15 నుంచి రంగంలోకి కేసీఆర్‌! | CM KCR will participate in various meetings from 15th October | Sakshi
Sakshi News home page

15 నుంచి రంగంలోకి కేసీఆర్‌!

Published Tue, Oct 10 2023 5:14 AM | Last Updated on Tue, Oct 10 2023 12:54 PM

CM KCR will participate in various meetings from 15th October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో.. బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా గోదాలోకి దిగుతున్నారు. ఈ నెల 15 నుంచి సభలు, ఇతర కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధంచేసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ నెల 15న తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమై పార్టీ బీఫారాలు అందజేస్తారు. తర్వాత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ వెంటనే నియోజకవర్గాల పర్యటనకు బయలుదేరుతారు. 

అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి.. 
15న తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులతో జరిగే భేటీలో.. ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు, సమావేశాల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విపక్షాల ఎత్తులను చిత్తుచేసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు. తర్వాత అదే రోజున సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 

వరుసగా నియోజకవర్గాల పర్యటన 
సుమారు 50రోజుల క్రితమే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కేసీఆర్‌.. ఈ నెల 15 నుంచి నియోజకవర్గాల్లో ప్రచార సభలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో 18 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు జరిగే బహిరంగ సభల షెడ్యూల్‌ను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 15న హుస్నాబాద్, 16న జనగామ, భువనగిరి, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొంటారు.

ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్లో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచార సభల షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ నెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభను తలపెట్టినా కేసీఆర్‌ అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు. ఆ సభను ఈ నెల 26 లేదా 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. 
 
కోనాయపల్లి ఆలయంలో పూజలు చేసి.. 
కేసీఆర్‌ తాను పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్‌ 9న నామినేషన్లు దాఖలు చేస్తారు. కేసీఆర్‌ సెంటిమెంట్, ఆనవాయితీ మేరకు ఆ రోజున ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి, మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకుని రెండో నామినేషన్‌ సమర్పిస్తారు. అనంతరం కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement