settlers
-
సెటిలర్లు టీఆర్ఎస్ వైపే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నట్లు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లోని దాదాపు 20 నియోజకవర్గాల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ సమైక్య రాష్ట్రాన్ని విడదీసిందన్న కోపం సెటిలర్ల మనసులో ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. ఎటువంటి రక్తపాతం జరగకుండా తెలంగాణాను తీసుకువచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెటిలర్లపై దాడులు జరుగుతాయన్న దుష్ప్రచారాన్ని పఠాపంచలు చేస్తూ పరిపాలించారు. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సెటిలర్లపై దాడులు చేయలేదు. చేసే అవకాశం కూడా సృష్టించలేదు. తెలంగాణాలో నివాసం ఉన్నవాళ్లందరూ తెలంగాణా వారే అన్న భద్రతను సెటిలర్లలో కల్పించగలిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా సెటిలర్ల మనసుల్ని గెలిచుకున్నాయనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు పథకాలు సెటిలర్లతో పాటు ఇక్కడి ప్రజల్ని కూడా ఆకట్టుకున్నాయి. ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా తెలంగాణాలోని సెటిలర్లకు ఇక్కడి వారితో సమానంగా ఈ పథకాలు అందించడంతో టీఆర్ఎస్ పాలనపై మక్కువ పెరిగింది. చంద్రబాబు నాయుడు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టకపోవడం, ఆంధ్రాలో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలతో కొని టీడీపీలో చేర్చుకోవడం.. ఇదే విషయంలో తెలంగాణ టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఓడించాలని ఈ ఎన్నికలలో పిలుపునివ్వడం.. కాంగ్రెస్‌తో కలవడం కూడా సెటిలర్లకు నచ్చినట్లుగా కనపడటం లేదు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అధికారం కుక్కలు చింపిన విస్తరాకులా తయారవుతుందని భావించి సెటిలర్లు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్గొండ, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, బోధన్, పాలేరు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో సెటిలర్లు పెద్ద సంఖ్యలోఉంటారు. వీరి ఓట్ల ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హుజూర్నగర్, ఎల్బీనగర్, పాలేరు, సత్తుపల్లి తప్పితే మిగతా అన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు 2014 కంటే మెజార్టీతో గెలిచినట్లు ఫలితాల ద్వారా తెలుస్తోంది. మరో 10 నియోజకవర్గాల్లో కూడా సెటిలర్లు పాక్షికంగా ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్నారు. అయితే వీరంతా కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే జై కొట్టినట్లు కనపడుతోంది. -
ఆంధ్రా, సీమ వాళ్లకు అండగా ఉంటా..
హైదరాబాద్: ఆంధ్రా, రాయలసీమ ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా కేసీఆర్ కుమారుడిగా తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. ఆదివారం నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హమారా హైదరాబాద్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన 16 మాసాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి అందరూ ఆశీర్వదించడంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు దక్కించుకున్నామన్నారు. గత నాలుగేళ్లలో ఎక్కడా గొడవలు, ఇతర సమస్యలు తలెత్తకుండా శాంతిభద్రతల విషయంలో నగరం సురక్షితంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లతో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భవిష్యత్ తరాలకు భద్రత నిచ్చేలా పోలీస్ వ్యవస్థను ఆధునికీకరించామని అన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. గత పాలకులు తెలంగాణ ఏర్పడితే చీకట్లోనే మగ్గుతారని ప్రచారం చేశారని, తాము అధికారం చేపట్టిన తరువాత 24 గంటలు విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నామన్నారు. ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాలి... నగరంలో రోడ్లు, ట్రాఫిక్, డ్రైనేజీ వంటి సమస్యలు ఉన్నాయని, వీటిని రానున్న రోజుల్లో అధిగమిస్తామన్నారు. రాష్ట్రంలోని 43 లక్షల మంది పెన్షనర్లు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు అండగా ఉంటామని అంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణతో తమ ప్రత్యర్థి పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారన్నారు. ప్రాజెక్టులను ఆపాలని చూసిన బాబుపై కేసీఆర్ విమర్శలు చేశారే తప్ప, ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయని, తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై అహంకారపూరిత వైఖరి అవలంభిస్తోందని, రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం చేసేది మిధ్యేనని కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు జాతీయ పార్టీలు చేసిందేమి లేదన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాలన్నది తమ అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్రాజు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, రాష్ట్ర నాయకులు మిరియాల రాఘవరావు, తాజా మాజీ ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానంద, కృష్ణారావు, కార్పొరేటర్లు జానకి రామరాజు, సతీశ్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, కాండూరి నరేంద్రాచార్య, ముద్దం నర్సింహ్మయాదవ్, హమీద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
సెటిలర్స్‌కి సీటు దక్కేనా..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్స్ ఓట్లపై ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలు కన్నేశారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రాంత ఓట్లు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గల్లో పోటీ చేసేందుకు ఏపీకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి కూకట్పల్లి స్థానం నుంచి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే ఏలూరి.. కూకట్పల్లి నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఇటీవల అధిష్టానాన్ని కలిశారు. 2014 ఎన్నికల్లో ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి పోటీ చేసి మూడుస్థానంలో నిలిచారు. ఈ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పోటీచేసి ఓటమిపాలైయ్యారు. తాజాగా ఆయన కూకట్పల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మహాకూటమి నుంచి ఆయనకు తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ నేత ఇనగాల పెద్దిరెడ్డి కూటమి తరుఫున తనకే టికెట్ కేటాయించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో సెటిలర్స్‌కు స్థానాలు కేటాయించాలని ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం అదేశించినట్లు సమాచారం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లు పలు ప్రాంతాల్లో ఉన్నందున ఏదో ఒక స్థానంలో వారికి సీటు దక్కే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ గతంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఏపీ గాలిని ఎత్తిచూపిన ‘ఏకవీర’
♦ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సెటిలర్ల పట్టం ♦ వారికి విశ్వాసం కల్పించిన 19 మాసాల కేసీఆర్ పాలన ♦ ఏపీలో చంద్రబాబు హామీలను తుంగలో తొక్కడమూ కారణమే ♦ ఏపీ ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన సెటిలర్ల ఓటింగ్ సరళి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెటిలర్లు అధికార టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) డివిజన్ ఒక్కటి మినహా సెటిలర్ల ప్రాబల్యమున్న అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. సరిగ్గా 22 మాసాల కిత్రం జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టిన ఓటర్లు ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 19 నెలల కాలంలో తాను తీసుకున్న పలు చర్యల ద్వారా సెటిలర్లకు విశ్వాసం కల్పించడమూ దీనికి కారణం. దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ తరవాత మాట మార్చడం, హామీలను నెరవేర్చకపోవడం కూడా హైదరాబాద్‌లోని సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతు పలకడానికి కారణంగా నిలిచింది. ఏపీలో నివసిస్తున్న తమవారికి రుణాలు మాఫీ కాకపోవడం, డ్వాక్రా రుణాలను రద్దు చేయకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కూడా సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ రాజధాని కోసం బలవంతంగా భూములు సేకరించడం, ఒక వర్గం వారికి మేలు చేకూర్చేలా నిర్ణయాలుండటం కూడా హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు మింగుడు పడలేదని కూకట్‌పల్లిలో నివసించే చొక్కాపు వెంకటరమణ పేర్కొన్నారు. ‘ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ వర్గానికీ ఇబ్బంది కలిగించడం లేదు. అక్కడ ఏపీలోనేమో అన్ని వర్గాలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని వాడవాడనా చెప్పారు. దాంతో ఇక్కడున్న మేం కూడా మావారి శ్రేయస్సు కోసం గత సాధారణ ఎన్నికల్లో ఏపీకి వెళ్లి మరీ ఓట్లేసి వచ్చాం. తీరా అధికారంలోకి వచ్చాక బాబు అన్నీ మర్చిపోయారు’ అని వెంకటరమణ వాపోయారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లోని సెటిలర్లకు ఇబ్బంది తప్పదన్న ప్రచారం వట్టిదేనని తేలిపోవడం, తమను జాగ్రత్తగా చూసుకుంటామని కేసీఆర్ పదేపదే చెప్పడం వల్ల తాము ఈసారి టీఆర్ఎస్కు మద్దతిచ్చామని మియాపూర్‌కు చెందిన వేములపాటి మురళీకృష్ణ చెప్పారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పని చేస్తున్న మురళీకృష్ణ గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారు. ‘ఏపీలో నా తండ్రి నుంచి సంక్రమించిన భూ మిపై వ్యవసాయ రుణం తీసుకున్నా. దాదాపు రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ఆశపడ్డా. తీరా చంద్రబాబు చేసిన మోసం వల్ల వడ్డీతో కలిపి నేను రూ.2.75 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో మళ్లీ జీవితంలో బాబుకు ఓటేయకూడదని నిర్ణయించుకున్నా’ అని చెప్పారాయన. అమరావతిలో మౌలిక సదుపాయాలేవీ లేకుండానే, ‘ఉన్నపళంగా అక్కడికి రావాల్సిందే’నంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తేవడాన్ని ఏపీ ప్రభుత్వోద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండే అవకాశముంది. కానీ, చంద్రబాబు మొండి పటుట్దలకు పోయి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే టీఆర్ఎస్కు ఓటేశా’’ అని ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలో ఉండే సచివాలయం ఉద్యోగి వెంకటలక్ష్మి చెప్పారు. కాంగ్రెస్‌పై కోపమింకా పోలేదు... టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సెటిలర్ల మనసొప్పలేదు. అందుకు వారు ససేమిరా అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దేనన్న ఆగ్రహం వారిలో ఇంకా ఏ మాత్రమూ తగ్గలేదు. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాం గ్రెస్‌ను తానెప్పటికీ సమర్థించబోనని సోమాజిగూడలోవాసి ఛాయాదేవి చెప్పారు. సచివాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆమె, ఈ ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతివ్వడానికి చంద్రబాబుపై వ్యతిరేకతే ప్రధాన కారణమన్నారు. టీఆర్ఎస్ పట్ల సెటిలర్లలో ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా వారికి మరో ప్రత్యామ్నాయమంటూ లేకపోయిందని పోస్టల్ శాఖలో పనిచేసే కల్యాణచక్రవర్తి చెప్పారు. వైఎస్సార్ సీపీ పోటీలో లేకపోవడం కూడా టీఆర్ఎస్కు కలి సొచ్చింది. వనస్థలిపురంలో నివాసముండే అనంతపూర్‌కు చెందిన రామ్మూర్తి అదే చెప్పారు. ఈసారి తాను టీఆర్ఎస్కు ఓటేశానని, వైఎస్సార్సీపీ గనక పోటీలో ఉంటే మరోలా ఆలోచించేవాడినని అన్నారాయన. -
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: సెటిలర్లపై అనుచితంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఇప్పుడు కేటీఆర్ తాను కూడా సెటిలర్నే అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నార న్నారు. తాను కూడా సెటిలర్నేనంటున్న కేటీఆర్‌కు గతంలో హైదరాబాద్ నుంచి సెటిలర్లు భాగో అంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని ఆమె ప్రశ్నించారు. సెటిలర్ అనే పదాన్ని సృష్టించింది టీఆర్ఎస్సే అని రేణుకాచౌదరి ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ నేతలు, మంత్రి కేటీఆర్ మాట మారుస్తున్నార న్నారు. -
టీఆర్ఎస్పై లోకేశ్ విమర్శలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ నేత లోకేశ్ విమర్శలు గుప్పించారు. సెటిలర్ల ఓట్ల విషయంలో టీఆర్ఎస్ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణి మరోసారి తేటతెల్లమైందని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. గతంలో సెటిలర్ల ఓట్ల విషయంలో రాద్ధాంతం చేసిన టీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకునేందుకు సానుభూతి ప్రదర్శిస్తున్నదని ట్వీట్ చేశారు. దీనికి హైదరాబాద్ బర్బాద్ అన్న హ్యాష్‌ట్యాగ్ జోడించారు. Two faced TRS proves it again. One that cries foul at settlers for votes, another that sympathises them, again for votes. #HyderabadBarbaad — Lokesh Nara (@naralokesh) January 9, 2016 -
సోదరబంధం చెరిగిపోదు
హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు సెటిలర్లు కాదు, వారంతా తెలంగాణ బిడ్డలే.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇటీవల పేర్కొ నడం ఏ రకంగా చూసినా అభినందనీయమే. హైదరాబాద్‌ను నమ్ము కుని కడుపునింపుకుంటున్న ఏ రాష్ట్ర ప్రజలూ సెటిలర్లు కారని వారం తా ఇక్కడివారే అంటూ ఆయన సామరస్యభావనకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి పునాదిరాళ్లు వేసిన ప్రముఖ నిర్మాత, దివంగత రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి తెలంగాణ తనను తాను గౌరవించుకుంది. బతుకుకోసం ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటివచ్చి చేరిన వారిని భాగ్యనగరం అక్కున చేర్చుకుని భాగ్యవం తుల్ని చేసిందే తప్ప ఎలాంటి వివక్ష ఎవరి పట్లా చూపలేదు. తమ కంటూ ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉండాలనే తపనతోనే తెలంగాణ ప్రజలు పోరు బాటపట్టారు కాని ఆంధ్ర సోదరులు తెలంగాణ విడిచి వెళ్లిపోవా లన్నది వారి అభిమతం కానే కాదు. సీమ కర్నూలును త్యాగం చేసి హైదరాబాద్‌ను రాజధానిగా చేయడంలో ఆనాడు ఆంధ్ర సోదర నేతల సాయాన్ని, ఔదార్యాన్ని ఎన్నటికీ మరువలేము. దేశంలో హిందీ రాష్ట్రా లు 12 ఉంటున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే తప్పులేదు. అందుకే తెలుగు వాళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయినా మన సోదర బంధం చెరగలేదు. ఇకపై కూడా చెక్కు చెదరదు. కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ -
సెటిలర్స్ లేరు..
* ఉన్నోళ్లంతా హైదరాబాదీలే: సీఎం కేసీఆర్ * సెటిలర్లు అనే భావనను విడిచిపెట్టండి.. హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడండి * ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు.. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా * వనస్థలిపురం, ఎల్బీనగర్, కూకట్‌పల్లిలో స్థిరపడిన వారితో సమావేశం నిర్వహిస్తా * ముఖ్యమంత్రిగా అందరి రక్షణ బాధ్యత తనదేనన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ భేదం లేదని.. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడికి వచ్చి ఉన్నవారంతా సెటిలర్స్ అన్న భావనను విడిచిపెట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంగా తనదేనని, ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో కూకట్పల్లి ప్రాంతంలోని పన్నెండు కాలనీలకు చెందిన పలువురు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వారందరినీ ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలే. మీరు సెటిలర్స్ కాదు. మీ తాతలు, తండ్రులు వ చ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టండి. తెలంగాణలో ఇక సెటిలర్స్ ఉండరు..’’ అని ఆయన పేర్కొన్నారు. తాను మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టినా హైదరాబాదీనని చెప్పుకొంటున్నానని.. హైదరాబాద్‌లో పుట్టిన తన మనవడు హైదరాబాదీ అనే చెప్పుకుంటాడని కేసీఆర్ చెప్పారు. ‘‘ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి తేడాలు వచ్చాయి. మీకు చీమకుట్టినా, మీ కాలికి ముల్లు గుచ్చుకున్నా పంటితో తీస్తా. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంగా నాదే. హైదరాబాద్‌లో నివసించే ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం..’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తమకు ప్రాంతీయ విభేదం లేదు కాబట్టే ప్రముఖ నిర్మాత రామానాయుడి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని చెప్పారు. బాధ్యత అందరిపైనా ఉంది: హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని, అందరి బిడ్డల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుందని, ఒకటి రెండేళ్లలో హైదరాబాద్‌లో మార్పులు చూస్తారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడడం తనకు నచ్చదని, చెప్పేది వంద శాతం చేసి చూపిస్తానని సీఎం అన్నారు. వనస్థలిపురం, ఎల్బీ నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో స్థిరపడిన వారితో భోజనాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా సమావేశమవుదామని... నాలుగైదు గంటలు హైదరాబాద్ అభివృద్ధి గురించి చ ర్చించుకుందామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నగర కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడున్నవారంతా.. తెలంగాణ బిడ్డలే..!
-
హైదరాబాద్‌లో ఉన్న గోంగూరోళ్లూ మావాళ్లే: కేసీఆర్
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ ఆంధ్రోళ్లు పచ్చి మోసగాళ్లు అంటూ ఒంటికాలిపై లేచిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హఠాత్తుగా రాగం మార్చారు. పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ వచ్చినోళ్లంతా తెలంగాణ బిడ్డలేనన్న ఆయన సెటిలర్లను కన్నబిడ్డల్లా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సీమాంధ్రులకు తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు. సినీ పరిశ్రమను విస్తరించడానికి అవసరమైతే వేలాది ఎకరాల భూములు ఇస్తామన్నారు. ఆంధ్రోళ్లను ఇబ్బంది పెట్టడం తమకేం అవసరం అని ఆయన గడుసుగా ప్రశ్నించారు. గోంగూరోళ్లూ...ఆవకాయోళ్లూ...ఇడ్లీ సాంబారోళ్ళూ అందరూ మావాళ్లే అంటూ కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. టిడిపి నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, గంగాధర గౌడ్లు బుధవారం టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ప్రసంగించిన ఆయన ఆంధ్రావాళ్లపై ప్రేమానురాగాలు కురిపించారు. పధ్నాలుగేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఆంధ్రోళ్లను ఏకి పారేయడమే అజెండాగా పెట్టుకున్న కేసీఆర్ హఠాత్తుగా వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ ఈ టర్నింగ్ తీసుకున్నట్లు సమాచారం. రాజధానిలో తన పట్టు నిలుపుకోవాలంటే టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే. దాంతో నగరంలోని సెటిలర్ల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే కేసీఆర్ అంతా మావాళ్లే అంటున్నారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు కూడా సెటిలర్స్‌పై వైఖరి మార్చుకుంటే బాగుంటుందనే సూచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పై విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
కన్నబిడ్డల్లా చూసుకుంటాం..
పొట్ట చేతపట్టుకుని వచ్చినోళ్లంతా మా బిడ్డలే: కేసీఆర్ చంద్రబాబు ఓ దగా కోరు.. అబద్ధాల కోరు సీమాంధ్రులను నిండా మోసం చేస్తున్నడు టీఆర్ఎస్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు తీగల, తల సాని, ఎమ్మెల్సీ గంగాధర్ సాక్షి, హైదరాబాద్: ‘‘పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు బతకడానికి వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నిరుపేదలను సైతం కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సీమాంధ్రులకు తెలంగాణ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేస్తుందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ దగాకోరని, ఆయన చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. బాబును నమ్మితే సున్నం పెడతాడే కానీ అన్నం పెట్టడని విమర్శించారు. హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేటలో బుధవారం నిర్వహించిన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు. హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమ దేశం గర్వపడే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతర్జాతీయ నగరాలను మించిన మహా నగరాన్ని నిర్మిస్తామన్నారు. హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో 1,700 మురికి వాడలున్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఏ బస్తీలో నివసిస్తున్న వాళ్లకు ఆ బస్తీలోనే ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్నగర్ వాసులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తాం..’’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని వారసత్వ సంపద దెబ్బతినకుండా ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో వారసత్వ సంపదకు నష్టం కలుగకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు త్వరలో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, అధికారులను త్వరలో ఇస్తాంబుల్‌కు పంపించనున్నట్లు సీఎం తెలిపారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించి.. ఇక్కడ ముస్లిం పేద విద్యార్థుల కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రేస్‌కోర్స్‌ను శివారుకు తరలించి.. రేస్‌కోర్స్ స్థలంలో వంద ఎకరాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. పేకాట క్లబులు, జూదాలాడే రేస్కోర్స్లు మనకు అవసరమా..? అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే రైతుల రుణాలు మాఫీ చెయ్యి.. ఏపీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ సవాలు చేశారు. ‘‘టీఆర్ఎస్ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇప్పటి కే రైతులకు సంబంధించిన రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశాం. అదే చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ. 1.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. వాటి అమలు సాధ్యం కాదని చెప్పిన ఇతర పార్టీల నేతలను దబాయించిండు. తీరా అధికారంలోకి వచ్చినంక వాటిని పట్టించుకోకుండ అక్కడి రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నడు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. చంద్రబాబుకు దమ్ముంటే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేసి చూపించాలె..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు పాలన వల్లే నేడు తెలంగాణ రైతులకు కష్టాలు వచ్చాయని... వారు అనుసరించిన తప్పుడు విధానాలే విద్యుత్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదన్నారు. తెలంగాణకు మూడేళ్ల పాటు కరెంట్ కష్టాలు తప్పవని ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి పల్లెకు వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీరు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కర్నె ప్రభాకర్, సలీం, వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా?: - చంద్రబాబుపై తలసాని మండిపాటు ‘‘మేం ఎటో పారిపోతున్నట్లు మమ్ములను ఓ గదిలో బంధించి నీకు ఏం కావాలి? నీ కుటుంబానికి ఏం కావాలి? అంటూ బాబు సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే బేరాలు ఆడుతున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా? నీకేమైనా సిగ్గుందా..?’’ అంటూ తలసాని శ్రీనివాస్‌యాదవ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాము యాచించే వాళ్లం కాదని, హైదరాబాద్‌ను శాసించే వాళ్లమని వ్యాఖ్యానించారు. తమ సత్తా ఏమిటో త్వరలోనే తెలుస్తుందని, వంద జన్మలెత్తినా తమలాంటి నేతలను తయారు చేయలేవని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లింది. బాబు కళ్లకు కాంట్రాక్టర్లు మినహా కార్యకర్తలెవరూ కనిపించడం లేదు. కొంతమంది చంద్రబాబు బంట్రోతులు బ్రోకర్లలా మాట్లాడుతున్నారు..’’ అని తలసాని విమర్శించారు. బతకడానికి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని చెప్పారు. తల్లిరుణం తీర్చుకునేందుకే..: తీగల తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్పారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ను బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామన్నారు. బంగారు తెలంగాణ కోసమే..: గంగాధర్‌గౌడ్ చంద్రబాబు సహా కొంత మంది సీమాంధ్రులు ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక పోతున్నారని ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ చెప్పారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకే తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని పేర్కొన్నారు. -
తమ భవిష్యత్తు పై ఆందోళనలో సెటిలర్లు