హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు సెటిలర్లు కాదు, వారంతా తెలంగాణ బిడ్డలే.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇటీవల పేర్కొ నడం ఏ రకంగా చూసినా అభినందనీయమే. హైదరాబాద్‌ను నమ్ము కుని కడుపునింపుకుంటున్న ఏ రాష్ట్ర ప్రజలూ సెటిలర్లు కారని వారం తా ఇక్కడివారే అంటూ ఆయన సామరస్యభావనకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి పునాదిరాళ్లు వేసిన ప్రముఖ నిర్మాత, దివంగత రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి తెలంగాణ తనను తాను గౌరవించుకుంది. బతుకుకోసం ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటివచ్చి చేరిన వారిని భాగ్యనగరం అక్కున చేర్చుకుని భాగ్యవం తుల్ని చేసిందే తప్ప ఎలాంటి వివక్ష ఎవరి పట్లా చూపలేదు.
తమ కంటూ ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉండాలనే తపనతోనే తెలంగాణ ప్రజలు పోరు బాటపట్టారు కాని ఆంధ్ర సోదరులు తెలంగాణ విడిచి వెళ్లిపోవా లన్నది వారి అభిమతం కానే కాదు. సీమ కర్నూలును త్యాగం చేసి హైదరాబాద్‌ను రాజధానిగా చేయడంలో ఆనాడు ఆంధ్ర సోదర నేతల సాయాన్ని, ఔదార్యాన్ని ఎన్నటికీ మరువలేము. దేశంలో హిందీ రాష్ట్రా లు 12 ఉంటున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే తప్పులేదు. అందుకే తెలుగు వాళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయినా మన సోదర బంధం చెరగలేదు. ఇకపై కూడా చెక్కు చెదరదు.
కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్