వినూత్న విదేశాంగ విధానం | Narendra Modi latest European tour | Sakshi
Sakshi News home page

వినూత్న విదేశాంగ విధానం

Published Sat, Aug 24 2024 4:20 AM | Last Updated on Sat, Aug 24 2024 4:20 AM

Narendra Modi latest European tour

నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలామంది అనుకొనేదే. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందోనన్న సంశయమే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన తాజా యూరోప్‌ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిన వైనాన్ని వెల్లడించింది.  ఇది మంచిదా, కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గరా కాదు... దూరమూ కాదని అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య దేశాలకూ మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తుకుతెస్తుంది. 

మోదీ రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్‌ దుదాతో సమావేశమయ్యారు శుక్రవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. ఇవి రివాజులో భాగంగా సాగిన పర్యటనలు కాదు. మన దేశ ప్రధాని ఒకరు పోలెండ్‌ను సందర్శించటం గత నలభై అయిదేళ్లలో ఇదే తొలిసారి. 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్‌ ఆ దేశంలో పర్యటించారు. కానీ అప్పటికది సోవియెట్‌ యూనియన్‌ ఛత్రచ్ఛాయలో ఏర్పడ్డ వార్సా సైనిక కూటమిలో భాగం. అయితే, 1991లో సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలడానికి చాలా ముందే పోలెండ్‌ బాట మార్చింది. సోవియెట్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో కూటమి దేశాలకు చేరువైంది. 

1999లో నాటోలో చేరింది. 2004లో యూరొపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో భాగమైంది. ఆ తర్వాత మరెప్పుడూ మన ప్రధానులు ఆ దేశాన్ని సందర్శించ లేదు. ఇక సోవియెట్‌లో ఒకప్పుడు భాగమైన ఉక్రెయిన్‌ 26 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల సలహాతో తన అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకుంది. భిన్న సందర్భాల్లో వాటి మనోభావాలకు తగినట్టు తన విధానాలను తీర్చిదిద్దుకుంది. వాజపేయి హయాంలో మన దేశం నిర్వహించిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది. మన కశ్మీర్‌ విధానాన్ని ఖండిస్తూ వచ్చింది. పాకిస్తాన్‌కు శతఘ్నులు విక్రయించింది. 

రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈమధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్‌ కూడా ప్రదర్శించింది. జూలై రెండో వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్‌స్కీ ట్విటర్‌ వేదికగా భారత్‌ను విమర్శించారు. నెత్తురంటిన పుతిన్‌తో ఎలా కరచాలనం చేస్తారని మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవటం విచారకరమన్నారు. 

ఆ సమయంలో మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియూవ్‌లో పిల్లల ఆస్పత్రిపై రష్యా బలగాలు దాడి చేసిన మాట వాస్తవమే. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్‌ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్‌స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం గనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. ఇది తెలివితక్కువతనం. భారత్‌–రష్యా సంబంధాల సంగతే తీసుకుంటే రష్యా అనేక కారణాల వల్ల పాకిస్తాన్‌కు ఆయుధ విక్రయంపై ఉన్న ఆంక్షలను పదేళ్లక్రితం సడలించింది. 

దూరశ్రేణి క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలు అందజేసింది. ఎంఐ–26 సైనిక రవాణా హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి సాయం అందజేసింది. మనకు ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు విక్రయించినప్పుడల్లా సమతూకం పాటించే నెపంతో పాకిస్తాన్‌కు కూడా అమ్మకాలు సాగించటం రష్యా నేర్చుకుంది. చైనాతో దాని సంబంధాలు సరేసరి. ఇలా మనకు బద్ధ వ్యతిరేకమైన రెండు దేశాలతో రష్యా సంబంధాలు నెరపుతున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ కోరుకోవటం అర్థరహితం.

రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్‌ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మన దేశం ఖండించలేదు. రష్యాను విమర్శిస్తూ తీసుకొచ్చిన తీర్మానాలపై వోటింగ్‌ సమయంలో మన దేశం గైర్హాజరైంది. అయితే యుద్ధ క్షేత్రంలో కాక  చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఈ మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇరు దేశాలూ చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సరిగ్గా నాటో 75 యేళ్ల ఉత్సవాల సందర్భంలో రష్యా పర్యటనను ఎంచుకున్నందుకు అమెరికా ఆగ్రహించింది. 

అయితే ఎడతెగకుండా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకడమెలా అన్నది దానికి బోధపడటం లేదు. తన మద్దతుతో, పాశ్చాత్య దేశాల సహకారంతో 3, 4 నెలల్లో రష్యాను ఉక్రెయిన్‌ అవలీలగా జయిస్తుందన్న భ్రమ మొదట్లో అమెరికాకు ఉంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది కొడిగట్టింది. నిరుడు ఫిబ్రవరిలో శాంతి సాధన పేరుతో చైనా ఒక ప్రతిపాదన చేసింది. కానీ అందులో రష్యావైపే మొగ్గు కనబడుతోందన్న విమర్శలొచ్చాయి. పైపెచ్చు చైనా అధికారిక మీడియా మొదటి నుంచీ రష్యాను వెనకేసుకొస్తోంది. 

ఇలాంటి సమయంలో భారత్‌ దౌత్యంపై ఆశలేర్పడటం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాలు మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరొప్‌ దేశాలు గుర్తించాల్సివుంది. ఆ తర్వాతే ఉక్రెయిన్‌ దూకుడు తగ్గుతుంది. ఆ మాటెలావున్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement