సాక్షి, సిటీబ్యూరో: ‘చిన్న కార్యాలయం.. కొన్ని మాటలు’ ఇవే వారికి పెట్టుబడి. లాభాలు మాత్రం భారీగా తెచ్చే వ్యవస్థ గ్రేటర్ మరొకటి పుట్టుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు నిలువునా మునిగిపోయి అప్పుల పాలవుతున్నారు. గ్రేటర్‌లో ఉన్న పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు, బీపీఓ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తరలించేందుకు క్యాబ్‌లను వినియోగించడం పరిపాటి. దీన్నే కొందరు తమకు ఆదాయ మార్గంగా మలుచుకున్నారు. వారే ‘వెండర్లు’. వీరు వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలతో లాబీయింగ్ ఒప్పందం చేసుకుని.. ఆపై క్యాబ్ డ్రైవర్లతో మరో ఒప్పందం చేసుకుని ఆపై దోపిడీకి తెరతీస్తున్నారు.
క్యాబ్‌ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచేసి డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఉబర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థల తరహాలోనే ఈ రతహా వ్యవస్థీకృత దోపిడీ కొనసాగుతోంది. ఫైనాన్షియర్ల నుంచి రూ.లక్షల్లో అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన క్యాబ్ డ్రైవర్లు చివరకు అప్పులు చెల్లించలేక వాహనాలను తనఖా పెట్టేసి రోడ్డుపాలవుతున్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలకు, కంపెనీలకు, వివిధ రకాల పరిశ్రమలకు అద్దె ప్రాతిపదికన వాహనాలను ఏర్పాటు చేసే నెపంతో డ్రైవర్లకు, సాఫ్ట్‌వేర్ సంస్థలకు నడుమ మధ్యవర్తిగా వ్యవహరించే ఈ ‘వెండర్’ వ్యవస్థ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు చెల్లించే సొమ్ములో సగానికి సగం తమ ఖాతాల్లో వేసుకొంటున్నట్లు వాపోతున్నారు.
డ్రైవర్‌కు దక్కేది కొంతే..
సాఫ్ట్‌వేర్ సంస్థలు పెద్ద వాహనాలకు కిలోమీటర్‌కు రూ.18 నుంచి రూ.20 చొప్పున చెల్లిస్తుంటాయి. ఆ మొత్తంలో డ్రైవర్లకు రూ.10 నుంచిరూ.12 మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును వెండర్లు తీసుకుంటున్నారు. చిన్న వాహనాల పైన వచ్చే ఆదాయం మరింత దారుణంగా ఉంది. పైగా ప్రధాన వెండర్లకు క్యాబ్ డ్రైవర్లకు మధ్య సబ్ వెండర్ల వ్యవస్థ కూడా ఉంటుంది. ఒక క్యాబ్ డ్రైవర్ ఏదో ఒక సంస్థలో వాహనం నడపాలంటే సబ్ వెండర్ల వద్ద ఒప్పందం కుదుర్చుకోవాలి. వారు ప్రధాన వెండర్‌తో మరో ఒప్పందం చేసుకుంటారు. ప్రధాన వెండర్‌కు, సాఫ్ట్‌వేర్ సంస్థలకు మధ్య మరో ఒప్పందం ఉంటుంది. అంతిమంగా సదరు సంస్థకు ప్రయాణ సదుపాయాన్ని అందజేసే సగటు డ్రైవర్‌కు దక్కేది మాత్రం చాలా తక్కువ. గ్రేటర్‌లో సుమారు 50 వేల మంది సొంత వాహనం కలిగి ఉన్న డ్రైవర్లు ఈ తరహా దోపిడీకి గురవుతున్నట్లు క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చిరుజీవుల ఉపాధిపై వేటు..
నగర శివార్లలోని ఇబ్రహీంపట్నానికి చెందిన రవికుమార్ ఏడేళ్ల క్రితం అప్పుచేసి స్విఫ్ట్ డిజైర్ కారు కొన్నాడు. హైటెక్‌సిటీలోని ఓ సబ్ వెండర్ వద్ద ఒప్పందంచేసుకున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్‌వేర్ సంస్థలకు చెందిన ఉద్యోగులను ఇంటి నుంచి ఆఫీసులకు తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడం అతని విధి. ఈ క్రమంలో పనిగంటలతో నిమిత్తం లేకుండా సేవలు అందజేస్తూనే ఉంటాడు. ఆ వాహనంపైన వెండర్‌కు ఒక కిలోమీటర్‌కు రూ.12 చొప్పున లభిస్తే రవి చేతికి వచ్చేది రూ.7 మాత్రమే.‘రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు తిరుగుతాం. కానీ వెండర్స్ మాత్రం 35 నుంచి 40 కిలోమీటర్లకే లెక్కలు వేసి డబ్బులు చెల్లిస్తారు.పైగా ఏ నెలకు ఆ నెల చెల్లించడం లేదు. మూడు నెలలకు ఒకసారి ఇస్తారు. దీంతో నెల వాయిదాలు చెల్లించలేకపోతున్నాను’ అంటూ రవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రైవేట్ రంగంలోని వాహనాల నిర్వహణపై రవాణాశాఖకు ఎలాంటి నియంత్రణ లేకపోవడం ఈ తరహా మధ్యవర్తుల వ్యవస్థ అక్రమార్జనకు అవకాశం ఇచ్చినట్టయింది. కాల్‌సెంటర్లు, సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాహనాలను ఏర్పాటు చేసే వెండర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఉబర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థల తరహాలోనే డ్రైవర్లను దోచుకుంటున్నారు. దీంతో చాలామంది డ్రైవర్లు అప్పులు చెల్లించలేక వాహనాలను వదిలేసుకుంటున్నారు.
డీజిల్‌పై 4 శాతం అ‘ధన’ం..
మరోవైపు క్యాబ్ డ్రైవర్లు నేరుగా బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు వీల్లేదు. వెండర్‌లకు అనుబంధంగా పనిచేసే సబ్‌వెండర్ల నుంచే డీజిల్ కొనుగోలు చేయాలి. ఇలా కొనే డీజిల్‌పైన పెట్రోల్ ధర కంటే 4 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొంటున్నారు.‘ఏ నెలకు ఆ నెల డబ్బులు చేతికి రావు. మొదట్లో 45 రోజులకు ఒకసారి ఇస్తామంటారు. చివరకు మూడు నుంచి 5 నెలల వరకు వాయిదాలు వేస్తారు. వాహనం నడిపేందుకు, ఇల్లు గడిచేందుకు ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తోంది. ఏదో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థకు సొంతంగా వాహనం నడిపేందుకు అవకాశం ఉన్నా ఈ వెండర్లు అడ్డుకుంటారు. చాలా కష్టంగా ఉంది’ డ్రైవర్ నాగరాజు ఆవేదన ఇది. నగరంలో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో లక్షకు పైగా ఉబర్, ఓలా సంస్థల్లో తిరుగుతుండగా మరో 10 వేల వాహనాలు ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. 50 వేల నుంచి 60 వేల వాహనాలు ప్రైవేట్ సంస్థలకు సేవలందజేస్తున్నాయి. ఈ వాహనాలన్నీ వెండర్ల ద్వారానే సదరు సంస్థలకు సేవలు అందజేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
వెండర్ల వ్యవస్థను తొలగించాలి
క్యాబ్‌లకు, ప్రైవేట్ సంస్థలకు నడుమ ఉన్న వెండర్లను తొలగించాలి. ప్రభుత్వమే స్వయంగా చార్జీలు నిర్ణయించాలి. డ్రైవర్లు నేరుగా ఒప్పందం చేసుకొనే అవకాశం కల్పించాలి. పైగా వెండర్ల వల్ల ఎలాంటి ప్రమాద బీమా కూడా లేదు.– సిద్ధార్థగౌడ్,జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment