జియో ఎఫెక్ట్:ఎయిర్‌టెల్ రోమింగ్ చార్జీలు రద్దు?
ముంబై: ఒక పక్క భారత టెలికాం మార్కెట్లో విభిన్న ఎత్తుగడలతో రిలయన్స్ జియో దూసుకుపోతోంటే .. మరోవైపు మార్కెట్ లీడర్స్ కూడా తదనుగుణంగా తమ స్ట్రాటజీలను మార్చుకుంటూ ముందుకు పోతున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఎయిర్ టెల్ టెలికాం ఇన్కమింగ్ కాల్స్ ,ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా అందించనుందని తెలుస్తోంది. మళ్లీ మునుపటి హ్యాపీడేస్ ను వినియోగదారులకు అందిస్తూ అవుట్ గోయింగ్ కాల్స్ , నేషనల్ డాటా రోమింగ్ పై ఎలాంటి అదనపు ప్రీమియం చార్జీలు ఉండవని ఆ నివేదిక తెలిపింది.
తన యూజర్లను కాపాడుకోవడానికి భారీ ప్రణాళికలే రచిస్తోంది ఎయిర్ టెల్. ముఖ్యంగా విదేశాల్లో ప్రయాణించే వినియోగదారులకోసం అంతర్జాతీయ ప్లాన్లతో పాటు బిల్లింగ్ ను కూడా సరళతరం చేసే దిశగా కసరత్తు చేస్తోందిట. గతంలో అమలు చేసిన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టే దిశగా యోచిస్తోందిట.
గతంలో 2013 నాటి ప్లాన్ తరహాలో రోజుకు రూ .5 ఛార్జ్ వద్ద ఎయిర్టెల్ 'ఉచిత ఇన్కమింగ్ కాల్స్' ను తిరిగి పరిచయం చేయనుందట. నెలకు రూ.79ల వన్ టైం ప్యాక్ కింద ఉచిత రోమింగ్ ఇన్‌కమింగ్ వాయిస్ సేవలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ తర్వాత వీటిని రద్దుచేసి రూ. 99 రీచార్జ్ ప్లాన్‌లో ఫ్రీ ఇన్ కమింగ్ , ఎస్‌ఎంఎస్‌కి 1.50 (రోమింగ్) లను ప్రవేశ పెట్టింది. అయినప్పటికీ ఈ మూడవ క్వార్టర్‌లో ఎయిర్ టెల్ లాభం 55 శాతం క్షిణించింది. గత నాలుగేళ్లలో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నిర్ణయంతో భారతి ఆదాయం, షేర్ ధరలపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్ షేరు 3-4.5 శాతం ప్రతికూలంగా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.
ప్రస్తుతం ఎయిర్ టెల్ స్థానిక కాల్ కోసం నిమిషానికి రూ .80 పైసలు, ఎస్టీడీ కాల్ కోసం నిమిషానికి రూ 1.15, ఇన్కమింగ్ కాల్ కోసం నిమిషానికి 45 పైసలు రోమింగ్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ నివేదికలపై ఎయిర్ టెల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా జియోకి పోటీని తట్టుకునే యోచనలో మరో టెలికాం దిగ్గజం వోడాఫోన్ దేశవ్యాప్తంగా గత ఏడాది దీపావళి సందర్భంగా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిర్టెల్ ఉచిత రోమింగ్ ఆఫర్ తో దేశవ్యాప్త రోమింగ్ ఛార్జీలు తగ్గింపుపై ఇతర దేశీయ టెలికాం ఆపరేటర్లు కూడా దృఫ్టి పెట్టే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.