
పూజల కోసం వచ్చిన సీఎం సతీమణి శోభ, కోడలు శైలిమ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ దేవుడి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వారివురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతేడాది వైకుంఠ ఏకాదశికి ఇక్కడకి వచ్చిన సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచి తన భర్త సీఎం అయితే పూజలు నిర్వహిస్తానని ఆమె మొక్కుకున్నారు. దీంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆమె కోడలితో కలసి ఆలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపినాథ్, ఈవో శర్మలు వారికి స్వాగతం పలికారు. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు సమకూరాలని, విజయవంతమైన పాలన కొనసాగించాల ని అర్చకులు ఆశీర్వచనం చేశారు. అలాగే అమీర్‌పేటలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్లిన వారివురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
బల్కంపేట ఆలయంలో సీఎం సోదరీమణులు
సీఎం కేసీఆర్ సోదరీమణులు బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేశారు. సీఎం ఇద్దరు అక్కలతోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తల్లి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. పూజల అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment