SIM
-
ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మోసాలకు బలైపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నవారు కోకొల్లలు. ఇటీవల ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ మహిళ సుమారు రూ. 27 లక్షలు పోగొట్టుకుంది.నోయిడాలోని సెక్టార్ 82లో నివాసం ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 'జ్యోత్సానా భాటియా'కు ఆగస్టు 31న టెలికాం కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపింది. మొబైల్ ఫోన్ పోయినట్లయితే.. యాక్టివేట్ అయ్యే ఈసిమ్ కొత్త ఫీచర్ల గురించి కాలర్ ఆమెకు చెప్పినట్లు వెల్లడించింది. కాలర్ చెప్పేది నిజమని నమ్మని భాటియా 'ఈసిమ్'కు మారేందుకు అతడు సూచించిన విధంగా చేసింది. ఇందులో భాగంగానే ఆమె మొబైల్‌కు వచ్చిన ఒక కోడ్ ఎంటర్ చేయమని అడగగా.. ఆమె అది కూడా పూర్తి చేసింది.కాలర్ చెప్పినవన్నీ చేసిన తరువాత ఆమె సిమ్ డీయాక్టివేట్ అవుతుందని.. మరో రెండు మూడు రోజుల్లో ఫిజికల్ సిమ్ వస్తుందని చెప్పాడు. మూడు రోజుల తరువాత కూడా ఆమెకు సిమ్ రాలేదు. దీంతో ఆమె కస్టమర్ కేర్ సిబ్బందికి కాల్ చేసింది. వారు డూప్లికేట్ సిమ్ కోసం సర్వీస్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు. ఆమె వారు చెప్పినట్లుగా సర్వీస్ సెంటర్ వద్ద డూప్లికేట్ సిమ్ తీసుకుని ఫోన్లో వేసుకుని యాక్టివేట్ చేసింది.మొబైల్ నెంబర్ యాక్టివేట్ అవ్వగానే.. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు డిడెక్ట్ అయినట్లు వరుస మెసేజ్‌లు వచ్చాయి. సైబర్ నేరస్థుడు తన ఫిక్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీసుకున్నట్లు, కొంత డబ్బు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమె పేరుమీద రూ. 7.40 లోన్ కూడా తీసుకున్నట్లు తీసుకుంది.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం సైబర్ నేరగాడు.. మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ అప్లికేషన్ హ్యాక్ చేసి.. ఈ మెయిల్ ఐడీలను సైతం మార్చేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. మొత్తం మీద ఆమె రూ. 27 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. నిందితున్న పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.ఈ-సిమ్ అంటే..ఈ-సిమ్ అనేది ఒక డిజిటల్ సిమ్ కార్డు. కాబట్టి ఈ-సిమ్ ఉపయోగిస్తే.. ఫిజికల్ సిమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనిని అధికారిక వెబ్సైట్లో లేదా సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు. ఈ-సిమ్ పొందాలనుకునేవారు టెలికామ్ ఎగ్జిక్యూటివ్‌ను కలిసిన తరువాత మారడం ఉత్తమం. -
బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్‌ఫారమ్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by— DoT India (@DoT_India) August 10, 2024 -
డేంజర్ యాప్స్‌పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్‌లను గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్‌లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్‌లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్‌పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లో, స్పెయిన్‌కు చెందిన హోలాఫ్లై రెండు యాప్‌లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్‌లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్‌కార్డ్‌లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్‌కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్‌కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్‌ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
అమెరికా నుంచి యాపిల్ (Apple) ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) మోడల్ తెప్పించుకుంటున్నారా? భారత్‌లో కంటే ధర తక్కువన్న కారణంతో అక్కడ ఉంటున్న బంధువులు, స్నేహితుల ద్వారా ఈ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఐఫోన్ 15 మోడల్‌లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సహా భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ఆఫ్‌లైన్ యాపిల్ స్టోర్లు, ఆన్లైన్ ఛానెల్‌లలో కస్టమర్లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. కాగా ఐఫోన్ 15 ప్రో ధర భారత్‌లో రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అయితే రూ. 1,59,900 ఉంది. (iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో) అదే సమయంలో ఐఫోన్ ప్రో మోడల్స్‌ను దిగుమతి చేసుకునే గ్రే మార్కెట్ ప్రాక్టీస్ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. విదేశాల్లోని తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా భారతీయ కస్టమర్లు అక్కడ ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్, యూఏఈ వంటి దేశాలలో ఐఫోన్ ప్రో మోడల్స్ తక్కువ ధరకు లభిస్తుండటమే దీనికి కారణం. అమెరికా ఐఫోన్లతో ఇదే సమస్య అయితే విదేశాల్లో లభించే ఐఫోన్లలో ఉండే సమస్యల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ముఖ్యమైనది ఫిజికల్ సిమ్ స్లాట్ లేకపోవడం. ప్రధానంగా యూఎస్ నుంచి కొనుగోలు చేసే ఐఫోన్ 15 ప్రో లేదా ఐఫోన్ 15లలో ఈ-సిమ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యాపిల్ ఆ దేశంలో ఫిజికల్ స్లాట్లతో కూడిన ఫోన్లను విక్రయించడం ఆపేసింది. కాబట్టి ఫిజికల్ సిమ్ స్లాట్ కావాలంటే యూఎస్ వేరియంట్‌ను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఇక యూరప్, యూఏఈ వంటి ఇతర దేశాల్లో లభించే ఫోన్లకు సింగిల్ సిమ్ స్లాట్లు ఉంటాయి. ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్లు కావాలంటే.. హాంకాంగ్‌లో లభించే ఐఫోన్లు ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్లతో వస్తాయి. ఏకకాలంలో రెండు సిమ్ కార్డ్‌లను వీటిలో ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ భారత్‌లో విక్రయిస్తున్న ఐఫోన్ 15 ప్రో వేరియంట్లో కూడా లేదు. ఇందులో ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్...!
న్యూ ఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ యోనో, యోనో లైట్లో 'సిమ్ బైండింగ్' అనే కొత్త మెరుగైన భద్రతా ఫీచర్‌ను ప్రారంభించింది. సిమ్ బైండింగ్ ఫీచర్‌తో కొత్త యోనో, యోనో లైట్ యాప్‌లను ఉపయోగించే ఖాతాదారులను వివిధ డిజిటల్ మోసాల నుంచి రక్షించనుంది. సిమ్ బైండింగ్ ఫీచర్‌తో కేవలం బ్యాంక్‌లో నమోదైన మొబైల్ నంబర్ల సిమ్ ఉన్న ఫోన్లలో మాత్రమే యోనో, యోనో లైట్ యాప్‌లు పనిచేస్తాయి. అయితే, ఖాతాదారులు బ్యాంకుతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్ ఉపయోగించి ఒకే మొబైల్ పరికరంలో యోనో, యోనో లైట్ యాప్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్ బ్యాంక్‌లో నమోదు చేయని మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తుంటే, యోనో, యోనో లైట్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయలేరు. ఈ సందర్భంగా ఎస్బీఐ డీఎమ్డీ (స్ట్రాటజీ) & చీఫ్ డిజిటల్ ఆఫీసర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..యోనో, యోనో లైట్ యాప్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫాంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎస్బీఐ తెచ్చిన కొత్త ఫీచర్‌తో ఖాతాదారులందరికీ మెరుగైన భద్రతను అందిస్తోంది. అంతేకాకుండా కస్లమర్లను ఎల్లప్పుడూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. సిమ్ బైండింగ్ ఫీచర్‌ను ఇలా యాక్సెస్ చేయండి...! మెరుగైన భద్రతా ఫీచర్లతో వచ్చిన యోనో, యోనో లైట్ యాప్‌ల కొత్త వెర్షన్‌ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారులు తమ మొబైల్ యాప్‌ని అప్డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా యోనో, యోనో లైట్ యాప్‌లలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్‌ను బ్యాంకు ధృవీకరిస్తుంది. కస్టమర్లు రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్ సిమ్ ఉన్న మొబైల్లో తమను తము నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. -
అలర్ట్: యోనో యాప్ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే
కరోనా కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) యాప్ యోనోలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను పెంచి, వినియోగదారుల అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు ఎస్బీఐ యోనో యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్లు చేస్తుంది.తాజాగా వినియోగదారుల భద్రతే లక్ష్యంగా యోనోలైట్ యాప్‌లో 'సిమ్ బైండింగ్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. Now online banking is more secure than ever with SBI! Download the latest YONO Lite app now: https://t.co/uP7JXenNsP #YONOLite #YONO #OnlineBanking #SafeBanking #BeSafe pic.twitter.com/lsLluyYXoq — State Bank of India (@TheOfficialSBI) July 27, 2021 'ఇప్పుడు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ గతంలో కంటే మరింత సురక్షితం! సరికొత్త యోనో లైట్ యాప్‌ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి' అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. సిమ్ బైండింగ్ ఫీచర్ వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో ఒక యూజర్‌కి మాత్రమే అనుమతి ఉంది. యూజర్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో కాకుండా వేరే నెంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేసి లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతి లేదు. యోనో లైట్ యాప్‌లో రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం ►ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుండి ఎస్బీఐ యోనో లైట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి ►యాప్ ఓపెన్ చేసిన తరువాత ఎస్బిఐలో సిమ్ 1 లేదా సిమ్ 2 ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఒకే సిమ్ ఉంటే సిమ్ సెలక్షన్ అవసరం లేదు. ► అనంతరం మొబైల్ నంబర్ కన్ఫాం కోసం ఓటీపీ అడుగుతుంది. ►ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది ►ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మీ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ►అనంతరం కండీషన్స్‌కు ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ►దీంతో మరో సారి మీ నెంబర్‌కు యాక్టివేషన్ ఓటీపీ వస్తుంది. ►ఆ ఓటీపీని ఎంటర్ చేసి యోనోలైట్ యాప్‌ను వినియోగించుకోవచ్చు. చదవండి: Cryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్ చేయడం లేదు -
సిమ్ బ్లాక్.. ఖాతాకు షాక్
రామనాథ్ బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆన్లైన్, మొబైల్ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇటీవల నాలుగురోజులు ఆయన సిమ్ పనిచేయలేదు. ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని మరో ఫోన్ వాడారు. కొద్దిరోజులకు బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటే భారీగా తేడా కనిపించింది. అయ్యో అనుకుంటూ బ్యాంకుకు వెళ్తే లావాదేవీల వివరాలన్నీ మీ సిమ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. కానీ అతని సిమ్ నంబరుతో మరొకరు అప్పటికే సిమ్ తీసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నట్లు తేలింది. ఈ తరహా నేరాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. కర్ణాటక, బనశంకరి:సైబర్ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులు, పోలీసు సైబర్ క్రైమ్ విభాగాలు ఎన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రజల కష్టార్జితానికి భద్రత ఇవ్వలేకపోతున్నారు. ఆన్‌లైన వంచకులు రోజురోజుకు విస్తరిస్తున్న సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త తరహా పద్ధతుల్లో ప్రజల ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులకు ఫోన్లు చేసి తమను తాము బ్యాంకు ప్రతినిధులుగా పరిచయం చేసుకొని లేదా లాటరీ వచ్చిందని, విదేశాల నుంచి బహుమతులు వచ్చాయని అందుకు డబ్బులు చెల్లించాలంటూ ఖాతాదారులను నమ్మించి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం లేదా డబ్బు డిపాజిట్ చేయించుకుంటూ దోచుకునేవారు. బ్యాంకులు, సైబర్ క్రైమ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మరోవైపు ఇటువంటి మోసాలపై ప్రజలకు కూడా అవగాహన కలగడంతో సైబర్ క్రైమ్ నిందితులు రూటు మార్చారు. మొబైల్ బ్యాంకింగ్దారులే లక్ష్యం తాజాగా సైబర్ వంచకులు మొబైల్‌సిమ్ స్వైపింగ్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్‌బ్యాంకింగ్ వ్యవహారాలను నిర్వహించేవారి మొబైల్ సిమ్ కార్డులను బ్లాక్ చేసి అవే నంబర్లతో కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసి అకౌంట్లకు కన్నం వేస్తున్న నేరాలు వెలుగుచూస్తున్నాయి. సిమ్ స్వైపింగ్ లేదా సిమ్ క్లోనింగ్ పేరుతో కొత్తమార్గాలను సైబర్ నేరగాళ్లు అన్వేషిస్తుండటంతో పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఇప్పటికి 12 కేసులు వెలుగులోకి నగరంలో దీనిపై ఇప్పటివరకు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు హరీశ్ అనే వంచకుడిని అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు అందించి సిమ్, బ్యాంక్ అకౌంట్ తెరిచిన నేపథ్యంలో వంచకుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారుతోందని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యశవంతకుమార్ తెలిపారు. మోసం జరుగుతుంది ఇలా ఈ మోసాలకు ఎలా పాల్పడతారంటే... నెట్ బ్యాంకింగ్ ఉన్న బ్యాంకు కస్టమర్లు మొబైల్ నెంబర్ తీసుకున్న తరువాత గుర్తింపు కార్డు దొంగలించి నకిలీ ఐడీ కార్డు సృష్టిస్తారు. ఎప్పుడైనా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మూడు నాలుగు రోజుల వరుస సెలవుల సమయంలో సిమ్ పోయిందని తెలిపి నకిలీ ఐడీకార్డు అందించి కొత్త సిమ్ సంపాదిస్తారు. దీంతో కస్టమర్లు అసలు సిమ్‌కార్డు బ్లాక్ అవుతుంది. వరుస సెలవులు ఉన్నందున కస్టమర్లు విచారించడానికి వెళ్లినా సిమ్ దుకాణాలు తెరిచి ఉండవు. ఈ సమయంలో వంచకులు సిమ్ ఆక్టివ్ చేసుకుని నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ అవుతారు. ఓటీపీ కొత్త సిమ్ రావడం, మోసగాళ్లు జనం బ్యాంక్ అకౌంట్ల నుంచి నగదు దోచుకోవడం జరిగిపోతుంది. మోసపోతున్న బాధితులు కస్టమర్లు సిమ్‌కార్డు బ్లాక్ చేయడం పట్ల సిమ్‌కార్డు దుకాణం వద్ద కు వెళ్లి విచారించినప్పటికీ ఈ సమయంలో ఏమి జరిగింది అనేది తెలీదు. దీంతో ఎలాంటి అనుమానం లేకుండా మరో కొత్త సిమ్ కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. కానీ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే వంచన వెలుగులోకి వస్తుంది. అంతలోగా సైబర్‌నేరగాళ్లు కస్టమర్లు అకౌంట్లులో ఉన్న నగదు నొక్కేస్తారు. సిమ్ బ్లాక్ అయితేజాగ్రత్త ♦ ఒక్కసారిగా సిమ్‌కార్డు బ్లాక్ అయితే ఏదో జరగరానిది జరిగిందని అనుమానించాలి. ♦ సిమ్ ఆపరేటర్ దుకాణానికి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ♦ బ్యాంకుకు వెళ్లి ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌ను బ్లాక్ చేయించండి. లావాదేవీల ఎస్ఎంఎస్లను మరో సిమ్ నంబరుకు మార్చుకోవడం చేయాలి. ♦ పాత సిమ్‌ను తొలగించి అదే నంబరుతో కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలి. -
ఇక ఒక్కొక్కరికి 18 మొబైల్ కనెక్షన్లు!
న్యూఢిల్లీ: మొబైల్ యూజర్లు సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చినప్పుడు, కొత్త కనెక్షన్‌ను తీసుకున్నప్పుడు కొత్తగా సిమ్‌ను తీసుకోవాల్సిన పని తప్పనుంది. టెలికం విభాగం (డాట్) తాజాగా కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇందులో సింగిల్, మల్టీపుల్ కాన్ఫిగరేషన్స్‌తో ఇ–సిమ్ వినియోగానికి అనుమతినిచ్చింది. అలాగే మొబైల్ కనెక్షన్ల పరిమితిని కూడా పెంచింది. ఎం2ఎం/ఐఓటీలో ఆధునిక సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఇ–సిమ్ (ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్) వినియోగానికి అనుమతినిస్తున్నట్లు డాట్ తెలిపింది. ఇ–సిమ్‌ను డివైజ్‌లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వీస్ మార్చినప్పుడు, కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇందులో సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కారులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు, కారు దొంగతనానికి గురైనప్పుడు, రిమోట్ కంట్రోల్ తదితర వాటికి సంబంధించి వెహికల్ నుంచి మొబైల్‌కు వచ్చే అలర్ట్స్ వంటి మెషీన్–టు–మెషీన్ (ఎం2ఎం) కమ్యూనికేషన్స్‌లో వినియోగించే సిమ్‌లకు కూడా నిబంధనలు విడుదల చేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్‌కు వినియోగించే సిమ్‌లకు 13 అంకెలు ఉంటాయని డాట్ గతంలోనే తెలియజేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్‌కు ఎక్కువ సిమ్ కార్డులు అవసరమౌతాయి. అందువల్ల డాట్ ఒక్కొక్కరికి మొబైల్ కనెక్షన్ల(సిమ్ కార్డులు) పరిమితిని 18కి పెంచింది (ప్రస్తుత పరిమితి 9). వీటిలో సాధారణ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్స్ కోసం 9 సిమ్‌లను, మరో 9 సిమ్‌లను ఎం2ఎం కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డివైస్‌లో ఎం2ఎం సిమ్‌ను ప్రి–ఇన్స్టాల్ చేయవలసి వస్తే, అప్పుడు సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్‌ను డివైజ్ తయారీ సంస్థలే పూర్తి చేయాలని డాట్ తెలిపింది. ఇక ఇ–సిమ్‌లో మొబైల్ నెంబర్ పోర్ట్‌బిలిటీ కోసం ఓవర్ ద ఎయిర్ సబ్స్క్రిప్షన్ అప్డేట్ ఫెసిలిటీ కల్పించింది. ఇ–సిమ్‌పై సర్వీసులు అందించే టెలికం ఆపరేటర్లు వాటిపై తగిన పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు యాపిల్ వాచ్ సిరీస్–3 విక్రయాలను ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత డాట్ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. ఈ వాచ్‌లలో ఇ–సిమ్ ఉంటుంది. యూజర్లు వీటిని మొబైల్లోని సిమ్‌తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా ఫోన్లోని సర్వీస్ ప్రొవైడర్ సేవలను పొందొచ్చు. -
సిమ్ ధ్రువీకరణకు మరింత గడువు!
న్యూఢిల్లీ: మొబైల్ సబ్స్క్రైబర్ల సిమ్ రీ వెరిఫికేషన్ (ఆధార్‌తో ధ్రువీకరణ)కు ఓటీపీ వంటి కొత్త విధానాల అమలుకు మరింత సమయం కావాలని సెల్యులర్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ తాజాగా యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ను కోరింది. టెల్కోలు సిమ్ రీ వెరిఫికేషన్‌కు కొత్త విధానాలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. ‘‘నిర్ణీత గడువు నుంచి కొత్త విధానాల్లో సిమ్ రీ వెరిఫికేషన్‌ను ప్రారంభించడం కష్టసాధ్యం. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను అమలు చేయడానికి మేం ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే యూఐడీఏఐకి, టెలికం డిపార్ట్మెంట్కు తెలియజేశాం’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వివరించారు. ఎస్ఎంఎస్ ఆధారిత వన్‌టైమ్ పాస్వర్డ్ ప్రక్రియను వీలైనంత త్వరగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ‘‘కొత్త విధానంలో కస్టమర్ అక్వైజిషన్ ఫామ్ (సీఏఎఫ్)లో మార్పులు అవసరమౌతాయి. టెలికం డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు వెలువడిన దగ్గరి నుంచి ఆపరేటర్లు వాటిని పాటించడానికి 4–6 వారాల సమయం పడుతుంది’’ అని యూఐడీఏఐకి రాసిన లేఖలో తెలిపారు. ఓటీపీ ఆధారిత విధానంలో సీఏఎఫ్‌లోని చాలా గళ్లను నింపడం ఆపరేటర్లకు సాధ్యం కాదని, అందుకే ఇందులోనూ మార్పులు తప్పనిసరని పేర్కొన్నారు. టెలికం డిపార్ట్మెంట్ మార్పులు చేసిన సీఏఎఫ్‌ను జారీ చేయనుందని, దాన్ని టెల్కోలు వినియోగించాల్సి ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియనే రీ వెరిఫికేషన్‌గా పేర్కొంటాం. యూజర్లు టెలికం స్టోర్లకు వెళ్లి దీన్ని పూర్తి చేసుకోవచ్చు. వృద్ధులు, వికలాంగులు వంటి వారి విషయంలో టెలికం సంస్థలు తమ ప్రతినిధులను ఇంటి వద్దకే పంపి రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెరిఫికేషన్ కోసం ఓటీపీ, ఐవీఆర్ఎస్, యాప్ వంటి విధానాలు పాటించాలని కూడా ఆదేశించింది. -
బీఎస్ఎన్ఎల్ మేళాకు విశేష స్పందన
– ఉచిత సిమ్ పథకానికి 27 వరకు గడువు పొడిగింపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నిర్వహించిన రెండు రోజుల ఉచిత సిమ్ మేళాకు విశేష స్పందన లభించింది. జీఎం పి.ఎస్.జాన్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేళా శిబిరాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు రెండు రోజుల వ్యవధిలో రెండు వేలకు పైగా సిమ్‌లు తీసుకున్నారని చెప్పారు. ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో ఉచిత సిమ్‌లు పొందేందుకు మరో మూడురోజులు గడువు పెంచినట్లు వెల్లడించారు. దరఖాస్తులు స్వీకరించడానికి 26, 27 తేదీల్లో వినియోగదారుల సేవా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
బయోమెట్రిక్‌తోనే సిమ్ యాక్టివేషన్
ఇక నకిలీ సిమ్ కార్డులు చెల్లవు పాలకుర్తిలో నూతన విధానం అమలు పాలకుర్తి టౌన్ : వినియోగదారులు ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు ఉపయోగించకుండా కార్డుల జారీకి బయో మెట్రిక్ విధానం అమలులోకి వచ్చిందని ఎయిర్టెల్ ప్రతినిధి శంకర్ లిక్కి తెలిపారు. గురువారం పాలకుర్తిలో బయో మెట్రిక్ విధానంతో సిమ్ కార్డుల జారీ కార్యక్రమాన్ని పాలకుర్తి ఎస్సై ఎన్. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ లిక్కి మాట్లాడుతూ.. గతంలో ఐడీకార్డు, ఫొటో ఉంటే సిమ్‌కార్డు పొందటం తేలికయ్యేదని. దీంతో ఇతరుల పేరిట సిమ్ కార్డులు విచ్చలవిడిగా వినియోగిస్తుండడంతో అసాంఘికక శక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అందుకే బమోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు వివరించారు. వినియోగదారుడు వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ అందజేయాలని, బయోమెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్ర స్వీకరించిన ఐదు నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ పగడాల శ్రీ««దlర్, తమ్మి రాంబాబు, బొగ్గరాపు నాగరాజు, వంగ మహేందర్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఉచిత సిమ్ మేళా
– రూ. 49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్ – రూ. 249కే బ్రాడ్ బ్యాండ్ – బీఎస్ఎన్ఎల్ జీఎం పి.ఎస్.జాన్ కర్నూలు(ఓల్డ్‌సిటీ): జిల్లాలోని 54 చోట్ల శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఉచిత సిమ్ మేళా నిర్వహించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ జీఎం పి.శామ్యూల్ జాన్ తెలిపారు. గురువారం తన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. రూ. 49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఇస్తామని, మేళా శిబిరాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక రూపాయికి ఒక జీబీ చొప్పున రూ. 249కే 300 జీబీ బ్రాండ్ బ్యాండ్ ఇస్తున్నామని, ఇన్స్టులేషన్ చార్జీలు మాఫీ చేస్తామన్నారు. రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు, ఆదివారం 24 గంటలూ ఏ నెట్‌వర్క్‌తోనైనా ఉచితంగా మాట్లాడవచ్చని తెలిపారు. నగరంలో ఎస్ఏపీ క్యాంప్, సీక్యాంప్, కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయం, పున్నమి గెస్ట్‌హౌస్, పాతబస్టాండులోని టీఆర్ఏ కార్యాలయం వద్ద ఉచిత సిమ్ శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీజీఎంలు నరసింహులు, నాగరాజు, ఎస్డీఈ నాగరాజు పాల్గొన్నారు. -
సిమ్ కార్డు లేకుండా రోమింగ్ ఇంటర్నెట్!
వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ముందుగా ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో ప్రవేశపెడుతోంది. వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది. దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది. థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు. -
‘సిమ్’ ఇంట్లో హోరాహోరీ!
భారీ వ్యయంతో కంపెనీల ప్రణాళికలు * విలీనాలకు తెరలేపిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ * వినూత్న వ్యూహాలతో వస్తున్న రిలయన్స్ జియో * రూ.60 వేల కోట్లతో ఎయిర్టెల్ ప్రాజెక్ట్లీప్ * ఐడియా, టెలినార్, వొడాఫోన్ వ్యూహాలకూ పదును * మాట నుంచి డేటాకు... 2015లో స్పష్టమయిన ట్రెండ్ * 2016లో ఈ దార్లోనే దూసుకెళ్లనున్న సంస్థలు బండికి పెట్రోల్, డీజిల్ ఎలాంటివో... మొబైల్‌కు సిమ్ అలాంటిదే. టెలికం కంపెనీలు ఏ సేవలందించినా ఈ సిమ్‌తోనే. అందుకే.. సిమ్‌ను చాక్లెట్ కన్నా చీప్‌గా ఒకోసారి ఉచితంగానే ఇచ్చేస్తున్నాయి. దీనిద్వారా అందిస్తున్న సేవల మార్కెట్ విలువ... రూ.3.3 లక్షల కోట్లు కావటంతో సిమ్ కార్డును గుప్పిట పెట్టుకోవటానికి పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. 2జీ, 3జీ, 4జీ... డేటా, వాయిస్ అంటూ రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2015లో కొందరు తెరమరుగైపోగా... మరికొందరు చేతులు కలపటానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది మాత్రం యోధుల రాకతో పోరాటం కొత్త మలుపు తిరగబోతోంది. ప్రాజెక్ట్ లీప్.. అంటూ ఎయిర్టెల్ పెద్ద అడుగే వేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్... సిస్టెమా శ్యామ్‌కు చెందిన ఎంటీఎస్‌ను కైవసం చేసుకోవటమే కాక... టవర్ల వ్యాపారాన్ని అమ్మేస్తోంది. ఎయిర్‌సెల్‌ను కొనబోతున్నట్లూ ప్రకటించింది. యూపీ, గుజరాత్ సర్కిళ్లలో 4జీ తరంగాలను రూ.3,310 కోట్లకు వీడియోకాన్ నుంచి ఐడియా కొంటోంది. బీఎస్ఎన్ఎల్ తన టవర్ల వ్యాపారాన్ని వేరు చేస్తోంది. * ఇవన్నీ... 2016 ఆరంభానికి నాలుగురోజుల ముందు ఆరంగేట్రం చేసిన ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోను ఎదుర్కొనే సన్నాహాలే. ఏడేళ్ల కిందట దేశీ మార్కెట్లో 16 కంపెనీలు పోటీ పడగా... ఇపుడు 10 మిగిలాయి. 4జీ మార్కెట్లో మాత్రం ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఐడియా, వొడాఫోన్ మధ్యే పోటీ ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. * దేశవ్యాప్తంగా నవంబరు నాటికి 75 కోట్ల జీఎస్ఎం చందాదారులున్నారు. 17 కోట్ల మంది వద్ద స్మార్ట్ఫోన్లున్నాయి. వీరిలో 3జీ కస్టమర్ల సంఖ్య 9 కోట్లని ఐడియా సెల్యులర్ ఎండీ హిమాన్షు కపానియా చెప్పారు. 2019-20 నాటికి 3జీ, 4జీ వినియోగదార్ల సంఖ ్య 40-50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. * ఈ ఏడాది దేశంలో సగటున నెలకు 40 లక్షల మందికి పైగా కొత్త చందాదారులు నమోదయ్యారు. అంటే 2015లో కొత్తగా చందాదారులైన వారి సంఖ్య 7.5 కోట్ల పైనే. జూలై-సెప్టెంబరు మధ్య దేశంలో కొత్త యూజర్లు 1.3 కోట్ల మంది కాగా... చైనాలో 70 లక్షలు. అమెరికాలో 60 లక్షలు. ఇదీ మన టెలికం జోరు. * కస్టమర్లను ఆకట్టుకోవడానికి 2009-10లో కంపెనీలు కాల్ రేట్లను 50% దాకా తగ్గించాయి. ఇప్పుడు ఇలాంటి యుద్ధం డేటా చార్జీలపై ఉండబోతోంది. ప్రస్తుతం పలు కంపెనీలు 3జీ స్థాయి ధరల్లోనే 4జీని ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో పెట్టబోయే ధరల ఆధారంగా మరిన్ని మార్పులు జరగవచ్చు. * టెలికం రంగంలో తిరిగి కొత్త నియామకాల జోష్ ఉండనుంది. వచే ్చ ఆరు నెలల్లో సుమారు 30,000 మంది రిక్రూట్ అయ్యే అవకాశం ఉందని టీమ్‌లీజ్ అంచనా వేస్తోంది. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో భారత టెలికం పరిశ్రమ రూ.4.29 లక్షల కోట్లకు ఎగుస్తుందన్నది మార్కెట్ వర్గాల అంచనా. * డేటా చార్జీలు తగ్గిస్తే వినియోగం మరింత పెరుగుతుంది కనుక కంపెనీల ఆదాయమూ పెరుగుతుందనేది పరిశ్రమ అంచనా. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు దీన్ని నిజం చేస్తున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఎయిర్టెల్ డేటా ఆదాయం కిందటేడాది ఇదే కాలంతో పోలిస్తే 14.5 శాతం నుంచి 21.5 శాతానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ డేటా ఆదాయం 92 శాతం ఎగసి 2014-15లో రూ.1,380 కోట్లుగా నమోదైంది. 3జీ కన్నా 4జీ వేగం ఎక్కువ కనక డేటా వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇవీ... భవిష్యత్ ప్రణాళికలు ప్రాజెక్ట్ లీప్ పేరిట... నెట్వర్క్ విస్తరణకు మూడేళ్లలో ఎయిర్టెల్ రూ.60,000 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం సుమారు 300 పట్టణాల్లో 4జీ సేవలందిస్తోంది. ఐడియా వచ్చే మూడేళ్లకుగాను రూ.18,000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ దక్షిణాదిన 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. 2016 జూన్ నాటికి 750 పట్టణాల్లో అడుగు పెట్టనుంది. 2015-16లో వొడాఫోన్ రూ.8,500 కోట్లు వెచ్చిస్తోంది. దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో 18,000 పట్టణాలు, నగరాల్లో 4జీ సర్వీసులను పరిచయం చేయనుంది. ఇప్పటికే సంస్థ రూ.95,000 కోట్ల దాకా ఖర్చుచేసింది. అర కిలోమీటరుకు ఒక టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.7,700 కోట్లు వెచ్చిస్తున్న బీఎస్ఎన్ఎల్... ప్రైవేటు కంపెనీల్లా మార్కెటింగ్ చేస్తే వాటా పెంచుకోవటం ఖాయం. టెలినార్ త్వరలో హై స్పీడ్ ఇంటర్నెట్ను ప్రవేశపెడుతోంది. నెట్వర్క్ ఆధునికీకరణ బాధ్యతను హువావె టెక్నాలజీస్‌కు అప్పగించింది. -
సిమ్.. క్రైమ్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్: అన్ని కంపెనీల సిమ్‌లు మొబైల్షాపుల్లోనేగాక పాన్‌షాపులు, కిరాణాషాపులు, జిరాక్స్ సెంటర్లు, ఇతరాత్రా షాపుల్లో కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఫొటోతోపాటు గుర్తింపుకార్డు జిరాక్స్ ఇస్తే చాలు.. సిమ్‌కార్డు ఇచ్చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం వరకు సిమ్ యూక్టివేట్ అవుతోంది. అయితే యూక్టివేట్ చేయడానికి ముందు ఆయూ కంపెనీల కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ చేసి పేరు, చిరునామా తదితర పూర్తి వివరాలు మరోసారి చెబితే సరిపోతుంది. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియూ) నిబంధనల ప్రకారం ఒక గుర్తింపుకార్డుతో ఒక వ్యక్తి 10 వరకు సిమ్ కార్డులు పొందవచ్చు. కంపెనీలు ఇచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆయూ కంపెనీల సిమ్‌లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇంతవర కు బాగానే ఉంది. కానీ కొందరు సిమ్ విక్రేతలు షాపులో వినియోగదారులు సమర్పించిన ఫొటోలు, గుర్తింపుకార్డులను యజమానులు స్కాన్ చేసి.. ప్రింట్ తీస్తున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో వివిధ కంపెనీలకు చెందిన ఐదారు సిమ్ల వరకు యూక్టివేట్ చేసి తమ టార్గెట్‌కు చేరువవుతున్నారు. ఇలా గుర్తింపుకార్డులో వ్యక్తికి తెలియకుండానే సిమ్‌లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. ఓ మొబైల్ కంపెనీలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువకుడి గుర్తింపుకార్డునే ఓ కిరాణషాపు యజమాని వాడేశాడు. వినియోగదారుల వివరాలు ఎంట్రీ చేసే క్రమంలో సదరు ఆపరేటర్ పేరు, చిరునామా అతనికే రావడంతో అవాక్కయ్యాడు. దీంతో అతడు కిరాణాషాపు యజమానిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాజాగా ఈ నెల 8న పర కాల పోలీస్‌స్టేషన్‌లో కూడా ఇలాంటి కేసు నమోదు కావడంతో సెల్పాయింట్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల దర్యాప్తులో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఒక సిమ్‌కార్డుతో అసలు వ్యక్తి ఒకటి లేదా రెండు సిమ్‌లు తీసుకుంటే మిగతా సిమ్‌లు అదే పేరుతో చలామణి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సిమ్‌లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే పరిస్థితి ఏమిట ని ప్రజలు, పోలీసులు ఆందోళన చెందుతున్నారు. సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా ఛేదించాల్సిన కొన్ని కేసుల్లో ఇలాంటి సిమ్‌లు వాడిన నేరస్తుడిని పట్టుకోవడం తలనొప్పిగా మారనుంది. అంతేగాక సంబంధం లేని వ్యక్తులు ఇబ్బందిపడే ప్రమాదముంది. తప్పుడు సిమ్‌కార్డుల సంస్కృతి పెరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మార్కెట్లో ఇలాంటి సంస్కృతిని పెంచిపోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఈ తరహా నేరాలు పునరావృతం కావని అభిప్రాయపడుతున్నారు. పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తరహా లోనే ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్న వారి అడ్రస్‌ను పూర్తిగా తనిఖీ చేస్తే ఈ తరహా నేరాలను అరికట్టవచ్చు.