పోలండ్‌లో ప్రధాని మోదీ
భారతీయులనుద్దేశించి ప్రసంగం
నేడు ప్రధాని, అధ్యక్షుడితో భేటీ
రేపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు
వార్సా/సాక్షి, న్యూఢిల్లీ: ‘‘దశాబ్దాల క్రితం పలు దేశాలతో సమదూరం పాటించిన భారత్ నేడు అన్ని దేశాలతో అనుసంధానమవుతోంది. అందరి అభివృద్ధినీ కాంక్షిస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం రాత్రి పోలండ్ రాజధాని వార్సాలో భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి. యుద్ధం మానవాళికి మహా ముప్పు. భారత్ అనాదికాలం నుంచి శాంతినే ప్రవచించింది.
ఇది యుద్ధాల యుగం కాదంటూ మన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ విపత్కర పరిస్థితుల్లో సమష్టిగా ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యమార్గం ద్వారానే శాంతి సాధ్యం. సంక్షోభం అంచుకు చేరిన ఏ దేశానికైనా ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సదా సిద్ధం. సహానుభూతికి సరైన అర్థం ‘భారత్’. కష్టజీవులకు చిరునామా భారత్. బుద్దుని బోధలతో పునీతమైన నేల భారత్. ప్రపంచంలో ఎక్కడ విలయాలు సంభవించినా ‘మానవాళికి సాయం’ మంత్రాన్నే జపిస్తుంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడినంతసేపూ ‘మోదీ మోదీ’ నినాదాలతో సభావేదిక మార్మోగింది.
వార్సాలో ఘనస్వాగతం
అంతకుముందు మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. పోలాండ్ అధికారులు, భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్‌లో భారతీయ, పోలండ్ కళాకారులు సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి అద్భుతమైన నృత్యరూపకం ప్రదర్శించారు. వారి నృత్యాన్ని మోదీ అభినందించారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి! పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ సెబాస్టియన్ డుడా, ప్రధాని డొనాల్డ్ టస్‌్కతో మోదీ గురువారం సమావేశమవుతారు. శుక్రవారం మోదీ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుంటారు.
తెలుగు సంఘం ప్రతినిధుల స్వాగతం
పోలండ్ తెలుగు అసోసియేషన్ (పోటా) ప్రతినిధులు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్‌లో తెలుగు తల్లికి వందనం, భరతమాతకు వందనం అంటూ స్వాగతించారు. పోలండ్‌లో దాదాపు 25వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 5 వేల మందికిపైగా ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులున్నారు.
గుడ్ మహారాజా స్క్వేర్ వద్ద నివాళులు
జామ్‌నగర్ పాలకుడు జామ్ సాహెబ్ దిగి్వజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా స్మారకార్థం వార్సాలో ఏర్పాటు చేసిన ‘గుడ్ మహారాజా స్క్వేర్’ వద్ద మోదీ నివాళులరి్పంచారు. నగరంలోని మాంటె కసీనో వార్ మెమోరియల్ సమీపంలోని వలివాడె–కొల్హాపూర్ స్మారకం వద్ద కూడా నివాళులర్పించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణ సమీపంలోని వలివాడె గ్రామం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6 వేల మందికిపైగా పోలండ్ ప్రజలకు ఆశ్రయమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment