SSC Exam Results
-
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
AP SSC Results 2023: నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది..బాలురు 3,09,245 మంది ఉన్నారు. https://www.sakshieducation.comలో ఫలితాలను చూడవచ్చు. -
ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్ 6న)నాటికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. -
పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా
ఛండీగఢ్: ఆయన ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. ఒక్క సబ్జెక్ట్‌తో ఆయన పదో తరగతి అర్ధంతరంగా ఆపేసిన ఆయన ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌లో ఇప్పుడు పాసయ్యాడు. దీంతో ఆయన పదో తరగతి గండాన్ని గట్టెక్కాడు. ఆయనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా. తాజాగా శనివారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించాడు. చౌతలా ఇటీవల 12వ తరగతి పాసయ్యాడు. అయితే ఆయన పదో తరగతి పాస్ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఆయన ఇంగ్లీశ్ సబ్జెక్ట్‌తో పదో తరగతి చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతలా ఇంగ్లీశ్ పరీక్ష రాశాడు. తాజాగా హరియాణా విద్యా బోర్డు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆయన ఇంగ్లీశ్ 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు. కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చౌతలా పదో తరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు. లేటు వయసులో లేటెస్ట్గా పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడం విశేషం. -
ఏ పీ లో పదో తరగతీలో గ్రేడ్ తో పాటు మార్కులు
-
ఏపీ: నేడే పదవ తరగతి ఫలితాలు
-
33 సార్లు ఫెయిల్.. కరోనాతో పాస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని భోలక్ పూర్‌కి చెందిన మహ్మద్ నూరుద్దీన్(51)కి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల. కానీ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆశ మాత్రం చావలేదు. దాంతో 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాడు. ప్రతి సారి ఫెయిల్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. వైరస్ కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెల్సిందే. దీంతో పరీక్షలుకు హాజయిన అందరిని ప్రభుత్వం పాస్ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా పదోతరగతి పరీక్ష రాస్తున్న వాళ్ళు కూడా కరోనా పుణ్యమాని పాస్ అయ్యారు. వారిలో మహ్మద్ నూరుద్దీన్ కూడా ఉన్నారు. ('నాకు కరోనా వచ్చి మేలు చేసింది') అంజుమన్ బాయ్స్ హైస్కూల్లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా.. పాస్ కాలేదు. అతడు తొలిసారిగా 1987లో ప్రైవేట్‌గా టెన్త్ పరీక్షలు రాశాడు. కానీ ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ ఈ సారి పాస్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖ, రక్షణ శాఖలో ఉద్యోగం చేయాలని నా కల. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. దాంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాను. కానీ ఫెయిల్ అయ్యాను. కరోనా వల్ల ఈ సారి పాస్ అయ్యాను. గ్రూప్-డీ జాబ్లకు వయసుతో నిమిత్తం ఉండదు. కాంట్రాక్ట్ బెస్ట్ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. వాటి కోసం ప్రయత్నిస్తాను. ఉన్నత చదువులు చదివే ఆలోచన లేదు’ అన్నారు నూరుద్దీన్. ఆయనకు ఇంటర్ చదివిన ఇద్దరు కొడుకులతో పాటు బీకాం పాసైన ఓ కూతురు ఉన్నారు. -
13న పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది. టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
నేడే టెన్త్ ఫలితాలు
-
నేడే టెన్త్ ఫలితాలు
హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు ⇒ ఇంటర్నెట్లో ఫలితాలు ⇒ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్ఎంఎస్ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్లు www.sakshieducation.com www.aponline.gov.in www.bsetelangana.org www.results.cgg.gov.in ఎస్ఎంఎస్ల రూపంలో.. ఎయిర్‌సెల్/వొడాఫోన్/రిలయన్స్ 58888 ఐవీఆర్ఎస్ ద్వారా.. యూనినార్/ఎయిర్టెల్/ఎయిర్‌సెల్/వొడాఫోన్ 5333530 -
ఉత్తమ ఫలితాలు ఆశిస్తూ...
ఖమ్మం, న్యూస్‌లైన్: పదో తరగతిలో ఉత్తమఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మూడేళ్లుగా ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో కింది నుంచి మూడు, నాలుగు స్థానాల్లో జిల్లా ఉంటుండటంతో మెరుగైనఫలితాల కోసం కలెక్టర్ ద్వారా లేఖాస్త్రాన్ని సంధించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, ప్రతినిమిషాన్నీ సద్వినియోగం చేసుకొని జిల్లా కీర్తిని చాటాలని బోధకులకు ఒక లేఖ, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్టేనని, ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు అందుతాయని, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు మరో లేఖ, పిల్లలు కీలకసమయంలో కష్టపడి చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, పిల్లల ప్రగతి రిపోర్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారిని మెరుగైన ఫలితాల దిశగా ప్రోత్సహించాలని పేరెంట్స్‌కు ఇంకోలేఖను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లేఖ లు పాఠశాలలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వి ద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశిం చారు. లేఖ దిగువభాగంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌తో పాటు ఆర్జేడీ బాలయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లను ముద్రించారు. 70వేల లేఖలు సిద్ధం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి తయారు చేసిన 70వేల లేఖలను విద్యాశాఖ సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వోన్నత పాఠశాలలు, 200కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35వేల మంది పైచిలుకు విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం పదో తరగతి చదువుతున్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుకు పదో తరగతి ఫలితాలే ప్రామాణికం కావడంతో రెండు నెలలుగా విద్యాశాఖాధికారులు ఎస్సెస్సీ ఫలితాలపై వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక బుక్లెట్లు తయారు చేయడం, వందరోజుల కాార్యక్రమంలో భాగంగా స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించడం, సాంఘిక సంక్షేమశాఖ, ఇతర ఎస్సీ, ఎస్టీ, ఐటీడీఏ పరిధిలోని హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. అయినా ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాకపోవడం, కనీస ఉత్తీర్ణత స్థాయి కూడా లేని విద్యార్థులు 20శాతం పైగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వీరిని ఇలాగే వదిలేస్తే గత వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ఉత్తరం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఓ ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.