గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది బాబే !
విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కే సీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు: హరీశ్‌రావు
దొంగే... దొంగా దొంగా అని అరిచినట్టుంది
ఏపీ సీఎం వైఖరి ‘బాబు కుట్ర’లపై లేఖ విడుదల
సిద్దిపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ‘దొంగే... దొంగా.. దొంగా’ అని అరిచినట్లుందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎద్దేవా చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిననాటి నుంచి తెలంగాణ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ.. కేసీఆరే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించడం ఆయనకే చెల్లిందని దుయ్యబట్టారు. హరీష్‌రావు ఆదివారమిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణపై బాబు చేసిన పది కుట్రలను వివరిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఇండియా, పాకిస్థానా అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. మీ పార్టీ నేతలు మాట్లాడుతున్న విధంగానే తెలంగాణలో టీడీపీని సమాధిచేసి, వాటి పునాదుల మీద సీమాంధ్రలో పదవి తెచ్చుకున్నది నిజం కాదా అని నిలదీశారు. తెలంగాణ పట్ల ద్వేషంతో వ్యవహరిస్తూ, శత్రుదేశంగా చూస్తున్న బాబు వైఖరిని దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వరాష్ట్రం కోసం ఏం చేశారో గానీ, నిత్యం తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు కుట్రలు పాపాలపుట్టలా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
కుత్రంతాలను కప్పి పుచ్చుకునేందుకు అంతా పునర్విభజన బిల్లు ప్రకారమే జరుగుతోందని మాట్లాడుతున్న చం ద్రబాబు.. బిల్లులో చెప్పిన అనేక విషయాలను ఎందుకు విస్మరిస్తున్నారని, మిగతావాటి విషయంలో కూడా బిల్లు ప్రకారంగా నడుచుకోవాలని ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.
హరీష్‌రావు మాటల్లో...
భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తె చ్చి, పోలవరం బిల్లుపై కుట్ర చేశారు. సీఎం కా గానే తెలంగాణకు చేసిన మొదటి ద్రోహం ఇది.రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన కరెంటులో 54 శాతం తెలంగాణకు ఇవ్వాలని బిల్లులో ఉన్నా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దుచేస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణలో కరెంటు కోత బాగా ఉన్నప్పుడే కడప ఆర్టీపీఎస్, విజయవాడ వీటీపీఎస్‌లలో ఉత్పత్తి నిలిపివేయించి తెలంగాణకు 710 మెగావాట్ల విద్యుత్‌ను రాకుండా చేసి కుట్ర చేశారు.
‘పెద్ద మనుషుల ఒప్పందం’ ఉల్లంఘన నుంచి పదవుల పంపిణీలో తెలంగాణకు అన్యా యం జరుగుతోందని మొదటి నుంచీ మేం చెబుతూనే ఉన్నాం. బాబు ఏపీ సీఎం అయిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూ కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు.
ఎంసెట్ ఉమ్మడి అడ్మిషన్లకు మేం కూడా ఒప్పుకున్నా, మమ్మల్ని సంప్రదించకుండా ఉన్నత విద్యామండలి ద్వారా నోటిఫికేషన్ ఎలా ఇప్పిస్తారు?
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని బిల్లులో పేర్కొన్నప్పటికీ హైదరాబాద్‌పై పెత్త నం కోసం కుట్ర చేసి శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తె చ్చి మోసం చేశారు. మీకు లేని చట్టం, మా కెందుకు? మా నెత్తిన కేంద్ర పెత్తనం ఎందుకు?
తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన నూతన విధానాన్ని తేవడంతో పెట్టుబడులు పెట్టడానికి టాటా, బిర్లా మహేంద్ర, విప్రో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వారిని భయపెట్టేందుకు బాబు ప్రయత్నం చేశారు. రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు కలిసుండాలని నీతి మాటలు మాట్లాడుతున్న బాబు.. చేతల్లో చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా తెలంగాణకు కరెంట్ కష్టాలు కలిగేలా వ్యవహరించడం సరికాదు. తెలంగాణకు చెందిన న్యాక్ సంస్థకు డెరైక్టర్ జనరల్‌ను ఆంధ్రప్రదేశ్ ఎలా నియమిస్తుంది? మా సంస్థలకు అధికారులను నియమించడం కుట్ర కాదా? తెలంగాణలో అక్రమార్కులకు చెక్ పెట్టాలనుకుంటున్నాం. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై కఠినంగా ఉండాలనుకుంటున్నాం. దీన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్రమార్కుల పక్షాన ఆంధ్ర ఎమ్మెల్యేలను పంపి ధర్నా చేయడం ఏమిటి?