వణికిస్తున్న 'నింజా' సూపర్ హీరో..!
రోమన్లు ఇప్పుడా ఆకారాన్ని చూసి వణికిపోతున్నారు. సుమారు ఇరవై ఏళ్ళ వయసు.. నల్లని ముసుగులాంటి షినోబి వస్త్రధారణ.. చేతిలో 19 అంగుళాల కత్తితో జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ వార్సా వీధుల్లో తిరుగుతూ జనాలను భయకంపితుల్ని చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? హంతక ముఠాకు చెందిన వాడా? గూఢచారా? ఇలా రకరకాల ప్రశ్నలు? చివరికి పోలీసులను కూడా ఆశ్రయించారు.. అయితే వారి సమాధానాన్ని విని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు...
మధ్యయుగం కాలంలో జపాన్ దేశానికి చెందిన కిరాయి హంతక ముఠాలను 'నింజాలు' అనేవారు. అప్పట్లో వీరు అత్యంత కఠినమైన శిక్షణ పొంది, హత్యలు, గూఢచర్యం, దొంగతనాలకు పాల్పడటంతో పాటు శత్రుస్థావరాల్లోకి ప్రవేశించడంలో నిష్ణాతులుగా ఉండేవారట. జపాన్ ఏకీకరణ తర్వాత వీరు అంతరించి పోయారు. అయితే నేటికీ వారి పాత్రలతో సృష్టించిన సినిమాలు, వీడియో గేమ్ ల కు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. వారి వస్త్రధారణను అనుకరించడం, వారి ఫైట్లను ప్రాక్టీస్ చేయడం చిన్నతనంలో కొందరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది.
ప్రస్తుతం వార్సా వీధుల్లో రోమన్లను హడలెత్తిస్తున్న ఆ యువకుడు సెజరీ.. అదే కోవకు చెందినవాడట. నల్లని వస్త్రాల్లో కళ్ళు మాత్రమే కనిపించేలా ముసుగుతో ఉన్న అతడు... 19 అంగుళాల నింజాటో పేరుగల నింజా కత్తిని వెనుక తగిలించుకొని వార్సా వీధుల్లో తిరుగుతున్నాడు. టీనేజ్ లో నింజా ఫైటర్ కావాలనుకుని కలలు కన్న అతడు.. ఇప్పుడు స్థానికుల్ని భయాందోళలకు గురి చేస్తున్నాడు. అతడి భయంతో కొందరు సీక్రెట్ నింజా ఆఫ్ గ్రోచో అంటూ భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు అతడ్ని ఏమీ చేయలేమని, అతడివల్ల ఎవరికీ హాని జరగటం లేదంటూ చేతులెత్తేశారు.
''మేం అతడ్ని ఎన్నోసార్లు చూశాం. అతడు మాకు బాగా తెలిసిన వ్యక్తే. అంతేకాదు అతడితో ఎలాంటి ముప్పు లేదు. పోలీసులకు కూడా అతడి వల్ల ఎలాంటి సమస్యా లేదు. హింసాత్మకంగా కూడా ప్రవర్తించడం లేదు. అతడితో ప్రమాదం లేదు'' అంటున్నారు పోలీసులు.
అయితే కొందరు ఈ 21 ఏళ్ళ ముసుగు వీరుడ్ని నింజా సూడో సూపర్ హీరోగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మూడువేలమంది మద్దతుదారులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్నో కామెంట్లు వచ్చాయి. గ్రోచో సూపర్ హీరోకి గ్రీటింగ్స్ కూడా పంపిస్తున్నారు. కొందరైతే మేం వార్సాలో లేకపోవడం మా దురదృష్టం.. అందుకే మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు సూపర్ హీరోను మేం చూశామని.. ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.
''నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నాపై దుండగులు దాడికి దిగారు. అప్పుడు నేను ముష్టి యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. అప్పట్లో నేననుకున్నాను. అటువంటి వస్త్రధారణ, చేతిలో కత్తి ఉంటే స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని.. ఆ తర్వాతే డ్రస్, నింజా కత్తిని కొన్నాను.'' అంటాడు నింజా సూపర్ హీరో సెజరీ. అంతేకాకుండా తాను చిన్నప్పుడు జపనీస్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, అప్పట్నుంచే తనకు అటువంటి వేషధారణ అంటే ఇష్టమని చెప్తున్నాడు సెజరీ. అందుకే తాను ఓ చెక్క కత్తిని కొన్నానని, అది ధరించి వెడుతున్న సమయంలో ఎవరైనా తనను సమీపించేందుకు భయపడతారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితుడు తనకు లీఫ్ స్పింగ్ తో తయారు చేసిన కత్తిని మూడు యూరోలకు అమ్మాడని, ఆ తర్వాత ఓసారి వీధిలో వెడుతుండగా తనపై దాడి జరిగితే అడ్డుకోగలిగానని సెజరీ తన కత్తి కథను ఎంతో ఇష్టంగా తెలిపాడు.
ప్రస్తుతం కత్తి లేకుండా సెజరీ ఇంటినుంచి బయటకు రానేరాడట. తనపై గ్రోచో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు కూడా తెలుసునని, అయితే కౌన్సిల్... వార్సా మేయర్ తో సమావేశం ఏర్పరచి తాను ఎవరికీ హాని చేయని వ్యక్తిగా చెప్పిందని పేర్కొన్నాడు. మనం ఎవ్వరికీ హాని చేయనప్పడు.. మనం ఎలా కావాలంటే అలా స్వతంత్రంగా బతికే హక్కుందని సెజరీ అంటున్నాడు. ఏదేమయినా 'నింజా' సూపర్ హీరో మాత్రం వార్సా వీధుల్లో చల్ హల్ చేస్తున్నాడనే చెప్పవచ్చు.