
హైదరాబాద్: టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనా కాలంలో కులమతాలకు అతీతంగా హైదరాబాద్ మహా నగరాన్ని కంటికి రెప్పలా చూసుకున్నామని మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఉప్పల్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్‌ఎస్ ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప్పల్‌ను ఎంతో అభివృద్ధి చేశామని, ఉప్పల్ నుంచి సీపీఆర్‌ఐ వరకు స్కైవే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ భగాయత్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక శిల్పారామం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే శేరిలింగంపల్లికి దీటుగా ఉప్పల్‌లో 300 ఎకరాల్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడలు అధికంగా ఉన్న ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పవర్ హాలిడేస్ ఉండేవని ఎద్దేవా చేశారు. అయితే తమ ప్రభుత్వం పరిశ్రమలను ఆదుకోవడానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసి మూతపడ్డ పరిశ్రమలకు తిరిగి ప్రాణం పోసిందన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలన్నది టీఆర్‌ఎస్ ఆశయమని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని, శాంతి భద్రతలు ఇలానే కొనసాగాలంటే, సంక్షేమ పథకాలు సజావుగా నడవాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి భేతి సుభాష్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం సీటు కోసం కుమ్ములాటలు..
కొన్ని పార్టీలు మతాన్ని అడ్డం పెట్టుకొని, మరికొన్ని పార్టీలు కులాలను అడ్డం పెట్టుకొని వస్తున్నాయని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. మహాకూటమిలో సీట్లు పంచుకోవడానికి 4 నెలలు పట్టిందని ఇలాంటి వారు పరిపాలన ఎలా సాగిస్తారని ఎద్దేవా చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రాజకీయ స్థిరత్వం ఉండదని, సీఎం సీటు కోసం కుమ్ములాటలే తప్ప.. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితులు ఉండవన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతోందని, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయన్నారు. కేసీఆర్‌ను దించాలంటున్న కూటమి నేతలు ఎందుకు దించాలో సమాధానం చెప్పాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉపాధి అవకాశాలు పెంచుతున్నందుకు కేసీఆర్‌ను దించాలా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఆయన చేసే పనులు తట్టుకోలేక 4 పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ ఉప్పల్ ఎన్నికల ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment