
రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్‌ఎంఎస్ ధరలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్‌ఎంఎస్ ధరలు మే 1 నుంచి తగ్గనున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ టారిఫ్ ధరలను తగ్గించటంతో రోమింగ్ మొబైల్ కాల్స్ 23 శాతం వరకు, ఎస్‌ఎంఎస్ ధరలు 75 శాతం వరకు తగ్గనున్నాయి. ట్రాయ్ రోమింగ్ ఎస్‌టీడీ కాల్స్ చార్జీలను (నిమిషానికి) రూ.1.5 నుంచి రూ.1.15కు, రోమింగ్ ఎస్‌ఎంఎస్ ధరలను రూ.1.5 నుంచి 38 పైసలకు, రోమింగ్ ఇన్‌కమింగ్ కాల్స్ ధరలను 75 పైసలు నుంచి 45 పైసలకు తగ్గించింది. రోమింగ్‌లో వుండగా చేసే లోకల్ ఎస్‌ఎంఎస్ ధరలను రూ.1 నుంచి 25 పైసలకు, రోమింగ్ లోకల్ కాల్స్ ధరలను రూ.1 నుంచి 80 పైసలకు తగ్గించింది. అంటే టెలికం ఆపరేటర్లు రోమింగ్ లోకల్ ఎస్‌ఎంఎస్‌లు, రోమింగ్ లోకల్ కాల్స్‌కు వినియోగదారుల నుంచి గరిష్టంగా 25 పైసలను, 80 పైసలను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. రోమింగ్‌లోనూ, హోం సర్కిల్ లోనూ ఒకే రకమైన కాల్ చార్జీలు ఉండే ఆర్‌టీపీ, ఆర్‌టీపీ-ఎఫ్‌ఆర్ వంటి రోమింగ్ టారిఫ్ ప్లాన్‌లను ట్రాయ్ రద్దుచేసింది. వినియోగదారుల కోసం ‘స్పెషల్ రోమింగ్ టారిఫ్ ప్లాన్’లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది.