గమ్యం చేరిన ప్రయాణం | kalyan left job to roam india | Sakshi
Sakshi News home page

గమ్యం చేరిన ప్రయాణం

Published Sun, Jun 12 2016 8:40 PM | Last Updated on Thu, Aug 30 2018 6:01 PM

గమ్యం చేరిన ప్రయాణం - Sakshi

గమ్యం చేరిన ప్రయాణం

ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన ఓ వ్యక్తి ఏం చేస్తుంటాడు చెప్పండి..? హా..! ఏం చేస్తాడు ఏదో పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడనుకుంటాం. కానీ కల్యాణ్‌ అక్కిపెద్ది మాత్రం అలా చేయట్లేదు. రూ.లక్షల్లో జీతం, నగరం జీవితం...ఇవేవి అతనికి తృప్తి నివ్వలేవు. వచ్చే జీతం జేబును నింపుతోంది కానీ మనసును తాకట్లేదు. ఉద్యోగం మానేసి తన సంతోషం ఎక్కడుందో వెతుక్కోవాలని... ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. చివరికి తను కోరుకున్న గమ్యాన్ని ఎలా చేరుకున్నాడో చూడండి..!

మే 30... కల్యాణ్‌  38వ పుట్టిన రోజున వచ్చిన ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. ఇంకా ఎన్నాళ్లు బతికుంటానని ఆలోచించసాగాడు కల్యాణ్‌. లెక్కలు వేసుకున్నాడు ‘మహా అయితే ఓ 30 ఏళ్లు. అంటే సుమారుగా పదివేల రోజులు. ఈ సమయంలో ఏం చేయగలను. ఏం సాధించగలను’ అని అతనిలో అతనే మధన పడిపోయాడు. ఆ మరుసటి రోజే తను పనిచేస్తోన్న ఆఫీసుకెళ్లాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

దేశమంతా పర్యటన
ఏ ప్రయాణానికైనా గమ్యం ఉంటుంది. కానీ కల్యాణ్‌ మొదలు పెట్టిన ప్రయాణానికి మాత్రం గమ్యమంటూ లేదు. దేశం మొత్తం తిరగాలని నిశ్చయించుకున్నాడు. చాలా మంది భారతీయుల జీవితాల్లో పేదరికం ఎలాంటి పాత్ర పోషిస్తోందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయాణంలో కల్యాణ్‌ తనకి తాను ఒక షరతు విధించుకున్నాడు. తన తిండికి గానీ వసతికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఏదో పనిచేస్తూ తన అవసరాలను తీర్చుకున్నాడు. 2008లో మొదలు పెట్టిన ఈ ప్రయాణాన్ని సుమారు రెండున్నరేళ్ల పాటు కొనసాగించాడు. ఈ సమయంలో కల్యాణ్‌ ఎక్కువగా గ్రామీణ భారతాన్ని చుట్టాడు. మన ప్రయాణాల్లో కొన్ని మనకి ఇబ్బంది కలిగించే అంశాలు, మరికొన్ని స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఎదురవుతుంటాయి. కల్యాణ్‌ వెతుకుతున్న గమ్యం గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉండే గిరిజనుల రూపంలో దొరికింది. సుమారు 8 నెలల పాటు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ కొన్ని గిరిజన తెగల జీవన శైలిని చూసి ఆశ్చర్యపోయాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. జీవితం పట్ల వారికి ఎలాంటి ఫిర్యాదులు లేవు. తమకున్న అవకాశాలను వాడుకుంటూ డబ్బులు సంపాదిస్తూ హాయిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసిన కల్యాణ్‌కి ఒక ఆలోచన వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించాలంటే రూ.కోట్లు ఖర్చు చేయడానికి బదులు, ప్రజల్లో స్వయంగా సంపాదన సృష్టించుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఎలా ఉంటుందనుకున్నాడు.

తిరిగి స్వగ్రామానికి
రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణానంతరం కల్యాణ్‌ తిరిగి తన స్వగ్రామం అనంతపురం చేరుకున్నాడు. సుమారు 166 గ్రామాలు సందర్శించిన తర్వాత ‘టెకులోడు’ అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. మొదట్లో ప్రతి రోజూ గ్రామంలోని ఒకరి ఇంట్లో ఉంటూ వారితో కలసి పనిచేస్తూ... రాత్రి ఆ కుటుంబంతోనే భోజనం చేసేవాడు. అలా సుమారు 100 రోజులు పాటు 100 కుటుంబాల స్థితిగతులను వారి ఆర్థిక పరిస్థితులను ఒక డాక్యుమెంటరీగా రూపొందిచాడు. చివరగా ఒక కుటుంబంతో కలసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. కల్యాణ్‌ వారి కుటుంబంలో చేరక ముందు ఆ కుటుంబం ఆదాయం ఏడాదికి కేవలం రూ. 6500. కానీ వారితో చేయి కలిపి వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు ఉపయోగిండంతో 8 నెలలు తిరిగేలోపే నెలకు రూ.14 వేలు సంపాదించే స్థాయికి ఆ కుటుంబం చేరుకొంది.

‘ప్రోటో విలేజ్‌’ లక్ష్యంగా
ఏడాదికి రూ. ఆరు వేల నుంచి నెలకి రూ. 14 వేల ఆదాయం సాధించడంతో...సాధికారత సాధించడం సాధ్యమేనని కల్యాణ్‌ బలంగా నమ్మాడు. ఇదే ప్రేరణతో ‘ప్రొటో విలేజ్‌’ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య, తండ్రి సహాయంతో అదే గ్రామంలో ఓ 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. తన ఆలోచనని మొదటగా గ్రామస్తులతో చెప్పినపుడు పది కుటుంబాలు దీనికి అంగీకరించాయి. ప్రస్తుతం ఈ ప్రోటో విలేజ్‌లో సుమారు 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ మొత్తం స్థలాన్ని అన్ని కుటుంబాలకు సమానంగా కేటాయించడం విశేషం. ఇప్పుడు ఆ గ్రామంలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆరు నెలల కాలంలో ఎనిమిది చెరువులను తవ్వారు. సోలార్‌తో గ్రామంలో స్వయంగా విద్యుత్‌ని సృష్టించుకుంటున్నారు.

చాలా సంతోషంగా ఉన్నాను
‘మొదట్లో మా కుటుంబ సభ్యులు... అంత జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని ఎలా సంతోషంగా ఉంటావురా.? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు గ్రామంలోని ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను చూసి వారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా జీవితంలో అనుకున్నది సాధించడంలో విజయవంతమవుతున్నా. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు. లక్షల రూపాయలు సంపాదించినా రాని సంతోషం నాకు ఇప్పుడు కలుగుతోంది’ అని అంటున్నాడు ఈ ‘రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడు’. 2017 ఆగస్టు నాటికి  తమ ‘ప్రోటో విలేజ్‌’ని ప్రపంచానికి పరిచయం చేస్తామంటున్నాడు కల్యాణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement