప్ ప్రస్తుతం విధించబోతున్న ఈ ఛార్జీలు ఎస్ఎంఎస్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాట్సాప్ బిజినెస్ యూజర్లలో ఆందోళన నెలకొంది. వాట్సాప్‌కు మొత్తం 1 .5 బిలియన్ యూజర్లున్నారు. బిజినెస్‌లు చేసే వారు నోటిఫికేషన్లను పంపడానికి వాట్సాప్ బిజినెస్ ఏపీఐను వాడుతున్నారు. వాట్సాప్ ఈ జనవరిలోనే చిన్న వ్యాపార అకౌంట్ల కోసం ఈ వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో 30 లక్షల మందికి పైగా యాక్టివ్ యూజర్లున్నారు. ఆ సమయంలోనే వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ నుంచి ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశ్యం ఉందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మ్యాట్ ఐడెమా తెలిపారు. -
ఐటీ పేరుతో లూటీ!
‘‘డియర్ xxxxx, మీరు చెల్లించిన ఆదాయపు పన్నుకు సంబంధించిన రీ ఫండ్ అప్రూవ్ అయింది. త్వరలోనే మీ బ్యాంకు ఖాతాలోకి (xxxxxxxx) జమ అవుతుంది. అంతకుముందుగా దయచేసి మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసుకోండి. మా రికార్డుల్లో ఉన్నది తప్పయితే తక్షణం ఈ లింకును క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ చేయండి (https://bit.ly/2 OwpYK6)'' హైదరాబాద్‌కు చెందిన అనేక మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొన్ని రోజుల నుంచి వస్తున్న సంక్షిప్త సందేశాలు ఇవి. సాంకేతిక పరిభాషలో ‘ఫిషింగ్’గా పిలిచే వీటిని నమ్మి ముందుకు వెళ్తే నిండా మునుగుతామని, సైబర్ నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన ఫిర్యాదులు రానప్పటికీ అధికారులు వీటి మూలాలు ఆరా తీస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత అధికంగా కట్ అయిన పన్ను రీ ఫండ్‌గా వస్తుంది. దీనికోసం ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన బ్యాంకు ఖాతా వివరాలను రిటర్న్స్తోపాటే ఐటీ విభాగానికి తెలియజేస్తాడు. ఆ మొత్తం రీ ఫండ్ వచ్చే ముందు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఓ సంక్షిప్త సందేశం వస్తుంది. దీన్నే సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ కోసం వినియోగించుకుం టున్నారు. ఉత్తరాదిన తిష్టవేసిన ఈ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు చెందిన డేటా సేకరిస్తున్నారు. దీని ఆధారంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల సెల్‌ఫోన్ నంబర్లకు ఐటీ విభాగం పంపినట్లు ‘రీ ఫండ్ అప్రూవ్డ్’ అంటూ ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఇందులో ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా పొందుపరుస్తున్నారు. దీంతో ఎస్ఎంఎస్ చూసుకున్న వారు అందులో తమ బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఉన్నాయని, ఐటీ విభాగం ఇచ్చే రీ ఫండ్ అందులోకే వెళ్లిపోతుందని భావిస్తున్నారు. వెంటనే తమ ఖాతా వివరాలు అప్డేట్ చేయడానికి ఎస్ఎంఎస్లో నేరగాళ్లు ఇచ్చిన లింకును క్లిక్ చేస్తున్నారు. వరుసపెట్టి వివరాలు సేకరణ ఎస్ఎంఎస్లోని లింకును క్లిక్ చేయడంతోనేవినియోగదారుడు ‘ఫిషింగ్’ వెబ్పేజ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ను పోలిందే మరోటి సృష్టించారు. ♦ అసలైన ఇన్‌కం ట్యాక్స్ విభాగం వెబ్సైట్ అడ్రస్ బార్లో https://www.incometaxindiaefiling.gov.in/home అని ఉంటుంది. బోగస్ వెబ్సైట్ అడ్రస్ బార్ పరిశీలిస్తే http://50.63.185.184/~shndkfnlemdinsl/500599524/hqu.php?RefundStatus=APPROVED&id=YWJjQDEyMy5jb20%3Dగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ♦ దీన్ని గమనించకుండా ఎవరైనా ముందుకెళ్తే బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరచాలంటూ ప్రత్యక్షం అవుతుంది. ♦ ఈ లింకులో బ్యాంకును ఎంపిక చేసుకోండంటూ యాక్సిస్, సిటీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ పేర్లతోపాటు ‘అదర్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. ♦ ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు ఎవరైనా దాని పేరు ఎంచుకుని ‘ప్రొసీడ్’ నొక్కితే ఈ బ్యాంకు వెబ్‌సైట్‌ను పోలిందే నకిలీది ఓపెన్ అవుతోంది. ♦ ఉదాహరణకు ఎస్బీఐదే తీసుకుంటే అసలైన ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ అధికారిక సైట్లోకి ఎంటర్ అయితే అడ్రస్ బార్లో https://retail.onlinesbi.com/retail/login.htm అని వస్తుంది. నకిలీ దాంట్లోకి ప్రవేశిస్తే అడ్రస్ బార్లో http://50.63.185.184/~shndkfnlemdinsl /500599524/hqu.php?RefundStatus=A PPROVED&id=YWJjQDEyMy5 jb20%3 అని కనిపిస్తుంటుంది. ♦ దీన్ని కూడా గమనించకుండా వినియోగదారుడు ముందుకు వెళ్తే అసలు కథ ప్రారంభం అవుతుంది. బ్యాంకు అధికారిక సైట్‌ను పోలి, అందులోని వివరాలతో కూడి ఉండే ఈ సైట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తోపాటు అన్ని వివరాలు పొందుపరచమని కోరుతుంది. తర్వాత వన్‌టైమ్ పాస్వర్డ్స్ అడుగుతుంది. సెల్‌ఫోన్/మెయిల్ వచ్చిన పాస్‌వర్డ్స్‌ను పొందుపరిచిన వెంటనే పూర్తి వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయి. అలా బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తారు. ♦ నకిలీ వెబ్‌సైట్స్‌లో ప్రవేశించినప్పుడు హెచ్చరిక కనిపిస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సాధారణంగా అడ్రస్ బార్‌కు ఎడమ వైపు https:// అనే అక్షరాలు ఉండే పక్కనే ‘సెక్యూర్’ అని కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ వినియోగం సురక్షితం అని దాని అర్థం. ♦ బోగస్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అడ్రస్ బార్ పక్కన (ఎడమ వైపు) ‘నాట్–సెక్యూర్’ అని వస్తుంటుందని, అలా లేకపోయినా అడ్రస్ బార్లో ఉన్న వివరాల ఆధారంగా నకిలీదని గుర్తించాలని సూచిస్తున్నారు. ఇలాంటివి గమనించకుండా ముందుకు వెళితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. -
బ్యాంక్ లింక్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మారిందా?
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తత కోసం ప్రతి ఒక్కరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది బ్యాంకు అధికారిక రికార్డుల్లో నమోదవుతుంది. ఈ సెల్ నంబర్ ఆధారంగానే కొన్ని ఆర్థిక లావాదేవీల యాప్స్ పని చేస్తుంటాయి. ఇంతటి కీలకమైన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం తప్పదు. నగరానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ చూపిన చిన్న నిర్లక్ష్యం రూ.7 లక్షల నష్టాన్ని మిగిల్చింది. దీనిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విదేశాలకు వెళ్లడంతో... నగరానికి చెందిన ఓ యువతికి ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. కొన్నేళ్ల క్రితం తెరిచిన ఈ ఖాతాకు తన ప్రీ పెయిడ్ సెల్‌ఫోన్ నెంబర్‌కు లింకు చేసుకుంది. సదరు బ్యాంకు ఖాతాలో జరిగిన ప్రతి లావాదేవీపై అలర్ట్ వచ్చేలా ఈ నెంబర్‌ను రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌గా మార్చుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్న ఈ యువతి ఎన్ఆర్ఐగా మారారు. నాలుగు నెలల క్రితం తన సెల్‌ఫోన్ నెంబర్ మార్చుకుని ‘రిజిస్టర్డ్ నెంబర్’ వదిలేశారు. ఈ విషయాన్ని ఈ–మెయిల్ రూపంలో బ్యాంకు దృష్టికి తీసుకువెళ్లారు. తన పాత నెంబర్‌కు బదులుగా కొత్తగా మరో నెంబర్‌ను ఖాతాతో లింకు చేయాల్సిందిగా అందులో కోరారు. అయితే బ్యాంకు నిబంధనల ప్రకారం వినియోగదారుడు స్వయంగా వచ్చి, నిర్ణీత దరఖాస్తు పూరించి ఇస్తేనే ఈ మార్పిడి సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులు ఎన్ఆర్ఐకి సమాచారం ఇచ్చారు. ఆపై ఆమె ఆ విషయం మర్చిపోయారు. ఎడాపెడా వాడేసిన నిందితుడు... సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం ఏదైనా ప్రీ–పెయిడ్ నెంబర్‌ను వినియోగదారుడు కొన్నాళ్ల పాటు వినియోగించకుంటే దాన్ని వేరే వినియోగదారుడికి ఎలాట్ చేసేస్తారు. దీని ప్రకారమే ఎన్ఆర్ఐకి చెందిన ‘రిజిస్టర్డ్ నెంబర్’ను సర్వీస్ ప్రొవైడర్ నాలుగు నెలల క్రితం మరో వ్యక్తికి కేటాయించారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొన్ని ఆర్థిక లావాదేవీల యాప్స్‌లో ఓ లోపం ఉంది. బ్యాంకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో ఉన్న ఫోన్లో వీటిని డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఖాతాను యాక్సస్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్ఆర్ఐ నెంబర్ పొందిన యువకుడు తన సెల్ఫోన్లో కొన్ని ఈ తరహా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో ఆమె బ్యాంకు ఖాతాతో అనుసంధానమైంది. లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్, ఓటీపీలు సైతం ఇదే నెంబర్‌కు రావడం అతడికి కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అతగాడు ఎన్ఆర్ఐ ఖాతాలో ఉన్న నగదును తన ఖాతాలోకి మళ్లించాడు.మూడునెలల్లో రూ.7లక్షలు స్వాహా చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ కాప్స్... ఈ వ్యవహారంపై విదేశాల్లో ఉన్న యువతికి సమాచారం రాకపోవడంతో ఆమె తన ఖాతాలోకి నగదు జమ చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తాన్ని ఓ వ్యక్తి కాజేస్తున్నాడనే అంశమే ఆమె దృష్టికి వెళ్లలేదు. ఇటీవల ఆమె తండ్రి సదరు బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అందులో ఉండాల్సిన మొత్తం లేనట్లు గుర్తించారు. లెక్కలు చూడగా దాదాపు రూ.7 లక్షల వరకు తేడా రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సదరు యువకుడు ఏపీలోని చిత్తూరుకు చెందిన వాడిగా భావిస్తున్నారు. సెల్‌ఫోన్ నెంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా వివరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల తెలంగాణలో భారీ సిమ్‌కార్డు స్కాం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నకిలీ వేలిముద్రలు, ఆధార్‌తో వేలాది సిమ్‌కార్డులను అక్రమంగా యాక్టివేట్ చేశాడు ఓ మొబైల్ షాపు యజమాని. మన ఆధార్ కార్డుతో ఒకే సిమ్‌కార్డు తీసుకున్నామనే అనుకున్నా, వాటిని నకిలీ చేసి వాటి నుంచి ఎన్ని సిమ్‌కార్డులు తీసుకున్నారో ఎవరికి తెలుసు? ఇటీవల తెలంగాణలో వెలుగు చూసిన సంఘటనతో మన వివరాలతో ఎవరు ఏ దారుణాలకు ఒడిగడుతున్నారో? అనే భయం ఇప్పుడు ప్రతిఒక్కరిలో ఉంది. అందుకే ఆ భయం పోవడానికి, మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండి. పలు టెలికం కంపెనీల్లో మన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి. యూఐడీఏఐ ఆదేశాల మేరకు, గతంలో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడు తన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా ఎస్ఎంఎస్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా చేరింది. ఒక్క మెసేజ్‌తో వివరాలను అందిస్తోంది. జియో తన యాప్‌లో ఆ వివరాలను పొందుపరుస్తుంది. అయితే ఐడియా, వొడాఫోన్, డొకోమో, టెలీనార్, రిలయన్స్ కంపెనీలు మాత్రం ఈ సర్వీసులను అందించడం లేదు. మీఆధార్ మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. మీరు ఎయిర్టెల్ వినియోగదారుడు అయితే మీఫోన్ నుంచి ADCHK స్పేస్ ఆధార్‌కార్డు నెంబర్ టైప్ చేసి 121కి మెసేజ్ చేయాలి. మరుక్షణమే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్ల జాబితా వస్తుంది. జియో వినియోగదారుడు అయితే మై జియో యాప్, మై అకౌంట్లో లింక్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. అలా కనుక లేకపోతే మీ పేరు మీద ఒక జియో సిమ్ ఉన్నట్లే లెక్క. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే ALIST స్పేస్ ఆధార్ నెంబర్ టైప్ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్ చేయాలి. రిప్లై మెసేజ్‌లో మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన బీఎస్ఎన్ఎల్ నంబర్లు వస్తాయి. -
ఎస్ఎంఎస్ పంపండి... పేరుందో లేదో చూసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో, లేదో తెలుసుకునేందుకు సెల్ ఫోన్ నెంబర్ 9223166166 కు మెసేజ్ పంపవచ్చునని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌బూత్ స్థాయి అధికారులు మే 21 నుంచి ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారని, ఈ కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుందన్నారు. సర్వే సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేరులేనివారు నమోదుచేసుకోవచ్చునని లేదా www.ceotelangana.nic.in అనే వెబ్సైట్ ద్వారా కూడా ఫారం–6లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, పొరపాట్ల సవరణకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. వీటితోపాటు ఓటరు జాబితాలో పేరున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు 9223166166 అనే సెల్ నెంబర్‌కు TS SPACE VOTER ID NO.( EXAMPLE TS VOTE ABC 1234567) మెసేజ్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. దీంతో పాటు మైజీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌లో కూడా ఓటరు నమోదు, ఓటరు సమాచారం తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.ఓటర్ల జాబితా సవరణపై నగరంలోని 11 లక్షల ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు -
ఇదేం వింత.. హెడ్‌ఫోన్ ఆర్డర్ చేస్తే..?
కోలకతా: ఆన్లైన్ కొనుగోళ్లలో మోసానికి సంబంధించి మరో షాకింగ్ ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం చూశాం. కానీ కోలకతాకు చెందిన వినియోగదారుడికి మాత్రం మరో వింత అనుభవం ఎదురైంది. ఒక ప్రముఖ ఆన్లైన్ కంపెనీకి హెడ్‌ఫోన్స్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్ అనంతరం పరిణామాలకు గందరగోళంలో పడిపోయాడు. ఫుట్‌బాల్ పట్ల అమితమైన ప్రేమ ఉన్న ఓ అభిమాని అటు కుటుంబానికి, ఇటు తనకు ఏఇబ్బందీ లేకుండా మ్యాచ్లనుఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇందుకు రెండుటీవీ హెడ్సెట్లను ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ ప్యాకేజీ శుక్రవారం ఇంటికి చేరింది. అయితే ఆ సమయానికి ఇంట్లో లేకపోవడంతో అతడు శనివారం ఆ ప్యాక్ విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్‌ఫోన్‌కోసం ఎదురు చూసిన అతగాడు బాక్స్‌లో ఉన్నది చూసి బిత్తరపోయాడు. ఇక్కడే ఈయనకు మరో షాక్ తగిలింది. హెడ్‌ఫోన్‌కు బమదులుగా ఒక హెయిర్ ఆయిల్ డబ్బా దర్శనమిచ్చింది. దీంతో బాధితుడు బాక్స్‌మీద ఉన్న టోల్ ఫ్రీకి (1800) ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ ఒకసారి మ్రోగి.. డిస్ కనెక్ట్ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్‌కు మళ్లీ డయల్ చేశాడు. సేమ్ ఎస్ఎంఎస్ రిపీట్. ఇక ఈ విషయాన్ని వాళ్ల స్నేహితులతో షేర్ చేస్తే.. వాళ్లు ఇదే అనుభవాన్ని పంచుకున్నారు. అయితే వారి సలహా మేరకు కంపెనీకి చెందిన అసలైన టోల్ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన ఫిర్యాదు నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే..ఆయిల్ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్‌ఫోన్ సెట్ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్ చేస్తామంటూ సోమవారం ఉదయం షాపింగ్ పోర్టల్ నుండి కాల్ రావడం. దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్లైన్ పోర్టల్ వాళ్లు వచ్చి ఆదే బాటిల్ వాపస్ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి... ఫుల్బాల్ మ్యాచ్‌లను మ్యూట్‌లోనే వీక్షిస్తున్నాడుట. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్లైన్ పోర్టల్ కస్టమర్ కేర్ ప్రతినిధి ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్ చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. -
మహేశ్‌తో సినిమా ఉంటుంది
‘‘నా తొలి సినిమా ‘ఎస్ఎంఎస్’ రిలీజ్‌కి ఓ వారం ముందు ఇంద్రగంటిగారితో ఓ సినిమా చేద్దామనుకున్నా. ఓ ప్రొడక్షన్ హౌస్‌తో సైన్ కూడా అయింది. కానీ టేకాఫ్ కాలేదు. అవసరాల శ్రీనివాస్ కథతో ఇంద్రగంటిగారు డైరెక్ట్ చేసేట్టు అనుకున్నారు. ఆ సినిమానే ‘ఊహలు గుసగుసలాడే’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా, అదితీరావు హైదరీ హీరోయిన్గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు... ∙ఇంద్రగంటిగారు ఒకరోజు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ స్క్రిప్ట్ వినమన్నారు. నచ్చింది, చేశా. ఈ చిత్రంలో నా పేరు విజయ్. చిల్డ్రన్స్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా కనిపిస్తాను. విజయ్‌కి సినిమా ఇండస్ట్రీ మీద, స్టార్స్ మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. అదితీరావు ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా నటించారు. మేమిద్దరం ఎలా కనెక్ట్ అయ్యామన్నదే ఈ సినిమా. నా పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఓ కామన్ ఆడియన్ డౌట్స్‌ని ఆన్‌స్క్రీన్‌పై డిస్కస్ చేస్తున్నట్టు ఉంటుంది. ∙ఇంద్రగంటిగారు తెరకెక్కించిన ప్రాపర్ లవ్‌స్టోరీ ‘అంతకు ముందు ఆ తర్వాత’. కానీ, ‘సమ్మోహనం’ వంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆయన ఇప్పటిదాకా చేయలేదు. ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదు. ‘ఏమాయ చేసావె’ కూడా వేరు.‘సమ్మోహనం’లో ఫన్, రొమాన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో హరీశ్ శంకర్, అవసరాల శ్రీనివాస్, తరుణ్ భాస్కర్‌గారు మాత్రమే గెస్ట్ రోల్స్ చేశారు. హీరోలెవరూ చేయలేదు. ∙ఈ సినిమా సెట్స్‌కి ఫ్రెండ్స్‌ని పిలిచేవాణ్ణి. ఇంద్రగంటిగారి సినిమాల్లో యాక్టరే కింగ్. యాక్టర్ కూర్చోవచ్చు. నిలబడొచ్చు. యాక్టర్ మంచి మూడ్‌లో ఉంటే దాన్ని గమనించి ఇంద్రగంటిగారు సినిమా చేస్తారు. అంతేగానీ కెమెరాను సెట్ చేసుకుని ‘యాక్టర్‌ని పిలవండయ్యా’ అని చెప్పరు. . శివలెంక కృష్ణప్రసాద్‌గారు చూడ్డానికి తెల్లగా ఉంటారు. అంతే స్వచ్ఛంగానూ ఉంటారు. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమా చేయాలని ఉంది. బాలీవుడ్ నటులు షూట్లో ప్రొనౌన్స్ కూడా సరిగా చేయలేరు. కానీ, అదితీ చాలా స్పష్టంగా తెలుగు నేర్చుకుని వచ్చేది. డబ్బింగ్ కూడా చెప్పింది. ∙మన చుట్టూ చాలామంది ప్రతిభావంతులున్నారు. కొరియోగ్రాఫర్లు, పాటలు రాసేవాళ్లు, నటీనటులు... ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇక్కడ అవకాశాల కోసం తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు. నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే బావుంటుందనిపించి చేశా. చాలా మంది వచ్చి కలుస్తూనే ఉన్నారు. ∙ప్రవీణ్ సత్తార్గారి దర్శకత్వంలో చేయనున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. నా తర్వాతి సినిమా మా సంస్థలోనే ఉంటుంది. ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తున్నా. మా బ్యానర్లో మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. మంచి కథ ఉంటే ఇంద్రగంటిగారి దర్శకత్వంలో మహేశ్‌తో సినిమా చేస్తే చాలా బావుంటుంది’’ అంటున్న సుధీర్‌తో ‘మీ వాయిస్‌లో మెచ్యూరిటీ కనిపిస్తోంది’ అంటే.. ‘‘వాయిస్ ఎక్సర్సైజ్లు చేస్తున్నా. మానేస్తే మళ్లీ పీలగా మారిపోతుంది’’ అన్నారు నవ్వేస్తూ. -
‘భవిష్య’ చందాదారులకు మరింత వెసులుబాటు
న్యూఢిల్లీ: సంస్థలు తమ వాటాను భవిష్య నిధికి నిర్దిష్ట గడువులోగా జమ చేయకుంటే ఆ సమాచారం ఇకపై సదరు ఉద్యోగికి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం జమ చేసిన వివరాలనే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఉద్యోగులకు పంపుతోంది. ‘ఇప్పటి వరకు సంస్థలు తమ వాటాను చెల్లించకుంటే ఆ సమాచారం ఆ ఉద్యోగులకు తెలిసేది కాదు. ఎవరి తరఫున వారి సంస్థ కంట్రిబ్యూషన్‌ను చెల్లించలేదో ఇకపై ఆ వివరాలు సదరు ఉద్యోగికి ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపుతాము’ అని ఈపీఎఫ్‌వో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌ను తమ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఎఎన్)తో అనుసంధానం చేసుకున్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. -
ఉద్యోగాలిప్పిస్తామంటూ వాట్సప్‌లో ఎర
ఓర్వకల్లు : సోలార్ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ ద్వారా నిరుద్యోగులకు ఎరవేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ మధుసూదన్‌రావు వివరాలు వెల్లడించారు. బనగానపల్లెకు చెందిన పరమేష్, కోవెలకుంట్లకు చెందిన మమబూబ్ ఉశేని, అదే మండలం, బిజినివేములకు చెందిన రాజశేఖరచౌదరి, ఆళ్లగడ్డకు చెందిన రామోజీరావు, చాగలమర్రికి చెందిన ప్రసాద్ ముఠాగా ఏర్పడి శకునాల వద్దనున్న సోలార్ పరిశ్రమలోని గ్రీన్కో కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వాట్సప్ ద్వారా ఈ నెల 17న నిరుద్యోగులకు సందేశాలు పంపారు. ఈక్రమంలో గ్రీన్కో కంపెనీ సెక్యూరిటీ సూపర్వైజర్ కోటేశ్వరరావు తన తమ్ముడికి ఉద్యోగం కావాలని సదరు యువకులను ఫోన్లో సంప్రదించాడు. అందుకు మొదట రూ.10 వేలు డిపాజిట్, మరో రూ.2 వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆయన విషయాన్ని గ్రీన్కో కంపెనీ డిప్యూటీ మేనేజర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం హుశేనాపురంలోని గడివేముల బస్టాండ్ వద్ద ముగ్గురు నిందితులు ఉండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎస్‌ఎంఎస్‌లకూ బాదేస్తున్న బ్యాంకులు
సాక్షి, కోల్‌కతా : బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఖాతాదారులకు పంపే ఎస్ఎంఎస్ అలర్ట్‌లకూ వినియోగదారులపై బ్యాంకులు చార్జీల భారం మోపుతున్నాయి. ఎస్ఎంఎస్లపై వాస్తవ యూసేజ్ ప్రకారం చార్జీలు విధించాలని ఆర్బీఐ బ్యాంకులను కోరితే..బ్యాంకులు మాత్రం ఫిక్స్డ్ చార్జీల పేరిట ఖాతాదారులను బాదేస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పెద్దగా లావాదేవీలు నిర్వహించని ఖాతాలపై ఎస్ఎంఎస్ చార్జీల వడ్డింపు ఉండదు. అయితే ఫిక్స్డ్ చార్జీల పేరిట బ్యాంకులు మూడు నెలలకు ఓసారి ఈ చార్జీలను అన్ని ఖాతాలపై వడ్డిస్తుండటంతో సగటు ఖాతాదారులపై అదనపు చార్జీల భారం పడుతోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు ఆర్బీఐ సూచనలకు విరుద్ధంగా ఎస్ఎంఎస్ చార్జీలను వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘనేనని భారత బ్యాంకింగ్ ప్రమాణాల మండలి (బీసీఎస్‌బీఐ) చైర్మన్ ఏసీ మహజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీఎస్‌బీఐ చేపట్టిన సర్వే ప్రకారం 48 బ్యాంకులకు గాను 19 బ్యాంకులు ప్రతి మూడునెలలకూ రూ 15 ఫిక్స్డ్ చార్జీలుగా వసూలు చేస్తున్నాయని తేలింది. ప్రస్తుత పన్నులను కలుపుకుంటే కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పొందినందుకు బ్యాంకులకు ప్రతి మూడు నెలలకూ రూ 17.7 చెల్లిస్తున్నారని వెల్లడైంది. ఫిక్స్డ్ చార్జీలతో పేద, సామాన్య కస్టమర్లపై భారం మోపడం సరికాదని బీసీఎస్‌బీఐ చైర్మన్ మహజన్ పేర్కొన్నారు. -
ట్రాఫిక్ చలానా ఎస్ఎంఎస్ రూపంలో
బనశంకరి: నగరంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే సమయంలో జరిమానా వసూలు చేయడానికి క్యాష్‌లెస్ విధానం అనుసరిస్తున్న బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు ఇకనుంచి పేపర్‌లెస్‌కు మారాలని నిర్ణయించారు. వాహనదారులకు జరిమానా రాసేటప్పుడు, లేదా సిగ్నల్ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా వారి చిరునామాలకు పోస్టులు పంపడానికి పెద్దమొత్తంలో పేపర్ ఖర్చవుతోంది. రసీదు రోల్, ఇంక్, ప్రింటర్ నిర్వహణకు ఏటా లక్షలాదిరూపాయలు ఖర్చుచేయాలి. దీనికి బదులు వారి మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే పేపర్ ఖర్చు మిగిలిపోతుందని నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర తెలిపారు. కొన్ని సందర్భాల్లో 50 సార్లు నిబంధనలు ఉల్లంఘన కేసులకు మీటర్లు మేర రసీదు అందించిన పరిస్ధితులు ఉన్నాయన్నారు. ముమ్మరంగా కసరత్తు ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు, వాహనాల సంఖ్య, తేదీ, సమయం, స్థలం, జరిమానా విధించే అధికారి పేరు, పోలీస్ స్టేషన్ పేరు, ఆన్లైన్ జనరేట్ సంఖ్యతో కూడిన పూర్తి సమాచారంతో రసీదు ప్రింట్ చేస్తున్నారు. ఇకముందు వాహనదారు మొబైల్ నెంబరు తీసుకుని పూర్తి వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ పంపిస్తామని హితేంద్ర తెలిపారు. బీ ట్రాక్ పథకం కింద ఎస్ఎంఎస్ రసీదు పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు. దీనికోసం ఎస్ఎంఎస్ పంపడానికి ప్రైవేటు టెలికాం సంస్థలతో చర్చలు కూడా జరిపారు. త్వరలో కొన్ని పోలీస్స్టేషన్లలో సిబ్బందికి శిక్షణనిచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు, తరువాత నగరమంతటా విస్తరిస్తారు. నోటీస్‌లకు బదులు చిరుసందేశమే: హితేంద్ర సీసీ కెమెరాలు గుర్తించిన ట్రాఫిక్ కేసుల్లో బండి నంబర్ ఆధారంగా వాహనదారుల ఇళ్లకు పోస్టు ద్వారా నోటీస్ పంపించేవారు. దీనికి ఒక్క రూపాయి వరకు ఖర్చవుతుతోంది. అయితే పోస్టల్ సిబ్బంది కొన్నిసార్లు గేట్ వద్దే పడేసి వెళతారు. ఎస్ఎంఎస్తో ఈ సమస్య ఉండదు, ఖర్చు కూడా 10 పైసలే అవుతుంది. అలాగే జరిమానా వసూలు చేశాక రసీదుగా ఇవ్వడానికి బదులుగా ఎస్ఎంఎస్నే పంపించాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలు నిర్భయంగా సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. -
క్షిపణి హెచ్చరికలతో హవాయిలో కలకలం!
వాషింగ్టన్: ఉత్తరకొరియా నుంచి ఖండాంతర క్షిపణి దూసుకొస్తోందనీ, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మొబైల్స్‌కు సందేశాలు రావడంతో అమెరికాలోని హవాయి రాష్ట్ర ప్రజలు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. ఇదంతా ఓ ఉద్యోగి తప్పిదమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘ఓ ఖండాంతర క్షిపణి హవాయి వైపు దూసుకొస్తోంది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి’ అని మొబైల్స్‌కే కాకుండా టీవీ, రేడియో కేంద్రాలకూ శనివారం సందేశాలు అందాయి. దీంతో పలువురు రెస్టారెంట్లు, హోటళ్ల బేస్మెంట్లలో దాక్కుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. 10 నిమిషాల అనంతరం ఇది పొరపాటున వచ్చిన హెచ్చరికని అధికారులు వివరణ ఇచ్చారు. ఓ ఉద్యోగి పొరపాటున హెచ్చరిక బటన్‌ను నొక్కాడని హవాయి గవర్నర్ డేవిడ్ ఇగ్ తెలిపారు. -
రైలు ఆలస్యమైతే ముందే సమాచారం
సాక్షి, న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే తీపి కబురు చెప్పింది. ఒక గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను ప్రయాణీకులకు రైల్వే శాఖ ముందుగానే చేరవేయనున్నట్లు తెలిపింది. గరిభ్ రథ్, దురంతో, జన శతాబ్ది, సువిధ, హంసఫర్, సూపర్ ఫాస్ట్ రైళ్లతో సహా మొత్తం 1373 రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని రైల్వే శాఖ వివరించింది. ఈ రైళ్ల రాక గంట కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎస్ఎంఎస్ల రూపంలో ముందుగానే ప్రయాణీకులకు సమాచారం అందిస్తామని చెప్పింది. ఈ సదుపాయం టిక్కెట్ రిజర్వేషన్ సమయంలో మొబైల్ నంబర్‌ను అందజేసిన ప్రయాణీకులే వర్తిస్తుందని తెలిపింది. ఆలస్యంగా ప్రయాణించే రైళ్ల వివరాలను ముందుగానే ప్రయాణీకుల పంపే ఈ పథకాన్ని 2017 నవంబర్లోనే ప్రయోగాత్మకంగా చేపట్టామని చెప్పింది. రాజధాని, శతాబ్ది, తేజస్, గతిమాన్ రైళ్ల ప్రయాణీకులకు ఇలా సమాచారం చేరవేయడంలో విజయం సాధించామని తెలిపింది. అనంతరం డిసెంబర్లో గరీబ్ రథ్, దురంతో, జన శతాబ్ది, సువిధ రైళ్లకు కూడా ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని ప్రారంభించినట్లు వివరించింది. ఈ నెల మూడో తేదీ నుంచి మొత్తం 1373 రైళ్లకు ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పింది. -
మొబైల్ చరిత్రలోనే అదో కీలక ఘట్టం!
పొద్దున నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ యూజర్లు చేసే పని వాట్సప్ సందేశాలు (ఎస్సెమ్మెస్‌లు) చెక్ చేసుకోవడం. కొన్నేళ్ల కిందట ఫేస్‌బుక్‌లోనూ మన స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు సందేశాలు సంపేవాళ్లం. కానీ ఇంటర్నెట్ వాడకం మొదలైన తొలిరోజుల్లో నెట్ వాడకుండా మాములుగానే ఎస్సెమ్మెస్‌లు పంపేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా.. తొలి ఎస్సెమ్మెస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారి 1992 డిసెంబర్ 2న నెయిల్ పాప్ వర్త్ అనే ఇంజినీర్ తొలి సందేశాన్ని పంపించారు. వోడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్సెమ్మెస్ 'మెర్రీ క్రిస్మస్'. ఆ సమయంలో వోడాఫోన్‌కు డైరెక్టర్ గా ఉన్న రిచర్డ్ జార్విస్ ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి. ఆ మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్సెమ్మెస్ లు పంపించే మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1999లో ఇతర నెట్వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది. జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమే. ఆ తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం, ఆపై స్మార్ట్ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్‌లు పంపడం, ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సప్ లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు. తొలి సందేశాన్ని పంపిన పాప్‌వర్త్ ప్రస్తుత అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. '1992లో నేను పంపిన సందేశం ఇప్పుడు ఇంత ఫేమస్ అవుతోందని భావించలేదు. తొలి సందేశాన్ని పంపింది నేనేనని నా పిల్లలకు కొన్ని రోజుల కిందట చెప్పగా.. వారు ఎంతో సంతోషించారు. నా తొలి ఎస్సెమ్మెస్ మొబైల్ చరిత్రలోనే ఓ కీలక ఘట్టమని' ఇంజినీర్ పాప్‌వర్త్ వివరించారు. -
ఎస్సెమ్మెస్
కొన్ని అక్షరాలు ఒక టెంప్లేటు ఓ సెండ్ బటన్ కాదు సందేశమంటే గుడ్డి గుడ్నయిట్లు ఎడ్డి గుడ్మార్నింగులు సోది స్టేటస్లు కాదు సందేశమంటే సందేశమంటే ఒక పొద్దుపొడుపు ఒక జననం కోసం మరణం సందేశమంటే సవరణలుండని రాజ్యాంగం జీవన వ్యాకరణం జన్మదిన అభినందనలో పుట్టుక అర్థం ఉండాలి పెళ్లి రోజు శుభాకాంక్షలో దేహాత్మల సంగీతం ఉండాలి రిప్ అంటే కన్నీళ్ల కుప్ప ఉండాలి అధికారం కోసం విపక్షం పెట్టుకునే అర్జీ కాదు సందేశమంటే అస్మాలాగా ఒక అరుపు అరువు దేశాలు పేకమేడల్లా కూల్తాయి మల్లెలవిప్లవాలు చెలరేగుతాయి సందేశాలు శాంతి ప్రపంచాల్ని నిర్మించాలి ఆధిపత్యాల కొమ్ములు విరగ్గొట్టాలి శ్వాసకు ఊపిరి బాటకు నడక దీపానికి కొత్తనూనె... సందేశం రాజ్యాన్ని కూల్చే నినాదం చెమట కోసం పాడే మల్లెల పాట సందేశం దాహానికి చెలిమె ఉక్కకు చలివణుకు సందేశం ప్రభువులు తమను తాము కాపాడుకునే కవచం కాదు సందేశం ఒక ఎస్సెమ్మెస్ కోసం కాలం కలలు కనాలి ఒక ఎస్సెమ్మెస్ మార్కెట్ మత్తుకు మందు కావాలి ఒక ఎస్సెమ్మెస్ దీనజనుల మెడలో దండ కావాలి గూగుల్ ఉసిళ్లపుట్ట మెసేజ్‌ల లింగనపురుగులూ కాదు కావల్సింది సందేశం భగవద్గీత కావాలి సందేశం బతుకు ఉద్యమం కావాలి బతుకు టెంప్లేటై చేయూతే అక్షరమైతే పంచే విశ్వాసమే సెండ్ బటనై ప్రసరించాలి ఒక సందేశం మనుషులందరినీ ఒకే గాటన కట్టేసే ప్రేమదారం కావాలి జూలూరు గౌరీ శంకర్ 9440169896 -
రైలు గంట ఆలస్యమైతే సంక్షిప్త సందేశాలు
న్యూఢిల్లీ: రైళ్లు ఆలస్యమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై రాజధాని, శతాబ్ది వంటి రైళ్లు గంట లేదా అంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే ఆ విషయాన్ని సదరు రైలులో వెళ్లే ప్రయాణికులకు సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) ద్వారా తెలియజేస్తామని రైల్వేశాఖ వెల్లడించింది. శనివారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ సౌకర్యాన్ని దశలవారీగా మిగతా రైళ్లకు కూడా వర్తింపజేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్ఐఎస్) దీన్ని రూపొందించిందన్నారు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు ప్రయాణికులు రిజర్వేషన్ దరఖాస్తులో మొబైల్ నంబర్‌ను నింపాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్ఎంఎస్ చార్జీలకయ్యే మొత్తాన్ని రైల్వేశాఖే భరిస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న 46 రాజధాని, 52 శతాబ్ది రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. -
మోసపూరిత ఎస్ఎంఎస్లకు చెక్!!
సెబీకి ట్రాయ్ సాయం న్యూఢిల్లీ: మోసపూరిత బల్క్ ఎస్ఎంఎస్లను నియంత్రించడానికి టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సాయం తీసుకున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి తెలిపింది. పలానా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఇలాంటి స్టాక్స్ టిప్స్‌కు సంబంధించిన మోసపూరిత ఎస్ఎంఎస్లకు చెక్ పెట్టేందుకు ఇక సెబీ, ట్రాయ్ కలిసి పనిచేయనున్నాయి. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను, విధానాలను సమీక్షించనున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, సంస్థలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన సలహాలను, స్టాక్స్ టిప్స్‌ను ఇవ్వాలి. వీరు కూడా సెబీ వద్ద రిజస్టర్ చేసుకోవాలి. కాగా బల్క్ ఎస్ఎంఎస్లను పంపుతున్న వారిని గుర్తించడంలో సెబీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో వారిపై సరైన చర్యలు కూడా తీసుకోలేకపోతోంది. -
గొర్రెలు అమ్ముతామంటూ..
► మంచిర్యాల పశు వైద్యుడు తిరుపతిని కిడ్నాప్ చేసిన మహారాష్ట్ర దొంగలు ► 9 యూనిట్లు అమ్మినట్టు సంతకం పెట్టి రూ.9 లక్షలు ఇప్పించాలని హుకుం ► చాకచక్యంగా తోటి డాక్టర్‌కు ఎస్ఎంఎస్ పెట్టిన తిరుపతి ► స్పందించిన ప్రభుత్వం.. మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు ► సాయంత్రం 4 గంటలకు వదిలిపెట్టిన దుండగులు.. సాక్షి, హైదరాబాద్: గొర్రెల పథకం ఓ పశు వైద్యుడి ప్రాణం మీదకు తెచ్చింది. గొర్రెలు కొనడానికి పొరుగు రాష్ట్రానికి వెళ్తే దుండగులు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. తాము గొర్రెలు అమ్మినట్టు సంతకం పెట్టించుకుని రూ.9 లక్షలు కాజేయాలని యత్నించారు. అయితే సదరు డాక్టర్ అప్రమత్తతతో వ్యవహ రించి తోటి వైద్యుడికి ఎస్ఎంఎస్ పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపింది. దీంతో కిడ్నాప్ అయిన డాక్టర్ క్షేమంగా విడుదలయ్యారు. గురువారమే ఫోన్.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పని చేస్తున్న పశు వైద్యుడు తిరుపతి.. గొర్రెల పథకం కింద గొర్రెల కొనుగోలు కోసం మహారాష్ట్రలోని బిగువాన్ జిల్లా సంగోలా ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉండి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమ యంలో ఆయనకు కొందరు ఫోన్ చేసి తాము గొర్రెలు అమ్ముతామని చెప్పారు. వారి వద్దకు వెళ్లి గొర్రెలను పరిశీలించిన తిరుపతి.. ఒక్క యూనిట్ (21 గొర్రెలు) మాత్రమే పనికి వస్తుందని చెప్పారు. అయితే తమ వద్ద ఇంకా గొర్రెలు ఉన్నాయని, శుక్రవారం చూపెడతా మని చెప్పి డాక్టర్‌ను వెనక్కు పంపారు. చెప్పినట్టుగానే శుక్రవారం ఉదయం 8 గంటలకు తిరుపతికి ఫోన్ చేశారు. తాము వస్తున్నామని, ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ ఆరా తీశారు. తాను బస చేస్తున్న హోటల్ పైనుంచి కిందకు దిగి ఫోన్ మాట్లాడుతుం డగా బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి తిరుపతిని కొట్టుకుంటూ బలవంతంగా వాహనం ఎక్కించారు. అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏక్తాపూర్కు తీసుకెళ్లి నిర్బంధించారు. తాము 9 యూనిట్ల గొర్రెలు అమ్మినట్టు సంతకం పెట్టి, ఆన్లైన్లో తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.9 లక్షలు జమ చేయించాలని డిమాండ్ చేశారు. ‘గొర్రెలను కొనుగోలు చేసేందుకు పశు వైద్యులను పంపడం అన్యాయం. రేపు ఏది జరిగినా మా మీదే వేస్తారు. అందుకే టెండర్లు పిలవాలి. లేదంటే విక్రేతలు, కొనుగోలు దార్లను ఓ చోట చేర్చి సంత తరహాలో ఏర్పాట్లు చేయాలి’ అని టీఏహెచ్ఓఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ బాబుబేరి అన్నారు. ఐ యామ్ కిడ్నాప్డ్.. డోంట్ సెండ్ మనీ గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కమిటీ పక్షాన గొర్రెలను కొన్న వైద్యుడు సంతకం పెట్టి ఉన్నతాధికారులకు చెబితే వారు డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసే అంశాన్ని హిందీలోనే మాట్లాడాలని కిడ్నాపర్లు తిరుపతిని బెదిరించారు. ‘వీళ్లు తొమ్మిది యూనిట్ల గొర్రెలు విక్రయించారు. డబ్బులు పంపండి’ అని హిందీలో చెప్పించారు. అదే సమయంలో తిరుపతి మరో డాక్టర్‌కు ‘ఐ యామ్ కిడ్నాప్డ్.. డోంట్ సెండ్ మనీ’ అంటూ మెసేజ్ పంపారు. వెంటనే సదరు డాక్టర్.. తిరుపతి కిడ్నాప్ అయిన విషయాన్ని జిల్లా అధికారులకు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌కు తెలియజేశారు. డైరెక్టర్ డాక్టర్.డి. వెంకటేశ్వర్లు వెంటనే అడిషనల్ డీజీ అంజనీకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు విషయాన్ని తెలియజేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు, సీఎస్‌లతో తలసాని సంప్రదింపులు జరిపి తిరుపతి ఎక్కడున్నారో కనిపెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల కదలికల గురించి తెలుసుకున్న కిడ్నాపర్లు సుమారు 8 గంటల అనంతరం సాయంత్రం 4.00 సమయంలో తిరుపతిని ఓ గుర్తుతెలియని ప్రాంతంలో వదిలివెళ్లారు. తిరుపతిని కిడ్నాపర్లు ఘోరంగా కొట్టారని, అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు సాయంత్రం మహారాష్ట్ర నుంచి మంచిర్యాల బయలుదేరేందుకు తిరుపతి ఏర్పాట్లు చేసుకోవడంతో కథ సుఖాంతమైంది. -
మెసేజ్ చూసి షేర్లు కొంటారా?
♦ బ్రోకరేజీ సంస్థల పేరిట నకిలీ మెసేజ్‌లు ♦ చెత్త షేర్లను కొనాలంటూ సిఫారసులు ♦ నిజమేనని నమ్ముతూ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ♦ అందరూ కొన్నాక ట్రేడ్ మాఫియా అమ్మకాలు ♦ అధిక ధర వద్ద కొని ఇరుక్కుంటున్న రిటైలర్లు ♦ ఈ మెసేజ్‌లు వద్దని టెలికంలకు సెబీ వార్నింగ్ అజయ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు. కొన్ని మంచి షేర్లను ఎంచుకుని దీర్ఘకాలానికి పెట్టుబడి పెడుతుంటాడు. అనుకున్న లాభాలు వచ్చాక వాటిని విక్రయించేసి... వేరే షేర్లు కొంటుంటాడు. కాకపోతే అజయ్‌కి ఈ మధ్య ఎస్ఎంఎస్ల తాకిడి ఎక్కువయింది. బ్రోకరేజీ సంస్థలుగా పేరున్న కార్వీ, మోతీలాల్, ఓస్వాల్, షేర్‌ఖాన్, ఏంజిల్ బ్రోకింగ్, ఇండియా ఇన్ఫోలైన్... ఒకటేమిటి!! పేరున్న ప్రతి బ్రోకరేజీ సంస్థా పంపినట్లుగా వాటి షార్ట్‌కట్ పేర్లతో జంక్ మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిలో కొన్ని షేర్ల పేర్లు చెబుతూ... అది నెలరోజుల్లో రెట్టింపుకన్నా ఎక్కువ పెరగబోతోందని, కనీసం 5000 షేర్లు కొనాలని రికమెండేషన్లు. నిజానికి అవేవీ ఖరీదైన షేర్లు కావు. పెన్నీ షేర్లు. అంటే రూ.50 లోపే ఉండే షేర్లు. కొన్నయితే రూ.10, రూ.5కు కూడా దొరుకుతాయి. ఇవి చూసి అజయ్‌కి నిజమో, అబద్ధమో అర్థం కావటం లేదు. ఎందుకంటే మెసేజ్‌లు వస్తున్నవి పేరున్న బ్రోకరేజీ సంస్థల పేరిట. నిజానికి ఆ బ్రోకరేజీ సంస్థలకు ఈ జంక్ మెసేజీలతో సంబంధం ఉందో లేదో కూడా అజయ్‌కి తెలియదు. మరో ఉదాహరణ చూద్దాం. ఇంట్రాడేతో పాటు డెలివరీ ఆధారిత ట్రేడింగ్ చేసే హరిప్రసాద్‌కు కూడా ఈ మధ్య ఇలాంటి మెసేజ్‌ల తాకిడి పెరిగింది. క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ (సీటీఎల్) షేర్లు కనీసం 10వేలు కొనాలని, దానికి స్టాప్‌లాస్ కూడా పెట్టుకోవద్దని, ప్రస్తుతం రూ.15గా ఉన్న షేరు నెల తిరిగేసరికి రూ.40 అయిపోతుందని తెగ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మెసేజ్‌లన్నీ పెద్ద పెద్ద బ్రోకరేజీ సంస్థలిస్తున్నట్లుగా ఉండటంతో... చివరికి హరి రూ.14 దగ్గర 1,000 సీటీఎల్ షేర్లు కొన్నాడు. కాకపోతే కొనే ముందు ఆ కంపెనీ గురించి ఏమాత్రం రీసెర్చ్ చేయలేదు. పలు బ్రోకరేజీ సంస్థలు ఒకే కంపెనీని రికమెండ్ చేశాయికదా... అనే ధోరణిలో కొనేశాడు. తరవాతి రోజు అది రూపాయి తగ్గింది. అప్పటికే వెయ్యి రూపాయలు నష్టం రావటంతో మళ్లీ పెరుగుతుందిలే అని వేచి చూడటం మొదలెట్టాడు. మర్నాటి నుంచి అది తగ్గుతూనే వచ్చింది. ప్రస్తుతం రూ.9 దగ్గర ఉంది. ఇక్కడ అమ్మేద్దామనుకుంటే రూ.5వేలు నష్టం. ఇంకా ఉంచుకుంటే ఎంతకు పోతుందో తెలియదు... అదీ కథ. అజయ్... హరి... ఇవన్నీ ఒకటిరెండు ఉదాహరణలే. స్టాక్ మార్కెట్ మంచి జోరుమీదుండటంతో ఈ మధ్య ఇలాంటి మెసేజ్‌ల తాకిడి ఇన్వెస్టర్లందరికీ ఎక్కువయింది. రకరకాల బ్రోకరేజీ సంస్థలు ఇస్తున్నట్లుగా వస్తున్న ఈ మెసేజ్‌లు నిజానికి నకిలీవేనని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి జంక్ మెసేజ్‌లు ఇస్తే సదరు టెలికం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కూడా ఇటీవల సెబీ హెచ్చరించింది. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకూ సూచనలిస్తోంది. అయినా సరే టెలికం సంస్థలు వీటిని అనుమతిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ఈ తరహా మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. వాటి బారిన పడుతూనే ఉన్నారు. అమ్ముకుని బయటపడటానికే...! ఈ మధ్య తరచూ మెసేజ్‌లు వస్తున్న సంస్థల్లో నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్ కార్పొరేషన్ (ఎన్ఈసీసీ), ఎస్ఎఫ్ఎల్ ఇంటర్నేషనల్, క్యాపిటల్ ట్రేడ్ లింక్స్ (సీటీఎల్), సింబియాక్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ తదితర కంపెనీలుంటున్నాయి. ఈ మెసేజ్‌లు పంపించే ట్రేడింగ్ మాఫియా ముఠాల లక్ష్యం ఒక్కటే. వారు అప్పటికే దాన్ని పైస్థాయిలో కొని ఉంటే... అందరూ కొంటున్న సమయంలో దాన్ని విక్రయించి బయటపడటం. అంటే అలాంటి షేర్లను పైస్థాయిలో కొనుక్కుని ఇరుక్కుపోయిన పెద్ద ఇన్వెస్టర్లో, లేకపోతే ప్రమోటర్లో ఈ మాఫియాను ఆశ్రయిస్తారు. వీరికి కొంత చెల్లిస్తారు. దీంతో ఈ మాఫియా కొన్ని పేరున్న బిజినెస్ వెబ్సైట్లలో యూజర్లుగా మెసేజ్‌లు పోస్ట్ చేయటం మొదలుపెడుతుంది. దాన్ని కొనుగోలు చేయమని సదరు యూజర్లు సిఫారసు చేస్తుంటారు. దాంతో పాటు అందరికీ బల్క్ మెసేజ్‌లు కూడా వెళుతుంటాయి. కొందరైనా కొనుగోలు చేస్తారు కనక... అప్పుడు షేరు ధర పెరిగితే... అప్పటికే పైస్థాయిలో కొనుక్కున్న వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకుని బయటపడతారు. దాంతో దాని ధర ఇంకా పడిపోతుంది. చేసేదేమీ లేక ఈ చిన్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలం వేచి చూడటమో, లేక నష్టానికి విక్రయించి బయటపడటమో చేస్తుంటారు. నిజానికి ఇలాంటి షేర్లలో దీర్ఘకాలం వేచిచూసినా లాభాలొస్తాయన్న గ్యారంటీ ఉండదు. చివరికి ఇవి రూపాయి... 10 పైసలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్ కార్పొరేషన్నే తీసుకుంటే... గతేడాది చివరి నుంచి దీనికి సంబంధించిన మెసేజ్‌లు రావటం మొదలయ్యాయి. చివరికి ఈ షేరును కొనుక్కుంటూ కొనుక్కుంటూ ఏకంగా రూ.111 కు తీసుకెళ్లిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.111.30కి చేరిన ఎన్ఈసీసీ... ఆ తరవాత సరిగ్గా 20 రోజులు గడిచేసరికి మళ్లీ 50 రూపాయలకొచ్చేసింది. అంటే ట్రేడింగ్ మాఫియా అక్కడ విక్రయాలు మొదలెట్టిందన్న మాట. ఆ తరవాత ఇంకా కిందికి జారుతూ వచ్చిన ఈ షేరు... ప్రస్తుతం రూ.46 వద్ద ఉంది. ఇదంతా ఎందుకంటే... ఇలాంటి మెసేజ్‌లను ఏమాత్రం నమ్మవద్దని సెబీ నుంచి నిపుణుల దాకా అందరూ చెబుతూనే ఉన్నా ఇంకా కొందరు వీటిని నమ్మి కొనుగోళ్లు చేస్తున్నారనేది బయటపడుతూనే ఉంది. వివిధ వెబ్సైట్ల మెసేజింగ్ బోర్డుల్లో చూసినపుడు... తాము మెసేజ్‌లను నమ్మి ఫలానా షేరును కొని ఇరుక్కుపోయామని, తిరిగి పెరుగుతుందో లేదో చెప్పాలని సహ బోర్డర్లను అడిగేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తూనే ఉన్నారు కనక. నిజానికి బ్రోకరేజీ సంస్థలు తమ కస్టమర్లకు మాత్రమే మెసేజ్‌లు పంపిస్తూ ఉంటాయి. ఇలా అందరికీ గంపగుత్తగా పంపవు. -
ఎస్ఎంఎస్తో పాన్-ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ఆదాయ పన్ను శాఖ మరింత సరళ తరం చేసింది. కేవలం ఒక ఎస్ఎంఎస్ ద్వారా పాన్ నంబర్‌కు ఆధార్చ నంబర్‌ను లింక్ చేసే విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ మేరకు పన్నుచెల్లింపుదారులు తమ ఆధార్ కార్డు నెంబరును అనుసంధానం చేయాల్సిందిగా కోరింది. ఇటీవల ఐటీ వెబ్సైట్లో ఆధార్ లింక్ కోసం కొత్త లింక్‌ను ప్రకటించిన ఐటీ శాఖ తాజాగా ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్‌ను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రముఖ జాతీయ దినపత్రికలలో జారీ చేసిన ప్రకటనల్లో ఎస్ఎంఎస్ ద్వారా వీటిని ఎలా లింక్ చేయాలో వివరించింది. పాన్, ఆధార్ నెంబర్లను 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ సెండ్ చేయాలని చెప్పింది. మరిన్ని వివరాలకు ఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కోరింది. కాగా జూలై 1, 2017 నుండి పాన్ కార్డు దరఖాస్తు కు ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
వడగాడ్పులపై ఎస్ఎంఎస్లు!
నాలుగైదు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: వడగాడ్పులపై నిత్యం కోటి మందికిపైగా ప్రజలకు సెల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్లు పంపాలని విపత్తు నిర్వహణ శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి పోర్టల్‌ను అభి వృద్ధి చేసి.. వాతావరణ శాఖకు అనుసం« దానం చేసింది. వాతావరణ శాఖ ఇచ్చే వడగాడ్పుల హెచ్చరికలను ఎప్పటి కప్పుడు ప్రజలకు మెసేజ్ ద్వారా పంపిస్తారు. పది రోజుల ముందస్తు హెచ్చరి కల సమాచారాన్ని కూడా పంపుతారు. ఎక్కడెక్కడ వడగాడ్పులు ఉంటాయో తెలుసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలుకలుగుతుంది. ఈ మేరకు వివిధ టెలికాం సంస్థలతో విపత్తు నిర్వహణ శాఖ ఒప్పందం చేసుకుంది. వడగాడ్పుల సమాచారాన్ని ప్రజలకు ఎస్ఎంఎస్ల ద్వారా ఉచితంగా పంపేం దుకు ఆ సంస్థలు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజల్లో ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే వర్షాకాలంలోనూ వర్ష సూచన, వర్షపాతం వివరాలు కూడా పంపించనున్నారు. వడదెబ్బతో 65 మంది మృతి రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా 65 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 14 మంది చని పోయారు. కరీంనగర్ జిల్లాలో 10 మంది, నల్లగొండ జిల్లాలో 9 మంది, కామా రెడ్డి జిల్లాలో ఐదుగురు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. రంగా రెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, జగిత్యాల, జనగామ, కొమురం భీం, మహబూబాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూలు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సంగా రెడ్డి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. -
మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ ఆర్గనైజర్
రోజూ పదులు, వందల సంఖ్యలో నోటిఫికేషన్స్, ఎస్ఎంఎస్లు అందుకునే కాలం ఇది. అర్జంటు అవసరం వచ్చి... ఒక ఎస్ఎంఎస్ను వెతకాలంటే? అబ్బో చాలా ఇబ్బంది... కష్టం కూడా! ఈ సమస్య మనందరికి ఏదో ఒకసారి వచ్చే ఉంటుంది కదూ. మైక్రోసాఫ్ట్ గారేజ్ బృందం ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఆప్ రూపంలో వస్తున్న దీని పేరు సింపుల్‌గా ఎస్ఎంఎస్ ఆర్గనైజర్. అంతే! మనకు వచ్చే అన్ని ఎస్ఎంఎస్లను తనే సొంతంగా వర్గీకరించి ముఖ్యమైన వాటిని హైలైట్ చేస్తుందీ అప్లికేషన్. ఎల్లుండి మీరెక్కాల్సిన ఫ్లైట్ వివరాలు కావచ్చు... వెళ్లాల్సిన సినిమా టైమింగ్స్, థియేటర్ వివరాలు కావచ్చు... ఇలా అన్ని ముఖ్యమైన సందేశాలను తనంతటతానే వర్గీకరించడం భలే ఉంటుంది కదూ! వీటితోపాటు భార్య పుట్టిన రోజు, పెళ్లిరోజు.. చెల్లించాల్సిన బిల్లుల వివరాల వంటివి కూడా రిమైండర్ కార్డ్‌ల రూపంలో మీకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది ఇది. నిత్యవ్యవహారాలకు సంబంధించిన, వ్యక్తిగత, వ్యాపార సంబంధమైన సందేశాలను వేటికి వాటిని వేరు చేసేందుకు దీంట్లో మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. కేవలం మూడు మెగాబైట్ల సైజు మాత్రమే ఉండే ఈ ఆప్లికేషన్ ఇంటర్నెట్తో సంబంధం లేకుండా కూడా పనిచేస్తుంది. ఎస్ఎంఎస్ల వర్గీకరణ మొత్తం మన స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తవుతుంది కాబట్టి.. మనకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు తెలుస్తుందన్న బెంగ కూడా అవసరం లేదు. మనకు అవసరమైన ఎస్ఎంఎస్లను అవసరమైనప్పుడు సులువుగా కనిపించేలా కూడా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ఆర్గనైజర్ పేరుతో మరికొన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని తయారు చేసింది మైక్రోసాఫ్ట్ అన్నది గుర్తుంచుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు మాత్రమే పరిమితం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మెసేజ్‌లు పెట్టి... ఉరితాడుకు వేలాడాడు
ఎస్వీయూ ఉద్యోగి మరణశాసనం ఆత్మహత్య చేసుకోవాలని ముందురోజే నిర్ణయం స్నేహితులకు ఎస్ఎంఎస్ యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): తనను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త ప్రేమికుల దినోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదీ తన డెత్‌డేట్ అంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించి మరీ ఉరితాడుకు వేలాడాడు. చనిపోయే ముందు జనన, మరణ తేదీలు, ఉరితాడుతో వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసి అందరికి షేర్ చేశాడు. మెసేజ్ చూసి ఇంటికి రావాలని.. ఇది చివరి కోరిక అని అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు రావడానికి వీలుగా ముందురోజే ఫ్లైట్ టికెట్లు కూడా తీశాడు. మంగళవారం తిరుపతిలో జరిగిన ఈ విషాదాంతం వివరాలిలా ఉన్నాయి. ఎస్వీయూ వీసీ చాంబర్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీహరి 2006లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. బీటెక్ చదివిన శ్రీహరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో, 2015 అక్టోబర్‌లో వీసీ దామోదరం పీఏగా నియమించుకున్నారు. శ్రీహరికి ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరుకు చెందిన విద్యాలతతో వివాహమైంది. కొంతకాలం తిరుపతిలోని ఎస్వీనగర్‌లో నివాసం ఉండేవారు. వీసీ పీఏగా నియమితులయ్యాక రెడ్‌బిల్డింగ్ క్వార్టర్స్‌లోని హౌస్ నెంబర్ 42కు షిఫ్ట్ అయ్యారు. పెళ్లి అయి ఆరు సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో నిత్యం భార్య భర్తలు గొడవలు పడేవారని సన్నిహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం విద్యాలత పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ తిరిగిరాలేదు. అప్పటి నుంచి బాధ పడుతూ వచ్చిన శ్రీహరి మంగళవారం తనువు చాలించాడని వారు తెలిపారు. శ్రీహరి ఆత్మహత్మకు ముందు వాట్సప్‌లో డిస్ప్లే పిక్చర్లో పుట్టిన తేదీ.. మరణించిన తేదీ అని, ఫోటోల మధ్యలో ఉరితాడు పెట్టి పిక్చర్ తయారు చేశాడు. కొంత మంది మిత్రులకు ఫోస్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఉన్న తమ్ముడు, చిన్నాన్నకు మంగళవారం తిరుపతికి రావడానికి వీలుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. మెసేజ్‌కు స్పందించి శ్రీహరి ఇంటికి చేరిన మిత్రులకు ఉరితాడుపై వేలాడుతూ కన్పించాడు. పలువురి సంతాపం ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ భాస్కర్, రిజిస్టార్ దేవరాజులు, పాలకమండలి సభ్యుడు గురుప్రసాద్, నాన్‌టీచింగ్ అసోసియేషన్ అధ్య క్షుడు పీకే సుబ్రమణ్యం శ్రీహరి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
టీడీపీలో ఎస్ఎంఎస్ల ప్రకంపనలు
– ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు – తాజాగా ఎమ్మెల్యే సూరికి రావడంపై చర్చ అనంతపురం సెంట్రల్ : టీడీపీలో సెల్ఫోన్ల సంక్షిప్త సందేశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఆగంతకుని నుంచి బెదిరింపు మెసేజ్ వస్తుందో అంతుబట్టడం లేదు. ఇప్పటికే అనంతపురం మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికు ఇటువంటి సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. వీరు ఎస్పీ రాజశేఖర్‌బాబును కలసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీని గురువారం కలవడం చర్చనీయాంశమైంది. ఆయన రాకతో పోలీసు వర్గాల్లోనూ చర్చ సాగింది. ఆయనకూ బెదిరింపు మెజేస్ వచ్చిందా లేక ఇతర సమస్యపై ఎస్పీని కలిశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు ఎస్పీ రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయ అధికారులు మాత్రం నేతల రాకపై నోరు మెదపడం లేదు. అత్యంత రహస్యంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అన్ని విషయాలు బయటపెడితే పార్టీ పరువు బజారును పడుతుందనే ధోరణిలో ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య ప్రజాప్రతినిధులకు బెదిరింపుల మెసేజ్‌లు వచ్చి రోజులు గడుస్తున్నా ఏం జరుగుతోందో.? ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా బయట పెట్టలేకపోవడం పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
13 లక్షల ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్లను వెలికి తీసే చర్యల్ని వేగవంతం చేసింది. బ్యాంకుల్లో రద్దయిన నోట్ల భారీ డిపాజిట్లను గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా మరింత చురుగ్గా కదులుతోంది. 18 లక్షల ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్ము రూ.4.7లక్షల కోట్లుగా తేల్చింది. ఈ లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగింది.ఆదాయ లెక్కలతో సరిపోలని ఖాతాదారుల డిపాజిట్లపై వివరణ కోరుతూ 13 లక్షల మందికి ఎస్ఎమ్మెస్లు, ఈ మెయిల్స్ ద్వారా నోటీసులు పంపించినట్టు సీబీడీటీ అధికారి సుశీల్ చంద్ర గురువారం వెల్లడించారు. ఇది ఆపరేషన్ క్లీన్ మనీ లో ఇది మొదటి దశ అని చెప్పారు. ఈ నోటీసులకు 10 రోజుల్లోగా ఆన్ లైన్ లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 8 పెద్దనోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ/స్వచ్ ధన్ అభియాన్ అనే సాఫ్ట్వేర్ ప్రాజెక్టును ఆరంభించింది. రూ.5 లక్షలకు మించిన లావాదేవీలు అన్నింటినీ అనుమానాస్పద లావాదేవీలుగానే పరిగణించిన ఐటీ శాఖ ఇ- వెరిఫికేషన్ తరువాత సంతృప్తి చెందని ఖాతాలకు నోటీసులు పంపనున్నట్టు ప్రకటించింది. ఆ డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని సదరు ఖాతాదారులందరికీ ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎ్‌సలు పంపనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కోటి బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకు మిం చి నగదు జమ అయినట్లు తేల్చిన సంగతి తెలిసిందే. -
ట్రేడింగ్ టిప్స్‌తో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: షేర్లకు సంబంధించి అవాంఛిత ఎస్ఎంఎస్లు, కాల్స్ ఆధారంగా ట్రేడింగ్ చేసి నష్టపోవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ... ప్రజలకు సూచించింది. తమ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్అనలిస్ట్ల సలహాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ... ఆయా సంస్థల, వ్యక్తుల వివరాలు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తమ వద్ద నమోదు కాని సంస్థలు.. ఇన్వెస్టర్లనుతప్పుదోవ పట్టించేలా ఎస్ఎంఎస్లు, కాల్స్ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ... ఇలాంటి 15 సంస్థలపై చర్యలు తీసుకున్నామని సెబీ తెలిపింది. మనీవరల్డ్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ, గ్లోబల్ మౌంట్ మనీరీసెర్చ్ అండ్ అడ్వైజరీ, ఆరంజ్ రిచ్ ఫైనాన్షియల్స్, గోక్యాపిటల్, క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్‌లు తమ వద్ద నమోదు కాకుండానే ఇన్వెస్ట్మెంట్ సలహాలిచ్చాయని సెబీ పేర్కొంది -
గర్ల్‌ఫ్రెండుకు ఎస్ఎంఎస్ చేశాడని.. యువకుడి హత్య
తన గర్ల్‌ఫ్రెండుతో తరచు మాట్లాడటంతో పాటు, ఆమెకు పదే పదే ఎస్ఎంఎస్లు పంపుతున్నాడనే కోపంతో 24 ఏళ్ల యువకుడిని తన స్నేహితుడితో కలిసి చంపేశాడో యువకుడు. కత్తితో గొంతు కోసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. సల్మాన్ (24) ఢిల్లీలోని ఒక దుకాణంలో పనిచేస్తుంటాడు. అతడి మృతదేహం దర్యాగంజ్‌లోని అతడి ఇంటి సమీపంలో పడి ఉంది. అతడి శరీరం మొత్తం కత్తిగాట్లు ఉన్నాయి. మెడ మీద బాగా లోతైన గాయం ఉంది. మైనర్లయిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్ కూడా నిందితులతో కలిసి తిరుగుతూ ఉండేవాడని, వాళ్లలో ఒకరి గర్ల్‌ఫ్రెండ్ ఇతడికి కూడా పరిచయమైందని చెప్పారు. అయితే ఆమె ఫోన్లో సల్మాన్ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ఎస్ఎంఎస్లు ఉండటంతో నిందితుడికి బాగా కోపం వచ్చింది. దాంతో, తన స్నేహితుడితో కలిసి సల్మాన్‌ను గట్టిగా కొట్టి అతడికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. కానీ మధ్యలో ఏమైందో గానీ, ప్లాన్ మార్చుకుని కత్తితో గొంతు కోసి హతమార్చాడు. -
ఎస్ఎంఎస్లో ‘మధ్యాహ్న’ వివరాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మధ్యాహ్న భోజన పథకం వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా పాఠశాల సంచాలకుడికి పంపాలని ఎంఈఓలను డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో ఎంఈఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిరోజు పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను పాఠశాల సంచాలకుడికి ఎస్ఎంఎస్ చేయాలని సూచించారు. సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఎంఈఓలు నిరంతరం పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఏఎంఓ హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ..గతేడాది స్కూల్ గ్రాంట్ల నిధులకు సంబంధించిన ఈసీలను ఈనెల 31వ తేదీలోపు సమర్పించాలన్నారు. లేకుంటే ఈ యేడాది గ్రాంట్లను కేటాయించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు పాల్గొన్నారు. -
నీటి సరఫరా వేళలు ఇక ఎస్ఎంఎస్లో
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక...నిత్యం టెన్షన్‌కు గురయ్యే వినియోగదారులకు శుభవార్త. నీటి వేళల వివరాలు ఇక నేరుగా మీ మొబైల్‌కే పంపేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఫలానా సమయంలో మీ ఇంట్లో నల్లా నీళ్లు వస్తాయని మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. తద్వారా నీటి కోసం వేచి చూడాల్సిన పని ఉండదు. మొదట ప్రయోగాత్మకంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని సుమారు 70 వేల మందికి నీటిసరఫరా జరిగే వేళలపై వారి సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఇదే తరహాలో నగరంలోని మిగతా 20 డివిజన్ల పరిధిలోని 8 లక్షల నల్లాలకు సైతం సెప్టెంబరు 15 నుంచి సంక్షిప్త సందేశాన్ని అందజేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు ఆయా వీధులకు నీటిని మళ్లించేందుకు వాల్‌్వను తిప్పిన సమయంలో ఆ వాల్వ్ పరిధిలో ఉన్న వినియోగదారులకు ఈ సమాచారం వారి ఫోన్లలో ఎస్ఎంఎస్ రూపంలో ప్రత్యక్షం కానుండడంతో వినియోగదారులకు ఇది మరింత సౌకర్యంగా ఉండనుంది. జీపీఎస్ సాంకేతికతతో ఎస్ఎంఎస్లు.... వినియోగదారులకు సంక్షిప్త సందేశం అందించేందుకు జలమండలి గ్లోబల్ పొజిషన్ సిస్టం(జీపీఎస్)సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లకు స్మార్ట్ఫోన్లను అందజేసి..అందులో ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకొని వాల్వ్ తిప్పేందుకు లైన్మెన్ వెళ్లినపుడు అతని ఫోన్లో ఆ వాల్వ్ నెంబరు ప్రత్యక్షమౌతుంది. ఆ నెంబరుపై అతడు నొక్కినపుడు ఆ సమాచారం జలమండలి కేంద్ర కార్యాలయంలో ఉన్న సర్వర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో ఆ వాల్వ్ పరిధిలో ఉన్న అందరు వినియోగదారులకు ఎస్ఎంఎస్ ద్వారా నల్లా నీళ్లు వస్తున్నాయన్న సమాచారం అందుతుంది. ఇదే సమాచారం క్షేత్రస్థాయి మేనేజర్ సెల్‌ఫోన్‌కు కూడా అందుతుంది. దీంతో ఒక ప్రాంతానికి అత్యధిక సరఫరా..మరొక వీధికి తక్కువ నీటి సరఫరా ఉండకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లైన్మెన్ల అక్రమాలకు చెక్... నీటిసరఫరాపై వినియోగదారులకు ఎస్ఎంఎస్ సందేశం అందించడం ద్వారా లైన్మెన్ల చేతివాటానికి చెక్‌పడనుంది. ఉన్నతాధికారులకు సైతం నీటి సరఫరా వేళలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుండడంతో డబ్బులు తీసుకొని ఒక ప్రాంతానికి అధికంగా..మరొక ప్రాంతానికి తక్కువ సమయం నీటిని సరఫరా చేయడానికి వీలుండదని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రయోగాత్మకంగా జల్‌యాప్ వినియోగం.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లకు నిత్యం వినియోగదారుల నుంచి వినపడే కలుషిత జలాలు..అరకొర నీటిసరఫరా, మూతలు లేని మ్యాన్‌హోల్స్ వంటి 9 రకాల సమస్యలపై జలమండలి రూపొందించిన జల్‌యాప్ ప్రయోగాత్మకంగా వంద మంది లైన్మెన్ల వద్దనున్న స్మార్ట్ఫోన్ల ద్వారా అమలు చేస్తున్నారు. జల్యాప్కు అందే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్కో క్షేత్రస్థాయి మేనేజర్‌కు రూ.2 లక్షలు నగదును అందజేయనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్‌ను నియమిస్తున్నామన్నారు. సెప్టెంబరు నెలలో జలమండలిలో పనిచేస్తున్న మూడువేల మంది లైన్మెన్ల చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లకు జల్‌యాప్ అందుబాటులోకి రానుందన్నారు. సెప్టెంబరు 15 నుంచి అన్ని నల్లాలకు... జలమండలి పరిధిలో ప్రస్తుతం 8.76 లక్షల నల్లాలున్నాయి. ప్రస్తుతానికి కూకట్పల్లి డివిజన్ ప్రాంతంలో సుమారు 70 వేల నల్లాలకు ఎస్ఎంఎస్ సందేశం అందుతోంది. మిగతా 8.06 లక్షల నల్లాలకు సెప్టెంబరు 15 నుంచి ఎస్ఎంఎస్ సమాచారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసంlమహానగర పరిధిలో మంచినీటి పైపులైన్లపై ఉన్న వాల్్వలను అవి ఉన్న అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జీపీఎస్ సాంకేతికతతో అనుసంధానిస్తున్నాం. దీంతోS బోర్డు రికార్డుల్లో నమోదైన వినియోగదారుల మొబైల్ నెంబర్లకు నీటిసరఫరా వేళలపై ఎస్ఎంఎస్ సందేశం అందనుంది. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఎస్ఎంసీ చైర్మన్లకూ చెక్‌పవర్
బాలాజీచెరువు (కాకినాడ) : పాఠశాలల్లో వివిధ పనుల నిమిత్తం నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయుడితోపాటు ఇటీవల ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్లకు కూడా సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తూ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 4,412 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఇటీవల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పాఠశాల అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, విద్యార్థుల చదువులపై శ్రద్ధ, డ్రాపౌట్ల గుర్తింపు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం తనిఖీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలను పర్యవేక్షించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. ఇటీవలి వరకూ స్కూల్ కమిటీలు లేకపోవడంతో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవోలు సంయుక్తంగా నిధులను వినియోగించేవారు. కొత్త కమిటీలు ఏర్పడటంతో ప్రధానోపాధ్యాయుడితోపాటు ఎస్ఎంసీ చైర్మన్‌కు జాయింట్‌గా ఖాతాలు ఏర్పాటు చేసి చెక్ పవర్ కల్పిస్తూ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎంఈవోలకు పంపి ఆయా పాఠశాల చైర్మన్, ప్రధానోపాధ్యాయులతో కొత్త ఖాతా ప్రారంభించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న 52 పాఠశాలలకు వచ్చే వారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఎస్ఏ పీవో శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. కొత్త చైర్మన్లకు వారి అధికారాలు, విధులపై త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఒక్క ఎస్సెమ్మెస్‌తో ఆ అలవాటు పోతుందట!
న్యూయార్క్: ఒక పనిని ఒక రోజు చేసి వదిలేస్తే అది అవసరం.. అదే పని మరో రోజు కూడా చేస్తే అలవాటు.. అదే అలవాటు విడిచిపెట్టకుండా కొనసాగిస్తే బానిసత్వం. ఈ రోజుల్లో అవసరాల రీత్యా వ్యక్తికి బానిసత్వం తప్పదుగానీ.. అతడి అలవాట్లలో ఈ లక్షణం ఉండకూడదు. అది చెడు అలవాట్లలో అయితే.. ఇంకా డేంజర్. అందుకే వ్యక్తికి ఉండే చెడుఅలవాట్లలో ఒకటైన ధూమపానం గురించి తెగ హెచ్చరికలు చేస్తుంటారు. ప్రసార మాధ్యమాలన్నింటిని ఉపయోగిస్తుంటారు. భారత దేశంలోని ఏ మూలన సినిమాకు వెళ్లినా తొలుత మనకు దర్శనం ఇచ్చేది 'ఈ నగరానికి ఏమైంది..' అంటూ వచ్చే ప్రకటన. అయితే, పొగరాయుళ్లను మార్చేందుకు అంతపెద్ద శ్రమ కూడా అవసరం లేదని.. వారికి కాస్తంత చైతన్యం ఇచ్చేలా కొన్నికొన్ని సంక్షిప్త సమాచారాలను(ఎస్సెమ్మెస్) ఫోన్ ద్వారా పంపిస్తే ఇట్టే మారిపోతారని అధ్యయన కారులు చెబుతున్నారు. 'నువ్వు చేయగలవు' 'ధృడంగా ఉండు'వంటి ఎస్సెమ్మెస్‌లు చేయడం ద్వారా పొగతాగే అలవాటున్న వ్యక్తులకు ఆ అలవాటును పూర్తిగా మాన్పించవచ్చంట. అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనకారులు ఈ సర్వే నిర్వహించారు. ఎవరెవరు పొగతాగుతున్నారో వారి వివరాలు తెలుసుకొని వారికి ఒక వ్యవస్థ ద్వారా ప్రత్యేక ఎస్సెమ్మెస్‌లు పంపిస్తే వారిలో ఆ ఆలోచన తగ్గించవచ్చని ఆ అధ్యయనం వివరించింది. -
మరో చౌకైన మొబైల్ @888
న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్, దేశంలోనే అత్యంత చవకైన ఫోన్ ను తయారుచేసి 251 రూపాయలకే అందిస్తామని చెప్పి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. తాజాగా 'డొకోస్' అనే సంస్థ 888 రూపాయలకు స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటించింది. పెద్ద ఆర్భాటమేమీ లేకుండా ప్రారంభోత్సవం చేసుకున్న ఈ సంస్థ తన మొదటి మోడల్ పేరును 'డొకోస్ ఎక్స్ 1' గా ప్రకటించింది. తన వెబ్ సైట్ ద్వారా ఫోన్లను అమ్మకానికి పెట్టేసింది. మే 2లోగా ఫోన్లను అందిస్తామని .. క్యాష్ ఆన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ బుక్ చేసుకోవాలని కోరుతూ వెబ్ సైట్లో వివరాలను పెట్టింది. అయితే, మొబైల్ ఎలా ఉంటుందనే వివరాలను గానీ, ఫోన్ ఫీచర్స్ గానీ వెల్లడించలేదు. సంస్థను గురించి కొద్దిపాటి వివరాలను మాత్రమే అందుబాటులో ఉంచిన డొకోస్ .. సెల్ కొనుగోలు కోసం కాల్ చేయొద్దని కేవలం ఎస్ఎంఎస్ మాత్రమే చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరింది. RAM : 1 GB 2.0 MP Primary Camera 0.3 MP Secondary Camera 1300 mAh Long Lasting Battery 1.2GHz, Dual-Core Cortex A7 4G LTE 4 inch IPS screen Android 4.4.2 (Kikat) OS Dual Sim (GSM + WCDMA) Expandable Storage Capacity of 32 GB -
ఎస్సెమ్మెస్‌లు పంపి.. రేప్ కు యత్నించాడు!
నాగోలు : ఎస్సెమ్మెస్‌లు పంపి ఎందుకు వేధిస్తున్నావని నిలదీసేందుకు వెళ్లిన యువతిపై స్నేహితులతో కలిసి లైంగికదాడికి యత్నించాడో ఘనుడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం తిమ్మాపురానికి చెందిన యువతి ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన మెకానిక్ శ్యామ్‌తో ఈమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని 2012 నుంచి శ్యామ్ ఆమె వెంట తిరిగాడు. ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ తరచూ యువతికి ఎస్సెమ్మెస్‌లు పంపుతూ, ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు. ఎందుకు వేధిస్తున్నావని ఆమె శ్యామ్‌ను నిలదీసేందుకు అతడి మెకానిక్ షాపు వద్దకు వెళ్లగా... స్నేహితులతో కలిసి లైంగికదాడికి యత్నించాడు. వారి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు ఎల్బీనగర్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లీజ్... సబ్సిడీ వదులుకోండి
‘మీ వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటిందా, అయితే వంటగ్యాస్ సబ్సిడీని వదులుకోండి’ అంటూ ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్లు పంపుతున్నాయి. చెన్నై: భారత దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా సబ్సిడీని అందజేస్తోంది. సబ్సిడీపై సరఫరా అవుతున్న వంటగ్యాస్ సిలిండర్లు డీలర్ల సాక్షిగా పక్కదారి పట్టిపోయేవి. బ్లాక్‌లో అమ్ముకోవడం, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు సరఫరా చేయడం ద్వారా డీలర్లు భారీగా అక్రమాలకు పాల్పడేవారు. అలాగే ఒకే ఇంటి యజమాని పేరున అనేక కనెక్షన్లు ఉండేవి. ఇలాంటి అక్రమాల కారణంగా వంట గ్యాస్ సబ్సిడీ మొత్తం అయిల్ కంపెనీలకు, ప్రభుత్వానికి భరించలేని భారంగా మారింది. ఈ భారం నుండి తప్పించుకునేందుకు ఏడాదికి పరిమితమైన సంఖ్యలోనే సిలిండర్లను సరఫరా చేస్తామని గత యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాత కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సబ్సిడీ దుర్వినియోగంపై దృష్టి సారించింది. అక్రమ కనెక్షన్లు అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసే విధానాన్ని గత ఏడాది జనవరిలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వానికి భారంగా పరిణమించిన వంటగ్యాస్ సబ్సిడీ నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని మంజూరు చేస్తున్న సబ్సిడీని ధనవంతులు పొందడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వినియోగదారులు తమ సబ్సిడీ నుండి స్వచ్చందంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ సబ్సిడీ నుంచి మరింతమంది వైదొలగాలని కేంద్రం ఆశిస్తోంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలను దాటిన వినియోగదారులను వంటగ్యాస్ సబ్సిడీ నుంచి మినహాయించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్లు పంపడం ప్రారంభించాయి. రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి వంట గ్యాస్ సబ్సిడీ సౌకర్యం లేదు, ఈ పరిధిలోకి వచ్చిన వారు తమ వివరాలను గ్యాస్ డీలర్‌కు సమర్పించి సబ్సిడీ నుంచి వైదొలగండి అంటూ ఎస్ఎమ్ఎస్ల ద్వారా అయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంపై ఇండియన్ ఆయిల్ చెన్నై శాఖ జనరల్ మేనేజర్ సబితా నటరాజన్ మాట్లాడుతూ, వంటగ్యాస్ వినియోగదారులకు ముంబయిలోని తమ కేంద్ర కార్యాలయం నుండి ఈ మేరకు ఎస్ఎమ్ఎస్లు పంపడం బుధవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమం ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతోందని చెప్పారు. -
వి(క)నిపిస్తూ ప్రచారం..
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచారం హైటెక్ హంగులతో దూసుకుపోతోంది. వివిధ ప్రాంతాల్లో అగ్రనేతల ప్రచార సభలు ఏర్పాటు చేయాలంటే అనేక అడ్డంకులు తప్పవు. పైగా వారి ప్రచారం సడన్‌గా రద్దయినా, టైంకి రాలేకపోయినా.. ఓటర్లు నిరాశ చెందుతారు. అయితే, ఈ సమస్యలను అధిగమించేందుకు పార్టీలు కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తున్నాయి. బస్తీల్లో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి పార్టీ ముఖ్యనేతల సందేశాన్ని వినిపిస్తున్నారు. ప్రముఖుల ప్రసంగాలు ముగిశాక చిన్నస్థాయి నేతలు మైకందుకుంటున్నారు. ట్రాఫిక్ రద్దీ, సమయాభావం వల్ల ముఖ్య నేతలు అన్నిచోట్ల ప్రచారం చేయకుండానే.. స్క్రీన్ల టెక్నిక్‌తో ఓటర్లకు వల వేస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కొంచెం ముందుంది. సీఎం కేసీఆర్ ప్రసంగాలు ప్రతి గల్లీలోను వి(క)నిపించేలా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఈ ప్రచారానికి మంచి స్పందన వస్తుందని, ఓటర్లతో నేతలు నేరుగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుందని బరిలో ఉన్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎంఎస్ల ప్రచారం.. రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా గడిపే సిటీజన్లను నేరుగా కలవడం సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులు ఎస్ఎంఎస్లతో సమాచారం చేరవేస్తున్నారు. ఆయా పార్టీలు ఓటర్లకు సంక్షిప్త సందేశాలు పంపుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీకి ఓటేస్తే ఎలాంటి ప్రజాపనులు చేపడతామో ఆ సందేశాల్లో చెబుతున్నారు. ఇలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు పంపేందుకు నగరంలో పలు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు షాకిస్తుంటే.. ఈ ఏజెన్సీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. -
ఒక్క ఎస్సెమ్మెస్‌తో రైలు బోగీ క్లీన్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలలో ప్రయాణికులు ఏ బోగీ ఎక్కినా కంపు కొట్టడం నిన్నటి మాట. సెంట్ కొట్టడం నేటి మాట. ఎక్కే దిగే ప్రయాణికుల కారణంగా బోగీలు అపరిశుభ్రంగా మారడం మనకు అనుభవమే. ఇప్పడు ఒక్క ఎస్సెమ్మెస్ లేదా ‘క్లీన్‌మైకోచ్ డాట్‌కామ్’కు ఒక్క రిక్వెస్ట్ చేస్తే చాలు. క్లీనింగ్ సిబ్బంది మనముందు వాలుతారు. అరగంటలో బోగీలను, టాయ్లెట్లను శుభ్రం చేసి బోగీల్లో సెంట్కొట్టి మరీ పోతారు. అందుకు రైళ్లలో ‘బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ (ఓబీహెచ్ఎస్)’ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో అప్రమత్తంగా ఉంటారు. ఓబీహెచ్ఎస్ సిబ్బంది సాధారణంగా రైలు గమ్యస్థానంలో చేరుకునేలోగా ప్రతి బోగీని రెండు సార్లు శుభ్రం చేయడం వారి డ్యూటీ. కానీ ప్రయాణికులు ఎప్పుడు కోరుకున్నా వచ్చి అరగంటలో శుభ్రం చేస్తారు. అందుకు మనం చేయాల్సిందల్లా ‘క్లీన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పది డిజిటల్ పీఎన్ఆర్’ నెంబర్‌ను మొబైల్ ఫోన్లో టైప్‌చేసి 58888 నెంబర్‌కు మిస్సేజ్ పంపించాలి లేదా ‘క్లీన్‌మైకోచ్ డాట్ కామ్’కు వెళ్లి అందులో ఉన్న ఫారమ్‌లో మన పీఎన్ఆర్ నెంబర్, మన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. అబ్జర్వ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. మన రిక్వెస్ట్‌ను అబ్జర్వ్ సాఫ్ట్వేర్ వెంటనే ఆ రైల్లో ఉన్న ఓబీహెచ్ఎస్ వ్యవస్థకు పంపిస్తుంది. అక్కడ మన పీఎన్ఆర్ నెంబర్ వాలిడేట్ కాగానే ఓబీహెచ్ఎస్ వ్యవస్థ మూడు ఎస్సెమ్మెస్‌లను జనరేట్ చేసి ఒక ఎస్సెమ్మెస్‌ను ప్రయాణికుడి మొబైల్ నెంబర్ సహా క్లీనింగ్ సిబ్బందికి పంపిస్తుంది. అవే వివరాలతో రెండో ఎస్సెమ్మెస్ కంట్రోల్ ఆఫీసుకు వెళుతుంది. క్లీనింగ్ సిబ్బంది వివరాలతో మూడో ఎస్సెమ్మెస్ ప్రయాణికుడికి వెళుతుంది. సకాలంలో క్లీనింగ్ సిబ్బంది స్పందించి బోగీని క్లీన్ చేశారా, లేదా అన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ ఈ విధానం ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. క్లీనింగ్ అనంతరం అలర్ట్ మెస్సేజ్ కూడా కంట్రోలింగ్ ఆఫీసుకు వెళుతుంది. ఈ విధానాన్ని ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1072 రైళ్లలో ప్రవేశపెట్టారు. త్వరలోనే మరో 700 రైళ్లలో ప్రవేశపెడతామని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. -
ఇకపై ‘వెయిటింగ్ లిస్ట్’వారికి ఎస్ఎంఎస్
ప్రత్యేక రైళ్ల బెర్తులపై సమాచారం హైదరాబాద్: ‘వెయిటింగ్ లిస్టు’ ప్రయాణికులకు కోసం దక్షిణమధ్య రైల్వే వినూత్న సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. రద్దీ సమయాల్లో నడిపే ప్రత్యేక రైళ్ల సమాచారాన్ని వారికి సంక్షిప్త సందేశా(ఎస్ఎంఎస్)ల రూపంలో పంపనుంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు రిజర్వ్ చేసుకున్న తేదీలతో పాటు ఆ రోజుకు దగ్గర్లో ఏవైనా ప్రత్యేక రైళ్లు నడుపుతుంటే... అందులోని బెర్తుల వివరాలతో సమాచారాన్ని వారికి చేరవేస్తారు. ఇటీవల పొగమంచు కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మంచు తెరలు వీడిపోవడంతో వాటిని పునరుద్ధరించారు. కానీ రైళ్లు ఖాళీగా ఉండటంతో విస్మయానికి గురైన రైల్వే అధికారులు... అదే మార్గంలో నడిచే ఇతర రైళ్లలోని వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఎస్ఎంఎస్లు పంపారు. దీనికి అనూహ్య స్పందన రావడంతో ఈ సదుపాయాన్ని అన్ని స్పెషల్ ట్రైన్స్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వినూత్న ఆలోచనను త్వరలోనే అన్ని ప్రత్యేక రైళ్లకు విస్తరించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
సంక్షిప్తంగా.. ఉచితంగా..
► కొత్తపుంతలు తొక్కుతున్న సమాచార వ్యవస్థ ► మాటల కంటే ఎస్ఎంఎస్, మెసేజ్‌లకు ప్రాధాన్యం ► ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్న ప్రజలు ► జిల్లాలో నెలకు రూ.2 కోట్లు విలువైన ఎస్ఎంఎస్ల వినియోగం తణుకు : క్రిస్మస్.. నూతన సంవత్సరం.. సంక్రాంతి.. దసరా.. దీపావళి.. ఏ పండగైనా.. ఏ శుభకార్యమైనా సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుకోవడం పరిపాటి. రోజురోజుకీ మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేవారు. కాలక్రమేణా అవన్నీ కాలగర్భంలోకి కలిసిపోయూరుు. అంతకుముందు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి సమాచారం పంపాలంటే ఫోన్ చేయడం లేదా ఉత్తరాలు రాసుకునేవారు. ఇప్పుడు స్కూల్‌కు పిల్లలు వెళ్లకపోయినా.. మార్కెట్లోకి కొత్త మోడళ్లు వచ్చినా.. ఏదైనా సమావేశం జరుగుతున్నా.. ఇలా ప్రతి సందర్భంలో ఎస్ఎంఎస్లు (సంక్షిప్త సందేశాలు) అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయాలంటే ఉత్తరం తర్వాత ల్యాండ్ ఫోన్ ఇప్పుడు సెల్‌ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఎస్ఎంఎస్లు కీలకంగా మారుతున్నాయి. వాటిలో ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసెంజర్ వంటి యాప్‌లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చిన తొలినాళ్లలో అధిక శాతం సంభాషణలకే ఉపయోగిస్తే ఇప్పుడు మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్... అంటూ కేవలం సంక్షిప్త సందేశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నీ ఉచితమే ఎస్ఎంఎస్లు కేవలం సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా నెట్ ద్వారా కొన్ని వెబ్సైట్లలోకి వెళ్లి సమాచారాన్ని పంపవచ్చు. తరచూ ఎవరికైతే మెసేజ్‌లు పంపుతున్నామో ఆయా నంబర్లను నెట్లో నిక్షిప్తం చేసుకుని తర్వాత రోజుకు వంద చొప్పున ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపుకునే వెసులుబాటు ఉంది. ఈ విధానం ఎక్కువగా విద్యాసంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు వినియోగిస్తున్నాయి. మరోవైపు కొంతకాలం క్రితం అందుబాటులోకి వచ్చిన వాట్సప్ ద్వారా నెట్ అందుబాటులో ఉంటే అపరిమితంగా ఎస్ఎంఎస్లు పంపుకునే వీలు కలిగింది. ఆయా నెట్వర్క్ కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ఆధారంగా ఆయా కంపెనీల ద్వారా జిల్లాలో సుమారు 40 లక్షల మంది సెల్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఆయా నెట్వర్క్ కంపెనీలు ఎస్ఎంఎస్ల కోసం వినియోగదారులకు వివిధ ఆఫర్లు అందజేస్తున్నారు. మొత్తమ్మీద వీరంతా నెలకు రూ. 2 కోట్లు విలువ చేసే ఎస్ఎంఎస్లు వినియోగిస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటున్నాం గతంలో స్నేహితులతో మాట్లాడాలంటే సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు యాంత్రిక జీవనంలో మాట్లాడాలంటే కష్టమవుతోంది. దీంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఎస్ఎంఎస్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. శుభాకాంక్షలు తెలపాలన్నా, సమాచారం చేరవేయాలన్నా సమయం వృథా కాకుండా ఇవి తోడ్పడుతున్నాయి. - టి.శివశంకర్, తణుకు -
పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం
న్యూఢిల్లీ: పొగత్రాగడం మానేయాలనికునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి కోసం ప్రత్యేకంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మొబైల్ కౌన్సిలింగ్ ఇచ్చి స్మోకింగ్ మానేయడానికి సహకారం అందించడానికి ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఓ మొబైల్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే వారి డేటాను రిజిస్టర్ చేసుకుంటారు.ఆ తర్వాత ఎసెమ్మెస్ రూపంలో మూడు నుంచి నాలుగు ప్రశ్నాలకు సమాధానం పంపించాల్సి ఉంటుంది. వాటిలో వయస్సు, విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు, ఎన్నేళ్ల నుంచి ధూమపానం అలవాటుంది లాంటి వివరాలు పంపించాలి. స్మోకింగ్ మానడానికి సూచనలిస్తూ ప్రతిరోజు 4 మెసేజ్‌లు వస్తాయి. ఉదాహరణకు దేవుని పట్ల నమ్మకం ఉన్న వారికి దేవి నవరాత్రుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచిస్తారు. దీంతో వారిలో మార్పు రావడానికి అవకాశముంటుందని భావిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల కొంత వరుకైనా మార్పు చేయవచ్చునని కేంద్ర ఆరోగ్యాధికారి అరోరా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల్లో చైతన్యపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోనికి తేనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం చేసేవారిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఏటా 10 లక్షల మంది వరకు స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్, టీబీ వ్యాధులతో మరణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏటా దశల వారిగా స్మోకింగ్‌ను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. -
ఎస్ఎంఎస్లతో జర జాగ్రత్త!
* షాపింగ్ ప్రియులకు గాలం * లాటరీ పేరిట ఎస్ఎంఎస్లు * సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు * ఆశ పడితే అంతే సంగతులు సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అరుణ్ ఓ షాపింగ్ మాల్కి వెళ్లాడు. అక్కడ ‘వెల్కమ్’ అంటూ ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. వివిధ ఆఫర్ల గురించి చెబుతూ వీరి పూర్తి వివరాలను సేకరించాడు.కొన్ని రోజుల వ్యవధిలోనే అరుణ్ సెల్ నంబర్కురూ.50 కోట్ల లాటరీ తగిలిందంటూ కోకాకోలా కంపెనీ పేరిట ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో ఆయన ఎగిరి గంతేశాడు. వాళ్లు చెప్పినట్టుగా పన్నుల పేరిట దఫదఫాలుగా సుమారు రూ.పది లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న అరుణ్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు దొరికినా... డబ్బులు మాత్రం రికవరీ కాలేదు.... ఇది ఒక్క అరుణ్ పరిస్థితే కాదు... షాపింగ్ మాల్స్‌కు వెళ్లిన వేలాది మందికి లాటరీలని, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలిస్తామని... ఇలా వివిధ రూపాల్లో సెల్ఫోన్లకు ఎస్ఎంస్లు వెల్లువెత్తుతున్నాయి. ‘లక్’ ఎంతో పరీక్షించుకుందామని ప్రయత్నిస్తున్న వారు అడ్డంగా దొరికిపోతున్నారు. షాపింగ్ ప్రియులే టార్గెట్... ఇన్నాళ్లూ ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఫోన్ నంబర్లను సేకరిస్తున్న సైబర్ ముఠాలు... ఇప్పుడూ ఏకంగా షాపింగ్ ప్రియులనే టార్గెట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు వివిధ దుకాణాలు ప్రకటిస్తున్న ఆఫర్లకు క్యూ కడుతూ... లక్కీ డ్రా తలుగుతుందనే ఆశతో తమ చిరునామాతో సహా పూర్తి వివరాలను సమర్పిస్తున్న వారి నుంచి నయా పద్ధతుల్లో డబ్బులు లాక్కొనే ప్రయత్నానికి తెర లేపాయి. వివిధ పద్ధతుల్లో తమ నెట్వర్క్ ద్వారా షాప్‌ల నుంచి చిరునామాలను సేకరించి లాటరీల పేరుతో సెల్ఫోన్లో ఎస్ఎంస్లు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాలపై ఆశతో ఉన్న కొందరి బలహీనతను ఆసరాగా చేసుకుంటే రూ.లక్షల్లో కొట్టేయవచ్చని పథకాలు రచిస్తున్నాయి. జంట పోలీసు కమిషనరేట్లలోనే కాదు... దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఈ తంతుకు తెరలేపి ఒకేసారి లాటరీల పేరిట లక్షల మందికి ఎస్ఎంఎస్లు పెడుతున్నారు. బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, రిబాక్, నైక్, సోనీ, మెర్సిడెజ్ బెంజ్ కంపెనీల లాటరీలు తగిలిందంటూ పంపిన ఎస్ఎంఎస్లకు స్పందించిన వారిని నమ్మించి పన్నుల రూపంలో బాదేస్తున్నారు. మరి కొంతమందికి తక్కువ వడ్డీలకు రూ.లక్షల్లో రుణం ఇప్పిస్తామని నమ్మించి కుచ్చు టోపీ పెడుతున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట భారీమొత్తంలో డబ్బు కాజేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి... పెద్ద మాల్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు... పెట్రోల్ బంక్‌లలో కార్డులు వినియోగించినప్పుడు వాటిని నైజీరియన్లు హ్యాక్ చేస్తున్నారు. తమ నెట్‌వర్క్‌తో వారి చిరునామాలను సంపాదిస్తున్నారు. ఆ తర్వాత లాటరీ పేరుతో బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. స్పందించిన వారికి భారీ మొత్తంలో టోకరా పెడుతున్నారు. అందుకే లాటరీ వచ్చిందని ఎస్ఎంఎస్లు వస్తే జాగ్రత్తపడాలి. - జయరాం, ఏసీపీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ -
ఎస్ఎంఎస్ చేస్తే కేసు వివరాలు
దేశంలోనే తొలిసారిగా సైబరాబాద్ పోలీసుల ప్రయోగం ఠాణాల చుట్టూ చక్కర్లు లేకుండానే ఫిర్యాదుదారులకు సమాచారం కమిషనర్ వైబ్‌సైట్‌కు వెళ్లి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడూ కేసు పురోగతి వివరాలు చేరవేత సిటీబ్యూరో: మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా...? కేసు స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారా..? కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు తిప్పించుకుంటున్నారా...? ఇక నుంచి ఫిర్యాదుదారులకు ఇలాంటి తిప్పలు లేకుండా సైబరాబాద్ పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఫిర్యాదుదారుడు తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి CYBPOL <space> CS <space> Police Station/Crime No/Yearఅని టైప్ చేసి 9731979899 నంబర్‌కు సందేశం పంపిస్తే కేసు పురోగతి గురించి సమాచారం వెంటనే వచ్చేస్తుంది. సైబరాబాద్ పోలీసులు ఇటీవల ప్రారంభించిన ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్‌కు మంచి స్పందన వస్తోంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నా ఎస్ఎంఎస్లు ‘ఎస్ఎంఎస్ ద్వారా కేసు వివరాలను తెలుసుకునేందుకు తొలుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వెబ్‌సైట్‌కి వెళ్లి నో యువర్ కేస్ స్టేటస్‌కి వెళ్లాలి. కేసు స్టేటస్ త్రూ ఎస్ఎంఎస్ని క్లిక్ చేయాలి. ఫిర్యాదుచేసిన పోలీసు స్టేషన్ పేరు, క్రైం నంబర్, పేరు, మొబైల్ నంబర్లను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫోన్‌కు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎస్ఎంఎస్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే కేసు స్థితిగతుల వివరాలు మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంటాయి. కేసుకు సంబంధించి ఎప్పుడూ పురోగతి లభించినా వెంటనే సదరు సమాచారం ఫిర్యాదుదారుడి సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ‘సైబరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన ఈ ఎస్ఎంఎస్ విధానం ద్వారా ఠాణాలు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి తప్పింది. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు వ్యక్తిగత పనులకు ఎటువంటి అంతరాయం కలగడం లేదు. ఫోన్ పట్టుకొని నంబర్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేసు పురోగతి వివరాలు వచ్చేస్తున్నాయ’ని గచ్చిబౌలికి చెందిన అరుణ్ తెలిపాడు. క్రైమ్ నంబర్, ఎఫ్ఐఆర్ నమోదు తేదీ, పేరుతో పాటు కేసు విచారణ దశలో ఉందా, ఉంటే అందుకు కారణాలు ఏంటనే వివరాలు వచ్చేస్తున్నాయని తెలిపాడు. కాగా, ఈ ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్ పద్ధతి వల్ల తమకు కూడా చాలా పనిభారం తప్పినట్టైందని, ఎప్పటికప్పుడు కేసు పురోగతి వివరాలను ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ రూపంలో చెరవేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఠాణాకు ప్రతిసారి కేసు వివరాలు తెలుసుకునేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని, దీంతో వాళ్లకు సర్దిచెప్పడం లాంటి సంఘటనలు కూడా తగ్గాయని అంటున్నారు. అలాగే కమిషనర్ వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు నమోదుచేసినా కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చు. -
'ఏపీ కేంద్ర మంత్రులకు ఎస్ఎంఎస్ పంపండి'
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ప్రతిఒక్క విద్యార్థి ఒక ఎస్ఎంఎస్ను పంపించి కేంద్రప్రభుత్వం కళ్ళు తెరిచేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం హామీలు గుప్పించి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాయని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం ప్రతి విద్యార్థి ఉద్యమించాలన్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు (9396693766), నిర్మలాసీతారామన్ (09910020595), సుజనాచౌదరి (09013181699), అశోక్‌గజపతిరాజు (0990822599)లకు ఎస్ఎంఎస్ చేయాలని సూచించారు. -
హోదా కోసం ఎస్ఎంఎస్ల ఉద్యమం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం చేయనున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ ఉద్యమాన్ని సెప్టెంబర్ 23న విశాఖపట్నంలో ప్రారంభిస్తామని తెలిపారు. శనివారం ఇందిరాభవన్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలతో రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఎస్ఎంఎస్ ఉద్యమంపై ఆయన జిల్లా నేతలతో మాట్లాడారు. అనంతరం వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రధానితోపాటు కేంద్రమంత్రులుకు ఎస్ఎంఎస్ సందేశాలు ఇస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. -
లాటరీ పేరుతో నర్సుకు రూ. 4.5 లక్షల టోకరా!
హైదరాబాద్ : లాటరీ గెలిచారంటూ వచ్చిన ఎస్సెమ్మెస్‌ను నమ్మడంతో ఓ స్టాఫ్ నర్స్ రూ.4.5 లక్షల మేర నష్టపోయారు. ఈ కేసు దర్యాప్తు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు ఉగాండాకు చెందిన ఓ మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐడీ అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒసాజీ మైక్ ఒడియోన్, ఓసాయ్ జార్జ్ ఒడేగూ, ఉగాండాకు చెందిన రోసీ అనే ముగ్గురూ బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారకలో స్థిరపడ్డారు. ఈ ముగ్గురూ ఓ ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా అనేక మందికి లాటరీలు, బహుమానాలు వచ్చాయంటూ ఎస్ఎంఎస్లు పంపడం ప్రారంభించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న లైఫ్ కేర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న గుంటూరుకు చెందిన సీహెచ్ అంజమ్మకు ఇటీవల ఒసాజీ నుంచి లాటరీ తగిలిందంటూ ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. దానికి అంజమ్మ స్పందించడంతో ఓసాయ్, రోసీ రంగంలోకి దిగి కథ నడిపించారు. వివిధ రకాల పన్నుల పేరు చెప్పి ఆమె వద్ద నుంచి మొత్తం రూ.4,53,950 దండుకున్నారు. చివరకు మోసపోయానని గుర్తించిన అంజమ్మ గత నెల 28న సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలోని బృందం ఢిల్లీకి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానం అనుమతితో గురువారం హైదరాబాద్ తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
అమ్మా నన్ను క్షమించు...
తల్లికి ఎస్సెమ్మెస్ పంపి కుమారుడి అదృశ్యం బంజారాహిల్స్ : ‘అమ్మా... నన్ను క్షమించు, ప్రేమలో ఓడిపోయా... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’... అంటూ ఓ యువకుడు తన తల్లి ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపి అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన అతడి తల్లి రెండు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా రోదిస్తూ కుప్పకూలిపోయింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్‌లో నివసించే శ్రీకాంత్(25) ఎంబీఏ చదువుతున్నాడు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగా తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ శనివారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. ‘ప్రేమలో ఓడిపోయా.. ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని గంట తర్వాత తన తల్లికి ఎస్సెమ్మెస్ పంపాడు. ఆందోళనకు గురైన తల్లి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీకాంత్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా చిలకలగూడ ప్రాంతంలోని రైలు పట్టాల వద్ద ఉన్న టవర్ లొకేషన్ చూపించింది. వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పట్టాల వద్ద రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. -
ఒక్క ఎస్సెమ్మెస్‌తో ఇంటికే మద్యం
సాక్షి, హైదరాబాద్: మీ మొబైల్ నుంచి ఒక్క ఎస్సెమ్మెస్ ఇస్తే చాలు మద్యం మీ ఇంటికే వస్తుంది. ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొనసాగుతున్న తంతు ఇది. మద్యం విక్రయాలు పెంచడం ద్వారా ఆదాయం మరింత పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో మద్యం షాపుల యజమానులు ఇప్పుడు డోర్ డెలివరీ విధానాన్ని అమలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి గ్రామాలకు డోర్ డెలివరీ యథేచ్చగా సాగుతోంది. గ్రామాల్లో మద్యం కావలసిన వారు మండల కేంద్రంలోని మద్యం దుకాణదారుడి మొబైల్‌కు ఒక్క ఎస్సెమ్మెస్ ఇస్తే నిమిషాల్లో బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం ద్విచక్ర వాహనాలతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని దూరప్రాంత గ్రామాల్లోని బెల్ట్‌షాపుల్లో స్టాకును నిలువచేస్తున్నారు. మండల కేంద్రంలోని షాపు యజమానికి ఎస్సెమ్మెస్ రాగానే గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి ఆ సమాచారం ఇచ్చి వెంటనే డోర్ డెలివరీ చేయాలని ఆదేశిస్తున్నారు. మాల్స్‌లోనూ మద్యం కర్ణాటక మద్యం విధానంలో భాగంగా పెద్ద పెద్ద మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరుల్లోని అయిదు మాల్స్‌లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ లెసైన్సులను మంజూరు చేసింది. ఆ మాల్స్‌లో మద్యం విక్రయాల గిరాకీ బాగా ఉందని, ఉద్యోగస్తులతో పాటు యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో తేలింది. త్వరలో నూతన బార్ల విధానం పర్యాటక విధానానికి అనుగుణంగా అన్ని హంగులతో నూతన బార్ల విధానం ఉంటుందని ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పర్యాటక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే నూతన విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ మద్యం దుకాణాల్లో నౌకర్ నామా ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.5వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మెసేజ్ కొట్టు.. గోల్డ్ కాయిన్ పట్టు
హైదరాబాద్: నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ వినియోగదారుల కోసం 'నేచురల్ గోల్డ్ ఫెస్ట్'ను ప్రవేశపెట్టింది. బేగంపేట్‌లోని తాజ్ వివంతా హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ చెఫ్ సంజయ్తుమ్మతో కలిసి ఎస్ఏఆర్ఎల్ జనరల్ మేనేజర్ కేఎస్‌రావు ఈ స్కీమ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేచురల్ ఫెస్ట్ ఆఫర్లో పాల్గొనే వినియోగదారులు లీటరు సామర్థ్యం కలిగిన రెండు నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తే కోడ్ కలిగిన స్క్రాచ్ కార్డును అందజేస్తారన్నారు. కోడ్‌ను తమ పేరు, పట్టణం పేరుతో కలిపి స్క్రాచ్‌కార్డుపై పొందుపరిచిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలని తెలిపారు. ప్రతిరోజూ ఎస్ఎంఎస్ చేసిన మొదటి 15 మందికి ఒక గ్రాము చొప్పున బంగారం గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. రంజాన్ నుంచి నవంబర్ 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఆదివారం విజేతలను ప్రకటిస్తారని తెలిపారు. ఈ క్యాంపెయిన్ ముగిసే సమయంలో లక్కీ డ్రా కూడా నిర్వహించి బంపర్ విజేతలకు 150 గ్రాముల బంగారం, మొదటి విజేతకు 100 గ్రాములు, రెండో విజేతకు 75, మూడో విజేతకు 50 గ్రాముల చొప్పున బంగారం అందజేస్తామన్నారు. ఈ ఆఫర్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
లాటరీ పేరుతో రూ.1.8 లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: విదేశీ లాటరీ వచ్చిందంటూ సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్) పంపి, వివిధ చార్జీల పేరుతో నగదు కాజేసిన నైజీరియన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు హర్యానాలోని గుర్గావ్లో అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, సిమ్‌కార్డ్ స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సోమవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబెగా మిచెల్ అలియాస్ జెఫ్ మోర్గాన్ తేలిగ్గా డబ్బు సంపాదించే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా అనేక మంది సెల్ఫోన్లకు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపాడు. ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి కె.వెంకటేశ్వరరెడ్డికి ఓ ఎస్సెమ్మెస్ పంపాడు. యూఎస్ శాంసంగ్ లాటరీలో భారీ మొత్తం వచ్చిందనడంతో ఆకర్షితుడైన వ్యాపారి తనకు ఇంగ్లిష్ రాకపోయినా వేరే వ్యక్తి ద్వారా మిచెల్‌తో సంప్రదింపులు జరిపించాడు. వెంకటేశ్వరరెడ్డి పూర్తిగా తన అదుపులోకి వచ్చాడని నిర్ధారించుకున్నాక వివిధ బ్యాంకుల ఖాతాల్లో రూ.1.79 లక్షలు జమ చేయించుకున్నాడు. దాదాపు 3 నెలలు ఎదురు చూసినా లాటరీ సొమ్ము రాకపోవడం.. మిచెల్ స్పందించకపోవడంతో వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు మార్చి మొదటి వారంలో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.శివాజీ తన బృందంతో దర్యాప్తు చేపట్టి, నిందితుడు గుర్గావ్లో ఉన్నాడని గుర్తించారు. పోలీసులు వారం రోజులు శ్రమించి గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. -
రైళ్లు రద్దయితే.. ఎస్ఎమ్ఎస్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రైళ్లు రద్దయితే.. ఆ తాలుకూ సమాచారాన్ని ప్రయాణీకుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎమ్ఎస్(సంక్షిప్త సమాచారం) ద్వారా అందించనుంది. సంబంధిత రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న రైళ్ల సమాచారం, వేళలు, వాటి రద్దు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనివల్ల రైళ్లు రద్దయితే వారు వెంటనే టిక్కెట్లు రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో దానికి మాత్రమే ఎస్ఎమ్ఎస్ వస్తుంది. -
ఎస్ఎంఎస్ ద్వారా వాతావరణ సూచన
న్యూఢిల్లీ: వాతావరణంలో భారీ వర్షాల వంటి తీవ్రమైన మార్పులు సంభవించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో రైతులకు అందించే సేవలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. వడగండ్లవాన, భారీ వర్షాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి మూడు గంటలకోసారి రైతులకు వారి మొబైల్ఫోన్లకు ‘నౌకాస్ట్’ పేరుతో సమాచారం అందుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు. దీంతో పాటుగా పంటలకు బీమా చేసుకునేలా రైతులను చైతన్య పరచటానికి ఒక వెబ్ పోర్టల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఉచిత ఎస్ఎంఎస్ సర్వీసులను పొందటానికి రైతులు ప్రభుత్వానికి సంబంధించిన ఝఓజీట్చఞౌట్ట్చలో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది. టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
నేడే టెన్త్ ఫలితాలు
-
నేడే టెన్త్ ఫలితాలు
హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు ⇒ ఇంటర్నెట్లో ఫలితాలు ⇒ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్ఎంఎస్ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్లు www.sakshieducation.com www.aponline.gov.in www.bsetelangana.org www.results.cgg.gov.in ఎస్ఎంఎస్ల రూపంలో.. ఎయిర్‌సెల్/వొడాఫోన్/రిలయన్స్ 58888 ఐవీఆర్ఎస్ ద్వారా.. యూనినార్/ఎయిర్టెల్/ఎయిర్‌సెల్/వొడాఫోన్ 5333530 -
రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ ధరలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ ధరలు మే 1 నుంచి తగ్గనున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ టారిఫ్ ధరలను తగ్గించటంతో రోమింగ్ మొబైల్ కాల్స్ 23 శాతం వరకు, ఎస్ఎంఎస్ ధరలు 75 శాతం వరకు తగ్గనున్నాయి. ట్రాయ్ రోమింగ్ ఎస్టీడీ కాల్స్ చార్జీలను (నిమిషానికి) రూ.1.5 నుంచి రూ.1.15కు, రోమింగ్ ఎస్ఎంఎస్ ధరలను రూ.1.5 నుంచి 38 పైసలకు, రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్ ధరలను 75 పైసలు నుంచి 45 పైసలకు తగ్గించింది. రోమింగ్‌లో వుండగా చేసే లోకల్ ఎస్ఎంఎస్ ధరలను రూ.1 నుంచి 25 పైసలకు, రోమింగ్ లోకల్ కాల్స్ ధరలను రూ.1 నుంచి 80 పైసలకు తగ్గించింది. అంటే టెలికం ఆపరేటర్లు రోమింగ్ లోకల్ ఎస్ఎంఎస్లు, రోమింగ్ లోకల్ కాల్స్‌కు వినియోగదారుల నుంచి గరిష్టంగా 25 పైసలను, 80 పైసలను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. రోమింగ్‌లోనూ, హోం సర్కిల్ లోనూ ఒకే రకమైన కాల్ చార్జీలు ఉండే ఆర్టీపీ, ఆర్టీపీ-ఎఫ్ఆర్ వంటి రోమింగ్ టారిఫ్ ప్లాన్లను ట్రాయ్ రద్దుచేసింది. వినియోగదారుల కోసం ‘స్పెషల్ రోమింగ్ టారిఫ్ ప్లాన్’లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది. -
కిడ్నాపర్లను పట్టించిన ఎస్సెమ్మెస్
హిమాయత్‌నగర్: ఒక్క ఎస్సెమ్మెస్సే కిడ్నాపర్లను పట్టించింది. పోలీసులు బాలుడి కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి కలిగించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ పోలీసులు సంయుక్తగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. హిమాయత్‌నగర్ 3వ వీధిలో నివసించే ఎల్.నరేందర్ నారాయణగూడ వై- జంక్షన్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతని చిన్న కుమారుడు సంజిత్ నారాయణగూడ వెంకటేశ్వర కాలనీలో ట్యూషన్‌కు వెళ్తుండగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఐదు బృందాలుగా విడిపోయి నగరంలోని అన్ని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేశారు. రూ. 50 లక్షల ఇవ్వాలని సంక్షిప్త సందేశం... రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి దాటాక బాలుడి తండ్రి నరేంద్రకు ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. అప్పటి వరకు నిందితులను పట్టుకొనేందుకు సరైన క్లూ లేక తలలు పట్టుకొన్న పోలీసులకు ఆ ఎస్సెమ్మెస్ కొండంత బలాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా దుండగుల కోసం వేట మొదలెట్టారు. కిడ్నాపర్లు బోయినపల్లి పీఎస్ పరిధిలోని అస్మత్పేటలోని ఓ ఇంటిలో చిన్నారి సంజిత్ను దాచిపెట్టారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బుధవారం ఉదయం పంజగుట్ట, సికింద్రాబాద్ మధ్య తిరిగారు. చివరకు పోలీసులు ప్రధాన నిందితుడు విజయకుమర్తో పాటు హేమంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా బాలుడి ఆచూకీ చెప్పారు. వెంటనే పోలీసులు వెళ్లి బాలుడి రక్షించారు. ఈ ఆపరేషన్‌లో అబిడ్స్ ఏసీపీ రాఘవేంద్రరెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ భీంరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈజీ మనీకోసం... సంజిత్ను మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లకు చెందిన విజయకుమార్(26) కిడ్నాప్ చేశాడు. ఆరేళ్ల క్రితం విజకుమార్ కిడ్నాప్‌కు గురైన సంజిత్ తండ్రి మెడికల్ షాపులో పని చేసి మానేశాడు. ప్రస్తుతం సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇతను హరిత (36) అనే జూనియర్ ఆర్టిస్ట్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ సులభంగా డబ్బు సంపాదించేందుకు సంజిత్ కిడ్నాప్‌కు పథకం వేశాడు. తనకు సహకరిస్తే ఒక్కొక్కరికి రూ. 20 వేలు ఇస్తానని హరిత, ఆమె కొడుకు హేమంత్‌కుమార్ (22), కూతురు స్వాతి (18), ఆటో డ్రైవర్ సయ్యద్ మున్నాతో ఒప్పందం చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు బాలుడ్ని కిడ్నాప్ చేసుకెళ్లారు. చివరకు పోలీసులకు చిక్కారు. -
ఇన్వెస్టర్లూ జాగ్రత్త... సెబీ ఎస్ఎంఎస్ ప్రచారం
న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల గురించి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు, అవగాహ న కల్పించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొత్తగా విస్తృత ఎస్ఎంఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం’ అనే ప్రకటనలు మోసపూరిత చర్యలో భాగమేనని సెబీ తెలిపింది. పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్టర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఇన్వెస్టర్ల మొబైల్ నెంబర్లను ట్యాప్ చేసి, వారికి వివిధ సందేశాలు పంపి, ఆకర్షిస్తున్నారని పేర్కొంది. సెబీ గతంలో నుంచే ఇన్వెస్టర్ల అవగాహన, అప్రమత్తత కోసం పత్రికా, టీవీ ప్రకటనలను ఇస్తోంది. -
ఈపీఎఫ్ఓ ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ సభ్యుల కోసం ప్రవేశపెట్టిన సంక్షిప్త కోడ్ ఎస్ఎంఎస్ సేవలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సార్వత్రిక ఖాతా నంబరు(యూఎన్ఏ)తో సేవలు పొందుతున్న సభ్యులకు సంక్షిప్త కోడ్ ఎస్ఎంఎస్ సేవ అందుబాటులో ఉంటుందని చెప్పారు. యూఎన్‌ఏలో రిజిష్టర్ అయిన సభ్యుల మొబైల్స్‌కు ఖాతాకు సంబంధించిన వివరాలు సంక్షిప్త సందేశాల రూపంలో అందుతాయన్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళం, మళయాలం, బెంగాలీ భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
ఎస్ఎంఎస్ వస్తే రేషన్ బియ్యం వచ్చినట్టే
లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తాం వచ్చే నెల నుంచి మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ ఎంఎల్ఎస్ పాయింట్లలో అమలు రేషన్‌బియ్యం అమ్మినా, కొన్నా కేసులు పెడతాం వంటగ్యాస్‌కు ఆధార్‌సీడింగ్‌లో సమస్యలుంటే 18004251442 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ‘విద్యార్థికి రెవెన్యూ నేస్తం’ జిల్లా జాయింట్ కలెక్టర్. డా.ఎన్.సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆహారభద్రత కింద మీ కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ప్రభుత్వం ఇస్తోందా? ఆ బియ్యం మీ రేషన్ షాపుకు ఎప్పుడు వస్తాయో మీకు తెలియదు కదా..! ఒకటి, రెండుసార్లు షాపుకు వెళ్లి లేదంటే డీలర్‌ను కలిసి అడిగితేనే మీకు రేషన్ బియ్యం వ చ్చిందో లేదో తెలుస్తుంది. కానీ వచ్చే నెల నుంచి అలాంటి అవసరం లేదు. మీ రేషన్ డీలర్ వద్దకు మీ కోటా బియ్యం రాగానే మీ మొబైల్‌ఫోన్ మోగుతుంది. మీ డీలర్ వద్దకు బియ్యం వచ్చాయి.. తీసుకెళ్లండి అని మీ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) వస్తుంది. మన జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ఎస్ఎంఎస్ సమాచారాన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తామంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ. రేషన్‌బియ్యం సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు గాను పలు మార్గాలను అన్వేషిస్తున్నామని, అందులోభాగంగానే ఈ ఎస్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు. జిల్లాలో నిత్యాసవరాల పంపిణీ, వంటగ్యాస్‌కు నగదు బదిలీ, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువపత్రాల మంజూరు లాంటి విషయాలపై శనివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి.... సాక్షి: జిల్లాలో నిత్యావసరాల పంపిణీ ఎలా ఉంది? ఈ పంపిణీలో జరుగుతున్న అవకతవకలను ఎలా అరికట్టాలనుకుంటున్నారు? జేసీ: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని డీలర్ల ద్వారా అందిస్తున్నాం. ఇతర వస్తువులు పంపిణీ చేసేందుకు కూడా ప్రతినెలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే, కొన్ని చోట్ల ఈ పంపిణీ సక్రమంగా లేదనే ఫిర్యాదులు మాకు కూడా వస్తుంటాయి. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పంపిణీలో మార్పులు చేస్తుంటాం. అందులో భాగంగానే జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సమాచారాన్ని చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నాం. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే దీనిని అమలు చేశారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా వచ్చే నెల నుంచి మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని షాపుల్లో రేషన్ తీసుకునే లబ్ధిదారులకు ఈ ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పిస్తాం. రేషన్ డీలర్‌వద్దకు బియ్యం రాగానే లబ్ధిదారుల మొబైల్ఫోన్లకు ఎస్ఎంఎస్ పెడతాం. తద్వారా రేషన్ సరుకులు లబ్ధిదారుడు సకాలంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దుర్వినియోగానికి అవకాశం ఉండదు. సాక్షి: మనిషికి ఆరుకిలోల బియ్యం ఇస్తే అవి దుర్వినియోగం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఏమైనా వస్తున్నాయా? జేసీ: ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. అయితే, ఈ బియ్యాన్ని చాలా మంది తినడం లేదని, అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. చట్టం ప్రకారం అయితే రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా కేసులు పెడతాం. బియ్యాన్ని పెద్ద మొత్తంలో సైకిల్‌పై తీసుకెళ్లినా ఆ సైకిల్‌ను కూడా సీజ్ చేయవచ్చని చట్టం చెబుతోంది. రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేయవద్దని ఊర్లలో టాంటాం వేయిస్తున్నాం. ఈ మేరకు తహసీల్దార్లకు, ఆర్డీఓలకు సూచనలు పంపాం. అదే విధంగా ఆరుకిలోల చొప్పున ఇచ్చేందుకు గాను డీలర్లు స్టాక్పెట్టుకునే స్థలం లేక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రెండు సార్లు బియ్యం తీసుకెళతామని అంటున్నా దానిని అంగీకరించే ప్రసక్తే లేదు. ఒక షాపునకు కేటాయించిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఒకేసారి తీసుకెళ్లాలి. దానిని నిల్వచేసి లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత డీలర్దే. ఈవిషయంలో తేడా వస్తే చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఆహారభద్రత కార్డులు ఎప్పుడొస్తాయి? ఈనెల కూడా కూపన్ల ద్వారానే రేషన్ ఇస్తారా? జేసీ: ఆహారభద్రత కార్డుల జారీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. కార్డులు వచ్చేంతవరకు కూపన్లు ఇచ్చాం. అయితే, ఈనెల మాత్రం కీరిజస్టర్ ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చాం. కార్డుల జారీకి ప్రభుత్వం ఆదేశిస్తే పంపిణీ చేసేందుకు మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ కార్డులు వచ్చిన తర్వాతే రేషన్‌షాపుల క్ర మబద్ధీకరణ చేపడతాం. సాక్షి: వంటగ్యాస్‌కు నగదు బదిలీ ఎంత వరకు వచ్చింది? జేసీ: కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వంటగ్యాస్‌కు నగదుబదిలీ ఏప్రిల్1 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందుకోసం జిల్లాలోని 90శాతం మంది వినియోగదారులను వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. అటు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల వద్ద ఆధార్‌సీడింగ్ వేగంగా జరుగుతోంది. అయితే, గ్యాస్ఏజెన్సీలు ఈ విషయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వ్యక్తిగత బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంకర్లను అప్రమత్తం చేస్తున్నాం. వంటగ్యాస్‌కు ఆధార్‌సీడింగ్‌లో సమస్యలుంటే 18004251442 టోల్‌ఫ్రీనంబర్‌కు ఫోన్‌చేసి చెప్పవచ్చు. సాక్షి: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పరిస్థితి ఏంటి? జేసీ: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. ఇందుకు సంబంధించి 125 గజాల్లోపు భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, వీటిని పరిశీలిస్తే 12వేలకు పైగా దరఖాస్తులు సక్రమంగా లేవు. ఈ భూములు అసైన్డ్, శిఖం, ఎఫ్టీఎల్, మున్సిపల్, పార్కులు, రోడ్ల సరిహద్దులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని మినహాయించి మరో 2,500 దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. 59 జీఓ కింద వచ్చిన 1815 దరఖాస్తులకు గాను దరఖాస్తుదారులు మార్కెట్ ధరలో 25శాతం చెల్లించడం ద్వారా 2.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. సాక్షి: రెవెన్యూ కార్యాలయాల్లో విద్యార్థులకు ధ్రువపత్రాల మంజూరులో ఏమైనా మార్పులు తెస్తున్నారా? జేసీ: విద్యాసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు, సెట్లకు హాజరయ్యేందుకు, పోటీపరీక్షల్లో పాల్గొనేందుకు గాను విద్యార్థులకు అనేక ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఇందుకోసం ఈ ఏడాది కొత్త విధానాన్ని తీసుకువస్తున్నాం. ‘విద్యార్థికి రెవెన్యూ నేస్తం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలను వారి వారి పాఠశాలలకే పంపిస్తున్నాం. ఇందుకోసం ఈనెల తొమ్మిదిన తహశీల్దార్లు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల్లో ఇచ్చే ఫార్మాట్ల ప్రకారం ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని 5 నుంచి 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆయా విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలను పాఠశాలలకు తీసుకెళ్తారు. తొలివిడతలో భాగంగా వచ్చే నెల మొదటివారంలోపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ద్రువపత్రాలిస్తాం. పాఠశాలలు తెరిచిన తర్వాత 6,7,8,9 తరగతుల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తాం. తద్వారా ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం ఉండదు. -
తగ్గనున్న మొబైల్ రోమింగ్ చార్జీలు
కాల్స్‌పై 35%, ఎస్ఎంఎస్లపై 80 శాతం దాకా తగ్గుదల: ట్రాయ్ ప్రతిపాదనలు న్యూఢిల్లీ: రోమింగ్‌లో మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ల చార్జీలను సుమారు 35 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గించే దిశగా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు రూపొందించింది. టెలికం కంపెనీలు వసూలు చేసే రోమింగ్ చార్జీలపై గరిష్ట పరిమితుల్లో మార్పులు చేస్తూ టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డరుకు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం రోమింగ్‌లో ఉన్నప్పుడు చేసే ఔట్‌గోయింగ్ లోకల్ కాల్స్‌కి ప్రస్తుతం నిమిషానికి రూ.1గా ఉన్న గరిష్ట టారిఫ్ పరిమితిని 65 పైసలకు తగ్గించాల్సి ఉంటుంది. ఇక నిమిషానికి రూ. 1.5గా ఉన్న ఎస్టీడీ కాల్స్ చార్జీలు కూడా రూ.1కి తగ్గుతాయి. మరోవైపు ఇన్కమింగ్ కాల్స్‌కి సంబంధించి ప్రస్తుతం టెల్కోలు గరిష్టంగా 75 పైసలు వసూలు చేస్తుండగా దీన్ని 45 పైసలకు తగ్గించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అలాగే, లోకల్ ఎస్ఎంఎస్లకు ప్రస్తుతం రూ. 1గా ఉన్న టారిఫ్‌ను 20 పైసలకు తగ్గించాలని పేర్కొంది. ఈ సిఫార్సులపై టెల్కోలు మార్చి 13లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
ఎస్సెమ్మెస్‌తో పవర్ ఆన్.. ఆఫ్
రూపొందించిన వరంగల్ జిల్లా యువ ఇంజనీర్ ఆత్మకూరు : ఒక్క ఎస్సెమ్మెస్.. టెక్ట్స్ అయినా, వాయిస్ అయినా ఇట్టే పవర్ ఆన్ అవుతుంది... ఆఫ్ అవుతుంది. ఏ ఊర్లో ఉన్నా ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేయొచ్చు.. ఆఫ్ చేయొచ్చు. దీన్ని ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఓ యువ ఇంజీనీరింగ్ రూపొం దించాడు. గ్రామానికి చెందిన తోట రాజ్‌కుమార్ పెంబర్తిలోని విద్యాభారతి ఇంజినీరింగ్‌కళాశాలలో 2011లో బీటెక్(ఈసీఈ) పూర్తిచేశాడు. ఈఏడాది వరంగల్‌లోని పాత్‌ఫైండర్ కాలేజీలో ఎంటెక్ పూర్తిచేశాడు. ఇతను ఎస్సెమ్మెస్ ద్వారా పవర్ ఆన్.. ఆఫ్ విధానాన్ని రూపొందించాడు. ఈపరికరాన్ని ఎలా రూపొందించాడో అతని మాటల్లోనే...‘మనం నిజజీవితంలో వాడే ఫ్యాన్, బల్బ్ తదితర విద్యుత్ ఉపకరణాలను స్విచ్‌ల ద్వారా కాకుండా మెస్సేజ్, వాయిస్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. బ్లూ టూత్ లేదా ఏఎంఆర్ వాయిస్ అనే అప్లికేషన్‌తో వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. 8051 మైక్రో కంట్రోల్ పరికరంతో మన ఇంట్లో వస్తువుల అనుసంధానం ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ఎంబడ్డెడ్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఎల్సీడీ, క్రిస్టల్ ఆస్కిలేటర్, 8051 మైక్రో కంట్రోలర్, జీఎస్ఎం సెట్, మ్యాక్స్232, పీసీ, బ్లూటూత్, రిలేస్, ఫ్యాన్, లైట్ ఉపయోగించాలి. దీనిలో జీఎస్ఎం సెట్ చేసి ఉంటుంది. ఇందులో ఒక సిమ్‌కార్డు ఉంచి ఆనబర్కు మెసేజ్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఏఆర్ఎంటీ(ఎల్పీసీ2148) ప్రాసెసర్ ఫిక్స్ చేయబడి ఉండి మన ఆదేశాలను తీసుకొని బైనరీ ఫామ్‌కు మార్చుకొని మనకు అవుట్‌పుట్‌ని అందిస్తాయి. దీన్ని ఇంటర్నెట్ మరియు మొబైల్ద్వారా ఎస్సెమ్మెస్ చేసి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. వాయిస్ కంట్రోల్ అయితే 20 మీటర్ల దూరం నుంచి బ్లూటూత్సహాయంతో , ఆటోమేటిక్ కాల్లిఫ్టర్, జీఎస్ఎం సెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఈపరికరంతో బహుళ అంతస్తుల భవనాలు, కంపెనీలు, షోరూంలు, సంస్థలు, గృహాల్లో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా లబ్ధి పొందవచ్చు.’ తనకు ఆర్థికసాయం చేస్తే ఈపరికరాన్ని మార్కెట్లోకి తీసుకువస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. -
ఎస్ఎంఎస్తో బస్సు వేళలు
జీపీఎస్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఆర్టీసీ సరికొత్త ప్రయోగం సిటీ వోల్వో బస్సులతో మొదలు కొద్దిరోజుల్లో ఫోన్ నంబర్ కేటాయింపు త్వరలో అన్ని బస్సులకు విస్తరించే యోచన సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు సరిగ్గా ఏ వేళకు వస్తాయో తెలుసుకోవడం కష్టం. బస్టాండులోకి అవి ఎప్పుడు వస్తాయో ఒక్కోసారి అధికారులకే అంతుబట్టదు. కానీ ఇప్పుడు ఈ వేళలను కచ్చితంగా చెప్పటమే కాదు... ఆయా బస్సులు ఎక్కాల్సిన ప్రయాణికులు అవి బస్టాండులోకి కచ్చితంగా ఎంతసేపటిలో వస్తాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. బస్సుల్లో జీపీఎస్, జీపీఆర్ఎస్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో... బస్సులు సరిగ్గా ఎక్కడున్నాయో, అవి బస్టాండ్లలోకి చేరటానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవటం అధికారులకు సులభంగా మారనుంది. కేవలం వాటి వివరాలను తాము తెసుకుకోవటం కోసం ఉద్దేశించిన ఈ ఆధునిక పరిజ్ఞాన వ్యవస్థను ప్రయాణికులకు సమాచారం అందజేసేందుకు కూడా వినియోగించాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోసం తొలుత భాగ్యనగరంలో తిప్పుతున్న మెట్రోలగ్జరీ ఏసీబస్సులతో ప్రారంభించబోతున్నారు. ఎస్ఎంఎస్ చేస్తే చాలా సమాచారం ఇటీవలే ఆర్టీసీ 80 వోల్వో బస్సులను ప్రీమియం కేటగిరీ సర్వీసులుగా నగరంలో ప్రవేశపెట్టింది. వీటన్నింటిని జీపీఎస్, జీపీఆర్‌ఎస్‌లతో అనుసంధానించింది. దీంతో ఆ బస్సులెక్కడున్నాయి, ఏ ప్రాంతం వైపు పయనిస్తున్నాయి, అవి గమ్యస్థానానికి ఎంతసేపటిలో చేరతాయో కచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు. దూర ప్రాంతాల మధ్య ఇవి తిరుగుతున్నందున ప్రయాణం సులభంగా, సౌఖ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికోసం కొత్తగా ఎస్ఎంఎస్ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. తాము ఎక్కాలనుకున్న బస్సు నిర్ధారిత బస్టాప్‌లోకి ఎంతసేపటిలో వస్తుందో నిమిషాలతో సహా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును ప్రయాణికులకు కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంసీ సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇది సిద్ధం కావటంతో త్వరలో దాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రయాణికులు ఎస్ఎంఎస్ పంపేందుకు ప్రత్యేకంగా ఓ నంబర్‌ను మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా అందిన సమాచారం మేరకు ప్రయాణికులు సరిగ్గా బస్సు వచ్చే వేళకు బస్టాప్‌నకు చేరుకునే వీలు చిక్కుతుంది. త్వరలో జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లో కూడా జీపీఎస్, జీపీఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఈ ఎస్ఎంఎస్ విధానాన్ని వాటిల్లో కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
ఎస్ఎంఎస్లతో ప్రయాణీకుల ఫిర్యాదుల స్వీకరణ
ఆర్టీసీ నిర్ణయం.. నెల రోజుల్లో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులు బస్సుల్లో ఎదుర్కొంటున్న తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ ఎస్ఎంఎస్ (సంక్షిప్త సమాచారం) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా మొబైల్ ఫోన్ల నుంచి బస్సుల్లో ప్రయాణిస్తూనే క్షణాల్లో డిపో మేనేజర్లకు సమస్యల్ని తెలియజేయవచ్చు. ఈ విషయాల్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ముక్కాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎంఎస్ పంపిన కొన్ని క్షణాల్లో ఫిర్యాదు ర సీదు నెంబర్‌ను తిరిగి ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు దారునికి పంపిస్తారు. ఈ కొత్త పద్ధతిని రావులపాటి టెక్ హబ్ సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల్లో ప్రవేశపెడతారు. ఎస్ఎంఎస్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే సైట్లు, వెబ్ పోర్టల్ వివరాలను త్వరలో తెలియజేస్తామని వివరించారు. -
తుపానుకు ముందు... ఎస్సెమ్మెస్
న్యూఢిల్లీ: తుపాను, సునామీ లాంటి వాతావరణ ఉపద్రవాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎస్సెమ్మెస్‌ల ద్వారా హెచ్చరించే కొత్త విధానాన్ని కేంద్రం గురువారం ప్రారంభించింది. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీనిని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎస్సెమ్మెస్ ద్వారా కేవలం సమాచారమివ్వడమే కాకుండా ఉపద్రవాల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సూచనలు కూడా ఇస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఒక ఏడాది సమయం పడుతుందన్నారు. ఎస్సెమ్మెస్ హెచ్చరికలు కావాలనుకునే వారు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
రైల్వే గ్రీవెన్స్‌కు ఒక్క ఎస్సెమ్మెస్ చాలు
8121281212 నంబర్‌కు విశేష స్పందన ఠమూడేళ్లలో లక్షా 50 వేల ఫిర్యాదులు సిటీబ్యూరో: ఒకే ఒక్క ఎస్సెమ్మెస్. క్షణాల్లో స్పందన.. కచ్చితమైన పరిష్కారం. దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ప్రయాణికుల నుంచి వెల్లువెత్తే ఫిర్యాదులకు పరిష్కార వేదిక...‘8121281212’. ఈ నెంబర్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని ప్రవేశపెట్టిన మూడేళ్లలో లక్షా 50 వేల ఫిర్యాదులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందాయి. వాటిలో 80 శాతానికిపైగా అధికారులు పరిష్కరించారు. సలహాలు, సూచనలు, సమస్యలపై ఫిర్యాదులు... ఇలా అనేక రకాల ఎస్సెమ్మెస్‌లపై దక్షిణమధ్య రైల్వేలోని వివిధ విభాగాలు వెంటనే స్పందించి పరిష్కారాన్ని చూపుతున్నాయి. ట్రైన్‌కు, ప్రయాణికుడికి మధ్య ఏర్పడిన ఈ గ్రీవెన్స్ బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... వేగంగా దూసుకెళ్తున్న సికింద్రాబాద్-బెంగ ళూర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో ఉన్నట్టుండి కలకలం మొదలైంది. ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. ప్రయాణికులు చాలామంది ఉన్నా ఏం చేయాలో తోచలేదు. ఓ ప్రయాణికుడు ‘8121281212’ నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేశాడు. రైలు సమీపంలోని స్టేషన్‌కు చేరుకునే సమయానికి అక్కడ వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇది ఇటీవల జరిగిన సంఘటన. ఎంఎంటీఎస్ హైటెక్‌సిటీ నుంచి నాంపల్లి వైపు వెళ్తుంది. రెండు, మూడు బోగీలకు తలుపులు సరిగ్గా పని చేయడం లేదు. ఎక్కడానికి, దిగడానికి కష్టంగా ఉందని ఓ ప్రయాణికుడు ఎస్సెమ్మెస్ చేశాడు. అధికారులు వెంటనే స్పందించడంతో రెండు రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారమైంది. ఇలా ఇతర సమస్యలపై కూడా ఎస్సెమ్మెస్ చేయవచ్చు. ఫిర్యాదులు ఇలా.. 8121281212 నంబర్‌కు ప్రయాణికులు ఎస్సెమ్మెస్ చేస్తారు. ఈ సమాచారాన్ని సెంట్రల్ సర్వర్ స్వీకరిస్తుంది. ప్రయాణికులకు కేటాయించిన యూనిక్ ఐడీ నంబర్‌కు వెంటనే సమాచారం అందుతుంది. ప్రయాణికుల నుంచి స్వీకరించిన ఫిర్యాదు/సలహాలను సంబంధిత విభాగానికి చేరవేస్తారు. ఈ వ్యవస్థ డివిజన్ స్థాయి అధికారుల నుంచి జోనల్ స్థాయిలోని ఉన్నతాధికారుల వరకు కేంద్రీకృతమై ఉంటుంది. -
అసభ్య మెసేజ్‌లు పంపిన ఉద్యోగికి దేహశుద్ధి
హైదరాబాద్ : సెల్‌ఫోన్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఓ రైల్వే ఉద్యోగికి.. టీఆర్ఎస్ మహిళా డివిజన్ అధ్యక్షురాలు వసంతకుమారి దేహశుద్ధి చేశారు. గత కొంతకాలంగా ఓ రైల్వే ఉద్యోగి.. వసంతకుమారికి...ఫోన్లో వేధింపులతో పాటు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నట్లు సమాచారం. దాంతో విసిగిపోయినా ఆమె...అతగాడిని గురువారం బోయిన్‌పల్లికి రమ్మని పిలిచింది. అక్కడ వచ్చిన ఉద్యోగికి దేహశుద్ది చేసిన ఆమె అనంతరం తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘రవాణా’లో ఇక ఎస్ఎంఎస్లు
తెలంగాణలో ‘నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు’ ప్రధాని మోదీ ఆదేశం మేరకు షురూ దేశంలోనే తొలిసారి అమలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతోంది. పారదర్శక సేవలకు మెరుగులు పెడుతోంది. మరింత వేగంగా...మరెంతో బాధ్యతాయుతంగా నిత్యవ్యవహారాలను చక్కబెట్టబోతున్నది. దీంతో చాంతాడంత ‘క్యూ’లు, గంటలతరబడి వెయిటింగులు ఉండవు. చిటికెలో వ్యవహారాలను పూర్తిచేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఎస్ఎంఎస్ల ద్వారా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ‘ఎస్’ అంటూ ముందుకుపోతోంది. పరిపాలనలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వర, అత్యుత్తమ సేవలను అందజేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాన్ని రాష్ట్ర రవాణాశాఖ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాను అందించే అన్ని సేవలను సెల్‌ఫోన్ సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్)తో అనుసంధానించింది. ముఖ్యమైన విషయాలపై ముందస్తుగా అప్రమత్తం చేయడం, పని పూర్తి అయితే ఆ సమాచారాన్ని చేరవేయడం, ఏవైనా సమాచారం అవసరమైతే దానిపై వివరాలు కోరడం వంటివన్నీ మెస్సేజ్‌ల ద్వారానే చేసే పద్ధతికి శ్రీకారం చుట్టింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు’ను రవాణాశాఖలో అమలుచేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకున్న రవాణాశాఖ తాజాగా దాని అమలును ఆరంభించింది. దీనికి సంబంధించి వాహనదారుల సెల్‌ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇక నుంచి అన్ని లావాదేవీల్లో ఫోన్‌నంబర్లు నమోదు చేసుకోబోతున్నారు. గతంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయిన వారి నంబర్లు క్రోడీకరిస్తున్నారు. ఏదేని పనికోసం రవాణాశాఖకు వస్తే ముందుగా వారి నంబర్ నమోదు చేయిస్తున్నారు. ఏం చేస్తారు..ఎలా చేస్తారు ...? కొత్తవాహనం రిజిస్ట్రేషన్ కాగానే అది ఎస్ఎంఎస్ రూపంలో వాహనదారు సెల్‌ఫోన్‌కు చేరుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తేదీ, సమయం, వాహనం నంబర్, ఇతర వివరాలన్నీ అందులో ఉంటాయి. కోరిన నంబర్‌ను రిజర్వ్ చేసుకుంటే దాని వివరా లు కూడా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. చాలామందికి నంబర్ రిజర్వ్‌కు ఫీజు ఎంతో తెలియదు. ఏజెంట్ కోరినంత ముట్టజెప్పుతారు. ప్రస్తుతం ఫీజు ఈ ఎస్ఎంఎస్లో స్పష్టంగా ఉంటుంది. రవాణాశాఖకు చెల్లించాల్సిన పన్నులు బకాయిపడితే వాటిని చెల్లించాల్సిన గడువును పేర్కొంటూ ఎస్ఎంఎస్ పంపుతారు. ముందుగానే వాహనదారులను అప్రమత్తం చేస్తారు. వాహన పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు దగ్గరపడితే వాటిని రెన్యూవల్ చేసుకోవాలని సూచిస్తారు. వయసు ఆధారంగా లెసైన్స్ గడువు తీరుతుంటే ఎప్పటిలోగా రెన్యూవల్ చేసుకోవాలో సమాచారం పంపుతారు. వాహనదారు దరఖాస్తులను పెండింగులో పెట్టకుండా, అదనపు సమాచారం కోసం ఎస్ఎంఎస్లు పంపుతారు. స్పందన బాగుంది: పాండురంగ నాయక్, జేటీసీ ‘ఈ కొత్త విధానం ఇటీవలే అమలులోకి వచ్చింది. దీనికి మంచి స్పందన ఉంది. పనుల్లో జాప్యం లేకుండా, పారదర్శకతకు అవకాశం కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు సమాచారం సెల్ఫోన్లో కనిపిస్తుండడంతో వాహనదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా సేవలను మరింత విస్తరించి వాహనదారులు సులభంగా ఆయా పనులు పూర్తి చేసుకునేలా చూస్తాం’ -
ఉక్కు ఎస్ఎంఎస్లో ఉత్పత్తి బంద్
నిలిచిపోయిన మరో కన్వర్టరు రెండు వారాలు ఉత్పత్తికి విఘాతం విశాఖపట్నం: విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్టీల్ మెల్ట్ షాప్-2లోని కన్వర్టర్-1 కూడా మరమ్మత్తులకు గురి కావడంతో విభాగంలో ఉత్పత్తి నిలిచిపోయింది. 13రోజుల పాటు ఉత్పత్తికి అంతరాయం కలగనున్నది. దీని ప్రభావం వల్ల విభాగం వార్షిక లక్ష్యాలకు తీవ్ర విఘాతం కలగనున్నది. వారం రోజుల క్రితం విభాగంకు చెందిన కన్వర్టర్-2కు రంధ్రం పడటంతో ఆ కన్వర్టర్ నిలిచిపోయిన విషయం విదితమే. ఒక్క కన్వర్టర్‌తో ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న మొదటి కన్వర్టర్‌కు చెందిన షెల్ హీట్ పెరిగిపోవడం గమనించారు. రిఫ్రాక్టరీ లైనింగ్ పాడైందని గుర్తించి దానిని మరమ్మతులకు అందించారు. విభాగం కన్వర్టర్లకు అవసరమైన రిఫ్రాక్టరీ బ్రిక్స్ సరఫరా లేకపోవడం వల్ల ఈ పరిస్ధితి తలెత్తినట్టు సమాచారం. రెండో కన్వర్టర్‌కు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తికావడానికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. విభాగంలో రెండు కన్వర్టర్లు ఉండగా కేవలం ఒక కన్వర్టర్‌కు సరిపడా రిఫ్రాక్టరీ మెటీరియల్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రెండో కన్వర్టర్‌కు చెందిన లైనింగ్‌ను మొదటి కన్వర్టర్‌కు అమర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్‌ను సకాలంలో సరఫరా చేయకపోవడం, యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
ఆ కంటికి చిక్కకూడదంటే..!
వాయనం ఆమధ్య ఢిల్లీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కారణం... ఆమె ఓ షాపింగ్ మాల్లో దుస్తులు మార్చుకుంటుండగా తీసిన ఓ వీడియో, ఎమ్మెమ్మెస్ రూపంలో దర్శనమివ్వడం! తర్వాత కొన్ని రోజులకే.. తన భర్తతో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను ఇంటర్నెట్లో చూసి షాకయిన ఓ ఇల్లాలు విషం తాగింది. చాలాసార్లు మనం మాత్రమే ఉన్నామనుకుంటాం. కానీ ఓ రాక్షసకన్ను మనల్ని గమనిస్తూ ఉంటుంది. అదెక్కడో దాగివుంటుంది. మనకు తెలియకుండానే మన పరువుని, అభిమానాన్ని బజార్లో పెట్టేస్తుంది. ఆ కన్ను... సీక్రెట్ కెమెరాది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఆఫీసుల్లోని బాత్రూముల్లో.. ఎక్కడైనా ఉండొచ్చు ఇవి. వాటికి చిక్కకుండా ఉండటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని మహిళలంతా తెలుసుకుని తీరాలి. * ట్రయల్ రూమ్స్, బాత్రూమ్స్, హోటల్ గదుల్లోకి వెళ్లిన వెంటనే... ఫ్లవర్ వాజులు, ఫొటో ఫ్రేములు, అద్దాలు, టేబుల్ ల్యాంప్స్... ఏవి ఉన్నా వాటిని పరీక్షించండి. ఎక్కు వగా వీటిల్లోనే కెమెరాలను పెడతారు. * హోటల్ గదుల్లోని సోఫా కుషన్లు, దిండ్లను అటూ ఇటూ తిప్పి చూడండి. ప్రతి అల్మరానీ తెరిచి చూడండి. టేబుల్, టీపాయ్‌ల అడుగున పరిశీలించండి. ఈ ప్రదేశాలు మీనియేచర్ కెమెరాను అమర్చడానికి అనువైనవి. * వైర్లు కనిపిస్తే... అవి దేనికి సంబంధించినవో పరిశీలించండి. * గదిలో లైటు తీసేసి చుట్టూ పరిశీలించండి. పచ్చ లేక ఎర్రటి ఎల్ఈడీ లైట్‌లాంటిది కనిపిస్తే కెమెరా ఉన్నట్టు. * సెల్ఫోన్లో ఏదైనా నంబర్ డయల్ చేయండి. సిగ్నల్ ఉన్నా కాల్ వెళ్లకపోతే కెమెరా ఉన్నట్టే. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉన్నచోట కాల్స్ వెళ్లవు. * ఈమధ్య అద్దాల వెనుక కెమెరాలు పెట్టడం ఎక్కువయ్యింది. కాబట్టి అద్దం దగ్గరకు వెళ్లి, చూపుడు వేలును అద్దం మీద అదిమి పెట్టండి. మీ వేలికి, అద్దానికి మధ్య గ్యాప్ కనిపిస్తే అది మంచి అద్దమే. అలా కాకుండా మీ వేలిని ప్రతిబింబం తాకుతుంటే మాత్రం అది టూవే మిర్రర్ అన్నమాట. మామూలు అద్దానికున్నట్టు వీటి వెనుక సిల్వర్ కోటింగ్ ఉండదు. కాబట్టి ఆ అద్దంగుండా మిమ్మల్ని అవతలివాళ్లు చూడగలరు. కానీ, అవతలున్నవాళ్లు మాత్రం మీకు కనిపించరు. వీటిని గుర్తించడానికి మరో మార్గం... లైటు తీసేసి, అద్దంలోకి సెల్‌ఫోన్ ద్వారా గానీ, టార్చ్ ద్వారా గానీ లైటు వేయండి. వెనుక కెమెరా ఉంటే కనిపిస్తుంది. * పిన్‌హోల్ కెమెరాలని ఉంటాయి. వీటిని సాధారణంగా గోడల్లో అమరుస్తారు. వీటిని కనిపెట్టడానికి ఓ చిన్న గొట్టం (టిష్యూ రోల్స్ ఉంటాయి కదా. దాని మధ్య ఉండే గొట్టం చాలు), ఓ టార్చ్ కావాలి. లైటు తీసేసి, గొట్టాన్ని ఓ కంటి దగ్గర పెట్టుకుని, రెండో కన్నుమూసి, గదంతా టార్చ్‌లైట్ వేసి చూడండి. ఎక్కడైనా కెమెరా ఉంటే, రిఫ్లెక్షన్ వస్తుంది. -
ఆప్స్... మేడిన్ ఇండియా!
స్మార్ట్ఫోన్లు వచ్చేశాక పనులు ఎంత సులువయ్యాయో! ఫిట్నెస్ చెక్ చేసుకునేందుకో ఆప్... ఆఫీసు పనుల కోసం మరోటి.. మూవీలు, బస్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు మరికొన్ని... ఇలా ఎన్ని రకాల అప్లికేషన్లో. మరి.... వీటిల్లో మేడిన్ ఇండియా ఆప్స్ ఏవో మీకు తెలుసా? బోలెడన్ని ఉండే ఉంటాయిగానీ.. వాటిల్లో కొన్ని బెస్ట్ ఏవో చూసేద్దాం... హైక్ మెసెంజర్ ఇది వాట్సప్ మాదిరిగా మెసెంజర్ అప్లికేషనే. ఎస్ఎంఎస్, ఇన్స్టంట్ మెసేజింగ్‌లు కలిసి ఉంటాయి దీంట్లో. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు ఎస్ఎంఎస్లు పంపేందుకు కూడా ఉపయోగపడటం దీని ప్రత్యేకత. పీడీఎఫ్ ఫైళ్లతోపాటు వర్డ్డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో ఫైళ్లు అన్నింటినీ ఈ అప్లికేషన్ ద్వారా పంపుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఈమెయిల్ అవసరం లేకుండా పోతుంది. వంద మెగాబైట్ల సైజున్న ఫైళ్లను కూడా సులువుగా షేర్ చేసుకునేలా ఏర్పాట్లున్నాయి. అంతేకాదు. మీరు వైఫై ద్వారా పంపే సమాచారం భద్రంగా ఉండేలా చూసేందుకు 128 బిట్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తారు. భారతీ ఎయిర్టెల్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల ‘భారతీ సాఫ్ట్‌బ్యాంక్’ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సూపర్‌హిట్. గూగుల్ ప్లే స్టోర్‌లో చూస్తే దాదాపు 9.5 లక్షల డౌన్లోడ్లున్నట్లు తెలుస్తుంది. కెమెరా ప్లస్ ఇది ఓ ఫొటో ఎడిటింగ్ అప్లికేషన్. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. కాకపోతే దీనికో ప్రత్యేకత ఉంది. ఫొటోను మీకు కావాల్సిన రెజల్యూషన్‌లో తీసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా రెజల్యూషన్ 8 మెగాపిక్సెల్స్ ఉన్నప్పటికీ అవసరమనుకుంటే మీరు 2 ఎంపీ రెజల్యూషన్తోనే ఫొటో తీయవచ్చు. వాల్యూమ్ బటన్స్‌ను ఉపయోగించుకుని రెజల్యూషన్‌లో మార్పులు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎక్స్‌పోజర్‌తోపాటు అనేక ఇతర కంట్రోల్స్ అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్‌ను ఉపయోగిస్తే మీరు తీసే ఫొటోలపై పదాలను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ధర దాదాపు రూ.120. రియల్ క్రికెట్ -14 క్రికెట్ అంటే మన దేశంలో ఎంత అభిమానమో మనకు తెలియంది కాదు. నౌటిలస్ మొబైల్ అనే సంస్థ ఈ క్రేజ్‌ను మొబైల్ఫోన్లలోకి తీసుకువచ్చింది రియల్ క్రికెట్ 14 అప్లికేషన్ ద్వారా. బంతి బౌల్ చేసేటప్పుడు దాని వెనుక దాగి ఉన్న భౌతికశాస్త్ర సూత్రాలను విడమరచడంతోపాటు దాదాపు 27 రకాల షాట్లకు సంబంధించిన వివరణలు ఉన్నాయి దీంట్లో. టీమ్ సెలెక్షన్‌తోపాటు ఫీల్డ్ ప్లేస్మెంట్ వరకూ అన్నీ సులువుగా నియంత్రించవచ్చునని, ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి దాదాపు 15 ఆప్షన్లు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు 16 దేశాలకు చెందిన 8 మాస్టర్ జట్లు ఉంటాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆర్ట్‌వర్క్‌తో వచ్చే క్రికెట్ గేమ్ అనుభూతిని మిగులుస్తుందని అంటోంది కంపెనీ. సెన్ఈజీ ఈ సైన్ఈజీ అప్లికేషన్ వ్యాపారులకు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు భలే ఉపయోగపడుతుంది. మీరు ప్రపంచంలో ఏ మూలనున్నా మీ ఆఫీస్ దస్తావేజులపై ఈ అప్లికేషన్ ద్వారా సంతకం పెట్టవచ్చునంటే మీ పని సులువైనట్లే కదా...! ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి వాటి ద్వారా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవడం... సంతకం పెట్టాల్సిన చోట స్క్రీన్‌పైనే సంతకం పెట్టేయడం సాధ్యమవుతుంది ఈ అప్లికేషన్‌తో. వర్డ్ డాక్యుమెంట్‌తోపాటు పీడీఎఫ్, జెపీఈజీ, హెట్టీఎంఎల్, పీఎన్జీ, టీఐఎఫ్ఎఫ్ వంటి అనేక ఫార్మాట్ల డాక్యుమెంట్లను సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 60 వేల మంది ఈ అప్లికేషన్‌ను డబ్బుకట్టి మరీ ఉపయోగించుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి సునీల్ పాత్రో దీన్ని అభివృద్ధి చేశారు. ఫ్లిక్ టెన్నిస్ ఆపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం రోలోక్యూల్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. స్టోరీ, ఎగ్జిబిషన్, హెడ్ టు హెట్ అనే మూడు రకాలుగా టెన్నిస్ గేమ్ ఆడవచ్చు. స్టోరీ పద్ధతిలోనైతే చిన్నపాటి డ్రామా ఉంటుంది. మీరు ఊహాజనిత పాత్రను పోషిస్తూ... ఆ కథకు తగ్గట్టుగా టెన్నిస్ నేర్చుకుంటరు. లక్ష్యాన్ని సాధిస్తారు. డబుల్స్, సింగిల్స్ విభాగాలుంటాయి. ప్రాక్టీస్ కోర్టులు మొదలుకొని స్టేడియమ్‌ల వరకూ దాదాపు 11 రకాల కోర్టులను ఎంచుకోవచ్చు. డెక్ ఆఫీసు ఉద్యోగుల ఉత్పాదకత పెంచే అప్లికేసన్ ఇది. టాబ్లెట్ల ద్వారా ప్రెజెంటేషన్లు తయారు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఐఐఎం బెంగళూరు విద్యార్థి సుమంత్ రాఘవేంద్ర అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ రెండేళ్ల క్రితమే క్వాల్కమ్ క్యూప్రైజ్ అవార్డును సంపాదించింది. గ్రాఫిక్స్పాటు టైపోగ్రఫీ, యానిమేషన్ వంటి ప్రెజెంటేషన్ సంబంధిత కార్యకలాపాలన్నీ చాలా సులువుగా చేసుకునే వీలుకల్పించే ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. -
అధిక విలువ చెక్కుల చెల్లింపుల్లో జాగ్రత్త: ఆర్బీఐ
ముంబై: అధిక విలువ చెక్కులకు సంబంధించి చెల్లింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. చెక్కు సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆర్బీఐ ఈ విషయంలో బ్యాంకులను అప్రమత్తం చేసింది. ఫోన్ కాల్ ద్వారా అకౌంట్ హోల్డర్లను అలర్ట్ చేయాలని, నాన్ హోమ్ చెక్కుల విషయంలో బేస్ బ్రాంచ్ని సంప్రదించాలని కూడా సూచించింది. 2 లక్షల పైబడిన చెక్కుల చెల్లింపు విషయంలో చెక్కు ఇచ్చిన వారికి, సంబంధిత సొమ్ము తీసుకునే వారికి ఎస్ఎంఎస్ అలర్ట్ చేయాలని పేర్కొంది. యూవీ ల్యాంప్ కింద చెక్కును క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొంది. రూ.5 లక్షల పైబడిన చెక్కు చెల్లింపుల్లో బహుళ స్థాయిలో చెకింగ్ ప్రక్రియ అవసరమని పేర్కొంది. పూర్తి అప్రమత్తం ద్వారా మోసాలను అరికట్టడానికి తగిన ప్రయత్నాలు చేయాలని పేర్కొంది. -
సేవ్ ద పవర్
గ్రేటర్లో విద్యుత్ పొదుపునకు శ్రీకారం ఏసీలు బంద్ హోర్డింగ్‌లకు రాత్రి 7 నుంచి 10 గంటల వరకే లైట్లు త్వరలో నగరమంతా ఎల్ఈడీ లైట్లు వీధి దీపాలకు 60 మెగావాట్ల నుంచి 24 మెగావాట్లకు తగ్గనున్న విద్యుత్ వాడకం ప్రజలకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా విజ్ఞప్తి రైతుల కోసమే విద్యుత్ పొదుపు మంత్రం అంటున్న జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతున్న వేళ... నగరంలో విద్యుత్ పొదుపు పాటించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. విద్యుత్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్న తరుణంలో వీలైనంత వరకు తమ పరిధిలో విద్యుత్ ఆదా చర్యలకు సిద్ధమైంది. అవసరమున్న మేరకే విద్యుత్‌ను వినియోగించాలని వివిధ యాజమాన్యాలకు సూచించింది. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనూ, హోర్డిం గ్లు, వీధిదీపాల్లోనూ విద్యుత్ ఆదా చర్యలకు శ్రీకారం చుట్టింది. కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కనీసం రానున్న 15 రోజులపాటు విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సోమవారం ఆయా వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రకటనల సంస్థలు, హోటళ్లు, ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దిగువ నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. ఖరీఫ్ పంట దిగుబడికి రానున్న రెండు వారాలు అత్యంత కీలకమైనందున 15 రోజులపాటు విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించాలి. షాపింగ్‌మాల్స్, హోర్డింగులు, వాణిజ్యసంస్థలు, సినిమా థియేటర్లలో విద్యుత్ దుబారా తగ్గించాలి. ఏసీలు, అధిక విద్యుత్ వినియోగమయ్యే లైట్లు వాడొద్దు. హోర్డింగులకు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకే లైట్లు వాడాలి. మూడు నెలల్లో నగరమంతటా ఎల్ఈడీలు.. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో ఏర్పాటు చేసిన 748 ఎల్ఈడీ లైట్లతో దాదాపు 60 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతున్నట్లు తెలిసింది. నగరమంతా వీటిని ఏర్పాటు చేస్తే ఎంతో విద్యుత్ ఆదా కానుంది. ఈ మేరకు మూడునెలల్లోగా నగరంలోని అన్ని మార్గాల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు చర్యలు. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో త్వరలోనే అమలు. ప్రస్తుతం నగరంలో ఉన్న దాదాపు 3.50 లక్షల వీధిదీపాలకు 59 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. ఎల్ఈడీ లైట్లతో ఇది 24 మెగావాట్లకు తగ్గుతుంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే వీధిదీపాలు వెలిగేందుకు కేంద్రీకృత విధానం. కంప్యూటరీకరణ ద్వారా ఆన్ /ఆఫ్‌కు చర్యలు. హోర్డింగ్‌లకూ ఎల్ఈడీ తప్పనిసరి ఇకపై అనుమతినివ్వబోయే హోర్డింగ్‌లకు, లైట్లను వాడే ప్రకటనలకూ ఎల్ఈడీలనే వాడాలనే నిబంధన అమలు చేస్తారు. వాడని పక్షంలో అనుమతులివ్వరు. పాతవాటి రెన్యూవల్స్ చేయించుకోవాలన్నా ఇదే విధానం వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ నుంచే తొలి అడుగు జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనూ ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఉన్నతాధికారులు విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించాలన్నారు. తమ వద్ద ఫోన్ నెంబర్లున్న 10 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదార్లకు ఎస్ఎంఎస్ల ద్వారా కరెంటు ఆదాపై విజ్ఞప్తి చేస్తామన్నారు. కరపత్రాల ద్వారానూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామన్నారు. విద్యుత్‌ను ఆదా చేయడమంటే.. ఒకరకంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమేనని చెప్పారు. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.నాగరాజు స్పందిస్తూ, తెలంగాణలోని అన్ని హోటళ్ల యాజమాన్యాలకూ ఈమేకు విజ్ఞప్తి చేస్తామని, నగ రంలోని హోటళ్లలో దీనిని అమలు చేసి మిగతావారికి ఆదర్శప్రాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. -
‘సంక్షిప్త’ ఆయుధం!
నేరాల నిరోధం దిశగా మరో అడుగు పోలీసు గ్రూప్ ఎస్ఎంఎస్లో చేరండి వ్యాపారులు, ప్రజలకు సీపీ పిలుపు మహానగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట నేరాలు...ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. నష్టం కలిగాక మేల్కోవడం కంటే... నిరోధించేందుకు యత్నిస్తే... మన పోలీసు ఉన్నతాధికారులు సరిగ్గా ఇదే యోచనతో ఉన్నారు. నేరాలను అరికట్టేందుకు ‘పోలీసు గ్రూప్ ఎస్ఎంఎస్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తద్వారా నేరగాళ్ల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నేరస్తుల అగడాలపై ఎప్పటికప్పుడు అన్ని వర్గాల వారిని అప్రమత్తం చేసేందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ‘పోలీసులు గ్రూప్ ఎస్ఎమ్ఎస్’ పథకానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. చోరీ జరిగాక కేసు నమోదు చేయడం.. ఆ తరువాత దర్యాప్తు చేయడం ఒక ఎత్తయితే అసలు నేరాలు జరగకుండా ముందే జాగ్రత్త పడేందుకు ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేసేందుకు నగర పోలీసులు సరికొత్త ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు ఏదైనా షాపింగ్ సెంటర్లో నేరం జరిగితే నగరంలోని అన్ని షాపింగ్ సెంటర్లను, పోలీసులను ఎస్సెమ్మెస్ ద్వారా అప్రమత్తం చేస్తారు. తద్వారా నిందితులను గుర్తించి, పట్టుకోవడం సులభతరం అవుతుంది. ఒక్కో ఠాణాలో 5 నుంచి 10 వేల వరకు... ఒక్కో ఠాణా పరిధిలో ఐదు వేల నుంచి పదివేల మంది (వ్యాపారులు, ప్రజలు) పోలీసు ఎస్ఎమ్ఎస్ గ్రూప్‌లో చేరాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హోటళ్లు, నగల దుకాణాలు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, మైత్రి కమిటీ మెంబర్స్, మసీద్, దేవాలయం, చర్చి కమిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాధారణ ప్రజానీకం... ఇలా 31 గ్రూప్‌లను గుర్తించారు. వారి సెల్ నంబర్లు సేకరించి పోలీసు గ్రూప్ ఎస్ఎమ్ఎస్లో చేరుస్తారు. ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్‌ను గుర్తిస్తారు. వెంటనే పోలీసులు సంబంధిత గ్రూప్‌నకు ఎస్ఎమ్ఎస్ పంపి అలెర్ట్ చేస్తారు. ఉదాహరణకు ఏదైనా హోటల్లో ఒకరకమైన చోరీ జరిగితే ఆ విషయాన్ని మిగతా హోటల్స్ వారికి వెంటనే తెలియజేస్తారు. సాధారణ ప్రజలు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సెల్ నంబర్‌ను గ్రూప్ ఎస్ఎమ్ఎస్లో నమోదు చేయించుకోవాలని పోలీసుల సూచిస్తున్నారు. అలా నమోదు చేసుకున్న సెల్‌నంబర్‌కు పోలీసులను నుంచి ఎప్పటికప్పుడు నేరాలు జరుగుతున్న తీరుపై అలెర్ట్ ఎస్ఎమ్ఎస్లు వస్తుంటాయి. ఒకేసారి నగరంలోని ఆరు లక్షల మందికి ఎస్ఎమ్ఎస్ పంపే సౌకర్యం ఉంది. నగరంలోని 70 ఠాణాలకు ఈ సౌకర్యం కల్పించారు. ఎస్ఎమ్ఎస్లకు అయ్యే ఖర్చును కేంద్ర ఐటీ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫోమ్యాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) భరిస్తుంది. వీరు అన్ని ప్రభుత్వ శాఖలకు ఎస్ఎమ్ఎస్లను ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం కల్పించారు. ఇదే తరహాలో నగర పోలీసు శాఖకు కూడా ఉచితంగా ఎస్ఎమ్ఎస్ చేసుకునే సౌక ర్యం ఉంది. -
ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఇకపై ఎస్సెమ్మెస్ అలర్ట్ ఇస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 804 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 428 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చైన్‌స్నాచింగ్ పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామన్నారు. ముస్తఫా కేసు దర్యాప్తులో సైనికాధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ కేసును చేధిస్తామని మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఒక్క ఎస్‌ఎంఎస్సే ఇంటికి శ్రీరామ రక్ష
సంగారెడ్డి క్రైం: దొంగతనాలను అరికట్టేందుకు జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా సంగారెడ్డి రూరల్ పోలీసులు ఎస్ఎంఎస్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ముందు (మొబైల్ నంబర్ 70323 04400) ఒక్క ఎస్ఎంఎస్ కొడితే చాలు.. ఆ ఇంటిపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న గురువారం సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ప్రారంభించారు. ‘ఎస్ఎంఎస్ చేయండి రక్షణ పొందండి‘ అనే పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి రూరల్ సీఐ శ్యామల వెంకటేష్ మాట్లాడారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు బీట్లలో పోలీసులు గస్తీ తిరుగుతారన్నారు. ఊర్లకు వెళ్లే ముందు ప్రజలు తమ ఇంటి నంబర్, చిరునామాను 70323 04400కు ఎస్ఎంఎస్ ఇవ్వాలని సూచించారు. అలాగే ఇళ్లలో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులుగానీ పెట్టి వెళ్లవద్దని చెప్పారు. కష్టాల్లో ఉన్న వ్యక్తుల ఇళ్లలోకి వచ్చి శాంతి, మంత్రాలు చేస్తామని చెప్పి మోసం చేస్తుంటారని, అలాంటి వారని నమ్మరాదని సూచించారు. సమావేశంలో ఎస్ఐ బాలస్వామి పాల్గొన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లిలోని ఓ ఇంటి ముందు సీఐ వెంకటేష్ పోస్టర్‌ను అతికించారు. -
ఎస్ఎంఎస్ ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పిన్ నంబరు
పర్యావరణానికి మేలు చేసేలా, పేపర్ వినియోగాన్ని ఉద్దేశంతో బ్యాంకులు ఇప్పటికే ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్స్ను మెయిల్ చేస్తున్నాయి. అయితే, డెబిట్ కార్డు పిన్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబరు)ను మాత్రం డెబిట్ కార్డు హోల్డర్లకు పోస్ట్ ద్వారానే పంపుతున్నాయి. ఈ విషయంలో తాజాగా హెచ్డీఎఫ్సీ మరో అడుగు ముందుకేసింది. పిన్ నంబరును వన్ టైమ్ పాస్వర్డ్ కింద కస్టమర్ మొబైల్ నంబరుకు నేరుగా పంపడాన్ని ఆవిష్కరించింది. దీన్ని గ్రీన్ పిన్‌గా వ్యవహరిస్తోంది. బ్యాంక్ ఏటీఎంలో కస్టమర్ దీన్ని మార్చుకోవచ్చు. -
ఎస్ఎంఎస్లతో వ్యవసాయ సమాచారం
కోలారు : రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా వ్యవసాయ, వాతావరణ, కీటనాశకాల నివారణ తదితర విషయాలను పంపించే వినూత్న విధానాన్ని కోలారు వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో బాగలకోట హార్టికల్చర్ విశ్వవిద్యాలయం చాన్సలర్ డాక్టర్ డీఎల్ మహేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా రైతులు మొబైల్ సేవలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ దిగుబడులు సాధించాలన్నారు. రైతులు 9480696395 నంబర్‌కు మొసేజ్ పంపితే అవసరమైన సమాచారాన్ని కన్నడ భాషలోనే పంపుతారన్నారు. వాతావరణ పరిస్థితులు, సస్యరక్షణ, పురుగు మందుల పిచికారి విధానం, పాడి, పట్టు తదితర అంశాలపై సలహాలు, సూచనల కోసం రైతులు తమ మొబైల్ నంబర్లను వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో తొలిసారిగా వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసింది కోలారులోనేనన్నారు. దక్షిణ వలయ ప్లానింగ్ డెరైక్టర్ శ్రీనాథ్ దీక్షిత్, డాక్టర్ ఏబీ పాటిల్ పాల్గొన్నారు. -
సమస్య ఏదైనా.. ఎస్ఎంఎస్ పంపు
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలికలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా స్వాతంత్య దినోత్సవం పురస్కరించుకొని కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎంఎస్ సేవా సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని మహరాష్ట్రలో మొదటి సారిగా ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఎస్.ఎమ్.ఎస్. సేవా సదుపాయాలు చేపట్టారు. దీంతో 100 శాతం క్లీన్ సిటీగా యావత్ భారత దేశంలో పేరుగాంచిన విషయం తెలిసిందే. దీని స్ఫూర్తిగా తీసుకున్న భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక కమిషనర్ జీవన్ సోనావునే ఎస్ఎంఎస్ సేవల సదుపాయాన్ని కల్పించారు. గతంలో ఇలా.. కార్పొరేషన్ పరిధిలో ఐదు ప్రభాగ్ సమితి కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో ఉన్న సమస్యలైన చెత్త పేరుకొని పోవడం, మురికి కాలువల శుభ్రత, విష క్రిమికీటనాశక మందులు వెదజల్లుట, వీధి దీపాలు, మంచినీటి సమస్య, మరుగు దొడ్ల అపరి శుభ్రత తదితర సమస్యలపై ఆయా కార్యాలయాలల్లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేవారు. ప్రస్తుతం పట్టణంలో జన సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతోపాటే సమస్యలు కూడా అధికమయ్యాయి. సమస్యల పరిష్కారానికి కార్పోరే షన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాల్సి ఉండేది. ఈ ఫిర్యాదులను అందుకుని పనులు నిర్వహించే వరకు కనీసం నాలుగైదు రోజులు పట్టేది. అలా సమయం వృథా కావడంతోపాటు ప్రజలు ఇబ్బందులు తొలగిపోలేదు. ప్రస్తుతం ఇలా.. కానీ ఇప్పుడు కమిషనర్ సోనావునే ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించడానికి మొబైల్ నంబర్‌ను (9970001312) ప్రకటించారు. సంబంధించిన సమస్యను టైపు చేసి ఎస్ఎంఎస్ చేయవచ్చుని, ఇంకా 10 భాగాలకు ఇంటర్‌కం సదుపాయాలు కల్పించామని కమిషనర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా ముబైల్ వాడుతున్నారని, వారికి కలుగుతున్న సమస్యలను వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఇది ఖర్చుతో కూడిన పని కాదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.