ఏపీ గాలిని ఎత్తిచూపిన ‘ఏకవీర’
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సెటిలర్ల పట్టం
♦ వారికి విశ్వాసం కల్పించిన 19 మాసాల కేసీఆర్ పాలన
♦ ఏపీలో చంద్రబాబు హామీలను తుంగలో తొక్కడమూ కారణమే
♦ ఏపీ ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన సెటిలర్ల ఓటింగ్ సరళి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెటిలర్లు అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) డివిజన్ ఒక్కటి మినహా సెటిలర్ల ప్రాబల్యమున్న అన్ని డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. సరిగ్గా 22 మాసాల కిత్రం జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టిన ఓటర్లు ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 19 నెలల కాలంలో తాను తీసుకున్న పలు చర్యల ద్వారా సెటిలర్లకు విశ్వాసం కల్పించడమూ దీనికి కారణం. దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ తరవాత మాట మార్చడం, హామీలను నెరవేర్చకపోవడం కూడా హైదరాబాద్‌లోని సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడానికి కారణంగా నిలిచింది.
ఏపీలో నివసిస్తున్న తమవారికి రుణాలు మాఫీ కాకపోవడం, డ్వాక్రా రుణాలను రద్దు చేయకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కూడా సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ రాజధాని కోసం బలవంతంగా భూములు సేకరించడం, ఒక వర్గం వారికి మేలు చేకూర్చేలా నిర్ణయాలుండటం కూడా హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు మింగుడు పడలేదని కూకట్‌పల్లిలో నివసించే చొక్కాపు వెంకటరమణ పేర్కొన్నారు. ‘ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ వర్గానికీ ఇబ్బంది కలిగించడం లేదు. అక్కడ ఏపీలోనేమో అన్ని వర్గాలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని వాడవాడనా చెప్పారు. దాంతో ఇక్కడున్న మేం కూడా మావారి శ్రేయస్సు కోసం గత సాధారణ ఎన్నికల్లో ఏపీకి వెళ్లి మరీ ఓట్లేసి వచ్చాం. తీరా అధికారంలోకి వచ్చాక బాబు అన్నీ మర్చిపోయారు’ అని వెంకటరమణ వాపోయారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లోని సెటిలర్లకు ఇబ్బంది తప్పదన్న ప్రచారం వట్టిదేనని తేలిపోవడం, తమను జాగ్రత్తగా చూసుకుంటామని కేసీఆర్ పదేపదే చెప్పడం వల్ల తాము ఈసారి టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని మియాపూర్‌కు చెందిన వేములపాటి మురళీకృష్ణ చెప్పారు.
స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పని చేస్తున్న మురళీకృష్ణ గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారు. ‘ఏపీలో నా తండ్రి నుంచి సంక్రమించిన భూ మిపై వ్యవసాయ రుణం తీసుకున్నా. దాదాపు రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ఆశపడ్డా. తీరా చంద్రబాబు చేసిన మోసం వల్ల వడ్డీతో కలిపి నేను రూ.2.75 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో మళ్లీ జీవితంలో బాబుకు ఓటేయకూడదని నిర్ణయించుకున్నా’ అని చెప్పారాయన. అమరావతిలో మౌలిక సదుపాయాలేవీ లేకుండానే, ‘ఉన్నపళంగా అక్కడికి రావాల్సిందే’నంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తేవడాన్ని ఏపీ ప్రభుత్వోద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండే అవకాశముంది. కానీ, చంద్రబాబు మొండి పటుట్దలకు పోయి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌కు ఓటేశా’’ అని ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలో ఉండే సచివాలయం ఉద్యోగి వెంకటలక్ష్మి చెప్పారు.
కాంగ్రెస్‌పై కోపమింకా పోలేదు...
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సెటిలర్ల మనసొప్పలేదు. అందుకు వారు ససేమిరా అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దేనన్న ఆగ్రహం వారిలో ఇంకా ఏ మాత్రమూ తగ్గలేదు. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాం గ్రెస్‌ను తానెప్పటికీ సమర్థించబోనని సోమాజిగూడలోవాసి ఛాయాదేవి చెప్పారు. సచివాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆమె, ఈ ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడానికి చంద్రబాబుపై వ్యతిరేకతే ప్రధాన కారణమన్నారు.
టీఆర్‌ఎస్ పట్ల సెటిలర్లలో ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా వారికి మరో ప్రత్యామ్నాయమంటూ లేకపోయిందని పోస్టల్ శాఖలో పనిచేసే కల్యాణచక్రవర్తి చెప్పారు. వైఎస్సార్ సీపీ పోటీలో లేకపోవడం కూడా టీఆర్‌ఎస్‌కు కలి సొచ్చింది. వనస్థలిపురంలో నివాసముండే అనంతపూర్‌కు చెందిన రామ్మూర్తి అదే చెప్పారు. ఈసారి తాను టీఆర్‌ఎస్‌కు ఓటేశానని, వైఎస్సార్‌సీపీ గనక పోటీలో ఉంటే మరోలా ఆలోచించేవాడినని అన్నారాయన.