ఎస్‌ఎంఎస్ ఛార్జీల కంటే ఎక్కువగా వాట్సాప్ ఛార్జీలు
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్.. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయకుండా ఉచితంగా తన సర్వీసులను అందిస్తోంది. మొబైల్ ఫోన్‌లో నెట్ ఉంటే చాలు. వాట్సాప్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించనవసరం లేదు. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఛార్జీల బాదుడు షురూ చేయాలని నిర్ణయించింది. అయితే అది యూజర్లందరకూ కాదట. కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమే. మార్కెటింగ్, కస్టమర్ సర్వీసు మెసేజ్‌లు పంపే వారి నుంచి ఇక ఛార్జీలు వసూలు చేయాలని ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ నిర్ణయించిందని తెలిసింది. యూసేజ్ తగ్గిపోవడం, రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో, ఈ ఛార్జీలను విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.
పంపించిన మెసేజ్ డెలివరీ అయినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఒక్కో మెసేజ్‌కు 0.5 సెంట్ల నుంచి 9 సెంట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. అంటే మన దేశంలో ఈ ఛార్జీలు 34.16 పైసల నుంచి రూ.6.15 వరకు ఉంటాయి. అయితే వాట్సాప్ ప్రస్తుతం విధించబోతున్న ఈ ఛార్జీలు ఎస్‌ఎంఎస్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాట్సాప్ బిజినెస్ యూజర్లలో ఆందోళన నెలకొంది. వాట్సాప్‌కు మొత్తం 1 .5 బిలియన్ యూజర్లున్నారు. బిజినెస్‌లు చేసే వారు నోటిఫికేషన్లను పంపడానికి వాట్సాప్ బిజినెస్ ఏపీఐను వాడుతున్నారు. వాట్సాప్ ఈ జనవరిలోనే చిన్న వ్యాపార అకౌంట్ల కోసం ఈ వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో 30 లక్షల మందికి పైగా యాక్టివ్ యూజర్లున్నారు. ఆ సమయంలోనే వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ నుంచి ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశ్యం ఉందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మ్యాట్ ఐడెమా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment