
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!.
రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?..
అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది.

👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్‌సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు.
👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?..
.. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు.

గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన.
ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?
టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?
ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!
గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!
👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది.
👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు
👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు.
👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు.
👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు.
👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది.
ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment