
సెటిలర్స్ లేరు..
* ఉన్నోళ్లంతా హైదరాబాదీలే: సీఎం కేసీఆర్
* సెటిలర్లు అనే భావనను విడిచిపెట్టండి.. హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడండి
* ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు.. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా
* వనస్థలిపురం, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లిలో స్థిరపడిన వారితో సమావేశం నిర్వహిస్తా
* ముఖ్యమంత్రిగా అందరి రక్షణ బాధ్యత తనదేనన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ భేదం లేదని.. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడికి వచ్చి ఉన్నవారంతా సెటిలర్స్ అన్న భావనను విడిచిపెట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంగా తనదేనని, ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో కూకట్‌పల్లి ప్రాంతంలోని పన్నెండు కాలనీలకు చెందిన పలువురు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వారందరినీ ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలే.
మీరు సెటిలర్స్ కాదు. మీ తాతలు, తండ్రులు వ చ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టండి. తెలంగాణలో ఇక సెటిలర్స్ ఉండరు..’’ అని ఆయన పేర్కొన్నారు. తాను మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టినా హైదరాబాదీనని చెప్పుకొంటున్నానని.. హైదరాబాద్‌లో పుట్టిన తన మనవడు హైదరాబాదీ అనే చెప్పుకుంటాడని కేసీఆర్ చెప్పారు. ‘‘ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి తేడాలు వచ్చాయి. మీకు చీమకుట్టినా, మీ కాలికి ముల్లు గుచ్చుకున్నా పంటితో తీస్తా. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంగా నాదే. హైదరాబాద్‌లో నివసించే ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం..’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తమకు ప్రాంతీయ విభేదం లేదు కాబట్టే ప్రముఖ నిర్మాత రామానాయుడి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని చెప్పారు.
బాధ్యత అందరిపైనా ఉంది: హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని, అందరి బిడ్డల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుందని, ఒకటి రెండేళ్లలో హైదరాబాద్‌లో మార్పులు చూస్తారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడడం తనకు నచ్చదని, చెప్పేది వంద శాతం చేసి చూపిస్తానని సీఎం అన్నారు. వనస్థలిపురం, ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో స్థిరపడిన వారితో భోజనాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా సమావేశమవుదామని... నాలుగైదు గంటలు హైదరాబాద్ అభివృద్ధి గురించి చ ర్చించుకుందామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నగర కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు.