సిమ్ కార్డు లేకుండా రోమింగ్ ఇంటర్నెట్!
వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ముందుగా ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో ప్రవేశపెడుతోంది.
వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది. దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది.
థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్‌వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు.