business app
-
వాట్సాప్ బిజినెస్ కోసం ఏఐ ఫీచర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న వ్యాపారాలను కొనుగోలుదారులకు మరింత చేరువ చేసే దిశగా వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కృత్రిమ మేథ (ఏఐ) ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు మెటా బిజినెస్ మెసేజింగ్ విభాగం డైరెక్టర్ రవి గర్గ్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరులోగా ఏఐ ఏజెంట్, అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి రాగలవని ఆయన వివరించారు. వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు .. కంటెంట్, యాడ్స్ మొదలైనవి క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. క్యాటలాగ్ రూపకల్పన నుంచి ఆర్డర్లు, చెల్లింపుల వరకు వాట్సాప్ ద్వారా లావాదేవీల నిర్వహణను సులభతరం చేసేందుకు పలు సంస్థలతో చేతులు కలుపుతున్నట్లు గర్గ్ చెప్పారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 6 మెట్రోలతో జట్టు కట్టామని, ప్రస్తుతం నెలకు సుమారు 20 లక్షల మెట్రో రైలు టికెట్ల కొనుగోలు వాట్సాప్ ద్వారా జరుగుతోందని తెలిపారు. బస్సు టికెట్లకు సంబంధించి టీఎస్ఆర్టీసీ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నామని వివరించారు. వాట్సాప్ బిజినెస్‌పై అవగాహన కలి్పంచేందుకు ప్రచారం, సీఏఐటీ వంటి పరిశ్రమ సమాఖ్యలతో శిక్షణ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహిస్తున్నట్లు గర్గ్ చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో 179 కొత్త శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 6–9 నెలల్లో కొత్తగా 179 శాఖలు ఏర్పాటు చేయనుంది. వీటిలో 90 తెలంగాణలో, 89 ఆంధ్రప్రదేశ్‌లో ఉండనున్నాయి. ఇందుకోసం 5,000 మంది సిబ్బందిని బ్యాంక్ తీసుకోనుంది. వ్యాపారవర్గాల కోసం రూపొందించిన స్మార్ట్‌హబ్ వ్యాపార్ యాప్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ (దక్షిణాది) తరుణ్ చౌదరి గురువారం ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 588 శాఖలు ఉన్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో 10,000 రకాల పైచిలుకు ఆఫర్లు కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, స్మార్ట్‌హబ్ యాప్‌తో చెల్లింపులు, బ్యాంకింగ్ సర్వీసులు పొందడం వ్యాపార వర్గాలకు సులభతరం అవుతుందన్నారు. గతేడాది జూలైలో ప్రయోగాత్మకంగా యాప్‌ను ప్రవేశపెట్టామని, ఈ నెలాఖరు నాటికి యూజర్ల సంఖ్య 10 లక్షలకు చేరుకోనుందని చౌదరి తెలిపారు. -
వాట్సాప్‌లో భారీగా ఛార్జీల బాదుడు
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్.. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయకుండా ఉచితంగా తన సర్వీసులను అందిస్తోంది. మొబైల్ ఫోన్లో నెట్ ఉంటే చాలు. వాట్సాప్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించనవసరం లేదు. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఛార్జీల బాదుడు షురూ చేయాలని నిర్ణయించింది. అయితే అది యూజర్లందరకూ కాదట. కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమే. మార్కెటింగ్, కస్టమర్ సర్వీసు మెసేజ్‌లు పంపే వారి నుంచి ఇక ఛార్జీలు వసూలు చేయాలని ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ నిర్ణయించిందని తెలిసింది. యూసేజ్ తగ్గిపోవడం, రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో, ఈ ఛార్జీలను విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. పంపించిన మెసేజ్ డెలివరీ అయినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఒక్కో మెసేజ్‌కు 0.5 సెంట్ల నుంచి 9 సెంట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. అంటే మన దేశంలో ఈ ఛార్జీలు 34.16 పైసల నుంచి రూ.6.15 వరకు ఉంటాయి. అయితే వాట్సాప్ ప్రస్తుతం విధించబోతున్న ఈ ఛార్జీలు ఎస్ఎంఎస్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాట్సాప్ బిజినెస్ యూజర్లలో ఆందోళన నెలకొంది. వాట్సాప్‌కు మొత్తం 1 .5 బిలియన్ యూజర్లున్నారు. బిజినెస్‌లు చేసే వారు నోటిఫికేషన్లను పంపడానికి వాట్సాప్ బిజినెస్ ఏపీఐను వాడుతున్నారు. వాట్సాప్ ఈ జనవరిలోనే చిన్న వ్యాపార అకౌంట్ల కోసం ఈ వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో 30 లక్షల మందికి పైగా యాక్టివ్ యూజర్లున్నారు. ఆ సమయంలోనే వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ నుంచి ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశ్యం ఉందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మ్యాట్ ఐడెమా తెలిపారు. -
వాట్సాప్‌లో మరో బిగ్ ఫీచర్, వారికోసమే..
వాట్సాప్... రోజుకో కొత్త అప్డేట్తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ బిజినెస్ యాప్‌ను మరింత మందికి చేరువ చేసి, వ్యాపారాలకు ఉపయోగపడేందుకు ఓ కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. అదే ‘ఛాట్ ఫిల్టర్స్’ ఫీచర్. దీని ద్వారా వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ అడ్మిన్లు త్వరగా మెసేజ్‌లను సెర్చ్ చేసుకోవచ్చు. అవసరమైన కస్టమర్లను త్వరగా సెర్చ్ చేసుకునేందుకు వ్యాపారస్తులకు సాయం చేయాలని ఈ సోషల్ మీడియా దిగ్గజం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ఛాట్ ఫిల్టర్స్’ అనే ఫీచర్‌ను తన బిజినెస్ యాప్‌కు యాడ్ చేసింది. ఈ ఫిల్టర్స్‌ను యాక్సస్ చేసుకోవడానికి సెర్చ్ బార్‌పై అడ్మిన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఛాట్ ఫిల్టర్స్’ ఫీచర్ యూజర్లను అన్‌రీడ్ ఛాట్స్, గ్రూప్స్, బ్రాడ్కాస్ట్ కేటగిరీల కింద గ్రూప్ చేయనుంది. ఇది అచ్చం ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యాక్షన్ బటన్’ మాదిరే పనిచేస్తుంది. ఈ యాక్షన్ బటన్ కూడా ముఖ్యమైన కస్టమర్లను డైరెక్ట్‌గా ఇన్‌బాక్స్‌లోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ తీసుకొస్తున్న ‘ఛాట్ ఫిల్టర్స్’ అనే ఫీచర్‌తో వ్యాపారాలను మెరుగ్గా చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యమైన కస్టమర్లకు మంచి సేవలను అందించవచ్చు. వారి ప్రాధాన్యత బట్టి కమ్యూనికేషన్‌ను నిర్వహించవచ్చు. వాట్సాప్ ఫర్ బిజినెస్ అనే యాప్‌ను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని ఈ బిజినెస్ యాప్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నవారు ఈ బిజినెస్ యాప్ ద్వారా తమ వినియోగదారులతో టచ్‌లో ఉండొచ్చు. సులభంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఈ కొత్త యాప్‌ను పాత వాట్సాప్ మెసెంజర్ ప్లాట్‌ఫాం మీద రూపొందించినప్పటికీ.. అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను జతచేశారు. వెరిఫైడ్ ప్రొఫైల్, క్విక్ రిప్లైస్, గ్రీటింగ్ మెసేజెస్, అవే మెసేజెస్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్ మాదిరిగానే వాట్సాప్ బిజినెస్ యాప్‌ను చూడా ఎంతో సెక్యూర్‌గా రూపొందించారు. మీ కాల్స్, మెసేజ్‌లు థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను ఈ యాప్‌లో పొందుపరిచారు. -
వాట్సాప్ బిజినెస్ సర్వీస్ షురూ
న్యూఢిల్లీః ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త సర్వీస్ ప్రారంభించింది. చిన్న వ్యాపారులు, సంస్థలకు మేలు చేసేలా వాట్సాప్ బిజినెస్‌ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా చిన్న వ్యాపారులు, సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల గురించి సులభంగా ఇంటరాక్ట్ కావచ్చని వాట్సాప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ ఇదేమా చెప్పారు.వాట్సాప్ బిజినెస్‌ను చిన్న వ్యాపారుల కోసం డిజైన్ చేశామని, బిజినెస్ ప్రొఫైల్ లేని వారి కోసం ఒకే చోట కస్టమర్లను నిర్వహించే రీతిలో ఇది మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. వ్యాపారులు తమ వాట్సాప్ కాంటాక్ట్స్‌ను ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలపై ఉంచడం ద్వారా విస్తృత కస్టమర్లకు చేరువ కావచ్చని చెప్పారు. నూతన యాప్‌తో వ్యాపారాలు వినియోగదారులతో నేరుగా అనుసంధానం కావచ్చని అన్నారు. రానున్న రోజుల్లో చిన్న వ్యాపారులు ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు నూతన ఫీచర్లు జోడించేలా ఈ యాప్‌ను పరీక్షిస్తామని తెలిపారు. ఈ యాప్‌లో వ్యాపార సంస్థలు తమ చిరునామా, పని చేసే వేళలు, ఉత్పత్తి, సేవల వివరాలతో కూడిన కంపెనీ ప్రొఫైల్‌ను రూపొందించుకోవచ్చని చెప్పారు. కన్సూమర్ చాట్స్ చేసేందుకూ వాట్సాప్ బిజినెస్‌లో వెసులుబాటు ఉందని తెలిపారు.