రమణా.. లోడ్‌ ఎత్తరా | Pressure on wineshop owners to carry goods: telangana | Sakshi
Sakshi News home page

రమణా.. లోడ్‌ ఎత్తరా

Published Thu, Aug 1 2024 4:24 AM | Last Updated on Thu, Aug 1 2024 4:24 AM

Pressure on wineshop owners to carry goods: telangana

జూలై టార్గెట్‌ కోసం చివరిరోజు ఎక్సైజ్‌ అధికారుల తంటాలు 

ఎంతోకొంత సరుకు తీసుకెళ్లాలని వైన్‌షాప్‌ యజమానులపై ఒత్తిడి 

గతేడాది జూలైతో పోలుస్తూ స్టాక్‌ ఎత్తాలని స్థానిక ఎక్సైజ్‌ సిబ్బంది ఫోన్లు 

చేసేదేమీ లేక వీలున్నంత స్టాక్‌ గోదాముల నుంచి తీసుకెళ్లిన రిటైలర్లు

ఇదేం ఖర్మరా బాబు.. ఎక్సైజోళ్ల బాధ పడలేకుంది. టార్గెట్‌.. టార్గెట్‌ అంటూ నిత్యం సంపుతున్నారు. మద్యం అమ్మితే నాలుగు డబ్బులు మిగిలేది మాకే కదా.. ఎంత అమ్మితే అంత వస్తుంది.. కానీ ఇప్పుడు వాళ్లకు సంపాదించి పెట్టాలట.. ఒక్కో షాప్‌నకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. మాకేమైనా అదనంగా వస్తుందా అంటే అది లేదు. రూ.లక్ష మందు సమాను కొంటే రూ.15 వేలు పోతున్నాయి. ఏంటో మరి..! ..ఇది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ వైన్స్‌ యజమాని ఆవేదన. అతను ఒక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణదారులందరి పరిస్థితి ఇదే.

సాక్షి, హైదరాబాద్‌/సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్, కరీంనగర్‌: ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలోనే ఎక్సైజ్‌ అధికారులకు కష్టాలు వచి్చపడ్డాయి. ఈ ఏడాది జూలై మాసంలో మద్యం అమ్మకాల లక్ష్యాన్ని చేరేందుకు నెల చివరి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారులు నానాతంటాలు పడ్డారు. ఈ నెల టార్గెట్‌ పూర్తి కాలేదని, పైఅధికారులు టార్గెట్‌ పెట్టారని, వీలున్నంత మేర స్టాక్‌ తీసుకెళ్లాలని వైన్‌షాప్‌ల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాస్తవానికి, గత మూడు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రూ.3వేల కోట్లు మించి జరుగుతున్నాయి.

జూన్‌ నెలలో రూ.3,175 కోట్లు దాటింది. కానీ, జూలై నెలలో ఈ అమ్మకాలు రూ.3వేల కోట్లలోపు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానికంగా ఉండే ఎక్సైజ్‌ అధికారులు రిటైలర్లపై ఒత్తిడి పెంచారు. గోదాముల్లో సరుకు రెడీగా ఉందని, ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ఎంతోకొంత సరుకు తీసుకెళ్లాలంటూ వైన్‌షాప్‌ యజమానులకు ఫోన్లు చేసినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో చేసేదేమీ లేని పరిస్థితుల్లో వైన్‌షాపుల యజమానులు అందుబాటులో ఉన్న నగదును బట్టి డీడీలు చెల్లించి గోదాముల నుంచి స్టాక్‌ తీసుకెళ్లారు. దీనిపై ఎక్సైజ్‌ అధికారులు మాట్లాడుతూ ప్రతిసారీ ఈ టార్గెట్లు ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వానికి నిధులు కూడా అవసరమైనందున ఉన్నతాధికారుల సూచన మేరకు సరుకు తీసుకెళ్లాలని వైన్‌షాపులను కోరామే తప్ప ఒత్తిడి తేలేదని, వీలునుబట్టి వైన్‌షాపుల నిర్వాహకులు సరుకు తీసుకెళ్లారే తప్ప...గొంతు మీద కత్తి పెట్టలేదని చెప్పడం గమనార్హం. 

తలపట్టుకుంటున్న వైన్స్‌ యజమానులు.. 
జనాభా ప్రాతిపదికన స్లాబ్‌ల ప్రకారం టెండర్‌ దక్కించుకున్నామని.. నిరీ్ణత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15 శాతం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో రూ.50 లక్షల స్లాబ్‌తో టెండర్‌ దక్కించుకున్న వ్యాపారికి పది పర్యాయాల వరకు ఐఎంఎల్‌ డిపోలో కొనుగోలు చేసిన మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే రూ.లక్షకు దాదాపు 15 శాతం అంటే రూ.15 వేలు అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం భారంగా మారిందని.. మిత్తీలకే సరిపోని పరిస్థితి ఉందని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇలా... 
ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్‌ అధికారులు నాలుగు జిల్లాల్లోని వైన్‌షాపులకు ఒక్కసారిగా సేల్స్‌ పెంచాలని టార్గెట్‌ విధించారు.  
కరీంనగర్‌తో సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రతీ వైన్‌షాపునకు రూ.30 లక్షల టార్గెట్‌ విధించారు. ‘‘మీరు అమ్ముకోండి.. లేదా స్టాక్‌ మీతోపాటే ఉంచుకోండి.. అవేమీ మాకు చెప్పొద్దు. కానీ, తప్పకుండా ప్రతీషాప్‌ రూ.30 లక్షల స్టాక్‌ కొనుగోలు చేయాల్సిందేనని’షరతు పెట్టారు. దీంతో గత్యంతరం లేక కేసులు పెడతారేమోననే భయంతో రూ.30లక్షల స్టాక్‌ కొనేందుకు సిద్ధమవుతున్నారు.  

⇒ సిరిసిల్ల జిల్లాలో రూ.30 లక్షల సరుకు తాము కొనలేమని మెజారిటీ వైన్‌షాపుల నిర్వాహకులు చేతులు ఎత్తేయడంతో కనీసం గత ఏడాది విక్రయాలను చేరుకోవాలని మినహాయింపు ఇచ్చారు. 
⇒  జగిత్యాల జిల్లాలోనూ వ్యాపారులు తాము రూ.30 లక్షలు చేయలేమని అనడంతో గతేడాది విక్రయాలతో 5–10 శాతం అదనంగా విక్రయించాలని టార్గెట్‌ పెట్టడంతో అంతా ఓకే అన్నారని సమాచారం. 

⇒  పెద్దపల్లి జిల్లాలో రూ.30 లక్షలు స్టాకు కొనలేమని వ్యాపారులు చెప్పడంతో చివరికి గతేడాది విక్రయాల మీద 30 శాతం అదనంగా విక్రయించాల్సిందేని షరతు పెట్టడంతో వ్యాపారులు సమ్మతించారని తెలిసింది. 
⇒ దీంతో ప్రతీ వైన్‌షాపు నిర్వాహకుడు రూ.లక్షలాదిగా దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ టార్గెట్‌ రీచ్‌ అయ్యేందుకు నానాతంటాలు పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement