వారిని మౌంటెయిన్ లయన్ వణికిస్తోంది
న్యూయార్క్: శాన్ ప్రాన్సిస్కోలోని పర్వతారోహకులను మౌంటెయిన్ లయన్ తీవ్రంగా భయపెడుతోంది. చాలా ఏళ్ల తర్వాత అక్కడి పర్వతారోహకులకు సింహం కనిపిండచంతో వారంత వణికి పోతున్నారు. గత పది రోజుల్లోనే నాలుగు సందర్భాల్లో సింహం తారస పడినట్లు అక్కడి నలుగురు పర్వతారోహకులు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం అది మగమృగరాజు అని తెలిసింది. జూన్ 30న ఒంటరిగా పర్వతంపై తచ్చాడుతున్న మగ సింహాన్ని తాము తొలిసారి చూసినట్లు ముగ్గురు వ్యక్తులు అధికారులకు తెలిపారు.
దీంతోపాటు అక్కడ అమర్చిన ఓ కెమెరాలో కూడా ఆ సింహం కనిపించింది. కానీ, ఉన్నట్లుండి గత శుక్రవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో అటువైపుగా వెళ్లాలంటేనే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. అది ఎక్కడ ఉందో, ఏ క్షణం దాడి చేస్తుందోనన్న గుబులు కూడా అధికారులను వేధిస్తోంది. అసలు, అంత ఎత్తు ఉన్న పర్వతంపైకి సింహం ఎలా వచ్చిందో అనేది ఇప్పటికీ వారికి అర్థం కానీ విషయం. అధికారుల అంచనా ప్రకారం ఆ సింహం శాన్ ప్రాన్సిస్కోలోని దక్షిణ భాగం వైపుగా వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానిని బందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.