'కృష్ణా బోర్డు తీర్పును గౌరవించాల్సిందే'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు విభజన చట్టాన్ని కోరి తెచ్చి.. ఇప్పడు అదే చట్టాన్ని ఎందుకు పాటించడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కృష్ణా బోర్డు తీర్పును గౌరవించాల్సిందేనని ఈ సందర్భంగా ఉమ స్పష్టం చేశారు. చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తిని సన్యాసి అనడాన్ని తెలంగాణ ప్రజలు కూడా హర్షించడం లేదన్నారు. కేసీఆర్ మాట్లాడే భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి ఇంకా కొనసాగిస్తే రాయలసీమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉమ తెలిపారు.
కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి తమ అధికారులు వాస్తవ పరిస్థితిని వివరిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంతానికి పోయి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే సమస్య పరిష్కారానికి సహకరించాలని ఉమ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ శ్రీశైలంలో 243 టీఎంసీలు, నాగార్జున సాగర్ లో 133 నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆంధ్రాలో పెడతానన్న సభను విజయవాడలో కాకపోతే ఆయన విజయనగరంలోనే పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఉమ తెలిపారు.