
ప్రసంగిస్తున్న కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రా, రాయలసీమ ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా కేసీఆర్ కుమారుడిగా తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. ఆదివారం నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన హమారా హైదరాబాద్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన 16 మాసాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి అందరూ ఆశీర్వదించడంతోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు దక్కించుకున్నామన్నారు. గత నాలుగేళ్లలో ఎక్కడా గొడవలు, ఇతర సమస్యలు తలెత్తకుండా శాంతిభద్రతల విషయంలో నగరం సురక్షితంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లతో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భవిష్యత్ తరాలకు భద్రత నిచ్చేలా పోలీస్ వ్యవస్థను ఆధునికీకరించామని అన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. గత పాలకులు తెలంగాణ ఏర్పడితే చీకట్లోనే మగ్గుతారని ప్రచారం చేశారని, తాము అధికారం చేపట్టిన తరువాత 24 గంటలు విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నామన్నారు.
ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాలి...
నగరంలో రోడ్లు, ట్రాఫిక్, డ్రైనేజీ వంటి సమస్యలు ఉన్నాయని, వీటిని రానున్న రోజుల్లో అధిగమిస్తామన్నారు. రాష్ట్రంలోని 43 లక్షల మంది పెన్షనర్లు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు అండగా ఉంటామని అంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణతో తమ ప్రత్యర్థి పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారన్నారు. ప్రాజెక్టులను ఆపాలని చూసిన బాబుపై కేసీఆర్ విమర్శలు చేశారే తప్ప, ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయని, తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై అహంకారపూరిత వైఖరి అవలంభిస్తోందని, రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం చేసేది మిధ్యేనని కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు జాతీయ పార్టీలు చేసిందేమి లేదన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాలన్నది తమ అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, రాష్ట్ర నాయకులు మిరియాల రాఘవరావు, తాజా మాజీ ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానంద, కృష్ణారావు, కార్పొరేటర్లు జానకి రామరాజు, సతీశ్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, కాండూరి నరేంద్రాచార్య, ముద్దం నర్సింహ్మయాదవ్, హమీద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment