ఖమ్మం, న్యూస్‌లైన్: పదో తరగతిలో ఉత్తమఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మూడేళ్లుగా ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో కింది నుంచి మూడు, నాలుగు స్థానాల్లో జిల్లా ఉంటుండటంతో మెరుగైనఫలితాల కోసం కలెక్టర్ ద్వారా లేఖాస్త్రాన్ని సంధించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, ప్రతినిమిషాన్నీ సద్వినియోగం చేసుకొని జిల్లా కీర్తిని చాటాలని బోధకులకు ఒక లేఖ, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్టేనని, ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు అందుతాయని, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు మరో లేఖ, పిల్లలు కీలకసమయంలో కష్టపడి చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, పిల్లల ప్రగతి రిపోర్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారిని మెరుగైన ఫలితాల దిశగా ప్రోత్సహించాలని పేరెంట్స్‌కు ఇంకోలేఖను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లేఖ లు పాఠశాలలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వి ద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశిం చారు. లేఖ దిగువభాగంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌తో పాటు ఆర్జేడీ బాలయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లను ముద్రించారు.
70వేల లేఖలు సిద్ధం
విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి తయారు చేసిన 70వేల లేఖలను విద్యాశాఖ సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వోన్నత పాఠశాలలు, 200కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35వేల మంది పైచిలుకు విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం పదో తరగతి చదువుతున్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుకు పదో తరగతి ఫలితాలే ప్రామాణికం కావడంతో రెండు నెలలుగా విద్యాశాఖాధికారులు ఎస్సెస్సీ ఫలితాలపై వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక బుక్‌లెట్‌లు తయారు చేయడం, వందరోజుల కాార్యక్రమంలో భాగంగా స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించడం, సాంఘిక సంక్షేమశాఖ, ఇతర ఎస్సీ, ఎస్టీ, ఐటీడీఏ పరిధిలోని హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. అయినా ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాకపోవడం, కనీస ఉత్తీర్ణత స్థాయి కూడా లేని విద్యార్థులు 20శాతం పైగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వీరిని ఇలాగే వదిలేస్తే గత వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ఉత్తరం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఓ ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.
ఉత్తమ ఫలితాలు ఆశిస్తూ...
Published Fri, Jan 10 2014 3:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement