సాక్షి బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చినప్పుడు చాలా సంతోషించారు. 2012లో ఓలా, 2013లో ఊబెర్ సేవలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ఆటోరిక్షా డ్రైవర్లు ఎంతంటే అంత డిమాండ్ చేస్తూ ప్రయాణికుల పాలిట గుదిబండగా మారిన తరుణంలో ఈ క్యాబ్‌లు అందుబాటులోకి రావడంతో నగరవాసులు ఎంతో ఆనందించారు. తొలినాళ్లలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, తక్కువ ధరలో ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తామని క్యాబ్ యజమానులు హామీనిచ్చారు.
దీంతో పాటు ఆటోరిక్షాలతో పోలిస్తే క్యాబుల్లో చార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు వాటిని ఎక్కువగా ఆదరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మొత్తం మారాయి. నగరంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న క్యాబ్ డ్రైవర్లు ఆకతాయిల చేష్టల వల్ల వాటిపై ప్రయాణికులకు నమ్మకం సన్నగిల్లుతూ వస్తోంది. ప్రస్తుతం నగరంలో మొత్తం 1.57 లక్షల క్యాబ్‌లు, 1.85 లక్షల ఆటో రిక్షాలు తమ సేవలను అందిస్తున్నాయి. 2013–14లో 66,264 క్యాబ్‌లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఒకటిన్నర లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ఒక్కరోజులో 3.5 లక్షల మంది క్యాబ్‌ల్లో ప్రయాణం చేస్తున్నారు. మోటార్ వాహన చట్టం పాత నియమాల వల్ల క్యాబ్‌లను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్న సమయంలో మహిళలు తప్పించుకోవడానికి వీలులేకుండా డ్రైవర్లు చైల్డ్ లాక్‌ను ఆన్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఈ చైల్డ్ లాక్ ఆన్‌లో ఉంటే కేవలం వాహన తలుపును బయట నుంచి మాత్రమే తెరిచేందుకు వీలవుతుందని, తద్వారా లోపల ఉన్న మహిళలు వాటిని తెరిచినా అవి తెరుచుకోలేకపోతున్నాయని తెలిపారు. 2016లో వచ్చిన ఆన్ డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటెడ్ నియమాల మేరకు ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలను మాత్రమే ప్రయాణికుల నుంచి క్యాబ్ యజమానులు వసూలు చేయాలి. అలాగే జీపీఎస్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. హెచ్చరిక బటన్లను ఏర్పాటు చేయాలి. క్యాబ్ డ్రైవర్లు కూడా రాష్ట్రంలో కనీసం రెండేళ్ల నివాసం కలిగిన వారు మాత్రమే ఉండేలా నియమాలను నిర్ధేశించారు. ఇన్ని చర్యలు తీసుకున్నా మహిళలు, యువతులు, బాలికలపై వేధింపులు ఆగడం లేదు. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఇటీవల కాలంలో మరీ ఎక్కువవుతున్నాయి. కాగా, వేధింపులపై పెడుతున్న కేసులు నిలబడడం లేదని పోలీసులు తెలిపారు. 2016లో చేసిన నియమాలపై క్యాబ్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానం ఎదుట పెండింగ్‌లో ఉండడంతో క్యాబ్ యజమానులపై కేసులు పెట్టలేకపోతున్నామని తెలిపారు. త్వరలో మరో మూడు క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రవాణా శాఖ వద్ద ఆప్టా క్యాబ్స్, సీఏబీ10 క్యాబ్స్, లెట్జ్ క్యాబ్స్ అనే మూడు సంస్థల లైసెన్స్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment