సాక్షి, విశాఖపట్నం: ఇంటెలిజెన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం(ఐటీఎస్) ద్వారా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న రోజుల్లో మరిన్ని సేవలందించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ రీజియన్‌లో ‘ఎస్సెమ్మెస్ ఇస్తే బస్సు సమాచారం’ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాను ఎక్కడున్నదీ, ఎక్కడకు వెళ్లాల్సిందీ తెలుపుతూ సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) ఇస్తే క్షణాల్లో.. అందుబాటులో ఉన్న బస్సుల వివరాలు, వేళలు తదితర సమాచారంతో సమాధానం వస్తుంది. అలాగే ఐవీఆర్‌ఎస్‌లోనూ పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మైసూర్, సింగపూర్ ప్రాంతాల్లో అవలంబిస్తున్న ఈ విధానాన్ని జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. బస్సు ల రాకపోకల వివరాలు తెలిసేలా బస్టాపుల్లో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులేర్పాటు చేయనున్నారు. ప్రమాదాలకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు జీపీఎస్, జీఐఎస్‌లను అమలుచేయనున్నారు.