కేసీఆర్‌పై బాబు సాఫ్ట్ కార్నర్!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారం తీరుతెన్నులపై ఆ పార్టీలో జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేయకుండా చంద్రబాబు సుతిమెత్తగా మాట్లాడటం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌పై విమర్శలు చేయకపోవడంలో ఆంతర్యమేంటన్న అంశంపై పార్టీలో చర్చ మొదలైంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచే రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. అయితే చంద్రబాబు మాత్రం నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజుల తర్వాత.. అదికూడా మరో నాలుగు రోజుల్లో పోలింగ్ ఉందనగా ప్రచారానికి రావడంపైనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. 150 డివిజన్లతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ పరిధి 23 అసెంబ్లీ సెగ్మెంట్ల మేరకు విస్తరించి ఉంది. ఎంతో కీలకమైన ఈ ఎన్నికలను చంద్రబాబు అంతగా పట్టించుకోకపోవడం, బీజేపీతో డివిజన్ల సర్దుబాటు అంశంపైనా ఆయన అంతగా ఆసక్తి చూపకపోవడం టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పోలింగ్ తేదీ దగ్గర పడిన సమయంలో వచ్చిన చంద్రబాబు.. అప్పుడైనా తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించడం ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడతారని టీడీపీ నేతలు భావించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా చంద్రబాబు తొలిరోజు ప్రచారం సాగడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. గురువారం తొలిసారి ప్రచారంలోకి దిగిన చంద్రబాబు పటాన్ చెరు, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు.
ఈ సభల్లో మాట్లాడుతూ... ''నన్ను విమర్శించే నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టీడీపీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోంది. కొంతమంది నేను ఎక్కడికో వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడు మీతోనే ఉంటా. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు భయపడని నేను ఎవరికో ఎందుకు భయపడుతాను. టీడీపీ పుట్టిందే తెలంగాణలో'' అంటూ మాట్లాడారే తప్ప.. ఎక్కడా నేరుగా కేసీఆర్‌పై విమర్శలు చేయలేదు. కేసీఆర్ అమరావతి వచ్చారు. నేను కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి వెళ్లాను. సహకారం వేరు రాజకీయం వేరు... అని కేసీఆర్ విషయంలో ముక్తసరిగా మాట్లాడారు.
ఈ సభల్లో ఎక్కడా కేసీఆర్‌పైన, టీఆర్ఎస్‌పైన విమర్శలు చేయలేదు. విచిత్రమేమంటే... అదే సమయంలో టీఆర్ఎస్ భవన్‌లో మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ మాత్రం చంద్రబాబుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ప్రచారం చేయడమన్నదే అర్థం పర్థం లేని విషయంగా కేసీఆర్ దుయ్యబట్టారు. ఆయనకు ఇక్కడేం పనండీ... చేసుకోవాలంటే ఏపీలో బోలెడంత పనుంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించడం గమనార్హం.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని విభజన చట్టంలోని సెక్షన్ 8 ను అమలు చేయాలంటూ గతంలో గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాలను ప్రస్తావించనే లేదు. ఓటుకు కోట్లు కేసు విషయంలో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటకు పొక్కిన సమయంలో మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదుచేసి నానా హడావిడి చేసిన ఆయన ఇప్పుడెందుకు కేసీఆర్ విషయంలో సున్నితంగా, సుతిమెత్తగా ఒక్క మాట మాట్లాడట్లేదని టీడీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది.