నో ఎస్‌ఎమ్‌ఎస్ | No SMS | Sakshi
Sakshi News home page

నో ఎస్‌ఎమ్‌ఎస్

Published Mon, Jun 23 2014 3:21 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

No SMS

  •     ఐసీడీఎస్‌లో మూలనపడిన ఎస్‌ఎమ్‌ఎస్ విధానం
  •      రాష్ట్ర విభజన వల్ల డెరైక్టరేట్‌లో టెలికం వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమంటున్న అధికారులు
  •      బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్కు లేక పనిచేయని అంగన్‌వాడీల సీయూజీ సెల్‌ఫోన్లు
  • చిత్తూరు(టౌన్): జిల్లాలోని ఐసీడీఎస్(స్త్రీ,శిశు సంక్షేమశాఖ) పరిధిలో పనిచేయాల్సిన ఎస్‌ఎమ్‌ఎస్ విధానం మూలనపడింది. అంగన్‌వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం, బీ ఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్కు లేకపోవడం, రాష్ట్ర విభజన వల్ల డెరైక్టరేట్ మార్పుతో ల్యాండ్‌ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు మార్చకపోవడం తదితర కారణాలతో ఎస్‌ఎమ్‌ఎస్ విధానానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జిల్లాలో పటిష్టంగా అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి.
     
    ఈ విధానం ఎందుకంటే..

    జిల్లాలో అంగన్‌వాడీల పనితీరును మెరుగుపరిచేందుకు ఎస్‌ఎమ్‌ఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిత్రం ప్రవేశపెట్టింది. దానికోసం జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డెరైక్టరేట్ అధికారులు, ఐసీడీఎస్ పీడీ, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు సీయూజీ (కామన్ యూజర్ గ్రూప్) పద్ధతిలో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డులను ప్రభుత్వం అందచేసింది.

    ఐసీడీఎస్‌లో రాష్ట్రస్థాయి అధికారి మొదలు జిల్లా, డివిజన్, గ్రామాల్లోని అంగన్‌వాడీ వర్కర్ల వర కు కమ్యూనికేషన్ ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. అంగన్‌వాడీ పరిధిలో జరిగే రోజువారీ కార్యక్రమాలు, పిల్లల హాజరు, వారికి అందించిన ఆహార పదార్థాలు తదితర వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు సీయూజీ ఫోన్ల ద్వారా డెరైక్టరేట్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ చేయాల్సి ఉంది.

    త ద్వారా అంగన్‌వాడీల్లో పారదర్శకత పెరిగి, ప్రజల్లో ఉ న్న అనుమానాలు తొలుగుతాయని భావించారు. పైగా నెలవారీగా అంగన్‌వాడీలకు సరఫరా అయ్యే సరుకు లు, కోడిగుడ్లు తదితరాలపై లెక్కల్లో ఎలాంటి తేడాలు కనిపించినా పసిగట్టే ఆస్కారముంది. అంగన్‌వాడీ వ ర్కర్లు క్రమం తప్పకుండా అంగన్‌వాడీలకు వెళుతున్నా రా లేదా అనేది కూడా ఈ విధానం ద్వారా తెలుస్తోంది. ఏ టవర్ నుంచి మెసేజ్ రిసీవ్ అయ్యింద నే సమాచారాన్ని కూడా డెరైక్టరేట్‌లో ఉండే మెసేజ్ రిసీవర్ రిసీవ్ చేసుకుని కంప్యూటర్‌లో ముద్రితమవుతుంది.
     
    నెలగా పనిచేయని ఎస్‌ఎమ్‌ఎస్ విధానం

    జిల్లాలో 4,387 మంది అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వం సీయూజీ ఫోన్ సౌకర్యం కల్పించింది. వారిలో 3,640 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 864 మంది మినీఅంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరంతా ప్రతిరోజూ సాయంత్రం డెరైక్టరేట్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తమ కార్యకలాపాలను ప్రభుత్వానికి నివేదించేవారు. నెల రోజులుగా ఈ విధానం పనిచేయడం లేదు. డెరైక్టరేట్ నుంచి కూడా ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. గతంలో ఒక్క రోజు ఎస్‌ఎమ్‌ఎస్ రాకపోయినా డెరైక్టరేట్ అధికారులే వెంటబడేవారు. నెల రోజులుగా వారూ పట్టించుకోకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎస్‌ఎమ్‌ఎస్ పంపడం మరిచారు.
     
    ఎంపీఆర్‌కు, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు తేడాలొస్తే ఇబ్బందే

     
    అంగన్‌వాడీల ప్రగతిపై సెక్టార్ స్థాయి సమావేశాలను ప్రతినెలా 20 నుంచి 25వ తేదీలోగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నివేదికలను అదేరోజు అంగన్‌వాడీ వర్కర్లు సూపర్‌వైజర్లకు అందిస్తారు. వాటిని 25 నుంచి 28వ తేదీలోగా సీడీపీవోలకు సూపర్‌వైజర్లు అందిస్తారు. సీడీపీవోలకు అందిన నివేదికలను కన్సాలిడేట్ చేసి ప్రతినెలా 29 నుంచి 30, 31 తేదీల్లోగా ఐసీడీఎస్ పీడీకి అందిస్తారు. వాటిని మరుసటి నెల 5వ తేదీలోగా డెరైక్టరేట్‌కు అందేటట్లు ఐసీడీఎస్ కార్యాలయ అధికారులు మెయిల్ ద్వారా పంపుతారు. దీన్నే ఎంపీఆర్ (మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టు) అంటారు. ఈ విధంగా అందిన ఎంపీఆర్‌కి,  అంగన్‌వాడీల నుంచి రోజూ వచ్చే ఎస్‌ఎమ్‌ఎస్‌లను సరిచూస్తారు.
     
    సీయూజీలకు నెట్‌వర్కు ప్రాబ్లమ్

    జిల్లాలో 4,387 మందికి సీయూజీలను ఇచ్చినా వాటిలో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు నెట్‌వర్కు ప్రాబ్లమ్‌తో పనిచేయడం లేదని తెలిసింది. నెట్‌వర్కు లేనపుడు ఫోన్ పనిచేయడం లేదు. తద్వారా ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపడం వీలుకావడం లేదు. దీనిపై ఐసీడీఎస్ పీడీ ఉషాఫణికర్‌ను వివరణ కోరగా రాష్ట్ర విభజన వల్ల 15 రోజులుగా జిల్లాలో ఎస్‌ఎమ్‌ఎస్ విధానం పనిచేయడం లేదన్నారు. డెరైక్టరేట్‌లోనూ ల్యాండ్‌ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు. డెరైక్టరేట్ సెట్‌రైట్ అయితే మళ్లీ ఈ విధానం యథాతథంగా కొనసాగుతుందన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement