సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలో పాజిటివ్ కేసుల కలకలం చోటుచేసుకుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు ఇప్పటి వరకు 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్‌లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment