హైదరాబాద్లో ఉన్న గోంగూరోళ్లూ మావాళ్లే: కేసీఆర్
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ ఆంధ్రోళ్లు పచ్చి మోసగాళ్లు అంటూ ఒంటికాలిపై లేచిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హఠాత్తుగా రాగం మార్చారు. పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ వచ్చినోళ్లంతా తెలంగాణ బిడ్డలేనన్న ఆయన సెటిలర్లను కన్నబిడ్డల్లా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సీమాంధ్రులకు తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు. సినీ పరిశ్రమను విస్తరించడానికి అవసరమైతే వేలాది ఎకరాల భూములు ఇస్తామన్నారు. ఆంధ్రోళ్లను ఇబ్బంది పెట్టడం తమకేం అవసరం అని ఆయన గడుసుగా ప్రశ్నించారు.
గోంగూరోళ్లూ...ఆవకాయోళ్లూ...ఇడ్లీ సాంబారోళ్ళూ అందరూ మావాళ్లే అంటూ కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. టిడిపి నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, గంగాధర గౌడ్లు బుధవారం టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ప్రసంగించిన ఆయన ఆంధ్రావాళ్లపై ప్రేమానురాగాలు కురిపించారు. పధ్నాలుగేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఆంధ్రోళ్లను ఏకి పారేయడమే అజెండాగా పెట్టుకున్న కేసీఆర్ హఠాత్తుగా వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ ఈ టర్నింగ్ తీసుకున్నట్లు సమాచారం. రాజధానిలో తన పట్టు నిలుపుకోవాలంటే టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే. దాంతో నగరంలోని సెటిలర్ల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే కేసీఆర్ అంతా మావాళ్లే అంటున్నారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు కూడా సెటిలర్స్పై వైఖరి మార్చుకుంటే బాగుంటుందనే సూచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పై విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.