నచ్చన్‌ఎల్లాపూర్ వద్ద రహదారిపై బైఠాయించిన రైతులు
సదర్మాట్ నీటిని విడుదల చేయాలని ఆందోళన
కడెం(ఖానాపూర్): రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్‌ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు.
వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్‌ఎల్లాపూర్, పెద్దూర్‌తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ
సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్‌సీ నుంచి ఎస్‌ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment