Miyazaki Mango in Kakinada: Ap Farmer Cultivating Rare Miyazaki Mangoes - Sakshi
Sakshi News home page

Miyazaki Mango-Kakinada: కాకినాడలో మియాజాకీ మామిడి.. అక్షరాలా ‘లక్ష’ రూపాయలు

Jun 3 2022 6:03 AM | Updated on Jun 3 2022 3:29 PM

Miyazaki mango by Kakinada district Farmer Andhra Pradesh - Sakshi

యాపిల్‌ మామిడి

అరటి పండులా తొక్క వలుచుకుతినే బనానా మామిడి, యాపిల్‌లా కనిపించే యాపిల్‌ మామిడి, నీలి రంగులో ఉండే బ్లూ మామిడి, టెంక లేని (సీడ్‌లెస్‌) మామిడి, 365 రోజులు కాపు కాసే మామిడితో పాటు కేజీ సీతాఫలం, అరటి సపోటా

పిఠాపురం: ‘కృషితో నాస్తి దుర్భిక్షమ్‌’ అన్నారు పెద్దలు. ఓ రైతు తన కృషితో అరుదైన పంటలు పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం ‘మియాజాకీ’ని పండించి ఔరా అనిపించాడు కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు. తనకున్న నాలుగెకరాల్లోనే వందకుపైగా రకాల పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నాడు.

అరటి పండులా తొక్క వలుచుకుతినే బనానా మామిడి, యాపిల్‌లా కనిపించే యాపిల్‌ మామిడి, నీలి రంగులో ఉండే బ్లూ మామిడి, టెంక లేని (సీడ్‌లెస్‌) మామిడి, 365 రోజులు కాపు కాసే మామిడితో పాటు కేజీ సీతాఫలం, అరటి సపోటా, పిక్క లేని (సీడ్‌లెస్‌) నేరేడు, తెల్ల నేరేడు, ఎర్ర పనస, స్ట్రాబెర్రీ జామ, హైబ్రిడ్‌ బాదం, అల్జీరా, పీనట్‌ బటర్‌ ఫ్రూట్‌ తదితర అరుదైన పండ్ల మొక్కలతో పాటు సంప్రదాయ కొబ్బరి, రేగు, జామ, సీతాఫలం, నేరేడు, సపోటా మొక్కలను తన తోటలో నాటి వాటి ఫలాలను పొందుతున్నాడు. పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు, మసాలా దినుసుల సాగు కూడా చేపట్టాడు. 

ది కింగ్‌ ఆఫ్‌ మ్యాంగో
మియాజాకీ రకానికి చెందిన మామిడిపండు ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా, కింగ్‌ ఆఫ్‌ మ్యాంగోగా గుర్తింపు పొందింది. జపాన్‌ దేశంలోని మియాజాకీ ప్రాంతంలో దీని మూలం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బయటకు సువాసనలు వెదజల్లుతూ, లోపల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత.

అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం, క్యాన్సర్‌ను నిరోధించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉండటంతో పాటు చర్మసౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటంతో అత్యంత ఖరీదు పలుకుతోంది. ఇతర రకాలతో పోల్చితే కాపు కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ పండ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.70 లక్షల వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు.  
తెల్ల నేరేడు 

మొక్కల పెంపకంపై మక్కువతో
నా నాలుగెకరాల పొలం ఎర్ర రేగడి నేల కావడంతో మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. మొక్కల పెంపకం అంటే నాకు చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం అరుదైన మొక్కలు పెంచాలనే ఆలోచనతో వాటిని నాటడం ప్రారంభించాను. రూ. 9 లక్షల వరకూ ఖర్చు చేసి ఇప్పటి వరకు 100కు పైగా అరుదైన రకాల మొక్కలు నాటాను. కడియం నర్సరీల వారితో మాట్లాడి ఆ మొక్కలు తెప్పించుకునే వాడిని. నా కుమారుడి సహకారంతో తోటను చంటి పిల్లాడిగా చూసుకుంటున్నా. మియాజాకీ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో ఒకటి ఒక కాయ కాసింది. దాని బరువు 380 గ్రాముల వరకు ఉంది. ఆన్‌లైన్‌లో పెడితే దాని ధర రూ. లక్షగా నిర్ణయించారు. 

మియాజాకీ మొక్కతో రైతు నాగేశ్వరరావు 

నాన్నకు తోడుగా 
నేను డిగ్రీ చదివాను. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వర్క్‌ చేస్తాను. ఖాళీ సమయాల్లో తోటలో నాన్నకు సహాయం చేస్తుంటాను. అరుదైన రకాల మొక్కలు ఆన్‌లైన్‌ ద్వారా రప్పించి నాటుతుంటాను. వాటికి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నాం. ఏమొక్కను ఎలా పెంచాలనేది ఇంటర్‌నెట్‌లో చూస్తాము. ఉద్యాన శాఖ వెబ్‌ సైట్ల ద్వారా కూడా మెళకువలు తెలుసుకుంటాం. పండ్లతో వ్యాపారం చేయాలనే ఆలోచన లేక పోయినప్పటికి ఆదాయం ఎక్కువగా వచ్చే రకాలు ఉండడంతో చాలా మంది ఆన్‌లైన్‌లో మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఫలాలను ఇస్తున్న మొక్కలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
– ఓదూరి కిషోర్, చేబ్రోలు

ఇక్కడ మియాజాకీ పండడం చాలా అరుదు
మియాజాకీ రకం మామిడి పండటం చాలా అరుదు. ఇది చాలా విలువైనది. మన ప్రాంతంలో పండించడం ఇదే మొదటిసారి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని అరుదైనవే. తోటను పరిశీలించి ఇతర రైతులకు పరిచయం చేస్తాం. ఇలాంటి అరుదైన మొక్కలను నాగేశ్వరరావు పండించటం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్‌ గానే చెప్పవచ్చు.
– శైలజ, ఉద్యాన శాఖ అధికారి, పిఠాపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement