‘సంక్షిప్త’ ఆయుధం!
- నేరాల నిరోధం దిశగా మరో అడుగు
- పోలీసు గ్రూప్ ఎస్‌ఎంఎస్‌లో చేరండి
- వ్యాపారులు, ప్రజలకు సీపీ పిలుపు
మహానగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట నేరాలు...ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. నష్టం కలిగాక మేల్కోవడం కంటే... నిరోధించేందుకు యత్నిస్తే... మన పోలీసు ఉన్నతాధికారులు సరిగ్గా ఇదే యోచనతో ఉన్నారు. నేరాలను అరికట్టేందుకు ‘పోలీసు గ్రూప్ ఎస్‌ఎంఎస్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తద్వారా నేరగాళ్ల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: నేరస్తుల అగడాలపై ఎప్పటికప్పుడు అన్ని వర్గాల వారిని అప్రమత్తం చేసేందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ‘పోలీసులు గ్రూప్ ఎస్‌ఎమ్‌ఎస్’ పథకానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
చోరీ జరిగాక కేసు నమోదు చేయడం.. ఆ తరువాత దర్యాప్తు చేయడం ఒక ఎత్తయితే అసలు నేరాలు జరగకుండా ముందే జాగ్రత్త పడేందుకు ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేసేందుకు నగర పోలీసులు సరికొత్త ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు ఏదైనా షాపింగ్ సెంటర్‌లో నేరం జరిగితే నగరంలోని అన్ని షాపింగ్ సెంటర్లను, పోలీసులను ఎస్సెమ్మెస్ ద్వారా అప్రమత్తం చేస్తారు. తద్వారా నిందితులను గుర్తించి, పట్టుకోవడం సులభతరం అవుతుంది.
ఒక్కో ఠాణాలో 5 నుంచి 10 వేల వరకు...
ఒక్కో ఠాణా పరిధిలో ఐదు వేల నుంచి పదివేల మంది (వ్యాపారులు, ప్రజలు) పోలీసు ఎస్‌ఎమ్‌ఎస్ గ్రూప్‌లో చేరాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హోటళ్లు, నగల దుకాణాలు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, మైత్రి కమిటీ మెంబర్స్, మసీద్, దేవాలయం, చర్చి కమిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాధారణ ప్రజానీకం... ఇలా 31 గ్రూప్‌లను గుర్తించారు. వారి సెల్ నంబర్లు సేకరించి పోలీసు గ్రూప్ ఎస్‌ఎమ్‌ఎస్‌లో చేరుస్తారు. ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్‌ను గుర్తిస్తారు.
వెంటనే పోలీసులు సంబంధిత గ్రూప్‌నకు ఎస్‌ఎమ్‌ఎస్ పంపి అలెర్ట్ చేస్తారు. ఉదాహరణకు ఏదైనా హోటల్‌లో ఒకరకమైన చోరీ జరిగితే ఆ విషయాన్ని మిగతా హోటల్స్ వారికి వెంటనే తెలియజేస్తారు. సాధారణ ప్రజలు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సెల్ నంబర్‌ను గ్రూప్ ఎస్‌ఎమ్‌ఎస్‌లో నమోదు చేయించుకోవాలని పోలీసుల సూచిస్తున్నారు. అలా నమోదు చేసుకున్న సెల్‌నంబర్‌కు పోలీసులను నుంచి ఎప్పటికప్పుడు నేరాలు జరుగుతున్న తీరుపై అలెర్ట్ ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తుంటాయి.
ఒకేసారి నగరంలోని ఆరు లక్షల మందికి ఎస్‌ఎమ్‌ఎస్ పంపే సౌకర్యం ఉంది. నగరంలోని 70 ఠాణాలకు ఈ సౌకర్యం కల్పించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌లకు అయ్యే ఖర్చును కేంద్ర ఐటీ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫోమ్యాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) భరిస్తుంది. వీరు అన్ని ప్రభుత్వ శాఖలకు ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం కల్పించారు. ఇదే తరహాలో నగర పోలీసు శాఖకు కూడా ఉచితంగా ఎస్‌ఎమ్‌ఎస్ చేసుకునే సౌక ర్యం ఉంది.