గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్‌నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా.
ఉమ్మడి ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది.
భగీరథ ప్రయత్నం చేసినా..
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్‌తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఉమ్మడి కరీంనగర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.
కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి.
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి.
ఈనిన వరి ఎండిపోయింది..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్‌శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు.
బకెట్‌తో నీళ్లు పోస్తూ..
ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
5 బోర్లువేశాడు
మక్తల్ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన రవీందర్‌రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment