తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది.