Roaming Service
-
జియో బంపర్ ప్లాన్: ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్
సాక్షి,ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కస్టమర్లకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను ప్రకటించింది. ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్ కాలింగ్ యాక్టివేషన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్ లో నెలకు 199రూపాయల ప్యాక్‌లో 25జీబీ డేటాని ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్ మే 15నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో జియో తెలిపింది. ముఖ్యంగా ఈ ప్యాక్ద్వారా జియో వినియోగదారులందరికీ అత్యంత ఆకర్షణీయమైన, ఇంటర్నేషనల్ కాలింగ్ అండ్ రోమింగ్ సౌలభ్యాన్నికూడా అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని పేర్కొంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. -
రూ.9కే అపరిమిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లు
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, రిలయన్స్ జియోకు పోటీగా మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే ఎంట్రీ-లెవల్ 9 రూపాయల రీఛార్జ్ ప్యాక్. ఈ కొత్త స్కీమ్ కింద అపరిమిత వాయిస్ కాల్స్‌ను, డేటాను, ఎస్ఎంఎస్లను వినియోగదారులకు అందించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. ఎయిర్టెల్ రూ.9 ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే వాలిడిటీలో ఉండనుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు అదనంగా రోజులో 100 ఎస్ఎంఎస్లను, 100 ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. జియో ఆఫర్ చేస్తున్న రూ.19 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, 20 ఎస్ఎంఎస్లు, 150ఎంబీ డేటాను మాత్రమే వినియోగదారులు పొందుతున్నారు. ధర పరంగా, ఆఫర్ల పరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. ఎయిర్టెల్ రూ.23 ప్లాన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 200 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్లను రెండు రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. కంపెనీ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు ఈ రూ.9 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోంబో ఆఫర్ సెక్షన్ కింద ఈ రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంది. నెల రోజుల పాటు ఇలాంటి ప్రయోజనాలు పొందాలనుకునే వారికి కూడా ఎయిర్టెల్ రూ.98 ప్యాక్‌ను ఇటీవల లాంచ్ చేసింది. దీని కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌పై ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను కస్టమర్లకు ఎయిర్టెల్ 28 రోజుల పాటు అందిస్తోంది. -
పడవ మునక.. 150 మంది మృతి
రోమ్: లిబియా నుంచి శరణార్ధులతో వస్తున్న పడవ మద్యధరా సముద్రంలో మునిగిపోవటంతో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.ప్రమాదం నుంచి బయటపడిన గాంబియాకు చెందిన ఒక వ్యక్తి ఈ విషయం తెలపటంతో వెలుగులోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం తెలిపిన వివరాల ప్రకారం గాంబియా, నైజీరియా, మాలి దేశాలకు చెందిన శరణార్ధులతో సోమవారం లిబియా తీరం నుంచి బయలుదేరిన పడవలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే అధిక బరువు కారణంగా పడవలోకి నీరు చేరి మునిగిపోయింది. సముద్రంలో తనకు దొరికిన ఖాళీ క్యాన్ సాయంతో ఓ వ్యక్తి బతికి బట్టకట్టగలిగాడు. ఈయూ నేతృత్వంలో మద్యధరా సముద్రంలో విన్యాసాలు చేస్తున్న స్పానిష్ మిలటరీ ఓడ సిబ్బంది గాంబియా వాసిని గుర్తించి ఇటలీలోని లంపెడుసా దీవికి సురక్షితంగా చేర్చారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లిబియా తీరం నుంచి పడవల్లో బయలుదేరిన దాదాపు 590 శరణార్ధులు కనిపించకుండాపోవటం లేదా చనిపోవటం జరిగిందని...తాజా ఘటనతో ఇది మరింత పెరిగిందని ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు. -
ఇక ఐడియా రోమింగ్ ఫ్రీ
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ: స్వదేశంలో రోమింగ్ చార్జీలను ఎత్తివేస్తూ ఐడియా సెల్యులర్ భారతీ ఎయిర్టెల్ బాటలో నడిచింది. ఏప్రిల్ 1 నుంచి తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు దేశీయంగా రోమింగ్‌లో ఇన్కమింగ్ కాల్స్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయ రోమింగ్‌కు సంబంధించి వేల్యూ ప్యాక్‌లను ఈ సందర్భంగా ప్రవేశపెట్టింది. దేశీయ రోమింగ్‌లో కాల్స్, ఎస్ఎంఎస్లపై చార్జీలను ఎత్తివేస్తూ భారతీ ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో పోటీగా ఐడియా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోమింగ్‌లో అవుట్గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లను సైతం తక్కువ చార్జీలకే అందిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది. సొంత సర్కిల్లో అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లను అదనపు చార్జీలు లేకుండా రోమింగ్‌లోనూ వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యాటకులకు రోమింగ్ కోసం రూ.2,499, రూ.5,999 ప్యాక్‌లను ప్రకటించింది. 400 అవుట్గోయింగ్ నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 3జీబీ బండిల్డ్ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ వీటిపై అందుకోవచ్చు. కాల వ్యవధి 30 రోజులు. 10 రోజుల వ్యాలిడిటీతో రూ.1,199 ప్యాక్ కూడా ఉంది. -
ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది..
-
ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది..
ముంబై: రిలయన్స్ జియోనుంచి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్ టేల్ యూజర్లకు శుభవార్త అందించింది. అంచనాల కనుగుణంగానే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కాల్,డ్యాటా చార్జీలు బెడద లేకుండా మొబైల్ సేవలను అనుభవించవచ్చని మార్కెట్ లీడర్ ఎయిర్ టెల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 1 2017నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. మొబైల్ సేవలలో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోమింగ్ కాల్స్‌కు ప్రీమియం చార్జీల రద్దు చేస్తున్నట్టు భారతి ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ ప్రకటించారు. ఏ దేశంలోఅడుగుపెట్టినా తమ యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఆన్ లో ఉంచుకోవచ్చని తద్వారా మొబైల్ నెట్ వర్క్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. తమ వినియోగదారులు ప్రపంచంలోని ప్రతి మూలలో ఎయిర్ టెల్ నెంబర్ ను అనుమతించేలా అంతర్జాతీయ రోమింగ్ రూపంలో భారీ మార్పులు తీసుకొస్తున్నామని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ ఆపరేటర్లు ధర అడ్డంకులను తొలగించడానికి సహకరించాలనీ, అన్యాయమైన బిల్లుల భయం లేకుండా కనెక్ట్ అయ్యేలా వినియోగదారులకు ఆఫర్లను అందించాలని కోరారు. ఈ సందర్భంగా వినియోగదారులకు కాల్ మరియు డేటా వినియోగం కోసం ఆకర్షణీయమైన మూడుప్యాకేజీలను ప్రకటించింది. 1, 5, 30రోజుల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. పాపులర్ డిస్టినేషన్లలో కాల్ చార్జీలను నిమిషానికి మూడు రూపాయలతో 90 శాతం, 3 ఎంబీ డాటాతో డేటా ఛార్జీలను 99 శాతం తగ్గించినట్టు ఎయిర్ టెల్ చెప్పింది. రూ.649 యూసేజ్దాటిన అమెరికావెళ్లే భారతీయ యూజర్లు ఆటోమేటిగ్గా వన్డే ప్యాక్ లోకి మారతారని, తద్వారా ఉచిత ఇన్ కమింగ్కాల్స్, ఎస్ఎంఎస్లతో పాటు 100 నిమిషాల ఇండియా, అమెరికా లోకల్ టాక్ టైం, 300ఎంబీ డాటా పొందుతారని తెలిపింది. అలాగే సింగపూర్ వెళ్లే (రూ.499) కస్టమర్ కూడా వన్ డేప్యాక్ కు తరలిస్తామని తెలిపింది. దీంతో రోమింగ్‌లో ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లను కూడా ఉచితం. అంతేకాదు డేటా రోమింగ్ చార్జీలూ ఉండబోవు. ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో భారతీ దాదాపు 3 శాతం నష్టపోయింది. -
జియో ఎఫెక్ట్:ఎయిర్టెల్ రోమింగ్ చార్జీలు రద్దు?
ముంబై: ఒక పక్క భారత టెలికాం మార్కెట్లో విభిన్న ఎత్తుగడలతో రిలయన్స్ జియో దూసుకుపోతోంటే .. మరోవైపు మార్కెట్ లీడర్స్ కూడా తదనుగుణంగా తమ స్ట్రాటజీలను మార్చుకుంటూ ముందుకు పోతున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఎయిర్ టెల్ టెలికాం ఇన్కమింగ్ కాల్స్ ,ఎస్ఎంఎస్లను ఉచితంగా అందించనుందని తెలుస్తోంది. మళ్లీ మునుపటి హ్యాపీడేస్ ను వినియోగదారులకు అందిస్తూ అవుట్ గోయింగ్ కాల్స్ , నేషనల్ డాటా రోమింగ్ పై ఎలాంటి అదనపు ప్రీమియం చార్జీలు ఉండవని ఆ నివేదిక తెలిపింది. తన యూజర్లను కాపాడుకోవడానికి భారీ ప్రణాళికలే రచిస్తోంది ఎయిర్ టెల్. ముఖ్యంగా విదేశాల్లో ప్రయాణించే వినియోగదారులకోసం అంతర్జాతీయ ప్లాన్లతో పాటు బిల్లింగ్ ను కూడా సరళతరం చేసే దిశగా కసరత్తు చేస్తోందిట. గతంలో అమలు చేసిన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టే దిశగా యోచిస్తోందిట. గతంలో 2013 నాటి ప్లాన్ తరహాలో రోజుకు రూ .5 ఛార్జ్ వద్ద ఎయిర్టెల్ 'ఉచిత ఇన్కమింగ్ కాల్స్' ను తిరిగి పరిచయం చేయనుందట. నెలకు రూ.79ల వన్ టైం ప్యాక్ కింద ఉచిత రోమింగ్ ఇన్కమింగ్ వాయిస్ సేవలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ తర్వాత వీటిని రద్దుచేసి రూ. 99 రీచార్జ్ ప్లాన్‌లో ఫ్రీ ఇన్ కమింగ్ , ఎస్ఎంఎస్కి 1.50 (రోమింగ్) లను ప్రవేశ పెట్టింది. అయినప్పటికీ ఈ మూడవ క్వార్టర్లో ఎయిర్ టెల్ లాభం 55 శాతం క్షిణించింది. గత నాలుగేళ్లలో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నిర్ణయంతో భారతి ఆదాయం, షేర్ ధరలపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్ షేరు 3-4.5 శాతం ప్రతికూలంగా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ స్థానిక కాల్ కోసం నిమిషానికి రూ .80 పైసలు, ఎస్టీడీ కాల్ కోసం నిమిషానికి రూ 1.15, ఇన్కమింగ్ కాల్ కోసం నిమిషానికి 45 పైసలు రోమింగ్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ నివేదికలపై ఎయిర్ టెల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా జియోకి పోటీని తట్టుకునే యోచనలో మరో టెలికాం దిగ్గజం వోడాఫోన్ దేశవ్యాప్తంగా గత ఏడాది దీపావళి సందర్భంగా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిర్టెల్ ఉచిత రోమింగ్ ఆఫర్ తో దేశవ్యాప్త రోమింగ్ ఛార్జీలు తగ్గింపుపై ఇతర దేశీయ టెలికాం ఆపరేటర్లు కూడా దృఫ్టి పెట్టే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. -
దీపావళి కానుకగా... వొడాఫోన్ ఫ్రీ రోమింగ్!
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియా తాజాగా తన వినియోగదారులకు దీపావళి (అక్టోబర్ 30) నుంచి నేషనల్ రోమింగ్‌లో ఫ్రీ ఇన్కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై రోమింగ్‌లో ఉన్న యూజర్లు రెట్టింపు చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 30 నుంచి వొడాఫోన్ కస్టమర్లు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ పొందొచ్చు. ఈ చర్య మా 20 కోట్ల మంది కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అని వొడాఫోన్ ఇండియా డెరైక్టర్ (కమర్షియల్) సందీప్ కటారియా తెలిపారు. -
జియో బంపర్ టారిఫ్‌లు ఇవే!!
-
జియో బంపర్ టారిఫ్‌లు ఇవే!!
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులపై యూజర్లకు ముకేశ్ అంబానీ బంపర్ టారిఫ్‌లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ టెలికాం పరిశ్రమ అందించలేని టారిఫ్‌లను వినియోగదారులు ముందుకు తీసుకొచ్చారు. ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాలింగ్, అపరిమిత మెసేజింగ్ సదుపాయం, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఎలాంటి ప్రత్యేక చార్జీలుండవని ప్రకటించిన ముకేశ్, విద్యార్థులకు స్టూడెంట్ ఐడీ కార్డుపై 25 శాతం అదనపు డేటాను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ లాంచ్ అనంతరం వెల్కమ్ ఆఫర్ కింద అందరికీ ఒక నెల ఉచిత సర్వీసులను అందించనున్నట్టు వరాల జల్లులు కురిపించారు. వచ్చే ఏడాది కల్లా కోటి వై-ఫై కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్న ముకేశ్, ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలపైనే ఎక్కువగా దృష్టిసారించారు. టెలికా పరిశ్రమలో విప్లవం సృష్టించే జియో డేటా టారిఫ్‌లు.... 1 ఎంబీ డేటా 5 పైసలు 1జీబీ డేటా 50 రూపాయలు 28 రోజులకు 300 ఎంబీ 4జీ డేటా టారిఫ్ రూ.149 రూ.499కు 4 జీబీ 4 జీ డేటాతో పాటు నైట్ అన్లిమిటెడ్ డేటా యూసేజ్ వై-ఫై హాట్స్పాట్లతో రిలయన్స్ జియోపై 8 జీబీ డేటాను పొందవచ్చు. రూ.999లకు 10 జీబీ 4 జీ డేటా, 20 జీబీ వై-ఫై యూసేజ్, నైట్ అన్లిమిటెడ్ యూసేజ్ రూ.1,499లకు 20 జీబీ 4 జీ డేటా రూ.2,499కు 35 జీబీ 4 జీ డేటా రూ.3,999కు 60 జబీ 4 జీ డేటా రూ.4,999కు 75 జీబీ 4జీ యూసేజ్, నైట్ అన్లిమిటెడ్, 150 జీబీ వై-ఫై డేటా -
గమ్యం చేరిన ప్రయాణం
ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన ఓ వ్యక్తి ఏం చేస్తుంటాడు చెప్పండి..? హా..! ఏం చేస్తాడు ఏదో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడనుకుంటాం. కానీ కల్యాణ్ అక్కిపెద్ది మాత్రం అలా చేయట్లేదు. రూ.లక్షల్లో జీతం, నగరం జీవితం...ఇవేవి అతనికి తృప్తి నివ్వలేవు. వచ్చే జీతం జేబును నింపుతోంది కానీ మనసును తాకట్లేదు. ఉద్యోగం మానేసి తన సంతోషం ఎక్కడుందో వెతుక్కోవాలని... ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. చివరికి తను కోరుకున్న గమ్యాన్ని ఎలా చేరుకున్నాడో చూడండి..! మే 30... కల్యాణ్ 38వ పుట్టిన రోజున వచ్చిన ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. ఇంకా ఎన్నాళ్లు బతికుంటానని ఆలోచించసాగాడు కల్యాణ్. లెక్కలు వేసుకున్నాడు ‘మహా అయితే ఓ 30 ఏళ్లు. అంటే సుమారుగా పదివేల రోజులు. ఈ సమయంలో ఏం చేయగలను. ఏం సాధించగలను’ అని అతనిలో అతనే మధన పడిపోయాడు. ఆ మరుసటి రోజే తను పనిచేస్తోన్న ఆఫీసుకెళ్లాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. దేశమంతా పర్యటన ఏ ప్రయాణానికైనా గమ్యం ఉంటుంది. కానీ కల్యాణ్ మొదలు పెట్టిన ప్రయాణానికి మాత్రం గమ్యమంటూ లేదు. దేశం మొత్తం తిరగాలని నిశ్చయించుకున్నాడు. చాలా మంది భారతీయుల జీవితాల్లో పేదరికం ఎలాంటి పాత్ర పోషిస్తోందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయాణంలో కల్యాణ్ తనకి తాను ఒక షరతు విధించుకున్నాడు. తన తిండికి గానీ వసతికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఏదో పనిచేస్తూ తన అవసరాలను తీర్చుకున్నాడు. 2008లో మొదలు పెట్టిన ఈ ప్రయాణాన్ని సుమారు రెండున్నరేళ్ల పాటు కొనసాగించాడు. ఈ సమయంలో కల్యాణ్ ఎక్కువగా గ్రామీణ భారతాన్ని చుట్టాడు. మన ప్రయాణాల్లో కొన్ని మనకి ఇబ్బంది కలిగించే అంశాలు, మరికొన్ని స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఎదురవుతుంటాయి. కల్యాణ్ వెతుకుతున్న గమ్యం గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉండే గిరిజనుల రూపంలో దొరికింది. సుమారు 8 నెలల పాటు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ కొన్ని గిరిజన తెగల జీవన శైలిని చూసి ఆశ్చర్యపోయాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. జీవితం పట్ల వారికి ఎలాంటి ఫిర్యాదులు లేవు. తమకున్న అవకాశాలను వాడుకుంటూ డబ్బులు సంపాదిస్తూ హాయిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసిన కల్యాణ్‌కి ఒక ఆలోచన వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించాలంటే రూ.కోట్లు ఖర్చు చేయడానికి బదులు, ప్రజల్లో స్వయంగా సంపాదన సృష్టించుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఎలా ఉంటుందనుకున్నాడు. తిరిగి స్వగ్రామానికి రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణానంతరం కల్యాణ్ తిరిగి తన స్వగ్రామం అనంతపురం చేరుకున్నాడు. సుమారు 166 గ్రామాలు సందర్శించిన తర్వాత ‘టెకులోడు’ అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. మొదట్లో ప్రతి రోజూ గ్రామంలోని ఒకరి ఇంట్లో ఉంటూ వారితో కలసి పనిచేస్తూ... రాత్రి ఆ కుటుంబంతోనే భోజనం చేసేవాడు. అలా సుమారు 100 రోజులు పాటు 100 కుటుంబాల స్థితిగతులను వారి ఆర్థిక పరిస్థితులను ఒక డాక్యుమెంటరీగా రూపొందిచాడు. చివరగా ఒక కుటుంబంతో కలసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. కల్యాణ్ వారి కుటుంబంలో చేరక ముందు ఆ కుటుంబం ఆదాయం ఏడాదికి కేవలం రూ. 6500. కానీ వారితో చేయి కలిపి వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు ఉపయోగిండంతో 8 నెలలు తిరిగేలోపే నెలకు రూ.14 వేలు సంపాదించే స్థాయికి ఆ కుటుంబం చేరుకొంది. ‘ప్రోటో విలేజ్’ లక్ష్యంగా ఏడాదికి రూ. ఆరు వేల నుంచి నెలకి రూ. 14 వేల ఆదాయం సాధించడంతో...సాధికారత సాధించడం సాధ్యమేనని కల్యాణ్ బలంగా నమ్మాడు. ఇదే ప్రేరణతో ‘ప్రొటో విలేజ్’ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య, తండ్రి సహాయంతో అదే గ్రామంలో ఓ 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. తన ఆలోచనని మొదటగా గ్రామస్తులతో చెప్పినపుడు పది కుటుంబాలు దీనికి అంగీకరించాయి. ప్రస్తుతం ఈ ప్రోటో విలేజ్‌లో సుమారు 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ మొత్తం స్థలాన్ని అన్ని కుటుంబాలకు సమానంగా కేటాయించడం విశేషం. ఇప్పుడు ఆ గ్రామంలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆరు నెలల కాలంలో ఎనిమిది చెరువులను తవ్వారు. సోలార్‌తో గ్రామంలో స్వయంగా విద్యుత్‌ని సృష్టించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నాను ‘మొదట్లో మా కుటుంబ సభ్యులు... అంత జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని ఎలా సంతోషంగా ఉంటావురా.? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు గ్రామంలోని ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను చూసి వారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా జీవితంలో అనుకున్నది సాధించడంలో విజయవంతమవుతున్నా. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు. లక్షల రూపాయలు సంపాదించినా రాని సంతోషం నాకు ఇప్పుడు కలుగుతోంది’ అని అంటున్నాడు ఈ ‘రియల్ లైఫ్ శ్రీమంతుడు’. 2017 ఆగస్టు నాటికి తమ ‘ప్రోటో విలేజ్’ని ప్రపంచానికి పరిచయం చేస్తామంటున్నాడు కల్యాణ్. -
సిమ్ కార్డు లేకుండా రోమింగ్ ఇంటర్నెట్!
వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ముందుగా ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో ప్రవేశపెడుతోంది. వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది. దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది. థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు. -
వణికిస్తున్న 'నింజా' సూపర్ హీరో..!
రోమన్లు ఇప్పుడా ఆకారాన్ని చూసి వణికిపోతున్నారు. సుమారు ఇరవై ఏళ్ళ వయసు.. నల్లని ముసుగులాంటి షినోబి వస్త్రధారణ.. చేతిలో 19 అంగుళాల కత్తితో జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ వార్సా వీధుల్లో తిరుగుతూ జనాలను భయకంపితుల్ని చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? హంతక ముఠాకు చెందిన వాడా? గూఢచారా? ఇలా రకరకాల ప్రశ్నలు? చివరికి పోలీసులను కూడా ఆశ్రయించారు.. అయితే వారి సమాధానాన్ని విని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు... మధ్యయుగం కాలంలో జపాన్ దేశానికి చెందిన కిరాయి హంతక ముఠాలను 'నింజాలు' అనేవారు. అప్పట్లో వీరు అత్యంత కఠినమైన శిక్షణ పొంది, హత్యలు, గూఢచర్యం, దొంగతనాలకు పాల్పడటంతో పాటు శత్రుస్థావరాల్లోకి ప్రవేశించడంలో నిష్ణాతులుగా ఉండేవారట. జపాన్ ఏకీకరణ తర్వాత వీరు అంతరించి పోయారు. అయితే నేటికీ వారి పాత్రలతో సృష్టించిన సినిమాలు, వీడియో గేమ్ ల కు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. వారి వస్త్రధారణను అనుకరించడం, వారి ఫైట్లను ప్రాక్టీస్ చేయడం చిన్నతనంలో కొందరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ప్రస్తుతం వార్సా వీధుల్లో రోమన్లను హడలెత్తిస్తున్న ఆ యువకుడు సెజరీ.. అదే కోవకు చెందినవాడట. నల్లని వస్త్రాల్లో కళ్ళు మాత్రమే కనిపించేలా ముసుగుతో ఉన్న అతడు... 19 అంగుళాల నింజాటో పేరుగల నింజా కత్తిని వెనుక తగిలించుకొని వార్సా వీధుల్లో తిరుగుతున్నాడు. టీనేజ్ లో నింజా ఫైటర్ కావాలనుకుని కలలు కన్న అతడు.. ఇప్పుడు స్థానికుల్ని భయాందోళలకు గురి చేస్తున్నాడు. అతడి భయంతో కొందరు సీక్రెట్ నింజా ఆఫ్ గ్రోచో అంటూ భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు అతడ్ని ఏమీ చేయలేమని, అతడివల్ల ఎవరికీ హాని జరగటం లేదంటూ చేతులెత్తేశారు. ''మేం అతడ్ని ఎన్నోసార్లు చూశాం. అతడు మాకు బాగా తెలిసిన వ్యక్తే. అంతేకాదు అతడితో ఎలాంటి ముప్పు లేదు. పోలీసులకు కూడా అతడి వల్ల ఎలాంటి సమస్యా లేదు. హింసాత్మకంగా కూడా ప్రవర్తించడం లేదు. అతడితో ప్రమాదం లేదు'' అంటున్నారు పోలీసులు. అయితే కొందరు ఈ 21 ఏళ్ళ ముసుగు వీరుడ్ని నింజా సూడో సూపర్ హీరోగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మూడువేలమంది మద్దతుదారులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్నో కామెంట్లు వచ్చాయి. గ్రోచో సూపర్ హీరోకి గ్రీటింగ్స్ కూడా పంపిస్తున్నారు. కొందరైతే మేం వార్సాలో లేకపోవడం మా దురదృష్టం.. అందుకే మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు సూపర్ హీరోను మేం చూశామని.. ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. ''నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నాపై దుండగులు దాడికి దిగారు. అప్పుడు నేను ముష్టి యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. అప్పట్లో నేననుకున్నాను. అటువంటి వస్త్రధారణ, చేతిలో కత్తి ఉంటే స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని.. ఆ తర్వాతే డ్రస్, నింజా కత్తిని కొన్నాను.'' అంటాడు నింజా సూపర్ హీరో సెజరీ. అంతేకాకుండా తాను చిన్నప్పుడు జపనీస్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, అప్పట్నుంచే తనకు అటువంటి వేషధారణ అంటే ఇష్టమని చెప్తున్నాడు సెజరీ. అందుకే తాను ఓ చెక్క కత్తిని కొన్నానని, అది ధరించి వెడుతున్న సమయంలో ఎవరైనా తనను సమీపించేందుకు భయపడతారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితుడు తనకు లీఫ్ స్పింగ్ తో తయారు చేసిన కత్తిని మూడు యూరోలకు అమ్మాడని, ఆ తర్వాత ఓసారి వీధిలో వెడుతుండగా తనపై దాడి జరిగితే అడ్డుకోగలిగానని సెజరీ తన కత్తి కథను ఎంతో ఇష్టంగా తెలిపాడు. ప్రస్తుతం కత్తి లేకుండా సెజరీ ఇంటినుంచి బయటకు రానేరాడట. తనపై గ్రోచో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు కూడా తెలుసునని, అయితే కౌన్సిల్... వార్సా మేయర్ తో సమావేశం ఏర్పరచి తాను ఎవరికీ హాని చేయని వ్యక్తిగా చెప్పిందని పేర్కొన్నాడు. మనం ఎవ్వరికీ హాని చేయనప్పడు.. మనం ఎలా కావాలంటే అలా స్వతంత్రంగా బతికే హక్కుందని సెజరీ అంటున్నాడు. ఏదేమయినా 'నింజా' సూపర్ హీరో మాత్రం వార్సా వీధుల్లో చల్ హల్ చేస్తున్నాడనే చెప్పవచ్చు. -
వారిని మౌంటెయిన్ లయన్ వణికిస్తోంది
న్యూయార్క్: శాన్ ప్రాన్సిస్కోలోని పర్వతారోహకులను మౌంటెయిన్ లయన్ తీవ్రంగా భయపెడుతోంది. చాలా ఏళ్ల తర్వాత అక్కడి పర్వతారోహకులకు సింహం కనిపిండచంతో వారంత వణికి పోతున్నారు. గత పది రోజుల్లోనే నాలుగు సందర్భాల్లో సింహం తారస పడినట్లు అక్కడి నలుగురు పర్వతారోహకులు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం అది మగమృగరాజు అని తెలిసింది. జూన్ 30న ఒంటరిగా పర్వతంపై తచ్చాడుతున్న మగ సింహాన్ని తాము తొలిసారి చూసినట్లు ముగ్గురు వ్యక్తులు అధికారులకు తెలిపారు. దీంతోపాటు అక్కడ అమర్చిన ఓ కెమెరాలో కూడా ఆ సింహం కనిపించింది. కానీ, ఉన్నట్లుండి గత శుక్రవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో అటువైపుగా వెళ్లాలంటేనే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. అది ఎక్కడ ఉందో, ఏ క్షణం దాడి చేస్తుందోనన్న గుబులు కూడా అధికారులను వేధిస్తోంది. అసలు, అంత ఎత్తు ఉన్న పర్వతంపైకి సింహం ఎలా వచ్చిందో అనేది ఇప్పటికీ వారికి అర్థం కానీ విషయం. అధికారుల అంచనా ప్రకారం ఆ సింహం శాన్ ప్రాన్సిస్కోలోని దక్షిణ భాగం వైపుగా వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానిని బందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. -
కొనసాగిన 'లేట్ నైట్ రోమియో'
చాంద్రాయణగుట్ట: అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ, కాలక్షేపం చేసే పోకిరీ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ లేట్‌నైట్ రోమియో' మంగళవారం రాత్రి కూడా సాగింది. మొత్తం 17 పోలీస్స్టేషన్ల పరిధిలో అర్థరాత్రి పనీపాటా లేకుండా తిరిగే 110 మంది యువకులను సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఫలక్‌నుమా నబీల్ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. బుధవారం ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయనున్నారు. తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, మరోసారి వారు అర్థరాత్రి రోడ్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించనున్నారు. -
రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ ధరలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ ధరలు మే 1 నుంచి తగ్గనున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ టారిఫ్ ధరలను తగ్గించటంతో రోమింగ్ మొబైల్ కాల్స్ 23 శాతం వరకు, ఎస్ఎంఎస్ ధరలు 75 శాతం వరకు తగ్గనున్నాయి. ట్రాయ్ రోమింగ్ ఎస్టీడీ కాల్స్ చార్జీలను (నిమిషానికి) రూ.1.5 నుంచి రూ.1.15కు, రోమింగ్ ఎస్ఎంఎస్ ధరలను రూ.1.5 నుంచి 38 పైసలకు, రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్ ధరలను 75 పైసలు నుంచి 45 పైసలకు తగ్గించింది. రోమింగ్‌లో వుండగా చేసే లోకల్ ఎస్ఎంఎస్ ధరలను రూ.1 నుంచి 25 పైసలకు, రోమింగ్ లోకల్ కాల్స్ ధరలను రూ.1 నుంచి 80 పైసలకు తగ్గించింది. అంటే టెలికం ఆపరేటర్లు రోమింగ్ లోకల్ ఎస్ఎంఎస్లు, రోమింగ్ లోకల్ కాల్స్‌కు వినియోగదారుల నుంచి గరిష్టంగా 25 పైసలను, 80 పైసలను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. రోమింగ్‌లోనూ, హోం సర్కిల్ లోనూ ఒకే రకమైన కాల్ చార్జీలు ఉండే ఆర్టీపీ, ఆర్టీపీ-ఎఫ్ఆర్ వంటి రోమింగ్ టారిఫ్ ప్లాన్లను ట్రాయ్ రద్దుచేసింది. వినియోగదారుల కోసం ‘స్పెషల్ రోమింగ్ టారిఫ్ ప్లాన్’లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది. -
విడిపోయినా.. రోమింగ్ ఉండదు!
-
విడిపోయినా.. రోమింగ్ ఉండదు!
ఒకే టెలికం సర్కిల్ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాక్షి, హైదరాబాద్: అపాయింటెడ్ డే అయిన జూన్ 2న రాష్ట్రం విడిపోయినా... ఒక అంశంలో మాత్రం ఒకటిగానే ఉండిపోనుంది. టెలికం విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒకే సర్కిల్ కింద కొనసాగనున్నాయి. దీంతో ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి వచ్చినా.. సెల్ఫోన్లకు రోమింగ్ మోత ఉండదు. ఎప్పటి మాదిరిగానే సెల్‌ఫోన్ వినియోగదారులు సాధారణ చార్జీలపైనే వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార పనులపై తిరిగే ఇరు ప్రాంతాలవారికి రోమింగ్ బెడద ఉండదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తమ మాతృరాష్ట్రాల నుంచి విడిపోయినప్పుడు టెలికం సర్కిళ్లను విభజించలేదు. ఇప్పటికీ అవి వాటి మాతృరాష్ట్రాలతో ఒకే సర్కిల్లో కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోనున్నప్పటికీ టెలికం సర్కిల్ ఒకటిగానే ఉండనుంది. ముఖ్యంగా ట్రాయ్ నిబంధనలతో పాటు టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చే లెసైన్స్ కాలపరిమితి తదితర అంశాల నేపథ్యంలో టెలికం సర్కిళ్లను విభజించడానికి అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆ లెసైన్సుల కాలపరిమితి 30 నుంచి 40 ఏళ్లవరకు ఉండటంతో.. ఆ తర్వాతే సర్కిళ్ల విభజన జరిగే అవకాశం ఉంది. దానికితోడు ట్రాయ్ నిబంధనల ప్రకారం కూడా 2024 వరకు జరిగే రాష్ట్ర విభజనలకు రోమింగ్ వర్తించదు. అసలు ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రోమింగ్ చార్జీలను రద్దు చేసేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తోంది.