వ్యర్థాలతోనే పంటలకు పోషకాల వృద్ధి
బయోచార్‌తో పంట భూములు సారవంతం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
పిఠాపురం: గత కొన్నేళ్లుగా మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులతో భూమి తన సహజ గుణాలను కోల్పోయింది. దీంతో ఆశించిన నాణ్యమైన ఉత్పత్తులను అందించలేక, క్రమంగా చౌడుబారుతోంది. మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు భూమిలో అంతరించిపోతున్నాయి.
తద్వారా భూమి సారాన్ని కోల్పోయి నిస్తేజంగా మారి, నాణ్యమైన పంటలు పండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్య నుంచి రైతులను ఆదుకోవడానికి పూర్వం వాడుకలో ఉండే బయోచార్‌ను (బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు) మళ్లీ వాడుకలోకి తీసుకు రావడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బయోచార్‌తో ఇదీ మేలు...
వాస్తవానికి 1850 నుంచే ఈ పద్ధతి వినియోగంలో ఉన్నప్పటికీ కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఎలాంటి ఎరువునైనా మొక్కలు గ్రహించి మంచి దిగుబడి రావడానికి బయోచార్ ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది. ఆమ్ల గుణాలున్న మట్టి పీహెచ్ స్థితిని సాధారణ స్థాయికి తీసుకుని రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సహజంగా మనం ఎన్ని ఎరువులు వేసినా, వాటిలో మొక్కకు 30 నుంచి 40 శాతం మాత్రమే అందుతాయి.
పంటలకు వేసే ఎరువుల్లో బయోచార్‌ను కలపడం ద్వారా వంద శాతం ఎరువులను మొక్కలు గ్రహించే అవకాశముంటుంది. మట్టిలో తేమ శాతాన్ని క్రమబద్దీకరించి, తగిన తేమ అందేలా చేయడంలో దీనికి మించింది మరొకటి లేదు. మొక్కలకు పోషకాలు అందని చోట ఇది ఉ్రత్పేరకంగా పని చేసి, మొక్కలకు పోషకాలు అందేలా చేస్తుంది. ముఖ్యమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. నేలలో రసాయనాల గాఢతను తగ్గించి, సహజంగా మార్చుతుంది.
ఉపయోగించే విధానం...
కర్ర బొగ్గు 50 కేజీలు, చివికిన పశువుల పెంట 50 కేజీలు, రసాయనాలు వాడని అడవి మట్టి లేదా పుట్ట మట్టి 10 కేజీలు తీసుకుని, 8 నుంచి 10 లీటర్ల నీరు, రెండు కేజీల బెల్లం కరిగించి తీసుకోవాలి. దీంతో పాటు ద్రవ జీవామృతాన్ని నేరుగా దీనిలో కలపాలి. వీటన్నిటినీ బాగా కలియబెట్టి వారం పది రోజుల పాటు ఒక డబ్బాలో వేసి నీడలో పెట్టాలి.
రోజుకోసారి కలుపుతూ ఉండాలి. లోపల గాలి తగిలే విధంగా గోనె సంచి మూత పెట్టి ఉంచుకోవాలి. పది రోజుల తరువాత బయోచార్ తయారవుతుంది. దీన్ని వరి దమ్ములో వేసుకోవాలి, ఉద్యాన పంటల్లో మొక్కల మొదళ్ల చుట్టూ పళ్లెం కట్టి దానిలో బయోచార్‌ను వేసి మట్టితో కప్పివేయాలి. దీనివల్ల పంట నాణ్యత పెరుగుతుంది.
బయోచార్ తయారీ ఇలా..
బహిరంగంగా కాల్చడం
» రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు లోతున గొయ్యి తవి్వ, దానిలో వృక్ష వ్యర్థాలను వేసి, ఒకసారి మంట మండిన తరువాత దాన్ని పచ్చటి ఆకులతో కప్పి బయటి నుంచి ఆమ్లజని అందకుండా చేయాలి. తద్వారా రెండు రోజులకు బయోచార్ తయారవుతుంది.
» స్థానికంగా లభ్యమయ్యే వృక్ష వ్యర్థాలను, నిరుపయోగంగా పడి ఉండే కట్టెలను కాల్చడానికి వీలుగా గుల్ల తయారీ బట్టీల మాదిరిగా అర్ధచంద్రాకారంలో బట్టీలను తయారు చేసుకోవాలి. ఆ బట్టీల్లో వృక్ష వ్యర్థాలు వేసి, కాల్చి రెండు రోజుల తరువాత తీసుకుంటే బయోచార్ సిద్ధమవుతుంది.
నాణ్యత, దిగుబడి పెరిగాయి...
రెండేళ్లుగా బయోచార్ ద్వారా నువ్వులు, వేరుశనగ, ఆకుకూరలు పండిస్తున్నాను. దీన్ని వేయక ముందు పంటలు నాసిరకంగా ఉత్పత్తయ్యేవి. బయోచార్ వాడటం మొదలు పెట్టాక పంటల నాణ్యతతో పాటు దిగుబడి బాగా పెరిగింది.
నేల సారవంతంగా మారి వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, మొక్కలు జీవంతో ఉంటున్నాయి. తేమ తగ్గిపోకుండా ఉంచడంలో ఇది చాలా బాగా పని చేస్తోంది. భూమిలో కార్బన్ శాతం పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. – దుర్గాప్రసాద్,
ఫార్మసీ సైంటిస్టు, రైతు, బలభద్రపురం, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా
బయోచార్‌తో మంచి ఫలితాలు..
మా పొలంలో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత ఏడాది ప్రకృతి వ్యవసాయ అధికారులు బయోచార్ గురించి వివరించడంతో దీన్ని ఉపయోగించడం ప్రారంభించాం. దీనివల్ల పంటలకు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
తడులు తక్కువగా పెట్టినా ఇబ్బంది ఉండటం లేదు. పంటలు గతంలో కంటే ఆశాజనకంగా, నాణ్యతగా వస్తున్నాయి. ఎరువుల వాడకమూ తగ్గింది. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటున్నాయి. మొక్కల పెరుగుదల చాలా బాగుంది. – ఎం.మల్లీశ్వరి, రైతు, ఒమ్మంగి, ప్రత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా
ప్రయోగాత్మకంగా చేపట్టాం...
బయోచార్ విధానాన్ని గత ఏడాది నుంచి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చాం. ఈ ఏడాది 1,500 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేయాలని నిర్ణయించాం. ఇప్పటి వరకూ 50 ఎకరాల్లో 60 మంది రైతులు ఈ విధానంలో సాగు చేపట్టారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
దీన్ని ఒకసారి ఉపయోగిస్తే కనీసం 60 నుంచి 80 రోజుల పాటు పంటలకు పోషకాలను అందిస్తుంది. ఎనిమిదేళ్లపాటు ఫలితం ఉంటుంది. ఎరువుల వాడకం 60 నుంచి 70 శాతం తగ్గిపోతుంది. నీటి ఎద్దడి ఉన్నా పంటలు నష్టపోకుండా దిగుబడులు ఇస్తాయి. – ఎలియాజర్, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ
కమిటీతో బయోచార్ పంటల సాగు...
బయోచార్‌తో లాభాలను జిల్లాలోని రైతులకు తెలియజేస్తున్నాం. 2024 రబీలో 19 మంది రైతు శాస్త్రవేత్తలతో బయోచార్ తయారు చేయించి, పొలాల్లో వేయించి, ఆ పొలాల పరిస్థితిని అంచనా వేశాం.
ఈ ఏడాది ఖరీఫ్, వచ్చే రబీలో 19 మంది రైతు మెంబర్లతో దీన్ని తయారు చేయించి, వారి పొలాల్లో వేయించి, పంటల తీరును ఇతర రైతులకు తెలియజేసేవిధంగా అవగాహన కల్పించాం. ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో పంటలు సాగు చేసే విధంగా చర్యలు
తీసుకుంటున్నాం. – రేష్మ సోమ, జిల్లా పాయింట్ పర్సన్, ప్రాజెక్టు లింక్ అసోసియేట్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment