రాంచీ: జార్ఖండ్‌లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్‌సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం
Comments
Please login to add a commentAdd a comment