సాక్షి, హైదరాబాద్: నగరంలోని భోలక్ పూర్‌కి చెందిన మహ్మద్ నూరుద్దీన్(51)కి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల. కానీ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆశ మాత్రం చావలేదు. దాంతో 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాడు. ప్రతి సారి ఫెయిల్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. వైరస్ కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెల్సిందే. దీంతో పరీక్షలుకు హాజయిన అందరిని ప్రభుత్వం పాస్ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా పదోతరగతి పరీక్ష రాస్తున్న వాళ్ళు కూడా కరోనా పుణ్యమాని పాస్ అయ్యారు. వారిలో మహ్మద్ నూరుద్దీన్ కూడా ఉన్నారు. ('నాకు కరోనా వచ్చి మేలు చేసింది')
అంజుమన్ బాయ్స్ హైస్కూల్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా.. పాస్ కాలేదు. అతడు తొలిసారిగా 1987లో ప్రైవేట్‌గా టెన్త్ పరీక్షలు రాశాడు. కానీ ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ ఈ సారి పాస్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖ, రక్షణ శాఖలో ఉద్యోగం చేయాలని నా కల. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. దాంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాను. కానీ ఫెయిల్ అయ్యాను. కరోనా వల్ల ఈ సారి పాస్ అయ్యాను. గ్రూప్-డీ జాబ్‌లకు వయసుతో నిమిత్తం ఉండదు. కాంట్రాక్ట్ బెస్ట్ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. వాటి కోసం ప్రయత్నిస్తాను. ఉన్నత చదువులు చదివే ఆలోచన లేదు’ అన్నారు నూరుద్దీన్. ఆయనకు ఇంటర్ చదివిన ఇద్దరు కొడుకులతో పాటు బీకాం పాసైన ఓ కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment