వి(క)నిపిస్తూ ప్రచారం..
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచారం హైటెక్ హంగులతో దూసుకుపోతోంది. వివిధ ప్రాంతాల్లో అగ్రనేతల ప్రచార సభలు ఏర్పాటు చేయాలంటే అనేక అడ్డంకులు తప్పవు. పైగా వారి ప్రచారం సడన్‌గా రద్దయినా, టైంకి రాలేకపోయినా.. ఓటర్లు నిరాశ చెందుతారు. అయితే, ఈ సమస్యలను అధిగమించేందుకు పార్టీలు కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తున్నాయి. బస్తీల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి పార్టీ ముఖ్యనేతల సందేశాన్ని వినిపిస్తున్నారు. ప్రముఖుల ప్రసంగాలు ముగిశాక చిన్నస్థాయి నేతలు మైకందుకుంటున్నారు. ట్రాఫిక్ రద్దీ, సమయాభావం వల్ల ముఖ్య నేతలు అన్నిచోట్ల ప్రచారం చేయకుండానే.. స్క్రీన్ల టెక్నిక్‌తో ఓటర్లకు వల వేస్తున్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ కొంచెం ముందుంది. సీఎం కేసీఆర్ ప్రసంగాలు ప్రతి గల్లీలోను వి(క)నిపించేలా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఈ ప్రచారానికి మంచి స్పందన వస్తుందని, ఓటర్లతో నేతలు నేరుగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుందని బరిలో ఉన్న అభ్యర్థులు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌ల ప్రచారం..
రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా గడిపే సిటీజన్లను నేరుగా కలవడం సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులు ఎస్‌ఎంఎస్‌లతో సమాచారం చేరవేస్తున్నారు. ఆయా పార్టీలు ఓటర్లకు సంక్షిప్త సందేశాలు పంపుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీకి ఓటేస్తే ఎలాంటి ప్రజాపనులు చేపడతామో ఆ సందేశాల్లో చెబుతున్నారు. ఇలాంటి బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు నగరంలో పలు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు షాకిస్తుంటే.. ఈ ఏజెన్సీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి.